తూర్పుగోదావరి

మత మార్పిళ్లపై హిందూ సంస్థల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 15: రాజ్యాంగ విరుద్ధంగా పవిత్రమైన గోదావరితీరాన మత మార్పిళ్లు జరుపుతున్నారంటూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతమార్పిళ్లు జరపకుండా అడ్డుకోవడంతో క్రైస్తవ మతస్తులు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కంబాలపేటలోని సెయింట్ పాల్ చర్చి పాస్టర్ ఎజి పట్ట్భా కొంతమంది వ్యక్తులకు బాప్టిజం ఇచ్చేందుకు శ్రీ ఉమామార్కండేయస్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్నానఘట్టం వద్ద మైక్‌తో సభ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న మార్కండేయస్వామి ఆలయానికి చెందిన అర్చకులు అడ్డుకున్నారు. దీంతో సభను పుష్కరాలరేవునకు మార్చారు. అక్కడ కూడా హిందూ ఆలయాలు ఉన్నాయని, మత మార్పిళ్లు జరిపేందుకు అర్చకులు, బ్రాహ్మణ సంఘం నాయకులు, ధర్మవీర్, హిందూ ధర్మరక్ష సంస్థ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు కూడా పాస్టర్ వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. రాజ్యాంగ విరుద్ధంగా మతమార్పిళ్లు జరుపుతున్నారంటూ హిందూ సంస్థల ప్రతినిధులు త్రీటౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో క్రైస్తవులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గోదావరి తీరంలో తమకు కూడా హక్కు కల్పించాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు. క్రైస్తవ సంఘం నాయకుడు ప్రతాప్‌సిన్హ, పట్ట్భాతో సబ్‌కలెక్టర్ సిఎం సాయికాంత్‌వర్మ చర్చించారు. శాంతి కమిటీని ఏర్పాటు చేసి, క్రైస్తవుల మత కార్యకలాపాలకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని, గురువారం నాటికి తాత్కాలికంగా రజకుల రేవు వద్ద కార్యక్రమాలు జరుపుకోవాలని సూచించారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య వారంతా రజకుల రేవు వద్దకు చేరుకుని బాప్టిజం స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న హిందూ సంస్థల ప్రతినిధులు అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలు ఉన్న చోట మతమార్పిళ్లకు ఎలా అవకాశం కల్పిస్తారంటూ నిలదీశారు. ఏఎస్పీ లతామాధురి, డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వారితో చర్చించి, వారికి సర్దిచెప్పారు. దీంతో వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. సిఐలు శేఖర్‌బాబు, ముక్తేశ్వరరావు, మూర్తి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.