తూర్పుగోదావరి

నిర్వాసితులతో సమావేశమైన మానవ హక్కుల కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీపట్నం, ఏప్రిల్ 12: జాతీయ మానవ హక్కుల కమిషన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ (లా) ఇంద్రజిత్ కుమార్, డిప్యూటీ ఎస్పీ రాజ్‌బీర్ సింగ్ పోలవరం ప్రోజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం తొలగించిన అంగులూరు గ్రామాన్ని సందర్శించి బాధితులతో సమావేశమయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం సత్యనారాయణ, పోలవరం ప్రోజెక్టు స్పెషల్ కలెక్టర్ భానుప్రకాష్, రంపచోడవరం సబ్ కలెక్టర్ పట్టంశెట్టి రవి, ఇందిరాసాగర్ డిప్యూటీ కలెక్టర్ సత్యవాణి తదితర అధికారులు కమిషన్ బృందం వెంట ఉన్నారు. ఇంద్రజిత్ కుమార్ అంగులూరు బాధితులను సమావేశం నుండి బయటకు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. బాధితులు సరిపల్ల సత్యవతి, ఉండ్రోతు నాగమణి, కట్టా దుర్గ తదితరులు పోలవరం ప్రోజెక్టులో తమకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారం వివరాలు, తమకు జరిగిన అన్యాయంపై అధికారులకు వివరించారు. ఫోరం ఫర్ సోషల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు, ఆర్థిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ పోలవరం ప్రోజెక్టులో బాధితులకు జరిగిన అన్యాయాన్ని ఇన్‌ఛార్జి సభ్యులకు వివరించారు. పోలవరం ప్రోజెక్టులో 4 (1) నోటిఫికేషన్ గ్రామాన్ని ఖాళీ చేయకముందు ఇవ్వడం వల్ల 4(1) నోటిఫికేషన్ ఇచ్చిన అయిదారు సంవత్సరాల తర్వాత బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, 4 (1) నోటిఫికేషన్ ఇచ్చిన తేదీనే అధికారులు పరిగణలోనికి తీసుకోవడం వల్ల, ఆ తేదీ దాటిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు పోలవరం ప్రోజెక్టులో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. పోలవరం ప్రోజెక్టులో ముంపునకు గురవుతున్న 276 గ్రామాల్లో ఇదే సమస్య ఉత్పన్నమవుతోందని పెంటపాటి తెలిపారు. అందువల్ల 4(1) నోటిఫికేషన్ తేదీనే అధికారులు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఖాళీ చేసే తేదీని పరిగణలోనికి తీసుకోవాలని ఆయన కోరారు. పోలవరం ప్రోజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాల బాధితులు ఏ విధమైన ఆటంకం కల్పించకుండా సహకరిస్తున్నా అధికారులు లేనిపోని జీవోలు తెచ్చిపెట్టి బాధితులకు తీరని అన్యాయం చేస్తున్నారని పెంటపాటి అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రోజెక్టులో పశ్చిమ గోదావరి జిల్లాలో అయిదు గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలో ఏడు గ్రామాలలోను 1889 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇచ్చారని, దానిని రద్దుచేసి 2013 కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని పెంటపాటి పుల్లారావు కోరారు. అనంతరం కమిషన్ సభ్యుడు ఇంద్రజిత్ కుమార్ మాట్లాడుతూ అంగులూరు గ్రామాన్ని తొలగించి, గిరిజనులను హింసించారంటూ అప్పటి రాజ్యసభ సభ్యురాలు, ఎమ్మెల్సీ రత్నాబాయి ఫిర్యాదు మేరకు తాము విచారణ చేపట్టేందుకు వచ్చినట్టు చెప్పారు. ఇక్కడి పోలవరం ప్రోజెక్టులో ఇళ్లు తొలగించడం వాస్తవమే అయినప్పటికీ ఏ విధమైన హింస జరగలేదని తమ విచారణలో వెల్లడైందని ఇంద్రజిత్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ పరంగా గిరిజనులు, ఇతర బాధితులకు చెల్లించిన మొత్తాల వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంగులూరు గ్రామంలో వ్యక్తిగతంగా వచ్చిన ఫిర్యాదులను కూడా కమిషన్ బృందం స్వీకరించింది. హెచ్‌ఆర్సీ సభ్యులకు బాధితులు తెలిపిన సమస్యలను జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడు అక్కిరా బాలు తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించి అధికారులకు వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని ఉప్పలపాటి అబ్బులు తదితరులు కోరారు. హెచ్‌ఆర్సీ సభ్యుల దృష్టికి ప్రోజెక్టు నిర్వాసితుల సమస్యలను తీసుకురాకుండా జిల్లా యంత్రాంగం ముందుగా సర్వప్రయత్నాలు చేసింది. హెచ్‌ఆర్సీ సభ్యుల రాకకుముందు అంగులూరు కూల్చివేసిన ప్రాంతంలో సమావేశ ఏర్పాట్లు ఏమీ లేవని, అంగులూరులో నూతనంగా నిర్మించిన ప్రాంతంలోనే హెచ్‌ఆర్సీ సమావేశం ఉంటుందని తహసీల్దార్, సిఐలు బాధితులకు చెప్పారు. వార్ని ఇక్కడ నుండి కొత్తగా నిర్మించిన కమ్యూనిటీ హాలులో సమావేశం ఏర్పాటుచేసినట్టు బాధితులకు చెప్పినప్పటికీ తమ గ్రామాన్ని కూల్చిన ప్రాంతంలోనే సమావేశం ఏర్పాటుచేశామని, అక్కడకు వచ్చేది లేదని ఖరాఖండిగా బాధితులు మండల అధికారులకు తెలిపారు. సమావేశం అనంతరం కమిషన్ సభ్యులు వెళ్లిపోతుండగా అంగులూరు బాధితులు, మహిళలు కమిషన్ బృందం కారుకు అడ్డంపడి తమకు న్యాయం చేయాలని కోరుతుండగా ఆ కారులోనే ఉన్నా ఇందిరా సాగర్ ప్రోజెక్టు భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రకాష్ రంపచోడవరం సిఐని మహిళలపై లాఠీ ఛార్జీ చేసి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో మానవహక్కుల సంఘం సభ్యుడు అక్కిరా బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కమిషన్ సభ్యులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై లాఠీఛార్జికి ఆదేశించడమేమిటని నిలదీయగా, హెచ్‌ఆర్సీ సభ్యుడు ఇంద్రజిత్‌కుమార్ కారుదిగి బాధితులను శాంతింపజేశారు. ఈ లోపులో డాక్టర్ పెంటపాటి పుల్లారావు జోక్యం చేసుకుని హెచ్‌ఆర్సీ సభ్యులు న్యాయం చేస్తారని, మండల అధికారులను పట్టించుకోవద్దని బాధితులకు నచ్చజెప్పారు.