తూర్పుగోదావరి

ఒంటరి పోరుకు సమాయత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 20: వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులుండవని, ఒంటరిగానే బరిలో దిగేందుకు సమాయత్తం కావాలని బీజేపీ నాయకత్వం జిల్లాలోని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. వరుసగా రెండు రోజుల పాటూ జిల్లా కేంద్రం కాకినాడ వేదికగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేడర్‌తో మమేకమయ్యింది. తొలిరోజైన ఈనెల 19న ఏపీ కిసాన్ మోర్చా సమావేశాన్ని నిర్వహించగా గురువారం స్థానిక నాగమల్లితోట జంక్షన్‌లోని భాస్కర కళ్యాణ మండపంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రెండో రోజు సమావేశంలో బీజేపీ జాతీయ ప్రథాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ పాల్గొన్నారు. తన ప్రసంగంలో ప్రథానంగా రానున్న ఎన్నికల్లో బీజేపీ నేరుగా తలపడేందుకు సిద్దమవుతోందన్నారు. 2019 ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోనూ సంబంధాలుండవని చెప్పారు. ఇకపై ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, అదే వ్యూహంగా సాగాలంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమాన్నీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిందేనన్నారు. నాలుగైదు అసెంబ్లీ సీట్లు మాత్రమే కలిగివున్న రాష్ట్రాల్లో నేడు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిందని, ఆయా రాష్ట్రాల కంటే ముందుగానే ఆంధ్రపదేశ్‌లో బీజేపీ అనేక విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఆ విధంగా చూస్తే ఏపీలో ఎప్పుడో అధికారంలోకి రావల్సి ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్రంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన నేతలందరూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో మమేకం కావడం తదితర అంశాలపై నేతలు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. సమావేశంలో జాతీయ ప్రథాన కార్యదర్శి అరుణ్‌జైన్, జాతీయ సహాయ కార్యదర్శి జీ సతీష్, జాతీయ కార్యదర్శి మురళీధరన్, పార్టీ ఏపీ ఇన్‌ఛార్జి సునీల్ దేవదార్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు, మహిళా మోర్చా జాతీయ ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి, ఎంపీలు డాక్టర్ కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ ప్రథాన కార్యదర్శి ఎస్ సురేష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ పైడా వెంకట నారాయణ, ఆల్డా ఛైర్మన్ యాళ్ళ దొరబాబు, పార్టీ నాయకులు బిక్కిన విశే్వశ్వరరావు, ఎన్వీ సాయిబాబా, దిలీప్‌కుమార్ సదనానీ తదితరులు పాల్గొన్నారు.