తూర్పుగోదావరి

మహా శివరాత్రి పర్వదినానికి ముస్తాబైన గోదావరి తీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23: శివరాత్రి పర్వదినం నేపథ్యంలో జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం తొణికిసలాడుతోంది. ముఖ్యంగా గోదావరి నదీ తీరప్రాతం శివరాత్రి పర్వదినానికి శోభాయమానంగా తయారయ్యంది. పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు రాజమహేంద్రవరానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం నగరపాలక సంస్థ, దేవాదాయ ధర్మాదాయ, జల వనరుల శాఖలు పోలీసు, రెవెన్యూ సమన్వయంతో భారీ ఏర్పాట్లుచేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి నది ఒడ్డున పురాణ ప్రాశస్థ్యం కలిగిన కోటిలింగేశ్వరస్వామి, మార్కండేయేశ్వర, విశే్వశ్వరస్వామి క్షేత్రాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. ఈ క్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్షేత్రాలతో పాటు గౌతమీ ఘాట్ ఆలయాల సముదాయంలోనూ శివరాత్రి ప్రత్యేక దర్శన, పూజా, అభిషేక, అర్చన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. శీఘ్ర దర్శనం నిమిత్తం భక్తులకు క్యూలైన్లు, ప్రసాద వితరణ, అభిషేకాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌కు అవాంతరాలు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లుచేశారు. ఇరవై నాలుగు గంటల ముందుగానే పోలీసులు బందోబస్తు విధులకు సిద్ధమయ్యారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ స్థలాలను నిర్దేశించారు. అత్యధికంగా రద్దీ వుండే పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్ద ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటుచేసి, వాహనాలకు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
గురువారం అర్ధరాత్రి నుంచే రాజమహేంద్రవరానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీ వుంటుంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి భక్తజనం పుణ్య స్నానాలు ఆచరించి శివ క్షేత్ర దర్శనం, అభిషేకాలతో తరించి సుఖప్రదంగా తిరిగి వెళ్ళే విధంగా నగరపాలక సంస్థ, దేవాదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంగా ఏర్పాట్లు చేశాయి.
దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు శైవ క్షేత్రాల్లో భక్తుల కోసం శివరాత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీ శేషసాయి, నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామరాజు స్నాన ఘట్టాల్లో ఏర్పాట్లను ఫర్యవేక్షించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధికారులతో కలిసి గురువారం స్నాన ఘట్టాల్లో ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. నదిలో నీటి మట్టం బాగా తగ్గిపోయింది. బ్యారేజి వద్ద కెనాల్స్‌కు నీటి విడుదలను శుక్రవారం తెల్లవారు జామున ఒక పూట నిలుపుదల చేస్తే బ్యారేజికి ఎగువ రాజమహేంద్రవరం నగరంలోని స్నాన ఘట్టాల వద్ద నీటి మట్టం పెరిగేందుకు అవకాశం వుంటుందని ప్రయత్నాలు చేసినప్పటికీ పొలాలకు నీటి ఎద్దడి దృష్ట్యా అందుకు అవకాశం లేకుండా పోయింది. స్నాన ఘట్టాల్లో నీటి లోతు అంతగా లేకపోవడంవల్ల కోటి లింగాల ఘాట్, పుష్కర ఘాట్‌ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లుచేశారు. దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లుచేశారు. పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటుచేసి స్నాన ఘట్టాలు నిరంతరం శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. మొత్తం మీద శివరాత్రి స్నానాలకు ఇటు ఘాట్లు, భక్తుల దర్శనాలకు శివ క్షేత్రాలు సిద్ధమయ్యాయి.
జిల్లాలోని పురాణ ప్రాశస్థ్యం కలిగిన శివక్షేత్రాలు శివరాత్రి పర్వదిన శోభాయమానమయ్యాయి. పిఠాపురంలోని పాదగయ కుక్కుటేశ్వరస్వామి, పంచారామాలు సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, పలివెల కపోతేశ్వరస్వామి, క్షణ ముక్తేశ్వరం, మురమళ్ళ వీరేశ్వరస్వామి, ర్యాలి జగన్మోహనీ కేశవస్వామి, ధవళేశ్వరం అగస్తేశ్వర స్వామి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. దీంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతం నుంచే అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు.

కొవ్వాడలో భారీ పెండలం దుంప
కాకినాడ రూరల్, ఫిబ్రవరి 23: కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో గోపిశెట్టి సూర్యనారాయణ (మాజీ గ్రామాధికారి) పెరట్లో అతి భారీ పెండలం తయారయ్యింది. సహజంగా పెద్ద పెండలం దుంప 4 కిలోల నుండి 5 కిలోలు ఉంటుందని, ఇది మాత్రం 20 కిలోలు ఉందని, ఇది కూడా వినాయకుని రూపంలో ఉందదని సూర్యనారాయణ అన్నారు. ఇది మామూలు పెండలం దుంప తెచ్చి 9 నెలల క్రితం తన పెరట్లో పాతి పెట్టానని, అది గురువారం చూసేసరికి తవ్వినకొద్దీ లోపలికి ఉందని అన్నారు. భారీగా పెరిగిన పెండలం దుంపను ఈ ప్రాంత ప్రజలు వింతగా చూస్తున్నారు.

మైనపు మహాదేవుడు!
-కొవ్వొత్తిపై తీర్చిదిద్దిన మండపేట యువకుడు
మండపేట, ఫిబ్రవరి 23: మండపేట పట్టణానికి చెందిన సంకు యజ్ఞేశ్వరరావు అనే యువకుడు కొవ్వొత్తిపై పరమేశ్వరుని ఆకారాన్ని చిత్రీకరించాడు. శివుని తలపై చంద్రవంక, మెడలోని పాము, తలపై గంగాదేవి, ఆమె నోటిలో నుండి నీరు వస్తున్నట్టు అద్భుతంగా చెక్కాడు. ఇతని ప్రతిభను చూసిన పలువురు యజ్ఞేశ్వరరావును అభినందించారు. ఈ సందర్భంగా యజ్ఞేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వొత్తిపై ఈ శిల్పాన్ని చెక్కేందుకు సుమారు 6 గంటల సమయం పట్టిందని, మహా శివరాత్రి సందర్భంగా దీనిని తయారుచేసినట్టు చెప్పాడు.

కార్యకర్తలకు గుర్తింపునకు కృషి
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప

అమలాపురం, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ఏ పార్టీ ప్రవేశపెట్టని విధంగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నూతనంగా చేరిన కార్యకర్తలకు విడుదలైన గుర్తింపు కార్డులను గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాజప్ప అందజేశారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు సంబంధించిన మొదటి గుర్తింపు కార్డును ఆ వార్డు కమిటీ అధ్యక్షుడు బొర్రా వెంకటేశ్వరరావు, కుసుమ సూర్యమోహనరావుల సమక్షంలో కార్యకర్తలకు రాజప్ప అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, వైస్ చైర్మన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, ఏరియా అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మెట్ల రమణబాబు, కర్రి దత్తుడు, భాస్కర్ల రామకృష్ణ, వలవల శివరావు, ఆశెట్టి ఆదిబాబు, బండారు సత్యనారాయణ, కైరం తాతాలు, వెలిగట్ల లక్ష్మణరావు, నెల్లి రిప్పన్, జడ్పీటిసిలు, ఎంపిపిలు పాల్గొన్నారు.

నేడు ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణకు సెలవు
కాకినాడ, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ నామినేషన్ స్వీకరణకు సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి ఎస్ సత్యనారాయణ తెలిపారు. అలాగే శనివారం, ఆదివారాల్లో కూడా నామినేషన్లను స్వీకరించమని జెసి తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు జెసి విజ్ఞప్తి చేశారు.

పనులను అడ్డుకున్న రైతన్న
పురుషోత్తపట్నం స్టేజ్-2 పనులకు బ్రేకు:పురుగుల మందు డబ్బా చేతపట్టి ఆందోళన

జగ్గంపేట, ఫిబ్రవరి 23: భూసేకరణ ఓ కొలిక్కి రాకుండానే చేపడుతున్న పురుషోత్తపట్నం స్టేజ్-2 పనులను రైతులు అడ్డుకున్నారు. జగ్గంపేట మండలంలోని రామవరం గ్రామం పరిధిలో పోలవరం కాల్వ చేపట్టడాన్ని ఆ ప్రాంత రైతులంతా గురువారం అడుకున్నారు. గ్రామ ఉప సర్పంచి అడబాల వెంకటేశ్వరరావు పరిసర రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. తమ పొలాలకు సమీపంలో పనులు చేపట్టడంతో ప్రతిపాదిత పైపులైన్ వెళ్లే మార్గంలోని గ్రామ రైతులంతా ఒక్కటై నిరసన గళం వినిపిస్తూ పురుగుల మందు డబ్బాలు చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో రైతులు అడబాల వెంకటేశ్వరరావు, మండపాక సుబ్రహ్మణ్యం, అడబాల సూరిబాబు, కంటికాల బుల్లియ్య, అడపా తాతయ్య, మండపాక పెద్ద తదితరులు పొక్లైన్‌తో మట్టి తవ్వకం పనులు అడ్డగించి బుధవారం నుంచి సమీప పొలాల్లో శిబిరం ఏర్పాటు చేశారు. రెండవ రోజు గురువారం రైతులంతా అక్కడ మట్టి తవ్వకం పనులు అడ్డగించి పురుగులు మందు తాగి చనిపోతామని బెదించారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట తహసీల్దార్ ఎల్ శివమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో విస్కో పైప్‌లైన్, పుష్కర, పోలవరం కోసం భూములను కోల్పోయామని, ఇప్పుడు పురుషోత్తపట్నం పైపులైన్ కోసం భూములు ఇవ్వాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలో పొలాలు ఉండడంతో మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఎకరం ధర పలుకుతోందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ. 40 లక్షల చొప్పున పరిహారం ఇస్తేనే పనులకు అనుమతిస్తామని, లేకుంటే తమ పొలాల నుంచి పైపులైన్‌కు అంగీకరించేది లేదని స్పష్టంచేశారు.

26 నుంచి జన ఆవేదన సదస్సులు
పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు

అమలాపురం, ఫిబ్రవరి 23: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26 నుంచి మార్చి 1 వరకూ జిల్లా కేంద్రాల్లో జన ఆవేదన సదస్సులు నిర్వహించనున్నట్టు పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ప్రకటించారు. గురువారం ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమాలను గురించి వివరించారు. ఇటీవల విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం ఈ నెల 25న అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న కరవు, మంచినీరు, సాగు నీరు వంటి సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. అలాగే ఈ నెల 26 నుండి మార్చి 1 వరకూ రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో జన ఆవేదన సదస్సులు నిర్వహించనున్నట్టు గిడుగు చెప్పారు. సదస్సులు జరిగే ప్రాంగణాలకు ఇందిరమ్మ సభాప్రాంగణాలుగా నామకరణం చేస్తామన్నారు. ఈ సదస్సుల్లో పెద్ద నోట్ల రద్దు, దాని కారణంగా వివిధ వర్గాల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, ప్రత్యేక హోదా వంటి వాటిపై చర్చిస్తామన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో పశుగ్రాసం కొరత ఏర్పడిందని, దీంతో రాయలసీమ జిల్లాల్లో పాడి పశువులను సగం ధరకే అక్కడి రైతులు అమ్మేసుకుంటున్నారన్నారు. వెంటనే రైతులకు పశుగ్రాసం సరఫరా చేయాలని గిడుగు డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల సమయంలో టిడిపి ప్రజలకు సుమారు 600కు పైగా హామీలు ఇచ్చిందని, వాటిలో ఒక్కటి కూడా నేటికీ అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి, బెల్ట్ షాపుల నిర్మూలన వంటి హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మార్చి 5 నుండి 15 వరకూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేస్తామన్నారు. మార్చి 15 తరువాత ప్రత్యేక హోదాపై రాష్టవ్య్రాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ ర్యాలీల్లో ఎఐసిసి ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఇటీవల ఇంటి పన్నులు ఐదింతలు పెంచుతూ యజమానులకు నోటీసులు ఇవ్వడంపై గిడుగు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ ప్రాతిపదికన పన్నులు పెంచారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై కూడా ఈ నెల 25న కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కంచిపల్లి అబ్బులు, శిరంగు బాబు, కల్వకొలను తాతాజీ, ఎండి షెహన్ షా, యార్లగడ్డ రవీంద్ర, గెడ్డం సురేష్, సత్తి బాపూజీ, దామిశెట్టి జయ, నిమ్మకాయల ప్రసాద్, ఇబ్రహీం పఠాన్‌ఖాన్, నల్లారెడ్డి రత్నం తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు సహకరించాలి
-మంత్రి మల్లాడి
యానాం, ఫిబ్రవరి 23: స్వశక్తితో ఆర్థికంగా ఎదిగే మహిళలకు బ్యాంకులు ఆర్థిక సహాయం అందించి మహిళా సాధికారతకు తోడ్పడాలని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. గురువారం ఉదయం యానాంలోని సర్వశిక్షాభియాన్ కాన్ఫరెన్స్ హాలులో తమిళనాడు రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యదర్శి ఎస్ రాజు యానాం బ్యాంకు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. యానాంలో మహిళలు డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. రుణం తీసుకున్నవారిలో ఎక్కువ మంది తిరిగి చెల్లించడంలేదని, అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని సభ్యులందరికీ రుణం మంజూరు చేయకపోవడం సరికాదన్నారు. సక్రమంగా చెల్లించలేనివారి కారణాలు తెలుసుకొని వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. బ్యాంకులు సహకరిస్తే యానాంలో అన్ని బ్యాంకులకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందజేస్తానన్నారు.
అనంతరం యానాంలో పనిచేస్తున్న అన్ని బ్యాంకుల అధికారులకు తమిళనాడు నుండి వచ్చిన రిజర్వు బ్యాంకు అధికారులు ఆచరించాల్సిన విధివిధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యానాంలో పనిచేస్తున్న అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

సర్వశిక్షా అభియాన్‌లో 2,446 అదనపు తరగతి గదులు
-ప్రాజెక్టు డైరెక్టర్ శేషగిరి
రాయవరం, ఫిబ్రవరి 23: జిల్లాలో సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇప్పటివరకు రూ.134.87 కోట్లు విలువైన 2,446 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయని ఎస్‌ఎస్‌ఎ పిఒ మేకా శేషగిరి తెలిపారు. గురువారం రాయవరం ఎమ్మార్సీ తనిఖీకి వచ్చిన సందర్భంగా పిఒ శేషగిరి స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ 2012-13 సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరాల వరకు మంజూరైన 2,446 అదనపు తరగతి గదులకు గాను 2,164 గదులు పూర్తయ్యాయన్నారు. 2,082 గదులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2016-17 విద్యా సంవత్సరంలో రూ.5 కోట్ల 67 లక్షల విలువైన 67 తరగతి జగదులు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో 3,300 ప్రాథమిక, 414 ప్రాథిమికోన్నత పాఠశాలలు, 12 కస్తూరిబా గాంధి పాఠశాలల్లో షాలా సిద్ధి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 7 అంశాల ఆధారంగా పాఠశాలలను మూల్యాంకనం చేస్తామన్నారు. దీనిపై ప్రతి మండలం నుండి ఎంఇఒ, ఇద్దరు హెచ్‌ఎంలకు మార్చి మొదటి వారంలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో 541 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో న్యూట్రి గార్డెన్లు ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది జిల్లాలో సౌకర్యాలున్న అన్ని పాఠశాలల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇప్పటివరకు 21 భవిత కేంద్రాలు ఏర్పాటు చేయగా మరో 15 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఎస్‌ఎస్‌ఎ ప్రవేశపెట్టిన బడిరుణం తీర్చుకుందాం కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన లభించిందని, ఇప్పటివరకు పలు పాఠశాలల్లో రూ.3 కోట్ల విలువైన వౌలిక సదుపాయాలను దాతలు సమకూర్చినట్టు తెలిపారు. పిఒ వెంట ఎస్‌ఎస్‌ఎ ఎఎంఒ చామంతి నాగేశ్వరరావు, సిఎంఒ ఇంటి వెంకట్రావు, ఎంఇఒ పి ముక్తేశ్వరరావు ఉన్నారు.

ఎపిపిఎస్‌సి గ్రూప్-2 రాత పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు
జిల్లా సంయుక్త కలెక్టర్ సత్యనారాయణ

కాకినాడ, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఎపిపిఎస్‌సి) నిర్వహిస్తున్న గ్రూప్-2 ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో గురువారం గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారుల సమావేశంలో జెసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలను నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమీషన్ పోటీ పరీక్షల నియమ, నిబంధనలను దృష్టిలో ఉంచుకుని వాటిని పక్కాగా అమలుచేయాలని స్పష్టం చేశారు. గ్రూప్-2కు ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలుంటాయని చెప్పారు. ప్రిలిమినరీ పరీక్షలను ప్రణాళిక ప్రకారం చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు సమన్వయంతో నిర్వహించాలని కోరారు. ఈ రాత పరీక్షకు 64,107 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, 135 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. లైజన్ ఆఫీసర్లు 26వ తేదీ ఉదయం 4 గంటలకు హాజరై ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను ఆయా కేంద్రాలకు పంపాలన్నారు. ఆరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని, అభ్యర్థులు ఉదయం 9 గంటలకే ఆయా సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9.45 గంటలకు రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రానికి రిపోర్టు చేయాలని సూచించారు. సరైన వారిని ఇన్విజిలేటర్లుగా నియమించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జెసి చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఎల్ చెన్నకేశవరావు, గ్రూప్-2 పరీక్షల నిర్వహణాధికారి రామ్‌గోపాల్‌ప్రసాద్, జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం, వివిధ శాఖల జిల్లా అఆధికారులు పాల్గొన్నారు.

బాలికను కాపాడిన షీ టీమ్
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23: ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఒక యువతిని షీ టీమ్ సభ్యులు కాపాడారు. గురువారం స్థానిక లక్ష్మీవారపుపేటకు చెందిన ఇంటర్ చదువుతున్న ఆ బాలిక తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తూ ఎలుకల మందు చేతిలో పట్టుకుని కుటుంబ సభ్యులను బెదిరించింది. ఈ విషయాన్ని బాలిక తల్లి షీ టీమ్‌కు తెలియజేశారు. దీంతో షీ టీమ్ సభ్యులు శ్రీదేవి, రషీదా, నాగలక్ష్మి ఆమె ఇంటికి వెళ్లి 3 గంటల పాటు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపజేశారు. బాలికను కాపాడిన షీటీమ్‌ను ఎస్పీ బి రాజకుమారి అభినందించారు.
మళ్లీ దివీస్ వ్యతిరేక ఆందోళన
తొండంగి, ఫిబ్రవరి 23: దివీస్ కర్మాగారం నిర్మించవద్దంటూ తమ భూములను తమకే అప్పగించాలని తాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట గ్రామాలకు చెందిన పలు బాధిత రైతులు, ప్రజలు మూకుమ్మడిగా తమ భూముల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. ముందుగా పోలీస్ బలగాలు భారీ ఎత్తున మోహరించి వారిని అడ్డగించేందుకు ప్రయత్నించారు. బాధిత రైతులు, ప్రజలు తమ భూములను స్వాధీనపరుచుకునేందుకు వెళ్ళి తీరతామని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇరువురి మధ్య కొంతసేపు తోపులాట జరిగినప్పటికీ సిపిఎం జిల్లా నాయకులు శేషుబాబ్జీ ఆధ్వర్యంలో పోలీసులను ఎదిరించి కొత్తపాకల గ్రామం నుండి దివీస్ కర్మాగారం నిర్మాణం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. పోలీసులు వారిని అడ్డుకుని సుమారు 200 మందిని బలవంతంగా అరెస్ట్‌లు చేసి వాహనాల్లోకి ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. తరలించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శితో సహా జిల్లా నాయకుడు వేణుగోపాల్, శ్రీనివాస్, సింహాచలం, ఐద్వా మహిళా కార్యదర్శిలతో పాటు పలు గ్రామాల బాధిత రైతులు, ప్రజలను అరెస్ట్ చేసి తరలించారు. ఈ పర్యవేక్షణంలో జిల్లా అడిషనల్ ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పెద్దాపురం డిఎస్పీ రాజశేఖర్, రామచంద్రపురం డిఎస్పీలతో పాటు భారీ సంఖ్యలో సిఐలు, ఎస్సైలు, కానిస్టేబుల్స్ తదితరులున్నారు. దివిస్ బాధిత గ్రామాల్లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న బాధితులను, వారికి సంఘీభావంగా వెళ్లిన ఎపి రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి. శేషబాబ్జీని అక్రమంగా అరెస్టుచేసి నిర్బంధించడాన్ని ఎపి రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్ తీవ్రంగా ఖండించారు. తొండంగి మండలంలోని టిడిపి ప్రభుత్వం పోలీసులను కాపలా కుక్కలాగా ఉపయోగించుకుంటూ సుమారు 9 నెలలుగా 144 సెక్షన్ పెట్టి ప్రజల స్వేచ్ఛను హరిస్తోందని ఆరోపించారు. కంపెనీలో యనమల రామకృష్ణుడు వాటాలు ఉన్నందునే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సముద్రతీర ప్రాంతాన్ని అప్రకటిత ఎమర్జన్సీగా మార్చి నిరుపేదలపై వివిధ రకాల కేసులు బనాయిస్తూ జనజీవనాన్ని మరింత దరిద్రంలోకి నెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. వెంటనే ప్రజాసంఘాలపై, నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి దివీస్ కంపెనీని రద్దుచేయాలని రమేష్ డిమాండ్ చేశారు.

భక్తుల ఇబ్బందుల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వి విజయరామరాజు వెల్లడించారు. భక్తులు, యాత్రికులకు ఏవైనా ఇబ్బందులు, సమస్యలు తలెత్తితే 0883-2479995 నెంబర్ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. కంట్రోల్‌రూమ్ వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. గోదావరినీటిమట్టం తక్కువగా ఉన్నందున నగరంలోని ప్రధాన స్నానఘట్టాల్లో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

సంస్కృతి సంప్రదాయాలకు ప్రోత్సాహం
నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ ప్రతినిధి డాక్టర్ ఒమర్ గహరెబ్
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 23: వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలకు తమ వర్శిటీ ఎంతగానో ప్రోత్సాహం అందజేస్తుందని యుఎస్‌ఎ నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ ప్రతినిధి డాక్టర్ ఒమర్ గహరెబ్ చెప్పారు. జెఎన్‌టియుకె తమ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందజేయాలనే లక్ష్యంతో పలు విదేశీ విశ్వవిద్యాలయాలతో 2017-18 విద్యాసంవత్సరానికి పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. గురువారం వర్శిటీ అధికారులతో యుఎన్‌ఎ, ఇల్లినాయిస్, డెకాల్బ్, నార్తన్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ ప్రతినిధులు డాక్టర్ ఒమర్, డాక్టర్ పురుషోత్తమ్ దామోదరంలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఒమర్ గహరెబ్ మాట్లాడుతూ నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ చికాగోకు చాలా దగ్గరగా ఉంటుందని, సుమారు 20 వేల మంది విద్యార్థులు వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్నట్టు చెప్పారు. తమ వర్శిటీ ఎక్కువగా చైనా, మలేషియా, ఇండోనేషియా, భారత్ నుండి వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఎంఎస్ కోర్సులను అభ్యసిస్తున్నట్టు వివరించారు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లను ప్రోత్సహిస్తుందని, విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కోసం తమ విశ్వవిద్యాలయానికి రావచ్చని డాక్టర్ ఒమర్ కోరారు. విఐటి, ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు తరచుగా తమ వర్శిటీకి వస్తున్నారని, విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌ను అందజేస్తున్నట్టు తెలిపారు. మొత్తంగా 10 కోర్సులను 30 క్రెడిట్స్‌కు పాఠ్యప్రణాళికతో రూపొందిస్తున్నామని, ఫ్యాకల్టీ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌కు ఆహ్వానిస్తున్నామని, దీనివలన సంస్కృతి సంప్రదాయాలకు తమ యూనివర్శిటీ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు డాక్టర్ ఒమర్ పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న మరో ప్రతినిధి డాక్టర్ పురుషోత్తమ్ మాట్లాడుతూ ఎంఎస్ చదివిన విద్యార్థులకు మూడు సంవత్సరాల ఆప్షన్ ప్రాక్టికల్ శిక్షణ ఉంటుందని, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం ప్రముఖ కంపెనీలతో అనుసంధానమై ఉందని, ఈ కారణంగా విద్యార్థులకు మంచి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు మాట్లాడుతూ తమ యూనివర్శిటీ అనేక కోర్సులను అందజేస్తుందని, ఉత్తమమైన పాఠ్యప్రణాళిక, సమీకృత విద్యావిధానం, పరిశోధన, పరీక్షలు, ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా నాణ్యమైన విద్యను అందజేస్తున్నట్లు చెప్పారు. తాము ఒక కమిటీని నియమించి ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంతో అనుసంధానమై పలు కోర్సులను ప్రారంభించడానికి తగిన సన్నాహాలు చేస్తామని ప్రకటించారు. ఈ కమిటీలో ప్రొఫెసర్ వి రవీంద్రనాధ్, ప్రొఫెసర్ జి ఏసురత్నం, ప్రొఫెసర్ వివి సుబ్బారావులు సభ్యులుగా ఉంటారన్నారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిబాబు, డాక్టర్ ఒమర్‌లు జనరల్ ఎంఒయుపై సంతకాలు చేసి రెక్టార్ ప్రొఫెసర్ బి ప్రభాకరరావు సమక్షంలో మార్చుకున్నారు. వర్శిటీ తరఫున ఇల్లినాయిస్ ప్రతినిధులు సత్కరించారు. సమావేశంలో ఒఎస్‌డి ప్రొఫెసర్ కెవి రమణ, డైరెక్టర్లు, యుసిఇకె ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జివిఆర్ ప్రసాదరాజు, తదితరులు పాల్గొన్నారు.