తూర్పుగోదావరి

అనాథ అమ్మ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, సెప్టెంబర్ 20: ‘చెట్టుకు కాయ భారమా... తల్లికి బిడ్డ భారమా’ అనే నానుడి అందరికీ తెలిసిందే... అయితే ఈ నానుడిలో చెప్పినట్టు తల్లి బిడ్డను ఎన్నటికీ భారంగా భావించకపోయినా రాన్రానూ బిడ్డలు మాత్రం కన్న తల్లిని భారంగానే భావిస్తున్నారు. కన్న నాటి నుండి పెరిగి మన కాళ్లపై మనం నిలబడే వరకూ పిల్లల అభ్యున్నతి కోసం నిత్యం పరితపించే తల్లిని మాత్రం వయసుడిగిన తరుణంలో పిల్లలు భారంగా భావించి, వదిలించుకుంటున్నారు. మంచినీరు తెస్తానని నమ్మించి, 90 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని అనాథగా బస్టాండులో వదిలేసి వెళ్లిపోయాడు ఒక పుత్రరత్నం. బుధవారం సాయంత్రం మాయమైన ఆ పుత్రరత్నం గురువారం నాటికీ రాకున్నా ఇంకా తన కుమారుడు మంచినీళ్ల సీసా తెస్తానని వెళ్లాడని, తన కోసం వస్తాడని ఆ తల్లి అందరికీ చెబుతుండటం గమనార్హం. బుధవారం సాయంత్రం నుండి అలా అనాథగా మిగిలిపోయిన ఆ వృద్ధురాలు తన వివరాలు సరిగా చెప్పలేకపోతుండటంతో పోలీసులు స్థానికంగా ఉన్న ఆశ్రమంలో చేర్చారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో గురువారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... అమలాపురం ఆర్టీసీ బస్టాండులో 90 ఏళ్ల వృద్ధురాలు బుధవారం సాయంత్రం నుండి ఒంటరిగా తన వాళ్ల కోసం ఎదురు చూస్తోంది. బుధవారం సాయంత్రం నుండి ఇక్కడే ఉన్న ఆమె పరిస్థితిని గమనించిన స్థానిక ఎస్‌కేబీఆర్ కళాశాల విద్యార్థులు ఈ విషయాన్ని అమలాపురం పట్టణ ఎస్సై సురేంద్ర దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం ఉదయం ఎస్సై ఆమె వద్దకు వెళ్ళి వివరాలు సేకరించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె చెప్పలేకపోతోంది. ఆమె వద్ద ఉన్న రేషన్ కార్డులో ఆమె పేరు ధవిళేశ్వరపు పార్వతి, డోర్ నెం.1-529, రాజానగరం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా అని ఉంది. ప్రస్తుతం లాలాచెరువురు పాలచర్లలో కొడుకు ఇంటి వద్ద ఉంటున్నానని ఆమె చెబుతోంది. తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని, తన కుమారుడే తనను ఇక్కడ ఉండమని చెప్పాడని, వాటర్ బాటిల్ కోసం వెళ్లాడని, వచ్చి తనను తీసుకు వెళతాడని ఆమె అమాయకంగా చెబుతోంది. కాగా ఆమె వద్ద ఉన్న నెంబర్లకు ఫోన్ చేస్తే ఎవరూ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎస్సై సురేంద్ర స్థానిక కామాక్షీ ప్రేమమందిరానికి ఆమెను చేర్చారు. ఎస్సై అభ్యర్థనతో ప్రేమమందిరం నిర్వాహకులు కామేశ మహర్షి ఆ తల్లిని అక్కున చేర్చుకున్నారు.