తూర్పుగోదావరి

ఆర్‌బిఐ మార్గదర్శకాలు పట్టవా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 9: ఎస్సీ బీసీ సంక్షేమ కార్పొరేషన్లకు నిర్దేశించిన రుణాల చెల్లింపులో బ్యాంకర్ల ధోరణిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 15వ తేదీలోగా లక్ష్యాన్ని చేరుకోని పక్షంలో తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. మీకు ఆర్‌బిఐ మార్గదర్శకాలు పట్టించుకోరా? ప్రాధమిక సెక్టార్‌కు రుణాల మంజూరులో ఇంత నిర్లక్ష్యం వహిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం బ్యాంకర్లతో నిర్వహించిన సమావేవంలో కలెక్టర్ మాట్లాడారు. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు రుణాల కల్పన ప్రగతిపై ఆయన సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో అలసత్వం వహించడాన్ని తప్పుపట్టారు. గత నెల 27న నిర్వహించిన సమన్వయ సమావేశంలో లబ్దిదారుల రుణాల మంజూరు, ఖాతాల ప్రారంభ ప్రక్రియలను మే 10వ తేదీ నాటికి పూర్తిచేస్తామని తెలియజేసిన బ్యాంకర్లు, ఈ దిశగా ఆశించిన పురోగతి చూపించకపోవడం పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రైమరీ సెక్టార్‌కు మీరు రుణాలు ఇవ్వరా? ఆర్‌బిఐ మార్గదర్శకాలను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇన్‌క్లూజన్ గ్రోత్ ద్వారా పేదరికాన్ని రూపుమాపాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విజన్ మీకు అర్ధం కావడం లేదా? అంటూ బ్యాంకర్లను నిలదీశారు. మీరు ఇదే తరహాలో నిర్లక్ష్య, సాచివేత ధోరణిని అవలంబిస్తే, లబ్దిదారులు నిరాస, నిస్పృహలకు లోనే మీ బ్యాంకుల ముందే నిరసన ప్రదర్శనలు చేపడతారంటూ కలెక్టర్ హెచ్చరించారు. ధర్నాలు, సత్యాగ్రహాలకుదిగి మీ కార్యకలాపాలను అడ్డుకుంటారని కలెక్టర్ వ్యాఖ్యానించారు. అటువంటి దయనీయమైన పరిస్థితులను కొనితెచ్చుకోవద్దని బ్యాంకర్లకు హితవు చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ యూనిట్ల లక్ష్యం 4889 యూనిట్లు కాగా ఇప్పటివరకు కేవలం 615 యూనిట్లు, బిసి కార్పొరేషన్ లక్ష్యం 13844 యూనిట్లు కాగా ఇంతవరకు కేవలం 1297 దరఖాస్తులకు మాత్రమే బ్యాంకర్లు అకౌంట్లు తెరిచారని కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యాలను ఈనెల 15వ తేదీలోగా పూర్తిచేయని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్యాంకుల వారీగా లక్ష్యాల సాధనకు అవసరమైతే జిల్లా యంత్రాంగం, ఆయా బ్యాంకర్లకు సహకరిస్తుందన్నారు. తహశీల్దార్లు, ఎంపిడిఒలు అవసరమైన లైజాన్, సమన్వయ సహకారాన్ని బ్యాంకు మేనేజర్లకు అందిస్తారని చెప్పారు. ఆయా మండలాల్లో జరిగే మండల స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలకు బ్యాంకు మేనేజర్లు విధిగా హాజరు కావాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, ఆర్‌బిఐ ఎజిఎం ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి అనూరాధ, బిసి కార్పొరేషన్ ఇడిఎం జ్యోతి, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

సగం తిన్న గారెలో బొద్దింక!
రామచంద్రపురం హోటల్‌లో వినియోగదారుని దురవస్థ
రామచంద్రపురం, మే 9: ‘తింటే గారెలే తినాలి... వింటే భారతం వినాలి’ అతి పురాతనమైన ఈ నానుడి తెలియని తెలుగువారు ఉండరనడం అతిశయోక్తికాదు. తెలుగువారి సంప్రదాయ వంటల్లో గారెకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది... అయతే అలాంటి గారె తిందామని హోటల్‌కు వెళ్లిన వ్యక్తికి జుగుప్సాకరమైన అనుభవం ఎదురయ్యంది. సగం తిన్న తర్వాత గారెలో బొద్దింక కనిపించడంతో లబోదిబోమన్నాడు. వివరాల్లోకి వెళితే... స్థానిక భారతీయ స్టేట్‌బ్యాంకు సమీపంలోగల ఒక హోటల్ (టిఫిన్ సెంటర్)కు మంగళవారం ఒక వినియోగదారుడు అల్పాహారం తినడానికి వెళ్లి గారెలు ఆర్డరిచ్చాడు. అయతే ఒక గారె సగం తిన్న అనంతరం వినియోగదారునికి తాను తింటున్న గారె మధ్యలో చనిపోయన బొద్దింక ప్రత్యక్షమయ్యంది. దీనితో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. అక్కడే ఉన్న మిగిలిన వినియోగదారులు సైతం గారె మధ్యలో ఉన్న బొద్దింకను చూసి విస్తుపోయారు. పరిశుభ్రత పాటించని కొన్ని హోటళ్లలో కాఫీ, టీ వంటి వాటిలో ఈగలు వంటివి రావడం చూశామని, అయతే ఇలా బొద్దింక రావడం ఎక్కడా చూడలేదని వారు పేర్కొన్నారు.
కాగా రామచంద్రపురం పురపాలక సంఘ పరిధిలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు గతంలో ఉండేది. అయితే ఇటీవల కాలంలో కాకినాడకు చెందిన అధికారికి తనిఖీలుచేసే బాధ్యతను అప్పగించారు. దీనితో హోటళ్లపై పర్యవేక్షణ తగ్గిపోయందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గారెలో బొద్దింక ప్రత్యక్షమైన విషయాన్ని కాకినాడలోని ఆహార తనిఖీ అధికారి కల్యాణ చక్రవర్తి దృష్టికి తీసుకెళ్లగా, ఇక నుండి రెగ్యులర్‌గా దాడులు చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహార పదార్థాలు అందేలా చర్యలు తీసుకుంటానని తెలపడం గమనార్హం.

ఆయనది అంతా రాజకీయ దృష్టే
జగన్‌పై మంత్రి జవహర్ ధ్వజం
సామర్లకోట, మే 9: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా విదేశీ పర్యటనలు చేస్తుంటే, దానిని కూడా రాజకీయ కోణంలోనే చూడటం వైసిపి అధినేత జగన్‌కు అలవాటైపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం అభివృద్ధికి పెట్టుబడులు సాధనకు అమెరికాలో పర్యటిస్తుంటే ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, అదే విపక్షనేత జగన్ విదేశాలకు వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఉందని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ విదేశాలకు తన సంపదను దాచుకోవడానికి వెళుతుంటే,ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారన్నారు. మంగళవారం సామర్లకోట విస్తరణ శిక్షణా కేంద్రంలో భూముల పరిశీలనకు విచ్చేసిన సందర్భంగా మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడారు. సిఎం చంద్రబాబు అమెరికా పర్యటనవల్ల డెల్, బెల్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. జగన్ అభివృద్ధికి ఆటంకంగా తయారయ్యారని ఆయన విమర్శించారు. పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు లక్ష్యంగా చంద్రబాబు అమెరికా పర్యటన సాగిస్తుంటే సోషల్ మీడియాలో సైతం నెగిటివ్ ప్రచారం జరుగుతుండటం దురదృష్టకరమన్నారు. ఒకవైపు పోలవరం అభివృద్ధి, మరోవైపు పులివెందులకు నీరు ఇవ్వడం ద్వారా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. మరోవైపు యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల సమీకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రిని చూసి విపక్ష నేత జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో జగన్ విపక్ష నేతగా ఉండే అర్హత కూడా కోల్పోతారని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. జగన్‌పై ఉన్న కేసుల కారణంగా విదేశాలకు వెళ్లే అర్హత కూడా లేదన్నారు. ఒకవేళ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చినా కేవలం కుటుంబ సభ్యులతో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఓర్వలేక వైసిపి నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. కాగా మంత్రి జవహర్‌కు స్వాగతం పలికిన వారిలో టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, సామర్లకోట ఎఎంసి ఛైర్మన్ పాలకుర్తి శ్రీనివాసాచార్యులు చౌదరి (శ్రీనుబాబు), టిడిపి జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి గుమ్మళ్ల రామకృష్ణ, ముస్లిం మైనార్టీ నాయకుడు ఎస్ రెహ్మాన్, నాయకులు కంచుమర్తి వీర్రాజు, పోలుపల్లి బాబీ, తదితరులున్నారు.

ప్రకృతి చికిత్సాలయంగా నగరవనం

వినూత్నంగా చోడి జావ, మొలక విత్తనాలు పంపిణీకి అటవీ శాఖ ఏర్పాట్లు

రాజమహేంద్రవరం, మే 9: రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా రాజమహేంద్రవరం లాలాచెరువు వద్ద ఏర్పాటుచేసిన నగరవనంలో సందర్శకుల కోసం అటవీ శాఖ వినూత్న ఏర్పాట్లు చేసింది. తాజాగా సందర్శకులు ఈ వనాన్ని ప్రకృతి చికిత్సాలయంగా వినియోగించుకునేలా తీర్చిదిద్దారు. యోగా, ధ్యానం, ప్రకృతి చికిత్స, అవగాహన కార్యక్రమాలు, పౌష్టిక విలువలు కలిగిన సంప్రదాయ తృణ ధాన్యాలు, మొలక విత్తనాలు వంటివి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పక్షి ప్రేమికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు కూడా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.
నగరవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇక్కడే ప్రారంభించారు. నక్షత్ర వనాలు, వివిధ అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కల పెంపకం, మ్యూజియం, జీవ వైవిధ్యం, డార్విన్ పరిణామ క్రమం తదితర విజ్ఞానదాయకమైన రీతిలో ఈ పార్కును తీర్చిదిద్దారు. రాష్టస్థ్రాయిలోనే ఒక పర్యాటక పార్కుగా అటవీ శాఖ అభివృద్ధి చేపట్టింది. తాజాగా ఈ పార్కులో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్టు డిఎఫ్‌ఒ ప్రభాకర్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ ఆశ్రమంలోని కార్యకర్తలతో ప్రతీ ఆదివారం యోగా, ప్రకృతి శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణకు, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాకర్స్‌కు చోడి జావ, మొలక విత్తనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లుచేశారు. నిత్యం దాదాపు 500 మంది సందర్శకులు ఈ పార్కును సందర్శించే లక్ష్యంతో వివిధ ఏర్పాట్లుచేశామని డిఎఫ్‌ఒ తెలిపారు. అంతేకాకుండా పక్షి ప్రేమికుల కోసం పక్షులకు ఆహారంగా గంట్లు తదితర చిరు ధాన్యాలు స్వయంగా వేసే విధంగా సందర్శకులకు అవకాశం కల్పించారు. పావురాలు, రామ చిలుకలు ఈ ఆహారం కోసం గుంపుగా వాలినపుడు సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగించే ఏర్పాటుచేశారు. పక్షులకు సందర్శకులే స్వయంగా ఆహారాన్ని వేసే ప్రక్రియ కూడా ఈ పార్కులో ఏర్పాటుచేశారు. మొత్తం మీద నగరవనాన్ని వినూత్న ఆకర్షణలతో అభివృద్ధి చేస్తున్నారు.

భయపెడుతున్న సిలెండర్లు!
రెండు రోజల వ్యవధిలో రెండు ప్రమాదాలు
పెద్దాపురం, మే 9: అగ్నిప్రమాదం సంభవించిన ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోయి తరచూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పెద్దాపురం పట్టణంలో రెండు రోజుల వ్యవధిలో రెండు గ్యాస్ లీకేజీ సంఘటనలు చోటుచేసుకోవడం పట్టణవాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో స్థానిక నాగంపేటలోని కొప్పడి నూకరాజు ఇంట్లో వంట గ్యాస్ లీకైన ఘటనతో ఆ ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. సమయానికి సమీపంలోని యువత చురుగ్గా వ్యవహరించి సిలెండర్‌ను చాకచక్యంగా బయట పడేయడంలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆస్తినష్టం గాని, ప్రాణ నష్టం గాని జరగకపోవడంతో పట్టణవాసులు ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున పట్టణంలో గౌరీకోనేరులో పూరి పాకలో గ్యాస్ సిలెండర్ పేలుడు ఘటన సంభవించడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 18వ వార్డు గౌరీకోనేరు ప్రాంతంలో నివాసముంటున్న గొల్తి ఈశ్వరమ్మ, ప్రసాద్‌ల పూరిపాకలో అగ్నిప్రమాదం సంభవించింది. కిరోసిన్ దీపం కారణంగా పాకకు మంటలు అంటుకుని ఒక్కసారిగా పాక తగలబడింది. ప్రమాదాన్ని గ్రహించిన పొరుగువారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంట్లో గ్యాస్ సిలెండర్ ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలిపోవడంతో గెడ్డం బాబూరావు, శివ, కృష్ణ, సతీష్, లక్ష్మిలతోపాటు గొల్తి ఈశ్వరమ్మ, ప్రసాద్‌లను అగ్నికీలలు చుట్టుముట్టడంతో గాయాలపాలయ్యారు. వీరిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్డీవో వల్లూరి విశే్వశ్వరరావు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. హోం మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బొడ్డు బంగారుబాబు, సభ్యుడు విరోదుల రాజేశ్వరరావు, విజయ్‌లు బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో సుమారు రు. లక్ష ఆస్తి నష్టం జరిగినట్టు ఫైర్ ఆఫీసర్ నాగభూషణం తెలిపారు. ఇంట్లో విలువైన వస్తులు, ఏలక్ట్రికల్ వస్తువులతోపాటు సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యిందన్నారు.
నేడు బాధితులను పరామర్శించనున్న హోంమంత్రి
గౌరీ కోనేరులో జరిగిన అగ్ని ప్రమాదం, గ్యాస్ సిలెండర్ పేలుడు ఘటనలో గాయాలపాలైన క్షతగాత్రులను బుధవారం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించనున్నారు. బుధవారం పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు.

ప్రమాదాలకు నిలయంగా
డొక్కా సీతమ్మ అక్విడెక్టు
-చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు
- రోడ్డుకిరువైపులా పేరుకుపోయిన ఇసుక
-ద్విచక్ర వాహనదారులకు ప్రాణ సంకటం
డి గన్నవరం, మే 9: పచ్చని కోనసీమలో ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ అక్విడెక్టు బ్రిడ్జి ప్రమాదాలకు నిలయంగా మారింది. బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా ఇసుక పేరుకుపోవడంతో ద్విచక్ర వాహనదారులు, సైక్లిస్టులు ప్రమాదాలకు గురవుతున్నారు. అక్విడెక్టు బ్రిడ్జిని పర్యవేక్షించి శుభ్రం చేయించాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డి గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్టు కమ్ రోడ్డు బ్రిడ్జి నుండి నిత్యం ఇసుక రవణా సాగుతోంది. అక్విడెక్టుకు అనుకొని ఇసుక ర్యాంపులు ఉండటంతో ఇసుక లోడు లారీలు, ట్రాక్టర్లు అక్విడెక్టు బ్రిడ్జి రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రాక్టర్లు నుండి జారీ పడ్డ ఇసుక అక్విడెక్టు రోడ్ బ్రిడ్జికి ఇరువైపులా పేరుకుపోయి ప్రమాద భరితంగా మారింది. ద్విచక్ర వాహనదారులు పొరపాటున బ్రిడ్జి రోడ్డు పక్కగా వెళ్లినట్టయితే చక్రాలు స్లిప్ అయి రోడ్డుపై పడి గాయాలు పాలవుతున్నారు.
పెద్దవాహనాలు అక్విడెక్టు బ్రిడ్జి వెళుతున్న సమయంలో వేగానికి పేరుకుపోయిన ఇసుక పైకి లేచి ద్విచక్ర వాహనాదారులు, బాటసారుల కళ్లల్లో పడటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అక్విడెక్టు రోడ్డు బ్రిడ్జి నిర్వహణ, బాధ్యత కలిగిన ఇరిగేషన్ డిఇఇ కార్యాలయం కూతవేటు దూరంలో ఉంది. అక్విడెక్టు రోడ్డు బ్రిడ్జికి ఇరువైపులా ఇసుక పేరుకుపోయి ప్రమాదభరితంగా మారినా అధికారులు మాత్రం ఏమీపట్టన్నట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు, ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు రాత్రి సమయాల్లో విద్యుత్ లైట్ల వెలుగులో ప్రకాశవంతంగా ఉండాల్సిన అక్విడెక్టు రోడ్డు బ్రిడ్జి అలంకారప్రాయంగా స్తంభాలు ఉండి చిమ్మచీకట్లో మగ్గుతోంది. అనేక సంవత్సరాలుగా విద్యుత్ లైట్లు పాడైపోయినా మరమ్మతులకు నోచుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి అక్విడెక్టు బ్రిడ్జి రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన ఇసుకను తొలగించి ప్రమాదాలను అరికట్టాలని, అదేవిధంగా బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న విద్యుత్ లైట్లు పునరుద్ధరించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

టార్గెట్ అర కోటి!
మహిళ కిడ్నాప్ కేసులో ఇద్దరు అరెస్టు:అడిషినల్ ఎస్పీ దామోదర్
కాకినాడ సిటీ, మే 9: ఓ పారిశ్రామికవేత్త భార్యను కిడ్నాప్‌కు పాల్పడిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, ఈ ఘటలో ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నట్లు జిల్లా అడిషినల్ ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు. కాకినాడ నగరానికి చెందిన ధనలక్ష్మి అనే పారిశ్రామికవేత్త భార్యను ముగ్గురు వ్యక్తులు కలసి కిడ్నాప్‌చేసి యు కొత్తపల్లి మండలంలో పట్టుబడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసుకు సంబంధించి మంగళవారం సాయంత్రం కాకినాడలోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన తెలియజేశారు. కాకినాడ నగరం వెంకటరత్నాపురానికి చెందిన కాలే వీరవెంకటసత్యనారాయణ అనే పారిశ్రామివేత్త బీచ్‌కు వెళ్లే ప్రాంతంలో యాక్ట్ ఫార్వార్డర్స్ అనే షిప్పింగ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ కార్యకలాపాలను ఆయన భార్య ధనలక్ష్మి నిర్వహిస్తున్నారు. ఈమె ప్రతీ రోజు ఇంటి నుండి కారులో బయలుదేరి తమ కంపెనీకి వెళ్లి రావడం పరిపాటి. దీనిలో భాగంగానే సోమవారం సాయంత్రం 5గంటల సమయంలో ధనలక్ష్మి ఇంటి నుండి కారులో తమ కంపెనీ కార్యాలయానికి బయల్దేరారు. ఆమె కారు డ్రైవర్ అరుగుల సుబ్బారావు (దయ) తన యజమానురాలిని కారులో తీసుకుని వెళ్తూ ముందస్తు పథకం ప్రకారం మధ్యలో తన స్నేహితులైన పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన పెండ్యాల బాబూరావు, కాకినాడ జగన్నాధపురానికి చెందిన విశ్వనాధరాజు అనే వ్యక్తులను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ధనలక్ష్మిని కారులో బలవంతంగా తీసుకువెళ్లడాన్ని చూసిన కె విజయ్‌కుమార్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెంబడిస్తూ తన సెల్‌ఫోన్ ద్వారా తిమ్మాపురం, యు కొత్తపల్లి పోలీసులకు సమాచారం అందజేశాడు. చివరకు కొనపాపపేట వద్ద లారీని రోడ్డుకు అడ్డుగా పెట్టి గ్రామస్థులు కారును నిలుపుచేశారు. పబ్లిక్, పోలీసుల సహకారంతో మహిళ కిడ్నాప్ యత్నం విఫలమైందని అడిషినల్ ఎస్పీ దామోదర్ తెలిపారు. ధనలక్ష్మిని కిడ్నాప్‌చేసి ఆమె భర్త నుంచి రూ.50 లక్షలు రాబట్టేందుకు నిందితులు పథకంవేశారని, డబ్బులు ఇవ్వని పక్షంలో ఆమెను చంపడానికి నిర్ణయించుకున్నట్లు తమ దర్యాప్తులో తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అతను రెండు సంవత్సరాలు క్రితం కాకినాడ నగరానికి వచ్చి పలువురి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడన్నారు. రెండు నెలలు క్రితం ధనలక్ష్మి వద్ద కారు డ్రైవర్‌గా చేరిన అతను తన యజమానురాలిని కిడ్నాప్‌చేసి పెద్ద మొత్తంలో డబ్బులు రాబట్టేందుకు తన స్నేహితులతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. నాలుగు బృందాలు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నాయన్నారు. ధనలక్ష్మి వద్ద నుండి కాజేసిన ఉంగరాలు, బటన్ నైఫ్‌లు, తాళ్లను కిడ్నాపర్ల నుండి స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందజేసిన విజయ్‌కుమార్‌ను, కిడ్నాప్ కేసును ఛేదించడంలో కీలక పాత్రను పోషించిన ఎఎస్సై బొజ్జా లోవరాజు, పిసిలు లెనిన్, గోవిందరాజు, హోంగార్డులు భాస్కర్, రాజులను ఎఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను కారుతో సహా పట్టుకున్న కోనపాపపేట గ్రామస్థులు కొర్ని శ్రీనువాసు, పెల్లేటి శ్రీనివాసు, ఉమ్మిడి రమణ, గ్రామ పెద్దలను ఎఎస్పీ దామోదర్ సత్కరించారు. సమావేశంలో కాకినాడ డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, పిఠాపురం సిఐ బి అప్పారావు పాల్గొన్నారు.

ఘనంగా సత్యదేవుని వనవిహారం
శంఖవరం, మే 9: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం రత్నగిరిపై కొలువుదీరిన శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి సమేత శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివార్లు మంగళవారం వన విహారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాల్లో భాగంగా రత్నగిరిపై గల పేపర్‌మిల్లు గార్డెన్‌లో తొలుతగా స్వామి, అమ్మవార్లకు ఆశీనులు గావించి దేవస్థానం వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన వెండి పల్లకిలో స్వామి, అమ్మవార్లను ఆశీనులు గావించి, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలతో వనవిహారం గావించారు.

సాగునీటి ప్రాజెక్టుల సందర్శన
జిల్లాలో పర్యటించిన ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి బృందం

రాజమహేంద్రవరం, మే 9: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలోని ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి బృందం మంగళవారం పర్యటించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొణతాల మాట్లాడుతూ సీతానగరం వద్ద నిర్మిస్తోన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు ఆయకట్టు స్థిరీకరణకు, విశాఖ వరకు నీళ్లు తీసుకెళ్లాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించి హైవే క్రాసింగ్ పనులను సత్వరం పూర్తిచేయాల్సి ఉందన్నారు. పురుషోత్తపట్నం పనులన్నీ సంతృప్తికరంగా జరుగుతున్నాయని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి బృందం కొణతాల నాయకత్వంలో ముందుగా పురుషోత్తపట్నం హెడ్‌వర్క్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ నిర్మాణ సంస్థ, ఇరిగేషన్ శాఖ అధికారులు పనుల వివరాలను వివరించారు. అక్కడ నుంచి జగ్గంపేట మండలం కృష్ణవరం గ్రామం వద్ద ఏలేరు లిఫ్ట్ పాయింట్‌కు చేరుకుని పనులను పరిశీలించారు. అక్కడ నుంచి ఈ బృందం ఏలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకుని సందర్శించింది. ఈ పర్యటనలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతోపాటు నీటిపారుదల శాఖ సలహాదారు ఎస్ సత్యనారాయణ, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి, పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, సిపిఐ విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి స్టాలిన్, సిపిఎం విశాఖ జిల్లా రూరల్ కార్యదర్శి లోకనాధం, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ తోట నగేష్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు శివశంకర్, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి సభ్యులు తదితరులు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన వారిలో ఉన్నట్టు తెలియజేశారు.

మున్సిపల్ కమిషనర్ సుధాకర్ బదిలీ
సామర్లకోట, మే 9: సామర్లకోట మున్సిపల్ కమిషనర్‌గా సుమారు రెండేళ్లుగా పనిచేస్తున్న కుంపటి తిమోతి సుధాకర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సుధాకర్‌ను కాకినాడ కార్పొరేషన్ కార్యదర్శిగా నియమించారు. అలాగే సామర్లకోటకు నూతన మున్సిపల్ కమిషనర్‌గా విజయవాడ నగర పాలక సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సి వెంకటేశ్వరరావును నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 25వ తేదీలోగా నూతన కమిషనర్ సి వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలిసింది.
ఎట్టకేలకు మున్సిపాల్టీకి రెగ్యులర్ డిఇ రాక
సామర్లకోట మున్సిపాల్టీకి సుమారు ఏడాది అనంతరం రెగ్యులర్ డిఇ వచ్చారు. మున్సిపల్ డిఇగా సోమేశ్వరరావును నియమించగా, ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గుడివాడ మున్సిపాల్టీలో ఎఇగా పనిచేస్తున్న సోమేశ్వరరావును డిఇగా పదోన్నతిపై సామర్లకోటకు నియమించారు. ఇప్పటివరకూ కాకినాడ పబ్లిక్ హెల్త్ డిఇ అదనపు బాధ్యతలు సామర్లకోట డిఇగా నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
-ముగ్గురికి తీవ్ర గాయాలు
రాజోలు, మే 9: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం పెట్రోలు బంకు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజోలుకు చెందిన ఆకుల సురేష్‌కుమార్ (35), అతని మేనల్లుడు సంగిశెట్టి నరేంద్రకుమార్ (25) దుర్మరణం పాలయ్యారు. గణపవరంలోని బంధువుల ఇంటిలో శుభకార్యం నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తూ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ ఢీకొట్టడంతో కలప లోడు ట్రాక్టర్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్‌కుమార్ కోరమాండల్ ప్లాంట్‌లో పనిచేస్తున్నట్టు తెలిసింది. భార్య శైలజ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నరేంద్రకుమార్ ఇంజనీరింగ్ ఫైనల్ చదువుతున్నట్టు తెలిసింది. మరో మోటారుసైకిల్‌పై ఉన్న బాలాజీ, చిట్టుగుళ్ల కృష్ణవేణి, సిర్రా సావిత్రి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన వైద్యం కోసం వారిని అక్కడి నుండి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.