తూర్పుగోదావరి

ఘనంగా భీమేశ్వరుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఫిబ్రవరి 18: దక్షిణ కాశి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఇటీవల పాంచాహ్నిక దీక్షగా దివ్య కల్యాణోత్సవాలు జరిగిన నేపధ్యంలో శ్రీ స్వామి వార్ల రథోత్సవ కార్యక్రమం సోమవారం ద్రాక్షారామలో భక్తుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. ఆలయంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ సమేత, శ్రీ నారాయణస్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలు రథంపై కూర్చుండబెట్టి ద్రాక్షారామ గ్రామంలోని చంద్రావీధి, సూర్యావీధిలలో నగరోత్సవ నిర్వహణ అనంతరం సమీపంలోని వేగాయమ్మపేట గ్రామానికి రథం చేరుకుంది. శ్రీ రాజా వాడ్రేవు సుందర రత్నాకర శర్మ నేతృత్వంలో అటుకుల మండపం వద్ద ఆస్థాన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కెఎన్‌విడివి ప్రసాదరావు, అర్చక స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయం వద్ద నుండి రథోత్సవం నిర్వహించే వరకు మంగళవాయిద్యాలతో ఉత్సవ మూర్తులను తీసుకువచ్చారు. అనంతరం రథంపై కూర్చుండబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పండిత సత్కారం
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో పండిత సత్కార కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎన్‌విడివి ప్రసాదరావు నేతృత్వంలో పండితులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు.

యువత ఓటుహక్కు వినియోగించుకోవాలి
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 18: పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన యువతీ యువకులు ఓటు నమోదుచేసుకొని రానున్న ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పిలుపునిచ్చారు. జెఎన్‌టియుకె అల్యూమినీ సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమాలు-19 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, వివి పాట్‌లపై ఇంజినీరింగ్ విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు నిండిన వారందరూ ఓటు నమోదు ఫారమ్-6 పూర్తిచేసి, ఆధార్, టెన్త్ సర్ట్ఫికెట్ జతచేసి ఇవ్వాలన్నారు. ఓటరు జాబితాలో ఓటు నమోదుచేసుకొన్నవారు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్నదీ, లేనిదీ చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో ఫారమ్-6 పూర్తిచేసి అప్‌లోడ్ చేయాలని, 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఓటరు జాబితాలో తమ పేరు వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన సమయంలో 16 రకాల గుర్తింపు కార్డులను చూపించవచ్చని ఆయన స్పష్టం చేశారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పోస్ట్ఫాస్, బ్యాంకు పుస్తకం, జాబ్‌కార్డు, స్మార్ట్‌కార్డు, రేషన్ కార్డు, పట్టాదార్ పాస్‌పుస్తకం, తదితర ప్రభుత్వం మంజూరుచేసిన గుర్తింపు కార్డులు చూపించవచ్చన్నారు. పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల్లో నలుగురు పోలింగ్ సిబ్బంది ఉంటారని, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు ఉంటారని తెలిపారు. ఓటరు పోలింగ్ స్టేషన్ వెళ్లాక ఓటరు లిస్ట్‌లో తమ పేరు చూసుకుని ఉంటే పోలింగ్ అధికారి గుర్తింపు కార్డు చూస్తారని, అనంతరం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని కలెక్టర్ మిశ్రా పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం మాక్ పోలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో సెట్రాజ్ సీఈవో ఎస్ మల్లిబాబు, జెఎన్‌టియుకె ఇంజినీరింగ్ విద్యార్థులు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్ నిర్మాణంలో స్థల వివాదం
యు కొత్తపల్లి, ఫిబ్రవరి 18: మండలంలోని ఉప్పాడలో అన్న క్యాంటీన్ కేంద్రం నిర్మించే స్థల విషయంలో సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఉప్పాడలో సోమవారం ఉదయం అన్న క్యాంటీన్ నిర్మాణానికై శంకుస్థాపనకు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ విచ్చేశారు. అయితే ఉప్పాడ మాజీ సర్పంచ్‌లు ఎరుపల్లి అప్పలకొండ, ఎరుపల్లి అడివిరాజు ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ కేంద్రం నిర్మించే స్థలం తమదంటూ ఆందోళనకు దిగారు. వివాదం ఇలా కొనసాగుతుండగానే ఎమ్మెల్యే వర్మ శంకుస్థాపన చేసేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారుల్లో ఒకరు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని వాటర్ ట్యాంకు ఎక్కి బెదిరించిన వెలుగుల రాజును అదుపులోకి తీసుకున్నారు. ఉప్పాడలో స్థల వివాదం విషయం తెలుసుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు, జన సేన పార్టీ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పలువురు మత్స్యకార నాయకులు ఆందోళనకారులకు సంఘీభావం తెలుపుతూ ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. పోలీసులు వారికి సర్థిచెప్పి అక్కడ నుంచి పంపించి వేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సుదర్శన్, జన సేన పార్టీ నేతలు కంబాల రాజు, పల్లేటి బాపన్నదొర తదితరులు పాల్గొన్నారు.
కాగా మాజీ సర్పంచ్‌లు ఎరుపల్లి అప్పలకొండ, ఎరుపల్లి అడివిరాజు, గుండా వెంకటేష్‌లతోపాటు మరో ఇద్దరికి సుమారు 15 సంవత్సరాల క్రితం ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అయితే ఆ స్థలంలో ఇప్పటి వరకూ ఎటువంటి గృహనిర్మాణాలు చేపట్టకపోవటంతో ఆ పట్టాలను గతంలోనే తహసీల్దార్లు రద్దు చేశారు. దీంతో ఖాళీగా ఉన్న ఆ స్థలంలో అన్న క్యాంటీన్ కేంద్రం నిర్మించేందుకు టీడీపీ నేతలు రంగం సిద్ధం చేయటంతో ఆ స్థలం తమదంటూ మాజీ సర్పంచ్‌లు ఆందోళనకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.