తూర్పుగోదావరి

‘వేసవి’పై అప్రమత్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 25: వేసవి నేపథ్యంలో జిల్లాలో వివిధ వర్గాల సహకారంతో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ఎండల తీవ్రత నుండి ప్రజలు, పశువులను కాపాడేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయ్యింది. ఏప్రిల్ నుండి వీచే వడగాల్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రకృతి వైపరీత్యాల నివారణ నిధుల (సిఆర్‌పిఎఫ్) నుండి రూ. 71.46 లక్షలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా 685 గొట్టపు బావుల్లో పూడిక తీత కోసం రూ. 45.46 లక్షలు వెచ్చిస్తున్నారు. జిల్లాలో 7 మంచినీటి చెరువులను నింపేందుకు రూ. 26 లక్షలు ఖర్చు చేస్తున్నారు. క్రాష్ ప్రోగ్రాం ద్వారా ఏజన్సీ, మెట్ట ప్రాంతాల్లో అన్ని హ్యాండ్ పంపులు పూర్తిస్థాయిలో పనిచేసేలా మరమ్మతులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఏజన్సీలో పలుచోట్ల బోర్ల ఫ్లషింగ్ పనులు చేపట్టారు. జిల్లాలో పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో రూ. 3 కోట్ల 53 లక్షల నిధులతో సమ్మర్ మిటిగేషన్ కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు కార్యాచరణ రూపొందించారు. గ్రేడ్ 1, 2 గ్రామ పంచాయతీల్లో నాలుగు, గ్రేడ్ 3, 4 గ్రామ పంచాయతీల్లో ఒక్కొక్కటి వంతున మొత్తం 1,958 చలివేంద్రాలను నిర్వహించి, తాగునీరు, మజ్జిగ, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట షెల్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థల తరహాలో ఈ సంవత్సరం ఎండల్లో చలివేంద్రాలను నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకువచ్చింది. ఇందుకు అవసరమైన ఓ నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం సమర్పించింది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో తగినన్ని ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. వేసవి నేపథ్యంలో పింఛన్ల పంపిణీ, చౌక ధరల దుకాణాల్లో సరుకుల పంపిణీ సమయాలను మార్చనున్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల పనివేళలను మార్చనున్నారు. అలాగే ఎండల తీవ్రత, వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలపై వివిధ రూపాల్లో ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అధికారులు తీసుకుంటున్నారు. వేసవిపై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లో స్వయం సహాయ సంఘాల సహకారం తీసుకుని, విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు కృషి చేస్తున్నారు. విద్యాసంస్థల్లో వేసవి నేపథ్యంలో విద్యార్థులకు తగిన అవగాహన కలిగించేందుకు కృషిచేయాలని జిల్లా విద్యాశాఖను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీటిని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని వేసవి దృష్ట్యా బాలలు ఎండ తీవ్రతకు గురికాకుండా అప్రమత్తంగా అమలుచేయాలని స్పష్టం చేశారు. వేసవిలో గర్భిణులు, వృద్ధులు, చిన్న పిల్లలు తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్య శాఖ అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకున్నారు. పెట్రోల్ బంకులు, దుకాణాల వద్ద విధిగా తాగునీటి సౌకర్యం కల్పించేలా ఆయా వర్గాలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది.
ప్రజారోగ్య లక్ష్యాలను సాధించాలి
కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, మార్చి 25: ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలిపే ఆరోగ్య సమాచారంతో ఇచ్చిన లక్ష్యాలను సాధించి హెచ్‌ఐఎంఎస్‌లో డేటా అప్‌లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. శనివారం కలెక్టర్ వైద్యారోగ్య శాఖ కార్యాలయంలోని ఓరియంటేషన్ హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టంపై పిహెచ్‌సి వైద్యాధికారులు, వైద్య సూపరింటెండెంట్‌లు, పిహెచ్‌సిల ఎహెచ్‌ఎస్, డిహెచ్, జిజిహెచ్, మెడికల్ సూపరింటెండెంట్‌లకు ఏర్పాటుచేసిన నేషనల్ హెల్త్‌మిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్త్‌మిషన్ హెచ్‌ఎంఐఎస్ డేటాకు ప్రాముఖ్యత ఉందని, దీన్ని ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగటం లేదని, వైద్య పరీక్షలు, ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రసవ సమయంలో మరణాలు సంభవించకుండా నివారించేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెన్సీలోని గర్భిణుల్లో హైరిస్క్ కేసులు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఏజెన్సీలో రక్తహీనత ఎక్కువగా ఉండడం వల్ల మందులు, కాల్షియం, ఐరన్, సుక్రోజ్, బికాంప్లెక్స్ మందులను అధికంగా పంపాలన్నారు. పారా మెడికల్ సిబ్బందిని ఎక్కువ కాలం ఒకేచోట పనిచేసిన వారిని డిప్యుటేషన్‌పై వేరే ప్రాంతానికి బదిలీ చేయాలన్నారు. హైరిస్క్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ కె చంద్రయ్య, వైద్య కార్యాలయ డెమో శివశంకర్‌బాబు, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మద్యంపాపు నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలు: ఉద్రిక్తత
మహిళలపై దాడికి దిగిన మద్యం మాఫియా
కొత్తపేట, మార్చి 25: జనావాసాల మధ్య మద్యం షాపును పెట్టొద్దంటూ అడ్డుకుంటున్న మహిళలపై దుకాణ నిర్వాహకులు దాడికి దిగటంతో కొత్తపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొత్తపేట భవానీ కాలనీతోపాటు పినిపేవారి పేటకు సమీపంలో మద్యం షాపు పెట్టేందుకు ఒక వ్యాపారి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా అక్కడి మహిళలు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. దీనిపై ఇటు రెవెన్యూ, పోలీసు అధికార్లతోపాటు ఎక్సైజ్ అధికార్ల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి మద్యం షాపు వల్ల తాము ఎదుర్కోబోయే సమస్యలను వారికి ఏకరువు పెట్టారు. అయితే అక్కడ మద్యం షాపు ఏర్పాటుచేయబోరంటూ అధికార్లు హామీ ఇవ్వడంతో అప్పట్లో వారు ఆందోళనను విరమించారు. ఇదిలా ఉండగా శనివారం తిరిగి పనులను మళ్లీ చేపట్టిన నేపథ్యంలో ఆ పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కొందరు దాడికి దిగటంతో అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ పల్లికొండ జానకీదేవితోపాటు స్థానికులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుకున్న తహసీల్దార్ ఎన్ శ్రీ్ధర్‌తో పాటు ఎస్సై డి విజయ్‌కుమార్ ఘటనా ప్రాంతానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. అయితే అధికార్లు వ్యవరించిన తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వ్యాపారికి వత్తాసు పలుకుతూ అధికార్లు వ్యవహరించడం పట్ల మహిళలు మండిపడ్డారు. తమను అరెస్టు చేసినా ఫర్వాలేదని, చావనైనా చస్తామే తప్ప మద్యం షాపు పెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని మహిళలు ఖరాఖండిగా చెప్పారు. చివరకు చేసేది లేక వచ్చిన ట్రాక్టర్లను తిరిగి పంపి సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇక్కడ ఎటువంటి నిర్మాణ పనులు చేయరని అధికార్లు హామీ ఇవ్వడంతో వారు తిరిగి ఆందోళనను విరమించారు. ఇదిలా ఉండగా సాయంత్రం తిరిగి మద్యం వ్యాపారులు పనులు చేపట్టడంతో మళ్లీ మహిళలు రోడ్డుపైనే బైఠాయించారు.
కెపిటి: మద్యం దుకాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలతో వాగ్వివాదానికి దిగిన దుకాణ నిర్వాహకులు
కెపిటి1: మద్యం షాపు పెట్టొద్దంటూ ట్రాక్టర్లను అడ్డుకున్న దృశ్యం
జాతీయ బిసి కమిషన్‌ను స్వాగతిస్తున్నాం
*బిసిలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధత *అనుమానం వచ్చే మంజునాథను బహిష్కరించాం*బిసి సంఘాల జెఎసి కన్వీనర్ మార్గాని

రాజమహేంద్రవరం, మార్చి 25: రాజ్యాంగబద్ధంగా బీసీలకు జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఉభయ సభల్లోనూ బిల్లు పెట్టి ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలియజేస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం పట్ల బీసీ సంఘాల రాష్ట్ర జెఎసి కన్వీనర్ ఛైర్మన్ మార్గాని నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా జాతీయ కమిషన్ మాదిరే బీసీ జాతీయ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం వల్ల బీసీలకు రాజ్యాంగపరమైన చట్టబద్ధమైన రక్షణ, భద్రత లభిస్తాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని మాట్లాడారు. బీసీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ప్రధాని మోది తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీల సమస్యల పరిష్కారం ఈ కమిషన్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. చట్ట సభల్లో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇంత కాలం మహిళా రిజర్వేషన్లు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బీసీ చట్టబద్దత వల్లేనని అర్ధమవుతోందన్నారు. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖను కేటాయించాలని ముందు నుంచీ కోరుతున్నామన్నారు.
కాకినాడలో జరిగిన మంజునాధ కమిషన్ వద్ద బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, 143 బీసీ కులాలకు పది మంది ప్రతినిధులే, ఒకే ఒక కులమైన కాపుల నుంచి కూడా పదిమంది మాట్లేడే విధంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మంజునాథను బహిష్కరించామని, కమిషన్‌కు కాపుల పట్ల సానుకూలత ఉన్నట్టు అనుమానం వచ్చి బహిష్కరించామన్నారు. 143 కులాలు ఉన్న బీసీలను కాదని అర్హతలేని కులాలకు సంబంధించిన వారి వాదనలే విన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో బీసీ ప్రజా ప్రతినిధుల వైఖరిని తెలుసుకుని ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించక తప్పదన్నారు. ప్రధాని మోదీతోపాటు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇందుకు కృషి చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
కేంద్ర కేబినెట్‌లో బీసీలకు ఎన్‌సిబిసిలుగా బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసి ఆ దిశగా బీసీల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపికి రుణపడి ఉంటామని హితకారిణి సమాజం మాజీ ఛైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలకు జాతీయ కమిషన్ చట్టబద్ధత వల్ల కొత్తగా కులాలను బీసీల్లోకి చేర్చే ప్రక్రియకు అడ్డుకట్ట అవుతుందని భావిస్తున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్నారు. వెంకయ్యనాయుడు బిల్లు కోసం కృషి చేస్తున్న వెంకయ్యనాయుడుకు బీసీలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఎపి, తెలంగాణా బీసీలంతా రుణపడి వుంటారన్నారు. చట్టబద్దత ఒక వరం వంటిదని, జాతీయ బీసీ కమిషన్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, ఈ కమిషన్ బీసీ హక్కుల రక్షణకు ఒక రక్షణగా ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు జి లక్ష్మీ తులసి పేర్కొన్నారు.
బీసీలకు జాతీయ కమిషన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంజునాధ కమిషన్‌కు చెంపపెట్టని బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి దుర్గా యాదవ్ అన్నారు. రిజర్వేషన్లలో ఇతర కులాలు ముందుకెళ్ళేందుకు ఈ కమిషన్ వల్ల కష్టతరమవుతుందన్నారు. సమావేశంలో నాయకులు మార్గాని రామకృష్ణ గౌడ్, బిసి సంఘం నగర అధ్యక్షుడు మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.