ఈ వారం స్పెషల్

‘ఆస్కార’మెవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్..
సినీజనాల్లో.. అందరినీ ఊరించే అవార్డు...
ఏ కొద్దిమందినో వరించే పురస్కారం...
అయితే- ఆ అవార్డు కోసం పరితపించే నటులు ఒకవైపు...
ఆ పురస్కార ప్రదానోత్సవాన్ని చూసేవారు మరోవైపు...
ఊపిరి బిగపట్టి ఎదురుచూసే క్షణం రానేవచ్చింది...
ఏటా ఫిబ్రవరి 28న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని చూసేందుకు విశ్వవ్యాప్తంగా సినీ అభిమానులంతా తహతహలాడతారు. దాదాపు 200 దేశాల్లో ప్రేక్షకులు వీక్షించే ఈ వేడుకకు లాస్‌ఏంజిలిస్‌లోని డోల్బే థియేటర్ ముస్తాబైంది. మరికొద్ది క్షణాల్లో ఆస్కార్ విజేతలెవరో తెలిసిపోతుంది. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైనె్సస్’ ఆధ్వర్యంలో ఆ సంస్థ సభ్యుల ఓటింగ్ ఆధారంగా విజేతల ఎంపిక జరుగుతుంది. ప్రధానంగా అమెరికా చలనచిత్ర రంగం, కొన్ని విభాగాల్లో ఇతర దేశాల చిత్రాలకు సంబంధించి వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపినవారిని విజేతలుగా ఎంపిక చేసే ఈ వేడుకకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. 1929లో ప్రారంభమైన ఆస్కార్ సంరంభం ఇప్పుడు 88వ పురస్కార ప్రదానోత్సవంతో కళకళలాడుతోంది. ఇదంతా సరే.. ప్రపంచంలోనే ఏటా విడుదలవుతున్న సినిమాల్లో ‘సింహభాగా’న్ని దక్కించుంటున్నట్లు ఘనత వహించిన భారత్‌కు మాత్రం ‘ఆస్కార్ పండుగ’ నిరాశనే మిగులుస్తోంది.

సినిమాల నిర్మాణంలో ముందువరసలో నిలబడినా, అవార్డుల విషయంలో నామినేషన్ల ఘట్టంలోనే భారతీయ సినిమాలు ఇంటిముఖం పడుతున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలు, కళాత్మకత, సామాజిక అంశాలు వంటివి తోడవుతున్నా మన సినిమాలు ఆస్కార్ బరిలో ఎందుకు నిలబడడం లేదన్న విషయాన్ని సింహావలోకనం చేసుకోవాల్సిన తరుణం ఇది...
‘ఆస్కార్’లో మనం ఇంతేనా?
* ది లంచ్‌బాక్స్, షాహిద్, విక్కీ డోనర్, దోబీఘాట్, షిప్ ఆఫ్ థీసియస్, ఉడాన్, పీప్లీలైవ్, కోర్ట్, వాటర్... ఇవన్నీ అద్భుత సృజనకు అద్దం పట్టే సినిమాలే. వీటిలో నటించిన వారు ఎవరు? దర్శకులు ఎవరు?.. అనే విషయాలు పట్టించుకోకుండానే సినీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ఇలాంటి సృజనాత్మక సినిమాలకు విమర్శకుల ప్రశంసలు దక్కినా- ‘ఆస్కార్’ రేసులో మాత్రం నిలబడలేక పోతున్నాయి. నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణలు కొత్తవారైనా ఈ తరహా సినిమాలు మన దేశంలో అత్యద్భుత కళాఖండాలని మనం అభవర్ణిస్తున్నా ‘ఆస్కార్’ వేదికపై స్థానం పొందలేక పోతున్నాయి.
* మూస చిత్రాల హోరులో అప్పుడప్పుడు పిల్లగాలుల్లా వచ్చి సేద తీరుస్తున్న ఈ సరికొత్త సినిమాల్లో సృజనకు, వైవిధ్యానికి లోటు లేకున్నా ఆస్కార్ వరకూ ఎందుకు వెళ్లలేకపోతున్నాయి. రొటీన్‌కు భిన్నంగా ఉంటున్న కొత్త తరహా సినిమాలను- ఆర్ట్ సినిమా, చిన్న సినిమా, నవతరం సినిమా, సెమీ కమర్షియల్ సినిమా... ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా కొన్ని ప్రత్యేకతలు తప్పక కనిపిస్తాయి. అయితే- ఈ ప్రత్యేకతలను ఆస్కార్ అవార్డుల కమిటీ గుర్తించడం లేదా? లేక ఆ స్థాయిలో మనవాళ్లు సినిమాలు తీయడం లేదా? ఏటా ఆస్కార్ వేడుకల సమయంలో ప్రతి భారతీయుడూ తనకు తాను వేసుకునే ప్రశ్నలు ఇవే.
* జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన
మన సినిమాలు అంతర్జాతీయ చలనచిత్స్రోవాలకు ఎంపికైనా ఆస్కార్‌కు అర్హత పొందడంలో ఎందుకు విఫలమవుతున్నాయి. మానవ సంబంధాలను, సమకాలీన పరిస్థితులను అద్భుతంగా ఆవిష్కరిస్తే చాలదు.. ఆధునిక మార్కెటింగ్ విధానం తెలియక పోవడం వల్లే మనం ఆస్కార్ రేసులో వెనుకబడిపోతున్నామన్న వాదన లేకపోలేదు. జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ‘కోర్ట్’ వంటి సినిమాలు ఆస్కార్ బరిలో తుది వరకూ ఎందుకు నిలబడలేకపోతున్నాయని సగటు భారతీయుడు వాపోవడం షరామామూలైంది. కమర్షియల్ ఆకర్షణలు లేకుంటే ఇలాంటి ‘ఆర్ట్ సినిమాల’ను ఎవరు విడుదల చేస్తారన్నది ఒక భేతాళ ప్రశ్న.
ముంబయిలో డబ్బావాలాలు ఉద్యోగులకు రోజూ అందించే ‘లంచ్‌బాక్స్’పై కొత్తతరహాలో కథ రాసుకుని సాదాసీదాగా తెరకెక్కించిన నూతన దర్శకుడు రితేష్ బాత్రా తన సినిమా ‘హిట్’ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్, టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు వచ్చినంత మాత్రాన ఈ ‘ఆర్ట్ సినిమా’ జనంలోకి వెళ్లలేదు. ఇలాంటి కళాఖండాలను థియేటర్లలో విడుదల చేసేందుకు ఎవరు సాహసిస్తారు? అయితే, అదృష్టం బాగుండి కొందరు పేరున్న దర్శకులు, కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డిసి) ఆసరా ఇవ్వడంతో ‘లంచ్‌బాక్స్’ జనంలోకి వచ్చింది. కమర్షియల్ ఆకర్షణ, ప్రచార వ్యూహం లేకపోవడం వల్ల ఇలాంటి ఎన్నో సినిమాలు ‘ఆస్కార్’ వేదిక వరకూ వెళ్లలేక పోతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు కొన్ని భారతీయ భాషల్లో ఆర్ట్ సినిమాల హవా నడుస్తున్నా- ఆ ఘనత అంతా మన దేశానికే పరిమితమై పోతోంది. ‘సామాజిక బాధ్యత’ అంటూ నవతరం దర్శకులు, కళాకారులు సృజనాత్మకతను పదునుపెడుతున్నా ‘రచ్చ గెలిచే’ పరిస్థితులు కనిపించడం లేదు.
రేసులో డికాప్రియో, మిల్లెర్ ముందంజ..?
‘ఆస్కార్’ పోటీలో విజేతలెవరన్న అంశంపై వాదనలకు, చర్చలకు అంతే లేదు. వివిధ కేటగిరీల్లో ఏయే సినిమాలు సత్తా చూపుతాయోనని విమర్శకుల్లో, సినీ అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. వేడుకల వేదికపై విజేతల పేర్లు ప్రకటించేవరకూ ఎవరి అంచనాలు నిజం అవుతాయన్నది కచ్చితంగా చెప్పలేం. అయినప్పటికీ గత కొద్ది వారాలుగా ప్రసార మాధ్యమాల్లో ఎడతెగని చర్చలు, ఎనె్నన్నో ఊహాగానాలు. ముఖ్యంగా ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి గురించే అందరి ఎదురుచూపులు. ఈ ఏడాది ఉత్తమ దర్శకుడిగా జార్జి మిల్లెర్, ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియో అవార్డులను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు ఊపందుకుంటున్నాయి. ‘మ్యాడ్ మాక్స్: ఫూరీ రోడ్’తో- ఆస్కార్ కోసం మిల్లెర్ నిరీక్షణ ఇన్నాళ్లకు ఫలించే తరుణం ఆసన్నమైందంటున్నారు. ఈ కేటగిరీలో మిల్లెర్‌తో పాటు మరో నలుగురు దర్శకులు అలెజాండ్రో గొన్జాలెజ్ (ది రెవెనంట్), టామ్ మెక్‌కార్తి (స్పాట్‌లైట్), ఆడమ్ మెకే (ది బిగ్ షార్ట్), లెన్నీ అబ్రహామ్సన్ (రూమ్) పోటీ పడుతున్నారు. అయితే, మిల్లెర్‌కే అవకాశాలు మెండుగా ఉన్నట్లు విమర్శకులు కొన్ని కారణాలను చెబుతున్నారు. వివిధ వర్గాల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా ‘మ్యాడ్ మేక్స్:్ఫరీ రోడ్’ నిలిచింది. ‘రాటెన్ టమాటోస్’ అనే సంస్థ ఈ సినిమాకు 97 శాతం మేరకు రేటింగ్ ఇచ్చింది. 89 శాతం మేరకు ప్రముఖ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. దీంతో మిల్లెర్‌కు ఆస్కార్ ఖాయమంటున్నారు. ఆస్కార్ కమిటీ మెచ్చుకునేలా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్టులు, గ్రాఫిక్స్ భారీగానే ఉన్నాయి. 2013లో ‘లైఫ్ ఆఫ్ పై’, 2014లో ‘గ్రావిటీ’ సినిమాల్లో మాదిరి ‘మ్యాడ్ మేక్స్:్ఫరీ రోడ్’లో స్పెషల్ ఎఫెక్టులు పుష్కలంగా ఉన్నందున అవార్డు వరించే ఛాన్స్ ఉందంటున్నారు. అదీగాక ఇప్పటికే 70 ఏళ్ల వయసులో ఉన్న మిల్లర్ ఇకముందు సినిమాలు తీసే అవకాశం లేనందున, అవార్డునిచ్చి ఆయన జీవితాశయాన్ని తీర్చేందుకు ఆస్కార్ కమిటీ మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తోందట!
వృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన కళాకారులను గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగించే వైఖరి ‘ఆస్కార్’ కమిటీ పాటిస్తోందని, ఈ రకంగానైనా మిల్లెర్‌కు అవార్డు ఖాయమని కొందరు వాదిస్తున్నారు.
ఇక, ఉత్తమ నటుడిగా ఎంపికయ్యే ఛాన్స్ లియోనార్డో డికాప్రియోకే ఎక్కువగా ఉన్నట్లు ‘్ఫర్బ్స్’ పత్రిక కూడా అంచనా వేస్తోంది. తొలిసారి ఆస్కార్ సాధించే అవకాశం డికాప్రియోకు దక్కడం ఖాయమంటోంది. గత నెలలో ‘శాగ్’ (స్క్రీన్ యాక్టర్ గిల్డ్స్) అవార్డు పొందడంతో ఇపుడు డికాప్రియోకు ‘ఆస్కార్’ అవకాశాలు మరింతగా మెరుగయ్యాయని ఆ పత్రిక విశే్లషిస్తోంది. ‘ది రెవెనంట్’లో ఆయన నటన అత్యద్భుతంగా ఉన్నందున ఇక ఆస్కార్ అందుకోవడమే తరువాయి అని చాలామంది విమర్శకులు అంచనా వేస్తున్నారు. కాగా, ‘శాగ్’ అవార్డు అందుకోవడం ‘ఆస్కార్’కు అర్హత కాదంటూ లాస్‌ఏంజిలెస్ టైమ్స్ పత్రిక సన్నాయి నొక్కులు నొక్కింది. ఎంతటి ప్రతిభావంతులకైనా ఆస్కార్ పురస్కారాల గురించి ఎవరికీ గ్యారంటీ ఇవ్వలేమని ఆ పత్రిక రాసింది.
రాసి ఎక్కువే..
హిందీ, పలు ప్రాంతీయ భాషలకు సంబంధించి ఏటా మన దేశంలో సుమారు 1,500 సినిమాలు విడుదలవుతున్నాయి. ఏటా విశ్వవ్యాప్తంగా నిర్మిస్తున్న సినిమాల్లో దాదాపు సగం భారత్‌లోనే రూపొందుతున్నాయి. సంఖ్యా పరంగా సినిమాల నిర్మాణంలో ఇంతటి ఘనతను సాధించినప్పటికీ ఆస్కార్ పురస్కారాల విషయంలో మాత్రం మన దేశం మరీ వెనుకంజలోనే ఉంది. భారతీయులు నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమాలేవీ ఇంతవరకూ ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకోలేదు. సినీరంగానికి చేసిన సేవలకుగాను దర్శకుడు సత్యజిత్ రేకు ఆస్కార్ గౌరవ పురస్కారం దక్కింది. విదేశీయులు నిర్మించిన సినిమాలకు పనిచేసిన భాను అథియా, ఎఆర్ రెహమాన్, రస్సెల్ పుకుట్టి, గుల్జార్‌లకు ఈ అవార్డులు దక్కాయి. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘గాంధీ’ సినిమాలు విదేశీయులు నిర్మించి, దర్శకత్వం వహించినవే కావడం గమనార్హం. ప్రపంచలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్న దేశంగా ఖ్యాతి పొందిన భారత్‌కు ఆస్కార్ నామినేషన్ల ఘట్టంలోనే చుక్కెదురు అవుతోందంటే లోపం ఎక్కడుందనే అంశాన్ని లోతుగా విశే్లషించాల్సిందే. 1957లో ‘మదర్ ఇండియా’ను మన దేశం తరఫున నామినేట్ చేసినప్పటి నుంచి తుది వరకూ రేసులో నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. 1970, 1975, 1976 సంవత్సరాల్లో మన దేశం అధికారికంగా ఏ ఒక్క సినిమానూ ఆస్కార్ నామినేషన్లకు పంపలేదు. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డులను గెలిచిన మన సినిమాలు ఆస్కార్ ముంగిట నిలబడలేక పోతున్నాయి. విమర్శకులు మాత్రం ఇందుకు కొన్ని కారణాలను ఎత్తిచూపుతుంటారు. చాలా వరకూ ఆర్ట్ ఫిల్మ్‌లు అవార్డుల కోసమే తీసినట్టు ఉంటాయి తప్ప కళాత్మక విలువలు, కమర్షియల్ ఆకర్షణ ఉండవన్నది ప్రధాన ఆరోపణ. అధిక శాతం భారతీయ సినిమాల్లో రొమాన్స్, కామెడీ సన్నివేశాలే ఉంటాయి. కథతో సంబంధం లేకుండా పాటలు, డ్యాన్స్‌లంటూ మన సినిమాల నిడివి మరీ ఎక్కువగా ఉంటోంది. విదేశీ సినిమాలు చాలా క్లుప్తంగా, తక్కువ నిడివితో ఉంటాయి. గంటల తరబడి కూర్చుని మన సినిమాలు వీక్షించాలంటే చాలా ఓపిక ఉండాలి. ఆస్కార్ బరిలో
నిలిచేందుకు సరైన ప్రచార వ్యూహం లేకపోవడం మన సినిమాలకు ప్రధాన శాపం. కొన్ని సినిమాలకు దేశంలో విపరీతమైన ప్రచారం జరిగినా అంతర్జాతీయ స్థాయిలో అది తక్కువేనని చెప్పాలి. ‘గ్రాఫిక్స్ మాయాజాలం’గా నిలచి దేశదేశాల్లో కలెక్షన్ల వర్షం కురిసినప్పటికీ ‘బాహుబలి’ సినిమా భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది. ఈ ఏడాది మన దేశం తరఫున అధికారికంగా నామినేట్ అయిన ‘కోర్ట్’ చివరి వరకూ నిలబడలేక పోయింది.
ప్రియాంకకు ఆహ్వానం
ఈ ఏడాది ఆస్కార్ సంబరంలో అవార్డు అందుకునే అవకాశం భారతీయ సినీ కళాకారులెవరికీ లేకపోయినా, బహుమతుల ప్రదానోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానాన్ని అందుకున్న ఘనత బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు దక్కింది. ఇటీవల అమెరికన్ టీవీ షో ‘క్వాంటికా’లో నటించి విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన 33 ఏళ్ల ప్రియాంక ఇపుడు ఆస్కార్ వేదికపై తళుకులీనబోతోంది. విజేతలకు బహుమతులు అందజేసేందుకు ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందడంతో ఈ మాజీ ‘ప్రపంచ సుందరి’ని బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తారు. ఆస్కార్ వేడుకకు భారత్ నుంచి హాజరవుతున్న ఏకైక ప్రతినిధిగా తనకు అవకాశం దక్కడం ఎంతో ఆనందం కలిగించిందని ‘ట్విట్టర్’ సందేశాలతో ఇపుడు ప్రియాంక ఉబ్బితబ్బిబ్బవుతోంది.
ఎంపికలో వివక్ష..?
ఆస్కార్‌కు సినిమాలను నామినేట్ చేయడంలో వివక్ష కొనసాగుతోందనే విమర్శ లేకపోలేదు. 1957 నుంచి 2012 వరకూ మన దేశం 45 సినిమాలను ఆస్కార్‌కు పంపింది. ఇందులో 30 సినిమాలు బాలీవుడ్‌కు చెందినవే. అదే కాలంలో జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్న హిందీ సినిమాల సంఖ్య ఎనిమిది మాత్రమే. బెంగాలీ, మళయాలం, కన్నడ భాషల సినిమాలకు జాతీయ పురస్కారాలు ఎక్కువగా లభిస్తున్నప్పటికీ, వాటిని ఆస్కార్‌కు ఎంపిక చేయకపోవడంలో మతలబులెన్నో ఉన్నాయి. అన్ని విషయాల్లోనూ భారీతనం కనిపించాలని ఎక్కువ మంది దర్శక, నిర్మాతలు కోరుకుంటారు. సూపర్ స్టార్లు, భారీ బడ్జెట్, ఐటెం సాంగ్స్, కామెడీ ట్రాక్ ఇతర హంగామా కోసం ఆరాటం తప్ప కథ, సాంకేతిక విలువలకు మన సినిమాల్లో ప్రాధాన్యం తక్కువే. పెద్ద నటులు, ప్రసిద్ధ దర్శకులు మూస పద్ధతులకు స్వస్తి పలకడం లేదు. సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యంతో కొత్తవారు తీసే సినిమాలను ‘ఆర్ట్ ఫిల్మ్’లంటూ పొగడ్తలకే పరిమితం చేస్తున్నారు. వైవిధ్యం ఉన్నప్పటికీ కమర్షియల్ ఆకర్షణ, ప్రచార వ్యూహం లేనందున ఇలాంటి కొత్త తరహా సినిమాలు ‘ఆస్కార్’ గడప తొక్కలేక పోతున్నాయి. *

విజేతలెవరో..?

ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల కోసం వివిధ దేశాల నుంచి ఎన్నో సినిమాలు పోటీపడినప్పటికీ, నామినేషన్ల ఘట్టం ముగిశాక తుది పోటీలో కొన్ని మాత్రమే నిలిచాయి. వాటి వివరాలు...
ఉత్తమ చిత్రం కేటగిరీలో..
ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రూక్లిన్, మ్యాడ్ మాక్స్: ఫూరీ రోడ్, ది మార్టియన్, ది రెవెనంట్, రూమ్, స్పాట్‌లైట్
ఉత్తమ నటుడి కేటగిరీలో..
లియానార్డో డికాప్రియో (ది రెవెనంట్), బ్రాన్ క్రాన్స్‌ంటన్ (ట్రంబో), మ్యాట్ డామన్ (ది మార్టియన్), మైఖేల్ ఫాస్బెండర్ (స్టీవ్ జాబ్స్), ఎడ్డీ రెడ్‌మేన్ ( ది డానిష్ గర్ల్),
ఉత్తమ నటి కేటగిరీలో..
కాటె బ్లాంచెట్ (కరోల్), బ్రీ లార్సన్ (రూమ్), జెన్నిఫర్ లారెన్స్ (జోయ్), చార్లెట్ రాంప్లింగ్ ( 45 ఇయర్స్), సయిర్స్ రొనన్ (బ్రూక్లిన్),
బెస్ట్ సినిమాటోగ్రఫీ..
కరోల్, ది హేట్‌ఫుల్, ఎయిట్, మ్యాడ్ మాక్స్: ఫూరీ రోడ్, ది రెవెనంట్
బెస్ట్ మేకప్..
మ్యాడ్ మాక్స్: ఫూరీ రోడ్, ది రెవెనంట్
విజువల్ ఎఫెక్ట్స్‌లో..
ఎక్స్ మిషినా, మ్యాడ్ మాక్స్: ఫూరీ రోడ్, ది మార్టియన్, ది రెవెనంట్

ఆస్కార్ ట్రోఫీ ప్రత్యేకతలివీ...

మోషన్ పిక్సర్చ్ విభాగంలో అత్యంత ఉన్నతమైనదిగా భావించే ఆస్కార్ అవార్డుకు ఎంత పేరుప్రఖ్యాతలున్నాయో.. విజేతలకు ఇచ్చే ట్రోఫీ (ప్రతిమ)కీ అంతే పేరుంది. ఆస్కార్ ట్రోఫీని చేతపట్టుకుని విజేతగా గర్వంగా నిలబడాలని ప్రతి నటుడూ, ప్రతి నటీ కలలు కనడం సహజం. చివరకి అతికొద్దిమందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఇంతకూ ఆ ట్రోఫీ ప్రత్యేకతలేంటి? దానిని ఎలా రూపొందిస్తారన్నది ఆసక్తికలిగించే అంశం. 24 కేరట్లబంగారు పూతతో 13.5 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల బరువుతో ఈ ప్రతిమలను 1982 నుంచి చికాగోకు చెందిన ఆర్‌ఎస్.ఒవెన్స్ సంస్థ రూపొందిస్తోంది. అయితే, ఈసారి 1929నాటి అసలు ట్రోఫీకి మక్కికిమక్కీగా, అధునాతన స్కానర్లు, త్రీడి ప్రింటింగ్ విధానాలు కలబోసి వీటిని తయారు చేస్తున్నారు. న్యూయార్క్ చెందిన పోలిచ్ ఫైన్‌ఆర్ట్స్ ఫౌండ్రీ అనే సంస్థ ఇప్పుడు ట్రోఫీలకు అసలురూపాన్ని ఇచ్చేలా చూస్తోంది. సెరామిక్ షెల్‌లో మైనపుప్రతిమలను పెట్టి క్యూర్ చేసి 1600 ఫారన్‌హీట్ వద్ద వేడిచేస్తారు. దీంతో మైనం కరిగి ఖాళీ ఆస్కార్ ప్రతిమలాంటి ఆకారం సిద్ధమవుతుంది. దీనిని కరిగిన కాంస్యంలో ముంచి 1800 ఫారన్‌హీట్‌లో మరిగించి, ఆ తరువాత చల్లబరిచి అద్దంలా తళుకులీనే రీతిలో పాలిష్ చేసేందుకు తరలిస్తారు. ఇలా 50 ప్రతిమలు తయారు చేయడానికి 3 నెలల సమయం పడుతుంది. అకాడమీ అవార్డుగా చెప్పుకునే ‘ఆస్కార్’కు ఆ పేరెలా వచ్చిందన్నది కూడా వివాదమే. 1929నుంచి ఇప్పటివరకూ 3,000 ఆస్కార్ ట్రోఫీలను ఇప్పటివరకు అకాడమీకి ఇచ్చారు. ఈసారి నిర్వహించే 88వ ఆస్కార్ అవార్డుల కోసం కొత్తబ్యాచ్ ట్రోఫీలను అందించారు.

‘మదర్ ఇండియా’ నుంచి ప్రియాంక వరకూ..

సంఖ్యాపరంగా సినిమాల నిర్మాణానికి సంబంధించి భారత్ ముందు వరసలో ఉన్నప్పటికీ ఆస్కార్ పురస్కారాల విషయంలో పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యున్నత అవార్డుగా అందరూ భావించే ఆస్కార్ రేసులో భారతీయుల ప్రాతినిధ్యం ఆది నుంచి తక్కువే. ఆస్కార్ నామినేషన్లకు అర్హత పొందిన తొలి భారతీయ సినిమాగా ‘మదర్ ఇండియా’ చరిత్రపుటలకెక్కింది. మెహబూబ్ ఖాన్ నిర్మించిన ‘మదర్ ఇండియా’ 1957లో విదేశీ భాషల కేటగిరీలో ఎంపికైనప్పటికీ తుది పోటీలో నిలవలేకపోయింది. విమర్శకుల ప్రశంసలతో పాటు సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘మదర్ ఇండియా’ ఆస్కార్‌ను సాధించేలేక పోయింది. దిలీప్‌కుమార్, వైజయంతి మాల నటించిన ‘మధుమతి’ విదేశీ భాషల కేటగిరీలో 1958లో నామినేషన్లలో నిలిచినా తుది పోటీలో ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ మూడు దశాబ్దాల వరకూ ఆస్కార్ బరిలో భారత్ ఊసే లేకుండా పోయింది. మీరా నాయర్ సృష్టించిన ‘సలాం బాంబే’ 1989లో ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది. విదేశీ భాషల కేటగిరీలో నామినేట్ అయిన ఈ సినిమాకు పురస్కారం లభించకపోయినా సుదీర్ఘకాలం తర్వాత ఆస్కార్ పరిశీలనకు వెళ్లిన భారతీయ సినిమాగా గుర్తింపు పొందింది. 2002లో అమీర్ ఖాన్ నటించిన ‘లగాన్’, 2007లో దీపా మెహతా నిర్మించిన ‘వాటర్’ ఆస్కార్ నామినేషన్లలో పోటీపడినా పురస్కారాలు దక్కలేదు. 2009లో బ్రిటన్‌కు చెందిన డేనియల్ డేనీ బోలే దర్శకత్వంలో రూపొందిన భారతీయ సినిమా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కు అవార్డుల పంట పండింది. ఈ సినిమాకు పనిచేసిన రస్సెల్ పుకుట్టి (ఉత్తమ సౌండ్ మిక్సింగ్), ఎఆర్ రెహమాన్ (బెస్ట్ ఒరిజనల్ స్కోర్, బెస్ట్ ఒరిజనల్ సాంగ్), గుల్జార్ ( ఉత్తమ గీత రచయిత)కు ఆస్కార్ అవార్డులు లభించాయి. బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన ‘గాంధీ’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన భారతీయ మహిళ భాను అథియా ఆస్కార్ పురస్కారం (1983లో) సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. దర్శక దిగ్గజమైన సత్యజిత్ రేకు 1992లో ‘గౌరవ పురస్కారా’న్ని ఆస్కార్ కమిటీ ప్రకటించింది.
రెహమాన్ ఖాతాలో రెండు..
‘ఆస్కార్’గా ప్రఖ్యాతి పొందిన ‘అకాడమీ అవార్డు’ల కోసం ఇప్పటి వరకూ 14 మంది భారతీయులు పోటీ పడ్డారు. ఇందులో అయిదుగురిని మాత్రమే ఆస్కార్ పురస్కారాలు వరించగా, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్‌కు మాత్రం రెండు అవార్డులు దక్కాయి. మన దేశానికి సంబంధించి రెహమాన్‌తో పాటు భాను అథియా (1983), సత్యజిత్ రే (గౌరవ పురస్కారం-1991), రస్సెల్ పుకుట్టి (2008), గుల్జార్ (2008) ఆస్కార్ విజేతలుగా నిలిచారు.

-పి.ఎస్.ఆర్.