తూర్పుగోదావరి

అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 9: అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా కోనసీమ ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఐ పోలవరం మండలం మురమళ్లలో నిర్వహించే కోనసీమ ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. గత ఏడాది జరిగిన చిన్నచిన్న పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా ఏర్పాట్లు చేయాలని రాజప్ప అధికారులు, నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో వాటర్ స్పోర్ట్సును భారీ స్థాయిలో నిర్వహించాలన్నారు. అలాగే స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహవంతులైన విద్యార్థినీ, విద్యార్థులను ఎంపిక చేసి వారిచే ప్రదర్శనలు ఏర్పాటుచేసి వారికి భాగస్వామ్యం కల్పించాలన్నారు.
జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కోనసీమకు ప్రపంచ స్థాయి పర్యాటక రంగానికి ఉన్న అన్ని హంగులు ఉన్నాయని, కోనసీమ ఉత్సవాల ద్వారా ఇక్కడ ప్రకృతి అందాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయన్నారు. కోనసీమలో చిర్రాయానం, ఎస్ యానాం, దిండి, మగసానితిప్ప వంటి ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా ఎంపిక చేసి ఆశాఖ ఉన్నతాధికారులకు నివేదికలు అందించామన్నారు. గతంలో ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణలో జరిగిన చిన్నచిన్న లోపాలు ఈసారి జరగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ కోనసీమ ఉత్సవాలను విజయవంతం చేస్తే భవిష్యత్‌లో టూరిజం శాఖ ద్వారా రెండువేల కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే కేంద్ర టూరిజం శాఖ ఉన్నతాధికారులు ఈ ప్రాంతాలను పరిశీలించి వెళ్లినట్లు ఆనందరావు తెలిపారు. చిర్రాయానం - ఎస్ యానాం ప్రాంతాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్‌లో పర్యాటకులకు విశేషంగా ఆకర్షించవచ్చన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) మాట్లాడుతూ కోనసీమ ఉత్సవాలను సక్రమంగా నిర్వహించాలంటే ముందుగా జాతీయ రహదారికి మరమ్మతులు నిర్వహించాలన్నారు. అమలాపురం నుండి ఎదుర్లంక వారధి వరకు రహదారి పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాత్రివేళల్లో జరిగే కోనసీమ ఉత్సవాలను తిలకించేందుకు వచ్చేవారు పాడైనపోయిన రహదారులపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడతారని రాజప్ప దృష్టికి బుచ్చిబాబు తీసుకువెళ్ళారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కేటాయించిన రూ. 2 కోట్లను ముందుగా విడుదల చేయాలని ఎమ్మెల్యే దాట్ల కోరారు. దీనిపై రాజప్ప మాట్లాడుతూ ఈ విషయంపై ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడానని, త్వరలోనే రహదారి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్సవాల నిర్వహణ ప్రత్యేకాధికారి భీమశంకరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 9 పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించిందన్నారు. వాటిలో కాకినాడ బీచ్ ఫెస్టివల్, కోనసీమ ఉత్సవాలకు స్థానం కల్పించడం విశేషమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఆర్డీవో జి గణేష్‌కుమార్, డిఎస్పీ ఎల్ అంకయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కోనసీమ ఉత్సవాల పరిధి పెంపు
ఈ ఏడాది నుండి కోనసీమ ఉత్సవాల పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. గత ఏడాది మురమళ్ల కేంద్రంగానే కోనసీమ ఉత్సవాలను నిర్వహించారు. అయితే ఈ ఏడాది మురమళ్లలో జరిగే ఉత్సవాలకు ప్రధాన ప్రాధాన్యత కల్పిస్తూనే మరో రెండు ఉత్సవాలను ఇందులో భాగం చేసినట్లు చినరాజప్ప తెలిపారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ప్రతియేటా నిర్వహించే జాతీయ వాలీబాల్ పోటీలు, ఎస్ యానాంలో బీచ్ ఫెస్టివల్‌ను కూడా కోనసీమ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మురమళ్లలో జరిగే కోనసీమ ఉత్సవాలు ఈ నెల 24 సాయంత్రం ప్రారంభమై 27వ తేదీన ముగుస్తాయని, ఎస్ యానాంలో 25, 26న బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, అలాగే ఈనెల 24 ఉదయం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జాతీయ వాలీబాల్ పోటీలు ప్రారంభమై 28న ముగుస్తాయన్నారు. ఈ పోటీల్లో 18కి పైగా పురుషుల, మహిళల జాతీయ స్థాయి జట్లు పాల్గొంటాయని రాజప్ప తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతీ రోజూ సుమారు లక్ష నుండి లక్షా యాభైవేలకు పైగా ప్రేక్షకులు పాల్గొనే అవకాశం ఉందని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాజప్ప ఆదేశించారు.

మన్యంలో ఆగని శిశుమరణాలు
నాలుగు నెలల పసికందు మృతి:18కి చేరిన మరణాలు
రాజవొమ్మంగి, ఫిబ్రవరి 8: మన్యంలో శిశుమరణాల పరంపర కొనసాగుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగికి జన్మించిన 4 రోజుల వయసున్న పసికందు సకాలంలో సరైన వైద్య సహాయం అందక అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మరణించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. దోనెలపాలెం గ్రామానికి చెందిన గిరిజన మహిళ అయిన పడాల వెంకటలక్ష్మి తొలి కాన్పులో జన్మించిన ఆడబిడ్డ కడుపునొప్పితో బుధవారం రాత్రి నుండి బాధపడుతూ ఏడుస్తుండగా గురువారం ఉదయం ఏలేశ్వరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించే సమయానికే ఆ బిడ్డ మరణించింది. జడ్డంగి పిహెచ్‌సి పరిధిలో మారేడుబాక హెల్త్ సబ్‌సెంటర్‌లో వెంకటలక్ష్మి రెండవ ఎఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తుందని, ఈ నెల 4న ఏలేశ్వరం ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె పురుడుపోసుకుందని, పుట్టిన నాటినుండి బిడ్డ కొంత అనారోగ్యంతో ఉన్నాదని జడ్డంగి పిహెచ్‌సి వైద్యాధికారిణి అఖిల తెలిపారు. దీనితో గత నాలుగునెలలుగా మండలంలో మరణించిన శిశువుల సంఖ్య 18కి చేరుకుంది. శిశుమరణాలు అరికట్టాలని, వైద్య సహాయం పెంచాలని, గర్భిణులకు పౌష్టికాహారం అందజేయాలని గిరిజన సంఘాలు, ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నా మరణాలు ఆగకపోవడం గమనించాల్సిన విషయం.

జిఎస్‌టి పరిధి నుంచి నర్సరీలను మినహాయంచాలి
-కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం
కడియం, ఫిబ్రవరి 9: నర్సరీలను జిఎస్‌టి పరిధిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌జైట్లీకి ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం గురువారం న్యూఢిల్లీలో వినతిపత్రం అందించారు. కాకినాడ ఎంపి తోట నరసింహం ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం ఈ వినతిపత్రాన్ని అరుణ్‌జైట్లీకి అందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు ఉత్పత్తి చేస్తున్న నర్సరీలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, పన్నుల పరిధిలోకి ఈ వ్యవస్థను తీసుకువస్తే పూర్తిగా నర్సరీ రంగం దెబ్బతింటుందని సుబ్రహ్మణ్యం అరుణ్‌జైట్లీకి వివరించారు. ఈ వినతిపత్రాన్ని పరిశీలిస్తామని అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చినట్టు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎపికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి
-లోక్‌సభలో ఎంపి నరసింహం
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 9: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం చెప్పారు. గురువారం లోక్‌సభలో జరిగిన బజ్జెట్ సమావేశంలో ఆంద్రప్రదేశ్ ప్రస్తుత ఆదాయ వనరులు, రెవెన్యూ లోటు, ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించడం కారణంగా ఆస్తులు తెలంగాణాకు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చి తీవ్ర అన్యాయం జరిగిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించి ఉదారంగా సహాయం చేయాల్సి ఉందన్నారు. ఈ బడ్జెట్‌లో అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌లో మినహాయింపు ఇవ్వడంతో రైతుల్లో ఆత్మస్థయిర్యం పెరిగిందని నరసింహం అన్నారు. అయితే కాకినాడలో హార్డ్‌వేర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలో ఇంతవరకు పురోగతి లేని విషయాన్ని సభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కాకినాడలో ఏర్పాటుచేస్తామని చెప్పిన ఇతర సంస్థలను సైతం ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటుచేయలని, తిరుపతిలో నీట్ ప్రవేశ పరీక్షకు కేంద్రాన్ని ఏర్పాటుచేసి, మక్కా యాత్రకు రాష్ట్రం నుండి వెళ్లే ముస్లింలు గణనీయంగా పెరుగుతున్న కారణంగా హజ్ కోటా పెంచడానికి చర్యలు తీసుకోవాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు ఎంపి నరసింహం తెలిపారు.

మహిళా సాధికారతకు పునరంకితం
కలెక్టర్ అరుణ్‌కుమార్

కాకినాడ, ఫిబ్రవరి 9: మహిళా సాధికారతకు పునరంకితమవుదామని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో మహిళా సాధికారతా సదస్సు-జాతీయ మహిళా పార్లమెంట్-2017 కార్యక్రమాలను పురస్కరించుకుని గురువారం నిర్వహించిన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అమరావతిలో శుక్రవారం నుండి 12వ తేదీ వరకు మూడు రోజులు జరిగే ఈ సమావేశాలను అందరూ తప్పక తిలకించాలని కోరారు. సదస్సుకు దేశ, విదేశాల నుండి సుమారు ఏడువేల మంది ప్రముఖులు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన జరిగే మహిళా దినోత్సవాల్లో ఇప్పటి అంశాలను చర్చించుకోవల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మహిళా సదస్సును నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. శుక్రవారం నుండి జరిగే సదస్సులో మహిళలకు సంబంధించి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరుగుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, మన దేశంలో మహిళల పట్ల వివక్ష ఇంకా ఎక్కువగా ఉందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైతే మహిళను గౌరవిస్తామో అక్కడ భోగభాగ్యాలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయన్నారు. పూర్వం సతీసహగమనం, బాల్య వివాహాల వంటి సామాజిక రుగ్మతలను సంఘ సంస్కర్తలు తరిమికొట్టారని గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు మహిళా సంక్షేమానికి కృషి చేశారన్నారు. మన ప్రభుత్వాలు నేడు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాయన్నారు. స్ర్తిలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుండటం హర్షణీయమని పేర్కొన్నారు. మహిళా శక్తి ఇంకా ఎన్నో విజయాలు సాధించేలా మనం ఆకాంక్షించాలని ఆయనన్నారు. అమరావతిలో జరిగే ఈ సదస్సుకు జిల్లాకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగులు, వివిధ స్థాయిల్లో ఉన్న మహిళలందరూ హాజరుకావాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ శుక్రవారం నుండి జరిగే ఈ సదస్సులకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షత వహిస్తారన్నారు. దేశంలోను, రాష్ట్రంలోను పురుషులతో సమానంగా మహిళలు ఎదిగేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ చదువుతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి స్ర్తి విద్యావంతులుగా రాణించాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తొలుత మహిళా ర్యాలీని ఎమ్మెల్యే అనంతలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కోరుకొండ నరసన్న కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
అన్నవరం ఇఒ నాగేశ్వరరావు
కోరుకొండ, ఫిబ్రవరి 9: చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయం, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని అన్నవరం దేవస్థానం ఇఒ కె నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కోరుకొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉత్సవాల నిర్వహణపై గురువారం ఉదయం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అన్నవరం దత్తత దేవాలయమైన కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులతోపాటు, గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రతీ సంవత్సరం చేస్తున్న విధంగానే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కొండపైన, మెట్ల మార్గం గుండా మంచినీటి కొరత రాకుండా చూసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రథోత్సవం నిర్వహించే పరిసర ప్రాంతాలకు, కొండకు దగ్గరలో ఎటువంటి మాంసాహార విక్రయషాపులు ఏర్పాటు చేయకుండా నిరోధించాలని, రథోత్సవం సమయంలో రథోత్సవం నిర్వహించే వీధుల్లో ఎటువంటి షాపులు ఉండకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆయా శాఖల అధికారులు వ్యవహరించాలన్నారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉంటే వారిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపుతానని తెలిపారు. కొన్ని శాఖల అధికారులు సమావేశానికి రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త రంగరాజ భట్టార్, మాజీ జడ్పీటీసీ తనకాల నాగేశ్వరరావు, కోరుకొండ సొసైటీ అధ్యక్షుడు నాగా రమేష్, టిడిపి నాయకులు మళ్ల అప్పలనర్సారావు, పరస శ్రీను, డిఎస్పీ ప్రసన్నకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థినులను చితకబాదిన
కరస్పాండెంట్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 9: గిరిజన విద్యార్థినిలను చితకబాదిన హోలీ ఏంజెల్స్ పాఠశాల కరస్పాండెంట్ కంచి మధుసూదనరావుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి బాధిత విద్యార్థినులను పరామర్శించి, జరిగిన సంఘటనపై ఆరా తీశారు.

భూముల క్రయ విక్రయాలు నిలిపివేతపై ఆందోళన
అన్నవరం ఇఒను నిలదీసిన వైసిపి నేతలు
కోరుకొండ, ఫిబ్రవరి 9: కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి భూములు అని తెలుపుతూ అన్నవరం దేవస్థానం అధికారులు ఎండోమెంట్ కమిషనర్ ద్వారా భూముల క్రయ విక్రయాలు జరగకుండా నిలిపి వేయడంపై వైసిపి నాయకులు ఆందోళన జరిపారు. జక్కంపూడి విజయలక్ష్మి, రాజా ఆధ్వర్యంలో రైతులు నారసింహుని ఆలయం వద్దకు చేరుకొని కల్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన సమన్వయ సమావేశం వద్ద ఆందోళన చేశారు. జక్కంపూడి విజయలక్ష్మి, రాజా, రైతులు ప్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అన్నవరం దేవస్థానం ఇఒ కె నాగేశ్వరరావు బయటకు వచ్చి చర్చించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని జిఒలు కోరుకొండలో మాత్రమే అమలవుతాయా అంటూ ఇఒను జక్కంపూడి నిలదీశారు. అదేవిధంగా దత్తత తీసుకున్నప్పుడు అన్నవరం సొమ్ములు ఖర్చుపెట్టాలని, అంతేకాని సొమ్ము నరసింహస్వామిది, సోకులు మీవా అంటూ ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. రైతులు కామరాజుపేట కర్ణంగా పనిచేసిన నారాయణరావును తమ ప్రతినిధిగా చర్చించడానికి ఇఒ అనుమతించడంతో వారు శాంతించారు. ఈ సందర్భంగా సమావేశం ముగిసే వరకూ అక్కడే బైఠాయించి, సమావేశం అనంతరం ఇఒతో నారాయణరావు చర్చించారు. గెజిట్ నోటిఫికేషన్ లేకుండా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం తగదన్నారు. కార్యక్రమంలో వాకా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీ అభివృద్ధికి కృషిచేసేవారికి గుర్తింపు

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

అమలాపురం, ఫిబ్రవరి 9: తెలుగుదేశం పార్టీ అభివృద్ధికోసం పాటుపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అమలాపురం పట్టణంలోని 1వ వార్డులో జరిగిన వార్డు కమిటీ ఎన్నికలను గురువారం రాజప్ప ప్రారంభించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో రాజప్ప ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో వార్డు కమిటీ అధ్యక్షుడిగా బొర్రా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కుసుమ సూర్యమోహన్‌రావు, కోశాధికారిగా రాజలపూడి శ్రీనివాసరావుతోపాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, వైస్ చైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరీ, మెట్ల రమణబాబు, నల్లాస్వామి, అల్లాడి సోంబాబు, తిక్కిరెడ్డి నేతాజీ, మట్టపర్తి శ్రీరామ్మూర్తి, లింగోలు పెదకాపు, నెల్లి రిప్పన్, అడపా నాయుడు, బండి రాధమ్మ పాల్గొన్నారు. అంతకు ముందు పార్టీ పతాకాన్ని రాజప్ప ఆవిష్కరించారు.

ఉన్నత చదువులతో గుర్తింపు పొందాలి

జిల్లా యాదవ మహాసభలో మాజీ మంత్రి పార్థసారథి పిలుపు
ప్రత్తిపాడు, ఫిబ్రవరి 9: యాదవులు ఉన్నత చదువులు చదివి సమాజంలో గుర్తింపు పొందాలని మాజీ మంత్రి కె పార్ధసారధి అన్నారు. మండంలోని ధర్మవరం గ్రామంలో గురువారం జరిగిన జిల్లా స్థాయి యాదవుల మహాసభలో ఆయన హాజరై ప్రసంగించారు. యశోద యాదవ సంఘం అధ్వర్యంలో జరిగిన ఈ సభకు జిల్లా వ్యాప్తంగా 5వేలకు పైగా యాదవులు హాజరయ్యారు. యాదవులు దేశ వ్యాప్తంగా ఇతరుల ఎదుగుదలకు సహకరించడమే గాని తాము ఎదగడం చేతకాని వ్యక్తులని ఇతరులకు అండదండలుగా ఉంటూ ఏళ్ళ తరబడి వెనుకబాటు తనంతో బతుకుతున్నారన్నారు. కుల వృత్తులతో సరిపెట్టకుండా విద్యా బుద్ధులు నేర్చుకుని ఉద్యోగ అర్హతలు పొందాలని పార్ధ సారధి సూచించారు. ప్రభుత్వ పధకాల కోసం ఎదురుచూడకుండా ఉన్నత చదువులు ద్వారా ఆర్ధిక అభివృద్ధి సాధించాలని సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు యాదవ యువతకు సూచించారు. కోపతాపాలకు తావు ఇవ్వకుండా కుటుంబ పోషణ కోసమే బతుకుని ఈడ్చుతున్నది యాదవ జాతన్నారు. చరిత్రలో యాదవరాజులు దేశాలను పాలించిన సంఘటనలు ఉన్నాయని నాగేశ్వరరావు అన్నారు. వివాదాలకు తావివ్వకుండా వినయంతో పైకి వచ్చిన వ్యక్తులలో రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరన్నారు. సమావేశంలో పాల్గొన్న యాదవ సంఘ నాయకులు పలు తీర్మానాలను చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏటా 1000 కోట్లు కేటాయించాలని జనాభా ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నామినేటెడ్ పదవులను యాదవులకు కేటాయించాలని గొర్రెల పెంపకం కోసం బంజర భూములు ఇవ్వాలని, గొర్రెల కాపరులు ప్రమాదంలో మృతిచెందితే రూ.5లక్షలు పరిహారం అందించాలని భగవత్ గీతను పాఠ్యాంశాలుగా చేర్చాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు కుండల సాయికుమార్, లంక వెంగలరావు, శంఖవరం మండల అధ్యక్షురాలు బి నాగమణి, ధర్మవరం సర్పంచ్ ముచ్చర్ల నాగలక్ష్మి, తదితరులు హాజరయ్యారు.

రెండు రంగుల అరటి గెల!
రావులపాలెం, ఫిబ్రవరి 9: రావులపాలెం అరటి మార్కెట్టు యార్డులో గురువారం రెండు రంగుల్లో ఉన్న అరటి గెల అబ్బురపరిచింది. కొమరాజులంకకు చెందిన రైతు కర్రి శ్రీనివాసురెడ్డి ఎరుపు చక్రకేళి రకం అరటిని సాగుచేశారు. గురువారం ఈ తోటలో నుండి ఆరు గెలలను కోసి రావులపాలెం అరటి మార్కెట్టు యార్డుకు విక్రయం కోసం తరలించారు. అయితే వీటిలో ఒక గెలలో సగ భాగం పచ్చ రంగులో కాయలు ఉండడం రైతులు, వ్యాపారులను ఆశ్చర్యపరిచింది. ఈ గెలను ఆసక్తిగా తిలకించారు. జన్యుపరమైన కారణాల వల్ల అరుదుగా ఇటువంటి గెలలు కాస్తుంటాయని మండల ఉద్యానవన శాఖ అధికారి ఎం బబిత తెలిపారు.

డిఇఒగా అబ్రహాం బాధ్యతల స్వీకరణ
కాకినాడ రూరల్, ఫిబ్రవరి 9: జిల్లా విద్యాశాఖాధికారిగా అబ్రహాం బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన డివైఇవోగా జిల్లాలో రాజమండ్రి, పిఠాపురం ఇన్‌ఛార్జ్ డివైఇవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డిఇవోగా పనిచేసిన రేలంగి నరసింహరావు ఎపి మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్ళారు. ఆయన స్థానంలో జిల్లాకు ఆర్‌జెడిగా వచ్చిన దేవానందరెడ్డికి డిఇవోగా అదనపు బాధ్యతలు ఇచ్చినప్పటికీ రెండో రోజునే పూర్తి స్థాయిలో అబ్రహంకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు.