తూర్పుగోదావరి

‘పోలవరం’లో భూమికి భూమి దక్కేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: పోలవరం జాతీయ ప్రాజెక్టులో నిర్వాసితులకు భూమికి భూమి దక్కేలా కనిపించడం లేదు. ఇప్పటికీ నిర్వాసితులకు భూమికి భూమి సేకరించే పని పూర్తికాలేదు. ప్రధాన పనులకు మాత్రమే భూమి సేకరణ జరిగింది. అందుకు తగిన పరిహారం ఇచ్చారు. కొత్త ఆర్ అండ్ ఆర్ ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించాలంటే ప్రస్తుత నాబార్డు నిధుల నుంచి సరిపెట్టలేని దుస్థితి దాపురించింది. కొత్త ఆర్ అండ్ ఆర్ ప్రకారం పరిహారం రెట్టింపయ్యే పరిస్థితి కన్పిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి తొలి దశలో రూ.2981 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. ఈ నిధులు కేవలం ప్రాజెక్టుకు మాత్రమే వెచ్చించాల్సివుంది. ప్రాజెక్టులో భాగంగా 960 మెగావాట్ల పవర్ హౌస్ నిర్మాణానికి నిధులను విడిగా సమకూర్చుకోవాల్సిందే. 2014 ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత పోలవరం నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.5810 కోట్లు చెల్లించాల్సివుంది. ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలు సమర్పించిన దరిమిలా నాబార్డు రూ.2981 కోట్లు మంజూరుకు అనుమతిచ్చింది. కేవలం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం వరకే కేంద్రం బాధ్యత వహిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఖరారుచేసే సవరించిన అంచనాలకు లోబడి మంజూరుచేయనున్నారు. వాస్తవానికి 2014 ఏప్రిల్ నాటి ధరల ప్రకారం సవరించిన అంచనాల మేరకు నిధులు ఇవ్వాల్సిందిగా రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. ఈవిధంగా అయితే నిర్వాసితులకు భూమికి భూమి, 2013 కొత్త చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించడమనేది ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ముందు నిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించి, ప్రాజెక్టు పనులకు ముందుకు కదలాలని ముంపు మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. దీని ప్రకారం చూస్తే ఇప్పటి వరకు భూమికి భూమి కేటాయించడానికి అంచనాలు రూపొందించారుగానీ ఎక్కడా ఇవ్వలేదు. దాదాపు పదేళ్లవుతున్నా పోలవరం పవర్ హౌస్ నిమిత్తం ఖాళీచేయించిన అంగుళూరు గ్రామస్థులకు కూడా నేటికీ భూమికి భూమి ఇవ్వలేదు. కొందరికి ఇచ్చిన భూమి ఎందుకూ కొరగాకుండా వుంది. నిర్వాసితులు ఆ భూమిని తీసుకోలేదు.
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 9,402 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 6,586 ఎకరాలు భూమికి భూమిగా నిర్వాసితులకు పంపిణీ చేయాల్సివుంది. అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లా పరిధిలో భూమికి భూమి కోసం కేవలం 597 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో 3657 ఎకరాలు సేకరించారు. ఈ రెండు జిల్లాలకు మొత్తం 15,988 ఎకరాలు అవసరం వుంది. తూర్పు గోదావరి జిల్లాలో 8,805 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2928 ఎకరాలు వెరసి 11,733 ఎకరాలు భూమికి భూమిగా సేకరించాల్సి వుంది. పోలవరం ప్రాజెక్టులో మొత్తం సుమారు నాలుగు వేల ఎకరాల అటవీ భూమి ముంపునకు గురవుతోంది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి సంబంధించి అటవీ శాఖకు నిధులు కేటాయింపు జరిగింది.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్సు, కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు సంబంధించి ముంపు మండలాలతో కలిపి 1,45,052 ఎకరాలు సేకరించాల్సి వుంది. అయితే ఇప్పటి వరకు 86,134 ఎకరాలు సేకరించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రూ.1771.69 కోట్లు ఖర్చుచేశారు. ఇంకా 58918 ఎకరాలు సేకరించాల్సి వుంది. ఇందుకు రూ.5925.13 కోట్లు చెల్లించాల్సి వుంది. కొత్త ఆర్ అండ్ ఆర్ ప్రకారం నిర్వాసితులకు నష్టపరిహారం, భూమికి భూమి చెల్లించాలంటే ఇందుకు రెట్టింపు నిధులు ఇంకా చెల్లించాల్సి వస్తుంది. అంటే దాదాపు రూ.10 వేల కోట్ల వరకు ఆర్ అండ్ ఆర్‌కి చెల్లించాల్సివుంటుంది.
పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, ఎటపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రపురం మండలాల్లో మొత్తం 90,681 ఎకరాలు సేకరించాల్సి వుండగా 45,743 ఎకరాలు సేకరణ జరిగింది. ఏదేమైనప్పటికీ ఆర్ అండ్ ఆర్‌కే నిధులు తడిసిమోపెడవుతుంటే, ఇక నాబార్డు నుంచి విడతల వారీగా విడుదలయ్యే నిధులతో ప్రాజెక్టు పురోగతి ఏ మేరకు లభిస్తుందోమరి.
చక్రం తిప్పుతున్న అధికారులు
*గగ్గోలుపెడుతున్న ప్రజాప్రతినిధులు
*ఇక్కడంతా కమిషనర్‌దే హవా..!!
*పాలకపక్షం ఉత్సవ విగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో అధికారంలో పాలకపక్షం ఉన్నట్టుగా లేదు.. అధికారుల పాలనలోనే కొనసాగుతున్నట్టుగా ఒక చిత్రమైన పరిస్థితి దాపురించిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారుల్లో కమిషనర్ నుంచి గుమస్తా వరకు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారి వరకు అంతా అధికారుల పాలన కిందే ఉందని, పాలకపక్షం ఉత్సవ విగ్రహాంగా మిగిలిందనే ఆరోపణలు గూడుకట్టుకున్నాయి. పాలకపక్ష ప్రజాప్రతినిధుల మాట కనీసస్థాయిలో కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తుండటంతో అసలు పాలకపక్షం అధికారంలో ఉందా, అధికారుల పాలనలో ఉందా అనే అనుమానం కలుగుతోందని సాక్షాత్తూ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కౌన్సిల్‌హాలులో ఆవేదన చెందడం కమిషనర్ చక్రం తిప్పుతున్నారనే విషయాన్ని రుజువు చేస్తోంది. ప్రజా ప్రతినిధులను కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోకుండా అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతీ పనికీ కమిషనర్ చెప్పారని పేర్కొంటూ కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఏకపక్షంగా వార్డుల్లో పనులు చేస్తున్నారని, దీంతో ప్రజల నుంచి ఎన్నికైన తాము ప్రజల ముందు చులకనైపోతున్నామని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరును ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఏ అధికారి తమను ఖాతరు చేయడంలేదని, ఇక రెండేళ్లపాటు ప్రజల ముందుకు ఏవిధంగా వెళ్లాలో అర్ధంకావడం లేదని, కార్పొరేటర్లకు విలువ లేకుండాపోయిందని, ఇది తమ 50 డివిజన్ల కార్పొరేటర్ల అభిప్రాయంగా చెబుతున్నామని కౌన్సిల్ హాలులో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు వాపోయారు. కమిషనర్ ఆధ్వర్యంలో అన్నీ అధికారులే చక్రం తిప్పేస్తుంటే ఇక ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. మొత్తం మీద పాలకపక్షాన్ని పక్కన పెట్టేసి కమిషనర్ హవా చూపిస్తున్నారని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే.. హ్యాపీ సండే పేరుతో ప్రతీ ఆదివారం కమిషనర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం కూడా పాలకపక్షానికి తెలియదంటే అధికారుల పెత్తనం ఏస్థాయిలో అర్ధం చేసుకోవచ్చంటున్నారు.

ముద్రగడ చట్టానికి అతీతులు కాదు
* కోరితే పాదయాత్రకు అనుమతిస్తాం: ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో సహాయ చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. జనవరి 25నుంచి ఆయన తలపెట్టిన పాదయాత్రకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. దివాన్‌చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులై, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను శనివారం ఆయన పరామర్శించారు. ఈసందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అనుమతి కోరితే పాదయాత్రకు అనుమతిస్తామని చెప్పారు. వైసిపి అధినేత జగన్, ఆయన సోదరి షర్మిళ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతే పాదయాత్రలు చేశారని గుర్తుచేశారు. ముందస్తు అనుమతి తీసుకుంటే తగిన భద్రత కల్పించగలుతామన్నారు. అయితే ముద్రగడకు రాజకీయం కావాలని, అందుకే మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
అర్థరాత్రి ప్రయాణాలు మానుకోవాలి
అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి ప్రయాణాలు చేయరాదని నిమ్మకాయల చినరాజప్ప విజ్ఞప్తి చేశారు. దివాన్‌చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 9 మంది క్షతగాత్రులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మశ్రీ తదితరులు ఉన్నారు.
అంతటా ఇ-పోస్!
కలెక్టర్ అరుణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబరు 3: జిల్లాలోని అన్ని రకాల ఆర్ధిక లావాదేవీలూ ఇక ఇ-పోస్ మిషన్ల ద్వారానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ చెప్పారు. ఇ-పోస్ యంత్రాలను విధిగా వాడేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని భానుగుడి జంక్షన్‌లో కిరాణా జనరల్, మెడికల్ స్టోర్స్‌లో ఏర్పాటుచేసిన ఇ-పోస్ మిషన్ల పనితీరును శనివారం కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు ఇ-పోస్ యంత్రాల వాడకంపై అవగాహన కలిగించారు. ఈ ప్రక్రియపై కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ కార్యదర్శి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఇ-పోస్ మిషన్లను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఏ సరుకు కొనుగోలు చేయాలన్నా నగదు చెల్లింపు ద్వారా కాకుండా నగదు రహితంగానే భవిష్యత్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు తగిన అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రజలు నగదు కొరకు బ్యాంకులకు వెళ్ళకుండా నిత్యావసరాలను తమ రూపే, డెబిట్ కార్టులతో కొనుగోలు చేసుకోవచ్చని, ప్రతివొక్కరు తగిన బ్యాలెన్స్‌ను తమ ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుందని చెప్పారు. జిల్లాలో పింఛనుదార్లందరికీ ఈ నెల పింఛన్ 1000రూపాయల వంతున, వికలాంగులకు 1500 వంతున ఖాతాలకు జమ చేశామని, వారంతా రూపే కార్డుల సహాయంతో తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువులు, మందులు తదితర అవసరాలను ఎటిఎం కార్డులు, రూపే కార్డుల ద్వారానే కొనుగోలు చేయాలని, దీని వలన నగదు కొరతను అధిగమించవచ్చని చెప్పారు. మహిళా పొదుపు సంఘాలు, ఉపాధి కూలీలు, పింఛనుదార్లు ఇలా ప్రతివొక్కరు నగదు రహితంగానే లావాదేవీలు జరుపుకోవచ్చని, నగదు బదిలీ కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు. నగదు రహిత బదిలీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా స్పందించి, సహకరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ అలీంబాషా, డిప్యూటీ కమీషనర్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
నలుగురు పరిస్థితి విషమం: పరామర్శించిన హోం మంత్రి రాజప్ప
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: రాజమహేంద్రవరం పదహారవ నెంబర్ జాతీయ రహదారి లాలాచెరువు జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. లాలాచెరువు జంక్షన్‌లో ఆగివున్న కంటైనర్ లారీని టాటాసుమో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చిల్లమల్లాపురం గ్రామానికి చెందిన అడగల పోలమ్మ, అప్పలస్వామి దంపతుల కుటుంబంలో మొత్తం ఎనిమిది కారులో విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్తుండగా రాజమహేంద్రవరం లాలాచెరువు జంక్షన్ వద్ద ఆగివున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో అప్పలస్వామి (30), గొడపాలు బొడ్డు (35) అక్కడికక్కడే మృతిచెందారు. ముడిసి నారాయణరావు, పోలమ్మ, లక్ష్మయ్య, సుధ, మూడేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రాష్ట్ర హోం మంత్రి, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చిన రాజప్ప రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్యులను ఆయన ఆదేశించారు. రాత్రి ప్రయాణాలు చేయకూడదని, ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను పోలీసు అధికారుల నుంచి రాజప్ప అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం సంభించినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందినవీరంతా దైవ దర్శనానికి వెళ్తూ ఈ విధంగా ప్రమాదానికి గురికావడంతో తీవ్ర విషాదం అలుముకుంది.

ఎపిలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి : భారత న్యాయవాదుల సంఘం జిల్లా మహాసభ తీర్మానం
రాజమహేంద్రవరం, డిసెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో తక్షణం హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భారత న్యాయవాదుల సంఘం జిల్లా మహాసభ డిమాండ్ చేసింది. హైకోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని శనివారం జరిగిన సభలో తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ చట్టాన్ని సవరించాలని, న్యాయవాదుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, ఈమేరకు రూ. 150కోట్లు మంజూరు చేయాలని కోరింది. మృతి చెందిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారాన్ని 8లక్షలు, వైద్యసహాయాన్ని 2లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. న్యాయవాదులందరికీ ఆరోగ్యకార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు ఫీజుల్లో 2శాతం మొత్తాన్ని న్యాయవాదుల సంక్షేమానికి వెచ్చించాలని మహాసభ తీర్మానించింది. న్యాయవాదుల సంక్షేమానికి ప్రతీ ఏటా 5కోట్ల మ్యాచింగ్‌గ్రాంటును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఖాళీగా ఉన్న న్యాయాధికారుల పోస్టులను భర్తీ చేయాలని, దాడులు అరికట్టాలని, చట్టసభల్లో న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తీర్మానించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రవేశపెట్టిన ఈతీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈసందర్భంగా జిల్లా, నగర కార్యవర్గాలను ఎన్నుకున్నారు.
ఒఎన్‌జిసి పైపులైన్ల రక్షణకు చర్యలు చేపట్టాలి
*ఎంపి నరసింహం
కాకినాడ సిటీ, డిసెంబర్ 3: ఒఎన్‌జిసి సంస్థ ఆంధ్రప్రదే రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తోందని, ఆసంస్థకు చెందిన గ్యాస్ పైపులైన్ల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు కాకినాడ పార్లమెంట సభ్యుడు తోట నరసింహం తెలిపారు. ఒఎన్‌జిసి సంస్థకు చెందిన గ్యాస్ పైపులైన్లు తరుచుగా మరమత్తులు గురికావడం కారణంగా లీకేజీలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని శనివారం జరిగిన పార్లమెంటు సమావేశంలో ప్రభుత్వానికి వివరించినట్లు చెప్పారు.