తూర్పుగోదావరి

రచ్చకెక్కిన ‘పిఆర్వో’ల బాగోతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 7: పోలీస్ శాఖలో మంచి క్రేజ్‌తో పాటు డిమాండ్ ఉన్న పోర్ట్ రిజిస్ట్రేషన్ అధికారి (పిఆర్‌ఒ), సహాయ పోర్ట్ రిజిస్ట్రేషన్ అధికారి (ఎపిఆర్‌ఒ) పోస్టుల్లో నియామకాల వ్యవహారం రచ్చకెక్కింది. రాజకీయ నాయకుల ఆశీస్సులుంటేనే ఈ పదవులను పొందే అవకాశం ఉండటం, చాలాకాలంగా పైరవీలకే పెద్దపీట వేస్తుండటాన్ని అర్హులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్టుల నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కి, పొలిటికల్ ప్రముఖుల సిఫార్స్‌లకు తలొగ్గుతున్నట్టు చాలాకాలంగా ఆరోపణలున్నాయి. తాజాగా జరుగుతున్న పైరవీలు, రాజకీయ జోక్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ నియామకాలపై తక్షణం దృష్టి సారించాలంటూ జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్‌ను సాక్షాత్తూ జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు విజ్ఞప్తి చేయడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. పిఆర్‌ఒ, ఎపిఆర్‌ఒ పోస్టులు జిల్లాలోని సాధారణ పోలీసులకు (నేతల పలుకుబడి లేనివారు) అందని ద్రాక్షగా మారాయని, పైరవీకారులకు మాత్రమే ఇవి వరంగా మారాయంటూ ఎస్పీకి రాసిన లేఖలో సంఘం కోశాధికారి జి బలరామమూర్తి పేర్కొనడం విశేషం!
ఈ వివాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కాకినాడ పోర్టులో కీలకమైన పిఆర్‌ఒ, ఎపిఆర్‌ఒ పదవులకు మంచి డిమాండ్ ఉంది. విదేశీ నౌకల్లో ప్రయాణించి కాకినాడ రేవుకు చేరుకునే విదేశీయులు, ఉద్యోగులు తదితరుల జాతకాలు వీరి చేతుల్లో ఉంటాయి. పాస్‌పోర్ట్‌లను తనికీ చేయడం నుండి ఇతర లావాదేవీలపై నిఘా ఉంచడం వీరి విధి! 2004 సంవత్సరం నుండి ఎస్సై స్థాయి అధికారిని పిఆర్‌ఒగాను, హెడ్‌కానిస్టేబుల్‌ను ఎపిఆర్‌ఒ గాను జిల్లా ఎస్పీ ఎంపిక చేసి నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఏటా జనవరి 1నుండి డిసెంబరు 31వరకు ఏడాది కాల పరిమితికి మాత్రమే వీరిని నియమించాల్సి ఉంది. ఏడాది కాలపరిమితి ముగిశాక మళ్ళీ సంవత్సరం కాల పరిమితికి కొత్తవార్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల నియామకాల్లో ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా 2012సంవత్సరం వరకు జరిగిందని, 2013వ సంవత్సరం నుండి పరిస్థితి మారిపోయింది. 2013 సంవత్సరంలో గతంలో పనిచేసిన వారినే పిఆర్‌ఒ, ఎపిఆర్‌ఒలుగా నియమిస్తూ అప్పటి ఎస్పీ బదిలీపై వెళ్తూ 45రోజులు ముందుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు సదరు ఎస్సై, హెచ్‌సిలకు ఇచ్చిన ఆర్డర్స్‌ను నిలిపివేశారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో 2013 సంవత్సరానికి కొత్త పిఆర్‌ఒ, ఎపిఆర్‌ఒలను నియమించలేదు. తర్వాత నియమితులైన పిఆర్‌ఒ, ఎపిఆర్‌ఒలు ఈ అంశాన్ని సాకుగా చూపి 2014, 2015 సంవత్సరాల్లో రాజకీయ సిఫార్సులతో జిల్లా ఎస్పీపై వత్తిడి తీసుకువచ్చి, రెండు సంవత్సరాల పాటు పదవుల్లో కొనసాగారు. ఇదే విధంగా 2016 సంవత్సరంలో పిఆర్‌ఒ , ఎపిఆర్‌ఒలుగా బాధ్యతలు స్వీకరించిన వారు సైతం రెండు సంవత్సరాల పాటు కొనసాగించవచ్చని వివిధ కారణాలు చూపుతూ, జిల్లాలోని స్థానిక నాయకుల సహకారంతో రాజకీయ ప్రముఖుల ద్వారా జిల్లా ఎస్పీపై వత్తిడి తీసుకువస్తున్నారని, వారి స్వార్ధ ప్రయోజనాలు, ఆర్ధిక లబ్ది కోసం ఈ పోస్టులు సామాన్యులకు దక్కకుండా చేస్తున్నారని బలరామమూర్తి ఆరోపించారు. జిల్లాలో 150 మంది ఎస్సైలు, 350 మంది హెడ్ కానిస్టేబుళ్ళున్నారని, అందరికీ అవకాశం రాకుండా, కేవలం కొద్దిమందికి మాత్రమే రెండవ సారి పనిచేసే అవకాశం ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం 2017 సంవత్సరంలోనైనా మార్గదర్శకాల ప్రకారం ఒక సంవత్సరం కాల పరిమితికి మాత్రమే అర్హులను నియమించి, భవిష్యత్‌లో ఎక్కువ మంది ఈ పదవులను నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విన్నవించారు.

అప్పుచేసి పప్పుకూడు అవసరమా!
*నిక్షేపంగా ఉన్న భవనం స్థానంలో కొత్త భవనం*పశ్చిమగానుగూడెం పశు వైద్యశాల వ్యవహారం
కోరుకొండ, జనవరి 7: అప్పు చేసైనా రాష్ట్ర ప్రజల కష్టాలు తీరుస్తామని ఓ వైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బహిరంగ ప్రకటనలు చేస్తుంటే పక్కా భవనం ఉన్న ప్రభుత్వ పశువైద్యశాలకు ఆగమేఘాల మీద రూ.36 లక్షలు ఖర్చుచేసి, మరో భవన నిర్మాణానికి అధికారులు ఆతృతకనపరుస్తున్నారు. ఈ భవనానికి సాక్షాత్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగానే శంకుస్థాపన చేయంచడం విశేషం. వివరాల్లోకి వెళితే... కోరుకొండ మండలంలోని పశ్చిమగానుగూడెం గ్రామంలో ప్రస్తుతం పశు వైద్యశాలకు భవనం ఉంది. ఆ భవనం నిక్షేపంగా ఉన్నప్పటికీ, రూ.36 లక్షల నాబార్డు నిధులు ఖర్చుచేసి మరో కొత్త భవనం నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. మండలంలో పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకుండా అద్దె భవనాల్లో విధులు నిర్వర్తిస్తున్నా రు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని, అభివృద్ధికి ప్రజల అవసరాలకు అప్పులు చేస్తున్నామని ఒకపక్క ప్రభుత్వం చెబుతోంది. శంకుస్థాపన కార్యక్రమంలో సాక్షాత్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమలే అప్పుల అంశాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారుల నిర్ణయం ప్రభుత్వం మరింత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనేలా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారా లేక సద్వినియోగం చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భవనం ఉన్నచోటే ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి మరో భవనం మంజూరు చేయడం అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు తరగతి గదులు లేక విద్యార్థులు వరండాలలో, ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు లేక రోగులు చెట్లకింద కూర్చుని ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని అధికారులు భవనం ఉన్న పశువైద్యశాలకే మరో భవనం కేటాయించడం ఎంతవరకూ సమంజసమనే వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ప్రస్తుతం అద్ద్భెవనంలో కొనసాగుతోంది. ప్రభుత్వ పశు వైద్యశాలకు సరిపడేలా పక్కా భవనం ఉన్నప్పటికీ ఆగమేఘాల మీద కొత్త భవన నిర్మాణం ఎవరికోసమని జనం నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి దుబారా ఖర్చు తగ్గించుకుంటే ఖాళీ అవుతున్న రాష్ట్ర ఖజానాకు మరింత చిల్లుపడే అవకాశముండదని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. ఇటువంటి వాటిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సి ఉందన్నారు.
ఇంకా తేలని భూ సేకరణ!
‘పురుషోత్తపట్నం’రైతులతో చర్చలు: రూ.17.91 లక్షలు ఇస్తామన్న కలెక్టర్

రాజమహేంద్రవరం, జనవరి 7: అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకానికి శంకుస్థాపన జరిగినా..అవసరమైన భూసేకరణ మాత్రం ఎటూ తేలలేదు. జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం రైతులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అన్ని గ్రామాలకు ఒకే మాదిరిగా నష్టపరిహారం చెల్లించాలని, సుమారు రూ. 60 లక్షలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ అరుణ్ కుమార్ పట్టిసీమ మాదిరి పరిహారాన్ని ఇస్తామని రైతులతో చర్చించారు. అధికారులు ఈ పధకానికి భూసేకరణ చేపట్టకుండానే ఆదరాబాదరా సిఎంచేత శంకుస్థాపన చేయించారు. ఇప్పుడు తీరుబడిగా భూసేకరణపై దృష్టిసారించారు. భూమి లేకుండానే భూమిపూజా.., డి పి ఆర్ లేని పురుషోత్తపట్నం.. ఇలా అనేక కధనాలు ఆంధ్రభూమి తొలిగా వెలుగులోకి తెచ్చింది.
ఎట్టకేలకు భూసేకరణకు సిద్ధమైన అధికారులు పురుషోత్తపట్నం, చినకొండేపూడి, నాగంపల్లి గ్రామాలకు చెందిన రైతులతో చర్చలు మొదలు పెట్టారు. ఈ మూడు గ్రామాలకు సంబంధించి పురుషోత్తపట్నంలో 122 ఎకరాలు, చినకొండేపూడిలో 64 ఎకరాలు, నాగంపల్లిలో 53 ఎకరాలు వెరసి 239 ఎకరాల భూమి అవసరం అవుతుందని ప్రాధమికంగా గుర్తించారు.
రైతులతో జరిగిన చర్చల్లో కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ భూ సేకరణకు రైతులు సహకరించాలని, రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పారు. తొమ్మిది నెలల్లో పూర్తయ్యే ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి పరిహారాన్ని అందిస్తామని చెప్పారు. 2013 చట్టం ప్రకారం భూ సేకరణ చేపట్టామని, చినకొండేపూడి, పురుషోత్తపట్నంలో ప్రస్తుతం ఎకరానికి రూ.7 లక్షలు వుండగా సర్వే చేసిన భూములలో రూ.17.91 లక్షలు పరిహారం వస్తుందని చెప్పారు. అదే విధంగా నాగంపల్లిలో ఎకరానికి రూ.7 లక్షలు ఉండగా రూ.15.35 లక్షలు ఇవ్వనున్నట్టు వివరించారు. అయితే అన్ని గ్రామాలకు ఒకే మాదిరిగా నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. కొంత మంది 35 నుంచి 40, మరి కొంత మంది రూ.60 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరింత పెంపుదలకు కృషి చేస్తామని చెప్పారు. భూమికి భూమి ఇవ్వాలని, భూములు కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని రైతులు కోరారు. మూడు సాగునీటి పథకాల్లో భూములు కోల్పోయామని, ప్రత్యేక దృష్టిపెట్టి న్యాయం చేయాలని రైతులు కోరారు. నాగలి ఆడని భూములను సైతం తీసుకుని పరిహారం ఇవ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఎపుడో పరిహారం కాకుండా తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.1638 కోట్ల అంచనాతో రూపొందిస్తోన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూసేకరణ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయనున్నామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, సీతానగరం ఎమ్మార్వో చంద్రశేఖర్, రైతులు కొరుపూరి ప్రసాద్, భాస్కర ప్రసాద్, కె.బాలక ష్ణ, నారాయణ, యనమదల శ్రీను, శివ గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.