తూర్పుగోదావరి

కొత్త మద్యం పాలసీలో ఆదాయం తగ్గుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కెఎస్ జవహర్ వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కన్నా ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటమే ముఖ్యమని భావిస్తోందన్నారు. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త మద్యం పాలసీలో ఆదాయ లక్ష్యాలు విధించలేదన్నారు. లైసెన్సు ఫీజులను కూడా 25శాతం తగ్గించామని, అమ్మకాల మార్జిన్ కూడా పెంచామని వివరించారు. ఎంఆర్‌పి ధరలకు మద్యాన్ని విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లూజు అమ్మకాలు అనుమతించమన్నారు. ఎంఆర్‌పి ధరలను ఉల్లంఘిస్తే విధించే జరిమానాను రూ. లక్ష నుంచి 5లక్షలకు పెంచామన్నారు. మద్యం కల్తీ చేసినా, బ్రాండ్లు కల్తీ చేసిన వారిపై పిడి చట్టం కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్ దోపిడీ గురించి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సిఎంకు లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావించగా, సిండికేట్ దోపిడీని నిరూపించాలని సవాల్ చేశారు. 250 దుకాణాలపై ఎంఆర్‌పి ఉల్లంఘన కేసులు నమోదు చేశామన్నారు. 10 జిల్లాలను సారారహిత జిల్లాలుగా ప్రకటించామని జవహర్ చెప్పారు. మరో ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారులు ఎక్సైజ్ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే బార్‌లైసెన్సులు జారీ చేస్తే దోపిడీ జరిగినట్లు ఒక పత్రిక, వైసిపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త బార్ పాలసీలో దోపిడీ జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పి, ఆపత్రికను మూసివేయాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు చేయడం ద్వారా దళితుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వైఎస్ జగన్, బొత్స సత్యనారాయణ తదితరులే దోపిడీదారులని ధ్వజమెత్తారు. అనంతరం ముస్లింలకు రంజాన్ తోఫాలను మంత్రి పంపిణీ చేశారు.
సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు
*అధికారులకు జెసి మల్లికార్జున ఆదేశం

కాకినాడ, జూన్ 19: ప్రజల నుండి అందుతున్న అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం జాప్యం చేయకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జెసి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసం కలిగించే బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. కాగా కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారుల్లో అధిక శాతం మంది పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, ఉద్యోగ కల్పన కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వారం 411 అర్జీలు అందగా ఆయా శాఖల అధికారులు వాటిని నమోదు చేశారు. స్థల తగాదాలకు సంబంధించిన సమస్యలను జెసి స్వయంగా పరిశీలించారు. కాజులూరు మండలం చేదువాడ గ్రామానికి కాకరపల్లి పద్మావతి, మట్టపర్తి కృష్ణవేణి తదితరులు జెసికి అందజేసిన అర్జీలో, ఆ గ్రామ ప్రాథమిక పాఠశాల సమీపంలో 35 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్ళు నిర్మించుకుని జీవిస్తున్నామని, అయితే కొందరు అదే ప్రాంతంలో పడమర వైపు భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దారు, సర్వేయర్, పోలీసులకు సైతం పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కబ్జాదారుల నుండి తమను రక్షించాలని కోరారు. దీనిపై జెసి స్పందించి తక్షణం అక్కడికి వెళ్ళి సర్వే చేసి, ఆక్రమణలను గుర్తించాలని సర్వే శాఖాధికారులను ఆదేశించారు. అలాగే కాకినాడ సమీపంలోని రమణయ్యపేట వద్ద జనావాసాల మధ్య మద్యం దుకాణాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ స్థానికులు జెసికి ఫిర్యాదు చేశారు. సదరు వైన్ షాపును వేరేచోటకు మార్చే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను జెసి మల్లికార్జున ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం జితేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజావాణిలో పాల్గొన్నారు.