తూర్పుగోదావరి

చితికిపోతున్న చిన్న దుకాణాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో చిన్న దుకాణాలు చితికిపోతున్నాయి. సగటు మనిషికి నిత్యజీవితంలో నిరంతరం ఆందుబాటులో ఉండే చిన్నా, చితకా దుకాణాలు నేడు మూతపడే దుస్థితి ఏర్పడింది. చిన్న నోట్లతో ఆయా సరుకులను కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు సాధారణ దుకాణాలు అందుబాటులో ఉంటాయి. ఇటీవలి కాలంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం చిన్న దుకాణాలను చిదిపేసింది. పెద్దనోట్ల రద్దు అనంతరం కార్పొరేట్ సంస్థలకు బాగా లాభిస్తోంది. ఆయా కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్న భారీ దుకాణాలకు సాధారణ వినియోగదారులు సైతం క్యూకడుతున్నారు. వివిధ మార్ట్‌లలో వ్యాపారం గత రెండు, మూడు వారాలుగా అనూహ్యంగా పెరిగింది. ఇందుకు సామాన్యుల వద్ద చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడం ఓ కారణం కాగా ఆయా షాపుల్లో నగదు రహిత విక్రయాలు మరో కారణంగా కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు కరెన్సీ కోసం నానా అగచాట్లు పడుతున్నారు. బ్యాంకులు, ఎటిఎంల నుండి నగదు పొందాలంటే అసాధ్యంగా మారింది. గంటల తరబడి ఎటిఎంల వద్ద క్యూలో ఉంటే రోజుకు కేవలం 2వేల రూపాయలు మాత్రమే లభిస్తోంది. అది కూడా ఒక పెద్ద నోటు (2వేలు) అందుతోంది. పెద్దనోట్లను మార్చాలంటే చిల్లర సమస్య శిరోభారంగా మారింది. దీంతో వినియోగదారులు బడా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో నిత్యావసర సరుకుల కోసం తమకు సమీపంలోని కిరణా దుకాణాలను ఆశ్రయించిన సామాన్యులు ఇప్పుడు కార్పొరేట్ వ్యాపార సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఆయా సంస్థల్లో నగదు రహిత విక్రయాలు జరుగుతుండటంతో ఆయా వర్గాలు అక్కడికే క్యూ కడుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలలో గత నెలతో పోలిస్తే డిసెంబరు మొదటి వారంలో కార్పొరేట్ సంస్థల వ్యాపారం అనూహ్యంగా పెరిగింది. వివిధ కార్పొరేట్ కంపెనీలు ఈ నగరాలలో సుమారు పాతిక వరకు మెగా మాల్స్‌ను నిర్వహిస్తున్నాయి. అన్ని రకాల నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుతున్నాయి. పలు పట్టణాల్లో కూడా ఇటీవలి కాలంలో కార్పొరేట్ వాణిజ్య కేంద్రాలు వెలిశాయి. ఆయా సంస్థలు ప్రతి ఒక్క సరుకు కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇంత వరకు ఆయా కార్పొరేట్ సంస్థలకు ఉన్నతస్థాయి, ఉద్యోగ, వ్యాపార వర్గాల వర్గాలు మాత్రమే వెళ్ళేవారు! ఇటీవలి పరిణామాల నేపథ్యంలో సామాన్య ప్రజలు సైతం ఈ తరహా వ్యాపార కేంద్రాలపై దృష్టి సారించాల్సి వచ్చింది. నెలకు 2 నుండి 3వేల రూపాయల మొత్తంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేవారిలో అధిక శాతం వినియోగదారులు ఇక చిన్న దుకాణాలకు గుడ్‌బై చెప్పినట్టేనని, వీరంతా బడా షాపులవైపు మళ్ళినట్టేనని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. దీంతో చిన్న, చితకా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఒక పథకం ప్రకారం కార్పొరేట్ కల్చర్‌ను, కార్పొరేట్ విక్రయ కేంద్రాలను అన్ని వర్గాల వారికీ చేరువ చేసేందుకు కుట్ర జరిగిందని మరోవైపు ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.

తుపానుపై అప్రమత్తం
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరిక

కాకినాడ, డిసెంబర్ 10: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్ద తుపానుపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. గత మూడు రోజులుగా వాతావరణ శాఖ తుపానుపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో తాజా బులిటెన్‌లో ఈనెల 12న మధ్యాహ్నం లేక సాయంత్రానికి తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని అధికారులు వెల్లడించారు. ముందు కాకినాడ వద్ద తుపాను తీరం దాటే అవకాశాలున్నట్టు వచ్చిన ప్రకటనకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను శనివారం ఉదయం 8.30 గంటల సమయానికి నెల్లూరుకు ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో 12.7 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 88 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో తుపాను పశ్చిమ వాయువ్యంగా కదులుతూ ఆదివారం సాయంత్రానికి బల పడుతుందని, రాష్ట్రంలోని తీరంవైపు కదులుతూ క్రమేణా బలహీనపడే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని తీర ప్రాంతంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. అక్కడక్కడ చెదురుమదురుగా జల్లులు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను తీరం దాటే వరకు తీర ప్రాంత మండలాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇసుక జాతర..నిబంధనలకు పాతర!
యంత్రాలతో తవ్వకాలు

రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: జిల్లాలో కొత్త ఇసుక ర్యాంపులు మొదలయ్యాయి..నిబంధనలను ఉల్లంఘిస్తూ తవ్వకాలు సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలను వినియోగిస్తున్నట్టు తెలిసింది. యథేచ్ఛగా పొక్లయినర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. తాజాగా అనుమతి లభించిన 14 ఇసుక ర్యాంపులతోపాటు జిల్లాలో మొత్తం 25 ర్యాంపులు నడుస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్తగా ఐదు ర్యాంపులకు అనుమతి ఇస్తే, 9పాత రేవులను పునరుద్ధరించారు. ఇసుక తవ్వకాలకు యంత్రాలు వినియోగించుకూడదనేది జిల్లా కలెక్టర్ ఆదేశం. కానీ ఈ ర్యాంపుల్లో నిబంధనలను పర్యవేక్షించే నాథుడు కరువయ్యాడు. వైవిపాలెం బెల్లంపూడి 1, రావులపాలెం, మర్రివీడు, తాతపూడి 2, పులిదిండి 2 ర్యాంపులకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అనుమతి లభించింది. జిల్లాలో కేటాయించిన ఇసుక ర్యాంపుల్లో కేవలం కూలీలతోనే ఇసుక తవ్వకాలు సాగాలి. యంత్రాలను వినియోగించకూడదు. కానీ ఎక్కడా యంత్రాలు లేకుండా పనులు జరగడం లేదంటున్నారు. కూలీ రేట్లు, రవాణా చార్జీల వివరాలను ప్రదర్శిస్తూ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాల్సి వుంది. కానీ ఇటువంటి నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఉచిత ఇసుక విధానం అపహాస్యం పాలవుతోంది. యంత్రాలను యథేచ్ఛగా వినియోగిస్తున్నా పట్టించుకునే నాధుడు కన్పించడం లేదు. దీనికి తోడు ఇసుక ర్యాంపుల్లోకి పరిమితికి మించి వాహనాలు రాకూడదు. రాత్రి వేళల్లో తవ్వకాలు సాగించకూడదు. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇసుక తవ్వకాలు నిర్వహించాలనేది నిబంధన. కానీ ఈ నిబంధనలేవీ మచ్చుకు కూడా కనిపించడం లేదు. గనుల శాఖ ఇచ్చిన జియో కో ఆర్డినేషన్‌ను అనుసరించి మీటరు లోతు మాత్రమే ఇసుక తవ్వాల్సి వుంది. కానీ ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని వంగలపూడి, వెదుళ్ళపల్లి, కాటవరం, బ్రిడ్జి లంక, కేతావారిలంక, వేమగిరి, జొన్నాడ, ముగ్గళ్ళ, మునికూడలి, అమలాపురం డివిజన్ పరిధిలో ఊబలంక 2, గోపాలపురం 2, ఆత్రేయపురం 2, అంకంపాలెం 2, తాడిపూడి , పులిదిండి 2, బెల్లంపూడి, కొమ్మనాపల్లి గేదెల్లంక, రాజవరం వెలిచేరు, వద్దిపర్రు తదితర రేవుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లభించింది. ఈ మేరకు నిబంధనలకు ఖచ్చితంగా పాటించే విధంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇందుకు అవసరమైన యంత్రాంగం కూడా వున్నపుడే ఉచిత ఇసుక విధానం గానీ, యంత్రాలతో వినియోగం గానీ లేకుండా వుంటుందని సర్వత్రా కోరుతున్నారు.
వామపక్ష
నాయకుల అరెస్టు
తుని, డిసెంబర్ 10: తొండంగి మండల పరిధిలోని తీర ప్రాంతంలో దివీస్‌ను వ్యతిరేకిస్తున్న కోన ప్రజలకు సంఘీభావం తెలిపిన వామపక్ష నేతలు దువ్వా శేషుబాబ్జీ, వేణుగోపాల్‌తోపాటు రైతుకూలీ సంఘం నేతలను తుని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తూర్పు, విశాఖ జిల్లాల నుండి వివిధ కార్మిక సంఘాల నేతలు పోలీసు స్టేషన్‌కు చేరుకుని అరెస్టుచేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి యుతంగా పోరాటం చేస్తున్నవారిపై పోలీసు జూలం చేయడం దారుణమైన చర్య అన్నారు. పోలీసులు కావాలనే కక్ష సాధింపు చర్యగా ఇటువంటి అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణం ఇటువంటి చర్యలు ఆపకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి నరసింగరావు, సిఐటియు గంగారాం, అప్పాలరాజు, సింహాచలం, బేబీరాణి పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ జరగకుండా
ప్రాణం ఉన్నంతవరకూ పోరాడతా
ఎంపి పండుల
అల్లవరం, డిసెంబర్ 10: ఎస్సీ వర్గీకరణ జరగకుండా తన ప్రాణం ఉన్నంత వరకూ పోరాడతానని అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం అల్లవరం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మాలల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కొన్ని కులాల వారితో నాయకులు ఆటలాడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగదన్నారు. దళితులు విడిపోతున్నారని పండగ చేసుకోవద్దన్నారు. ప్రైవేటు సంస్థల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎంపి పండుల పేర్కొన్నారు. పార్లమెంటు మాజీ స్పీకర్, దివంగత జిఎంసి బాలయోగి కోనసీమకు ఎన్నో ప్రజోపయోగకరమైన పనులు చేశారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సేవలందిస్తున్నట్టు తెలిపారు. రైల్వే లైను తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నం చేశానన్నారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోనసీమలో 95 శాతం మాలలు నిరుపేదలుగానే ఉన్నారని, వ్యవసాయ కూలీ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారెందరో ఉన్నారన్నారు. మాలల కోసం వర్గీకరణ జరగకుండా తనవంతు పోరాటం చేస్తానని చెప్పారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ మాల మహానాడు నాయకులు జూపూడి ప్రభాకర్, కారెం శివాజీలు వర్గీకరణ విషయంలో నోరు మెదపకపోవడం విచారకరమన్నారు. మాలలంతా ఐక్యతతో ఉండి ఎస్సీ వర్గీకరణ అడ్డుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో నాతి శ్రీనివాస్, కునుకు బాపూజీ, డిఎస్పీ మోకా సత్తిబాబు, దేవరపల్లి విజయలక్ష్మి, చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వానపల్లిలో ఐదు ఇళ్లు దగ్ధం
రూ.10 లక్షల ఆస్తినష్టం: 11 కుటుంబాలు నిరాశ్రయం
కొత్తపేట, డిసెంబర్ 10: మండల పరిధిలోని వానపల్లిలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో అయిదు ఇళ్లు పూర్తిగా, రెండు ఇళ్లు పాక్షికంగా దగ్ధం కాగా 11 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో పి పళ్లంరాజు, బండారు సత్తిరాజు, అన్నవరం, బండారు పళ్ళంరాజు, బండారు వెంకటేశ్వరరావు, నూకల వెంకటేశ్వరరావు, నూకల పళ్ళంరాజు, నూకల నాగేశ్వరరావు, బండారు లక్ష్మణరావు, నూకల ధనరాజు, బండారు మనియ్య కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ ప్రమాదంలో గ్యాస్ సిలెండర్‌లు కూడా పేలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అన్ని కుటుంబాలు కట్టుబట్టలతో బయటపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివెళ్లి మంటలను అదుపుచేసారు. బండారు వెంకటేశ్వరరావు కుమార్తె నిశ్చితార్థం మధ్యాహ్నం జరగాల్సి ఉండగా, ప్రమాదంలో అతని ఇల్లు కూడా కాలిపోవడంతో దానిని వాయిదా వేశారు.
ఎమ్మెల్యే చిర్ల పరామర్శ
ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఘటనా ప్రాంతానికి వచ్చి బాధితులను పరామర్శించారు. అగ్నిబాధిత కుటుంబాలకు తనవంతు ఆర్థిక సహాయాన్ని, ప్రభుత్వం తరఫున బియ్యం పంపిణీ చేశారు. అలాగే నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బండారు సత్యానందరావు కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
గంగుమళ్లకు మంత్రి యనమల పరామర్శ
కడియం, డిసెంబర్ 10: ఇటీవల మాతృవియోగం పొందిన నర్సరీ రైతు, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గంగుమళ్ల సత్యనారాయణను శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పరామర్శించారు. యనమలతోపాటు రాజానగరం, మండపేట ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావులు పరామర్శించిన వారిలో ఉన్నారు. గంగుమళ్ల మాతృమూర్తి సత్యవతి చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. గంగుమళ్ల సోదరులు తాతాజీ, నగేష్ కుటుంబ సభ్యులను మంత్రి యనమల ఓదార్చారు. గంగుమళ్ల కుటుంబంతో తనకెంతో అనుబంధం ఉందని మంత్రి యనమల ఈ సందర్భంగా పేర్కొన్నారు. గంగుమళ్లను పరామర్శించిన వారిలో టిడిపి నాయకులు గన్ని కృష్ణ, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, వెలుగుబంటి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలి
కాకినాడ సిటీ, డిసెంబర్ 10: క్రీడారులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని జెఎన్‌టియుకె ఉపకులపతి ప్రొఫెసర్ విఎస్‌ఎస్ కుమార్ అన్నారు. వర్శిటీ క్రీడాప్రాంగణంలో రెండురోజులపాటు జరగే ఐదవ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ టోర్నమెంటును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడారులు గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వలన శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎఎం ప్రసాద్, డాక్టర్ పిఎస్ ప్రసాద్, స్పోర్ట్సు కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 200మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు.
దివీస్‌కు వ్యతిరేకంగా బాధితుల వంటావార్పు
తొండంగి, డిసెంబర్ 10: దివీస్ లేబరేటరీ కంపెనీ నిర్మాణంపై పలు గ్రామాల ప్రజలు శనివారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తాటియాకుల పాలెం, ఒంటి మామిడి, కొత్తపాకలు, పంపాది పేట తదితర గ్రామాల ప్రజలు దివీస్ లేబరేటరీ కంపెనీ నిర్మించవద్దంటూ పంపాదిపేట సమీపంలో గల జీడిమామిడి తోటలో సమావేశమైన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దివీస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భూములలోనికి ప్రవేశించారు. తాము అమ్మని భూములలో పోలీస్ బలగాలను దింపి అక్రమంగా చెట్లును తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా సిపిఐఎంఎల్, సిఐటియు నాయకులు దువ్వా శేషుబాబ్జి మాట్లాడుతూ భూములు అమ్మని రైతులు వారికి సంబంధించిన చెట్లను తొలగించడం ఎంత వరకు సమంజసమన్నారు. చెట్లు తొలగించిన వాటికి నష్టపరిహారాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, శ్రీనివాస్, సింహాచలంలతో పాటు దానవాయిపేట మాజీ సర్పంచ్ మేరుగు ఆనంద్ హరి, మాజీ జెడ్పీటిసి అంగులూరి అరణ్‌కుమార్, ఎమ్ ముసలయ్య, నేమాల బుజ్జి, వీరబాబు, బాబురావు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రాజమహేంద్రవరం అర్బన్‌లో 57 మంది ఎస్సైలు బదిలీ
రాజమహేంద్రవరం, డిసెంబర్ 10: రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో 57 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ శనివారం ఎస్పీ బి రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న ప్రొబేషనరీ ఎస్‌ఐలకు స్టేషన్లను కేటాయించడంతో పాటు, వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలకు స్థానచలనం కల్పించారు.
ఇటుక బట్టీలతో పెరుగుతున్న కాలుష్యం

మండపేట, డిసెంబర్ 10: ప్రధాన రహదారికి ఇరువైపులా వందలాది ఇటుక బట్టీలు నెలకొనటంతో ఈ ఇటుక బట్టీలు ప్రజల పాలిట శాపంగా మారాయి. రామచంద్రపురం నుంచి మండపేట మీదుగా రావులపాలెం వెళ్లే రహదారిలో ఈ ఇటుక బట్టీల వ్యవహారం మరింత తీవ్రంగా ఉంది. ఇటుక బట్టీ యజమానులు కాసుల సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ప్రజల కళ్లల్లో దుమ్ము మాత్రం పట్టించుకోవడంలేదు. దీనితో రైసుమిల్లులతోపాటు ఆయిల్ మిల్లులు వెదజల్లుతున్న గాలి, నీటి కాలుష్యం ప్రజల పాలిట శాపంగా మారాయి. వేలాది రూపాయలతో వ్యాపారం చేస్తున్నప్పటికీ ప్రజాసమస్యలపై నీళ్లు చల్లుతున్నారని పలు విమర్శలు విన్పిస్తున్నాయి. రామచంద్రపురం నుంచి వచ్చే మార్గంలో మాచవరం, పెడపర్తి, వీరభద్రపురం, ఆలమూరు, జొన్నాడ, పులగుర్త, మారేడుబాక, ఏడిదతోపాటు మండపేట నుంచి రాజమహేంద్రవరం వెళ్లే రహదారిలో తాపేశ్వరం, ఇప్పనపాడు, జెడ్ మేడపాడులలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటుక బట్టీల నుంచి వచ్చే పొగ, బూడిదల వల్ల పలు ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాతతోపాటు మరికొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. అలాగే కర్మాగారాల నుంచి వాయు, నీటి రూపాల్లో వచ్చే కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. రైసుమిల్లుల నుంచి వచ్చే ధూళి వల్ల కంటి సంబంధ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండపేట పట్టణం నుంచి ఏడిద వెళ్లే రహదారిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో అనేక కంటిపరమైన జబ్బులతోపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు, ప్రయాణీకులు వాపోతున్నారు. ప్రభుత్వం, అధికారుల తనిఖీలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ సమస్యలు మరింత ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు సత్వరమే చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నగదు రహిత భారత్ ఏర్పాటుకు ప్రతిజ్ఞ
రామచంద్రపురం, డిసెంబర్ 10: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అవినీతిని అంతమొందించాలనే ఏకైక నినాదంతో స్థానిక మోడరన్ విద్యాసంస్థల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల విద్యార్ధులు జాతీయ జెండా సాక్షిగా నగదు రహిత భారత్ ఏర్పాటుకు ప్రతిజ్ఞ చేశారు. మోడరన్ విద్యాసంస్థల అధినేత లయన్ జివి రావు నేతృత్వంలో శనివారం పట్టణ వీధుల్లో అత్యధిక నిడివి కలిగిన జాతీయ జెండాను ఊరేగించి ప్రతిజ్ఞ చేశారు. తమ దత్తత గ్రామమైన యనమదలలో మోడరన్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల సహకారంతో ఇంటింటికి వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరం ద్వారా అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించినట్లు లయన్ జివి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.