తూర్పుగోదావరి

ప్రజల హృదయాల్లో అంబేద్కర్‌కు సుస్థిర స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, ఏప్రిల్ 14: విద్య ద్వారానే దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించ వచ్చునని మహాత్మా జ్యోతీరావు పూలే ఆశయాల సాధనకు ముందుకు సాగిన ఒకేఒక్క నాయకుడిగా డాక్టర్ అంబేద్కర్ దేశ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి మహనీయుడిగా నిలిచారని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట బేతనీ విద్యా సంస్థల ప్రాంగణంలో శుక్రవారం రాత్రి అమలాపురం శ్రీరత్న బుద్ధ విహార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు, అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బుద్ధ విహార్ వ్యవస్థాపకుడు, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఏమి జరుగుతుందో బోధించి, అట్టడుగున అణగారిన బడుగు, బలహీన వర్గాలను సమీకరించి, శాంతియుత పోరాటాలు చేసి, రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తేనే వెనుకబడిన వర్గాలకు కొంతమేరైనా న్యాయం జరుగుతుందని ఆశించి, తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు. దేశానికి స్వాతంత్య్రం ఎంత అవసరమో అంటరానితనాన్ని పారదోలడమూ అంతే అవసరమని, అది విద్య ద్వారానే సాధ్యమని మహాత్మా జ్యోతీరావు పూలే చెప్పారన్నారు. ఆయన ఆశయ సాధనకు అంబేద్కర్ నడుం బిగించి, ఎంతో దూరాలోచనతో, పట్టుదలతో రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరిచారన్నారు. వాటి ఫలితంగానే నేడు తనవంటి ఎందరో నాయకులు పాలనలో భాగస్వామ్యులు కాగలుగుతున్నారన్నారు. ఈ అవార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు తదితరులను అభినందించారు. మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఆనాడు అంబేద్కర్, గాంధీజీ వంటి మహనీయులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, వాటిని మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా నేటికీ దేశంలో అంటరానితనం మిగిలి ఉందని, నాణ్యమైన విద్య, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందేలా చేయడం ద్వారానే ఈ అసమానతలు తొలగిపోతాయన్నారు. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల కారణంగానే ఎందరో ఉన్నత స్థితికి చేరుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ సేవలను గుర్తు చేస్తూ అమరావతిలో 20 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేసి, 126 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందన్నారు. అనంతరం రాష్టస్థ్రాయిలో కవి, జర్నలిస్టు పొనుమట్ల విష్ణుమూర్తి, ముమ్మిడివరం మున్సిపల్ ఛైర్‌పర్సన్ చెల్లి శాంతి అశోక్, జాలం రాజారావు, పిల్లి రాంబాబు తదితర 12 మంది సంఘ సేవకులకు జిల్లా స్థాయిలో 55 మందికి అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డులు ప్రదానం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైభీమ్ బాలకృష్ణ బృందం ఆలపించిన గీతాలు అలరించాయి. ఈ బృందం గొల్లపల్లిపై స్వరపరచిన గీతాల సిడిని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అమలాపురం ఆర్డీవో గణేష్‌కుమార్, ఎఎంసి వైస్-్ఛర్మన్ బండారు వెంకట సత్తిబాబు, అవార్డు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు రేవు ఈశ్వరరావు, ఎంఎకె భీమారావు, బేతనీ విద్యా సంస్థల కరస్పాండెంట్లు గొల్లపల్లి శ్రీ్ధర్, గొల్లపల్లి వరప్రసాద్, గొల్లపల్తి లూథియమ్మ తదితరులు పాల్గొన్నారు.

బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్
-మంత్రి యనమల
తొండంగి, ఏప్రిల్ 14: దేశంలోని బలహీన వర్గాల వారికి అంబేద్కర్ ఆశాజ్యోతి అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను శుక్రవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కోదాడలో నిర్వహించిన వేడుకలకు మంత్రి యనమల ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, యనమల కృష్ణుడు, తాండవ సుగర్స్ ఛైర్మన్ ఎస్‌ఎల్ రాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి శేషగిరిరావు, భేతాలుడు తదితరులు పాల్గొన్నారు.

ఉద్రిక్తత నడుమ అంబేద్కర్ జయంతి
మాజీ ఎంపి హర్షకుమార్ జోక్యంతో వివాదం పరిష్కారం
సామర్లకోట, ఏప్రిల్ 14: గత 22 రోజులుగా సామర్లకోట మండలం వేట్లపాలెం మాల చెరువులో ఆక్రమణలు తొలగించి మాల కులస్థులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సదరు చెరువు వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతల నడుమ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. మాల చెరువు సమీపంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించడానికి వీల్లేదంటూ తహసీల్దార్ ఎల్ శివకుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుండి జయంతి వేడుకలు నిర్వహించడానికి మాజీ జడ్పీటీసీ బొబ్బరాడ సత్తిబాబు ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు యత్నించగా పోలీసులు అడ్డుతగిలారు. దాంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ దళిత ప్రజలు ఆందోళనకు దిగారు. అనుమతిలేని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులు, పోలీసులు వత్తిడి తెచ్చారు. దాంతో స్థానికులు అడ్డగించి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దళితుల స్థలాలు కబ్జాలు చేస్తుంటే చోద్యం చూస్తున్న పోలీసులు, యంత్రాంగం దళిత నేత అంబేద్కర్ ఉత్సవాలకు ఆటంకం తెలపడం విడ్డూరమని మాజీ జడ్పీటీసీ బొబ్బరాడ మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాలకు అనుమతులు ఎందుకని అధికారులను నిలదీశారు. తాను గతంలో వేట్లపాలెం గ్రామ సర్పంచ్‌గా అనేక అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటుచేసినట్టు వాదించారు. మొత్తమీద సాయంత్రం అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ సంఘటనా స్థలానికి విచ్చేసి సమస్యలపై తహసీల్దార్ ఎల్ శివకుమార్, పోలీసులతో చర్చలు జరిపారు. వారు అంగీకరించడంతో శుక్రవారం రాత్రి ఎట్టకేలకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలను నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకంచేశారు. అధికారులు, పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎట్టకేలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.
పోలీసుల అదుపులో గజదొంగ?
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 14: రాజమహేంద్రవరంలో గొలుసు దొంగతనాలతో చెలరేగిపోయిన ఒక యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తొర్రేడుకు చెందిన ఎం భాస్కర్ అనే ఈ గొలుసు దొంగ సుమారు 120 గొలుసు దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు భాస్కర్ చేసిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన ఈయువకుడు మద్యం, మగువ మత్తులో చోరీల బాటపట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఏది అసలు... ఏది నకిలీ!
పది రూపాయల నాణేల చలామణీలో పలు ఇక్కట్లు
రావులపాలెం, ఏప్రిల్ 14: పది రూపాయల నాణేలు ప్రజలకు భారంగా మారాయి. నిన్న మొన్నటి వరకు పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నగదు లేక ఇబ్బందులు పడిన ప్రజలు నేడు పది రూపాయల నాణేలు చలామణి కాక ఒక వైపు, నకిలీల బెడదతో మరో వైపు అవస్థలు పడుతున్నారు. సుమారు వారం రోజుల క్రితం మొదలైన సమస్య తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్త మవుతోంది. మొదట్లో పది నాణెం చెల్లదని పుకార్లు రేగడంతో ఎక్కడికక్కడ వ్యాపార సంస్థల్లో వీటిని తీసుకోవడం మానేశారు. దీంతో ఆర్‌బిఐ రద్దు చేయలేదని, నాణేలన్నీ చలామణి అవుతాయని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. అయితే వీటిలో కొన్ని తేడాలుండడంతో వీటిని నకిలీలుగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని నాణేలపై రూపాయి గుర్తుతో పది సంఖ్య ఉండి, పది కిరణాలు ఆకారం ఉంటుండగా కొన్ని నాణేలపై రూపాయి గుర్తు లేకుండా పది సంఖ్య మాత్రమే ఉండి 15 వరకు కిరణాలుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏది అసలు, ఏది నకిలీ అనే స్పష్టత లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని నాణేలను వ్యాపారులు నకిలీలుగా నిర్ధారించి తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

60 కిలోల గంజాయి స్వాధీనం

చింతూరు, ఏప్రిల్ 14: కారులో తరలిస్తున్న సుమారు 60 కిలోల గంజాయిని చింతూరు సిఐ దుర్గాప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మోతుగూడెం ఎస్సై కిశోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం ఒడిస్సా నుండి తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు కారులో గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సిఐ దుర్గాప్రసాద్, ఎస్సై కిశోర్‌బాబు సిబ్బందితో కలిసి లక్కవరం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా కారు ఢిక్కీలో మూడు బస్తాల్లో ఉన్న 60 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న సీరబోయిన కృష్ణమూర్తి, ఎండి గౌస్, టి వీరబాబు, ఎం నాగేశ్వరరావును అరెస్టు చేశారు. అలాగే కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు మూడు లక్షల రూపాయలుంటుందని అంచనా. ఈ దాడుల్లో సిబ్బంది కృష్ణ, చందు, రమణ పాల్గొన్నారు.