తూర్పుగోదావరి

ముఖ్యమంత్రి సభపై దోమల దండయాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 22: దోమల నిర్మూలనకు రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుకు హాజరైన కార్యక్రమంపై దోమలే దండయాత్ర చేశాయ. కాకినాడ ఆనందభారతి మైదానంలో ముఖ్యమంత్రి బహిరంగ సభ సాక్షిగా దోమలు స్వైరవిహారం చేశాయి. ఓవైపు దోమలపై దండయాత్ర పేరుతో సభ నిర్వహిస్తుంటే, మరోవైపు దోమలు సభాస్థలిలో విపరీతంగా కనిపించాయి. సభా ప్రాంగణంలో విఐపి, మీడియా గ్యాలరీలో కూర్చున్న వారి ఒంటిపైన, కుర్చీలకు పెద్దసంఖ్యలో దోమలు అంటుకుపోయి కనిపించాయి. ముఖ్యంగా ఆనందభారతి మైదానం పక్కనే కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం నెలకొనివుంది. కనీసం ముఖ్యమంత్రి వచ్చేరోజైనా సభాస్థలికి దోమలు చేరకుండా తగు చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని పలువురు వ్యాఖ్యానించారు. సభాస్థలి వద్ద దోమల నిర్మూలనకు వినియోగించే యంత్రాలను కూడా ఏర్పాటుచేయకపోవడం గమనార్హం!

రాజమహేంద్రవరానికి నాలుగు ఫ్లై ఓవర్లు
-దివాన్‌చెరువు, లాలాచెరువు, మోరంపూడి, వేమగిరి జంక్షన్లలో
-డిపిఆర్‌లు సిద్ధం-నవంబర్‌లో టెండర్లు, డిసెంబర్‌లో పనులు

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: రివర్ సిటీ రాజమహేంద్రవరం మహా నగరం కానుంది.. ఇపుడున్న విస్తీర్ణం కాకుండా మరో ఐదు కిలో మీటర్ల పరిధిలోని 13 పరిసర గ్రామాలు విలీనమైతే కొత్త మాస్టర్ ప్లాన్‌తో ఈ చారిత్రక నగరం మహానగరమవుతుంది. 168.83 చదరపు కిలోమీటర్ల మేర శరవేగంగా రూపాంతరం చెందనుంది. ఈ నేపధ్యంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై నాలుగుచోట్ల నాలుగు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు రానున్నాయి. ఈ నాలుగు ఫ్లై ఓవర్లకు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధమయ్యాయి. వచ్చే నెలలో టెండర్లు పూర్తిచేసుకుని డిసెంబర్‌లో పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. రాజమహేంద్రవరం నగరంలో ప్రధానమైన 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రహదారిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ అవసరాలు, స్థానిక ట్రాఫిక్ అవసరాలు, ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధిని కాంక్షిస్తూ మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా నాలుగు చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. ఈ మేరకు దివాన్‌చెరువుజంక్షన్, లాలాచెరువు జంక్షన్, మోరంపూడి జంక్షన్, వేమగిరి జంక్షన్లలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. దీంతో నగరం సమగ్రమైన ప్రణాళికబద్ధ విస్తరణతోపాటు బహుముఖంగా అభివృద్ధి చెందేందుకు మార్గం సుగమమయ్యింది. రాజమహేంద్రవరం నగరంలో విలీనమయ్యే 13 గ్రామాల్లో దివాన్‌చెరువు, వేమగిరి కూడా ఉన్నాయి. ఇప్పటికే తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నారు. నవంబర్‌లో విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు ఈ రోడ్డును ఆనుకుని వాంబే గృహసముదాయం వైపు నుంచి 16వ నెంబర్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 100 అడుగుల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పలుచోట్ల భారీ స్థాయిలో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రోడ్ల విస్తరణ జరగనుంది. విలీన గ్రామాల్లో రోడ్లు సైతం మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే రూపొందిస్తూ అనుసంధానం చేస్తున్నారు. కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ నుంచి మోరంపూడి జంక్షన్ వరకు మరో బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రతిపాదనలో వుంది. మోరంపూజి జంక్షన్‌లో నిర్మించనున్న ఫ్లైఓవర్ బ్రిడ్జికి కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ నుంచి నిర్మించనున్న బ్రిడ్జిని అనుసంధానం చేస్తూ రూపొందిస్తూ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపకల్పన దశలోనే వుంది. జాతీయ రహదారిలో ఈ నాలుగు ఫ్లై ఓవర్లు రావడం వల్ల జాతీయ రహదారి ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. నగరంలోకి వచ్చే ట్రాఫిక్‌ను కూడా నియంత్రించవచ్చు. ఇటు దివాన్‌చెరువు వద్ద గోదావరి నది నాల్గవ వంతెన అప్రోచ్ రోడ్డు నుంచి అటు వేమగిరి జంక్షన్ వరకు నగరం బహుముఖంగా విస్తరించేందుకు అవకాశం ఏర్పడనుంది. ఏదేమైనప్పటికీ నగరంలో నాలుగు ఫ్లై ఓవర్ బ్రిడ్జిల పనులు కూడా ఒకేసారి మొదలు కానున్నాయి. ఇటీవల రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి నగరంలో ఈ నాలుగు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రకటించారు.

ముఖ్యమంత్రి నమ్మకం వమ్ము

అమలాపురం, అక్టోబర్ 22: ‘ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు శాంతికాముకులు... ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యుత్ చౌర్యం జరగదంటే అందుకు ఈ ప్రాంత ప్రజల నిజాయితీయే కారణం’ శనివారం కాకినాడ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి... రాష్ట్ర ప్రభుత్వ అధినేత వ్యాఖ్యలను, నమ్మకాన్ని వమ్ముచేస్తూ కోనసీమలోని కొందరు ఆక్వా మాఫియా అవతారమెత్తి, యథేచ్ఛగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. చెరువులకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాలతో పొందడం, రాత్రివేళల్లో అక్రమంగా విద్యుత్ వినియోగించడం ఇక్కడి మాఫియాకు పరిపాటిగా మారింది. తిలాపాపం తలా పిడికెడు చందంగా స్థానికంగా కొందరు సిబ్బంది సహకారం అందిస్తుండటంతో ఈ వ్యవహారాలు పెద్దగా వెలుగుచూడవు. దీనితో అంతా సక్రమంగానే నడుస్తోందని ముఖ్యమంత్రి భావించారు. అయితే శుక్రవారం రాత్రి కోనసీమ ప్రాంతంలో భారీగా సాగుతున్న విద్యుత్‌చౌర్యాన్ని ఆ శాఖ విజిలెన్స్ అధికారులు వెలుగులోకి తెచ్చారు. రాజమండ్రి నుండి వచ్చిన యాంటీ పవర్ థెప్ట్ స్క్వాడ్ (ఎపిటిఎస్) డిపిఇ సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి ఐ పోలవరం, కాట్రేనికోన మండలాల్లో ఆక్వా చెరువులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమ విద్యుత్ వినియోగిస్తున్న ముగ్గురు చెరువుల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఐ పోలవరం మండలంలోని టి కొత్తపల్లిలో అక్రమ విద్యుత్ వినియోగిస్తున్న ఇద్దరు చెరువుల యజమానులు, కాట్రేనికోన మండలంలోని పల్లంకుర్రు గొల్లగరువులో ఒక చెరువుయజమాని అక్రమ విద్యుత్‌ను వినియోగిస్తూ పట్టుబడ్డారు. వారిపై కేసుల నమోదుచేసి అధికారులు సుమారు రూ.25 లక్షలకు పైగా జరిమానా విధించారు. అయితే ఈ విషయాన్ని ధ్రువీకరించడానికి స్థానిక అధికారులెవరూ సాహించడంలేదు. దీనిపై ముమ్మిడివరం ఎడిఇ ఎం రవికుమార్‌ను ‘ఆంధ్రభూమి’ వివరణ కోరగా శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడులు చేయడం వాస్తవమేనని, అయితే వివరాలు తనకు ఇంకా తెలియలేదని చెప్పారు.

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం
కాకినాడ సిటీ, అక్టోబర్ 22: జిల్లా కేంద్రం కాకినాడలో పర్యటనకు శనివారం వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనస్వాగతం లభించింది. ఉదయం 11 గంటలకు రావలసిన ముఖ్యమండ్రి 11.30 గంటలకు చేరుకున్నారు. సిఎంకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదయం 10.30 గంటలకే పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. హెలీకాఫ్టర్ దిగిన సిఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కొద్దిక్షణాల తరువాత సిఎం భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. సిఎం రాక సందర్భంగా పోలీసులు అసాధారణ రీతిలో బందోబస్తును ఏర్పాటుచేశారు. సిఎం వచ్చి వెళ్లే వరకు ఆయన ప్రయాణించే మార్గంలో ఎవరనీ అనుమతించలేదు. ఈకారణంగా వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. హెలీప్యాడ్ ఏర్పాటుచేసిన పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లోకి పోలీస్ శాఖ జారీచేసిన పాసులు ఉన్నవారినే లోనికి అనుమతించారు. పాసులు లేని పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, మీడియా ప్రతినిధులు పెరేడ్ గ్రౌండ్ గేటువద్దనే వేచి ఉండాల్సి వచ్చింది.
జ్వరంతో వృద్దుడు మృతి
విఆర్ పురం, అక్టోబర్ 22: మండల పరిధిలోని రామవరం గ్రామానికి చెందిన కూర పెద్దలక్ష్మయ్య (70) అనే గిరిజనుడు జ్వరంతో మృతిచెందిన సంఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతిచెందిన పెద్ద లక్ష్మయ్య కొద్దిరోజుల క్రితం కాళ్లవాపు వ్యాధి రావటంతో రేఖపల్లి పిహెచ్‌సి వైద్యులు కాకినాడ జిల్లా వైద్యశాలకు తరలించారు. జిల్లా వైద్యులు రెండుసార్లు రక్తం ఎక్కించి వారం రోజులపాటు వైద్యం అందించి రోగిని ఇంటికి పంపించి వేశారు. ఆసుపత్రిలో రక్తం ఎక్కించిన దగ్గర నుంచి జ్వరం వస్తుందని, 15 రోజుల్లో జ్వరం తగ్గుతుందని చెప్పి ఇంటికి పంపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా జ్వరం తగ్గలేదని, ఆసుపత్రికి తీసుకువెళ్లటానికి లేచే పరిస్థితి లేదని, ఈక్రమంలో పెద్దలక్ష్మయ్య శుక్రవారం రాత్రి మృతిచెందాడని కుటుంబ సభ్యులు వాపోయారు.

గాయపడిన
సమాచార శాఖ ఉద్యోగి
కాకినాడ, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నాటి పర్యటనలో సమాచార శాఖ ఉద్యోగి మచ్చా మాధవకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. సిఎం హెలీపాడ్ నుండి బయలుదేరిన సిఎం కాన్వాయ్‌లో వీడియోగ్రాఫర్ల వ్యాన్ మలుపు తిరుగుతుండగా అందులో ఉన్న మాధవకృష్ణ జారిపడిపోవడంతో తలకు గాయమైంది. కాన్వాయ్ ఆగిపోవడంతో చంద్రబాబు విషయాన్ని తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మాధవకృష్ణ కోలుకుంటున్నారని డీపీఆర్వో ఫ్రాన్సిస్ తెలిపారు.
దోమలపై దండయాత్ర ర్యాలీ ప్రారంభించిన ముఖ్యమంత్రి
కాకినాడ, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడలో శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద నుండి దోమలపై దండయాత్ర ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుండి పాదయాత్ర చేస్తూ కొత్తపేట, రామకృష్ణారావు పేటల మీదుగా బహిరంగ సభ నిర్వహించే ఆనందభారతి గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు కాన్వాయ్‌లో టూటౌన్‌కు చేరుకున్నారు. అక్కడ అప్పటికే చంద్రబాబు రాకకోసం నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు చేరుకున్నారు. అక్కడ తోపుడు బండ్లను లబ్ధిదారులకు అందించారు. విచిత్ర వేషధారణలో ఉన్న విద్యార్థులతో చంద్రబాబు కరచాలనం చేశారు. పాదయాత్ర చేస్తూ ఎన్‌జిఓ హోంకు చేరుకున్న సిఎంకు నాయకులు బూరిగ ఆశీర్వాదం, పద్మమీనాక్షి, మూర్తి, శ్రీనివాస్, వర్మలు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఎన్‌జిఓ హోం వద్ద సిఎంచే మొక్కను నాటించారు. పాదయాత్ర చేస్తూ కొత్తపేటలో కొయ్యేటి నారాయణమ్మ ఇంటిలోకి వెళ్ళి పడక గది, మరుగుదొడ్లను పరిశీలించి దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారికి మొక్కను బహూకరించారు. నారాయణమ్మకు ఇంటిని మంజూరు చేయాలని ఆమె కోరగా ఇల్లు మంజూరుకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాత రామకృష్ణారావుపేటకు చేరుకున్న ఆయన మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాకి రామయ్య ఇంటిని సిఎం సందర్శించగా డ్వాక్రా గ్రూపులో తన భార్య సభ్యురాలేనని, తమకు గృహం లేదని చెప్పగా సిఎం స్పందించి గృహం మంజూరుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ అలీం బాషాను ఆదేశించారు. అలాగే అక్కడ ఉంటున్న ముస్లిం నాయకులు ఎండి జహీరుద్దీన్ జిలానీ, ఎంఎ తాజుద్దీన్‌లు చంద్రబాబును శాలువాతో సన్మానించారు. టైలర్ సయ్యద్ బాబ్జీ ఇంటిని చంద్రబాబు సందర్శించగా వారు తమకు గృహాన్ని మంజూరు చేయాలని కోరగా ఇంటి మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం భారీ బందోబస్తుతో ఆనందభారతి వద్దకు చేరుకున్నారు. ముందుగా ఏర్పాటు చేసిన వనం- మనం ఛాయాచిత్రాలను సందర్శించి చంద్రబాబు సభ వేదిక పైకి వెళ్ళారు.
కోటిపల్లిలో ‘కొత్త కుర్రోడు’ సందడి
రామచంద్రపురం, అక్టోబర్ 22: కె గంగవరం మండలం కోటిపల్లిలో శనివారం నూతన నటీనటులతో నిర్మిస్తున్న ‘కొత్త కుర్రోడు’ సినిమా చిత్రీకరణ జరిగింది. కోటిపల్లి ఫెర్రీ గట్టు వద్ద హోటల్ సెట్టు వేసి, పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాకుండా హీరో, హీరోయిన్‌లపై పలు దృశ్యాలను చిత్రీకరించారు. ప్రేమ, ఆస్తి కంటే సమాజంలో నైతిక విలువలు, అనుబంధాలే గొప్పవి అన్న ప్రధాన కథాంశంతో లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ‘కొత్త కుర్రోడు’ చిత్రానికి బి రమేష్ నిర్మాతగా, ఎస్ మోహనరావు దర్శకుడుగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎన్ రాజానాయుడు, సంగీతం ఏలేంద్ర, ప్రొడక్షన్ మేనేజర్‌గా కుమార్ వ్యవహరిస్తున్నారు. నూతన నటీనటులైన శ్రీరామ్ హీరోగా, ప్రియ హీరోయిన్‌గా, చేబ్రోలు శ్రీను విలన్‌గా నటిస్తుండగా, రామచంద్రపురం వాసి చౌదరి విజయసాయి ఈ సినిమాలో ఒక పాత్ర పోషిస్తున్నారని, కోటిపల్లి పరిసర ప్రాంతాలలో ఇంకా 4 రోజుల పాటు చిత్రీకరణ జరుగనుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ ఎన్ రాజానాయుడు తెలిపారు.