తూర్పుగోదావరి

గడప గడపకు జగన్ అవినీతిని చెప్పాలి:చినరాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, జూలై 11: ప్రస్తుతం వైసిపి గడపగడపకూ కార్యక్రమంలో జగన్ అవినీతిని ప్రచారం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎద్దేవాచేశారు. కొత్తపేటలో సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. జగన్‌పై ఉన్న అవినీతి కేసులు, కోర్టుకు ఎందుకు వెళుతున్నారు, ఇడి ఎందుకు ఆస్తులను జప్తు చేస్తుందో గడపగడపకూ వెళ్ళి ప్రచారం చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుంటే దానిని చూసి ఓర్వలేని వైసిపి అడ్డుకోవాలని చూస్తోందన్నారు. నగరిలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఒక్కరి కూడా రుణం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారని, ప్రభుత్వం ఇస్తున్న అన్ని రుణాలను నెట్‌లో పెడుతోందని, వాటిని పరిశీలించుకుని, దమ్ముంటే ఒక్కరికి కూడా లోను రాలేదని నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిశోర్‌బాబు, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.
పేరుకు గ్రావెల్... వేసేది మట్టి రోడ్లు!
-ఉపాధి నిధులు స్వాహాకు రంగం సిద్ధం
కోరుకొండ, జూలై 11: కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న గ్రావెల్ రోడ్లకు బదులు కాంట్రాక్టర్లు మట్టి రోడ్లు నిర్మిస్తూ నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని కోటి గ్రామంలో వేస్తున్న గ్రావెల్ రోడ్లలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారని ఆ గ్రామ రైతులు వాపోతున్నారు. గ్రావెల్ రోడ్లు మంజూరైనా గ్రావెల్‌కు బదులు మట్టిని వేస్తున్నారు. అధికారులపై చోటా నాయకులు ఒత్తిడి తేవడంతో వాటిని పరిశీలించకుండా బిల్లులు చేయడానికి అధికారులు సిద్ధపడుతున్నారు. కోటి గ్రామంలో కోనేరు నుండి సాహెబు పంటపొలం వరకూ 900 మీటర్లు, కోటి నుండి కూనవరం వరకు రైతులు పొలంలోకి వెళ్లడానికి 1.5 కిమీ గ్రావెల్ రోడ్లు ఉపాధి పథకం కింద మంజూరయ్యాయి. సుమారు 9 లక్షల రూపాయలతో ఈ పనులు చేపట్టారు. అయితే ఈ రోడ్లకు గ్రావెల్ వేయవలసి ఉండగా మట్టిని వేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. రైతాంగానికి ఈ పనులపై ఏ విధమైన అవగాహన కల్పించకుండా ఉపాధి నిధులను దుర్వినియోగం చేయాలని చూస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలలో భాగస్వామ్యం ఉన్న అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేసారు. ఈ విషయమై ఎంపిడిఒను వివరణ కోరగా విషయం తెలుసుకుంటానని తెలిపారు.
ఉద్ధృతంగా గోదావరి
విఆర్ పురం, జూలై 11: ఇటీవల గోదావరి ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు మండలంలో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకోగా, మండలం వద్ద 15.530 మీటర్లకు చేరుకుంది. ఉదయం నుంచి మండలం వద్ద దాదాపుగా 5 మీటర్ల నీటి మట్టం పెరిగింది. పెరుగుతున్న వరద ఉద్ధృతి కారణంగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మంగళవారం నాటికి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా పొంగుతున్న గోదావరి వరద ఎగపోటుకు శబరినది వెనక్కు దాదాపు రెండు కిలో మీటర్ల దూరం నెట్టి వేయబడింది. పెరుగుతున్న వరదను చూస్తున్న లోతట్టు గ్రామల ప్రజలు, ఏ రాత్రి వరదలు ముంచెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నారు. వరద ఎగపోటుకు విఆర్ పురం నుంచి గున్నంకొండ మీదుగా చింతరేవుపల్లి వెళ్లే దగ్గర దారి గున్నంకొండ వద్ద రోడ్డుపైకి వరద నీరుచేరుకుంది. దీంతో ఆగ్రామ ప్రజలు 15 కిమీ చుట్టూ తిరిగి మండల కేంద్రానికి రావాల్సి వస్తుంది. ఇదే విధంగా వరద ఉద్ధృతి కొనసాగుతూ ఉంటే మంగళవారం నాటికి మరో కొన్ని రహదారుల పైకి నీరు చేరుకుని మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్నివిధాల సిద్ధంగా ఉన్నామని తహసీల్దారు జివిఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. వరద సహాయక చర్యల్లో భాగంగా మండలానికి రెండు లాంచీలను కూడా సిద్ధం చేశామని ఆయన తెలిపారు.
రెండేళ్లుగా మలేరియా మరణాల్లేవు
గంగవరం, జూలై 11: గత రెండేళ్లుగా జిల్లాలో మలేరియా మరణాలే సంభవించలేదని, మలేరియా నిర్మూలనకు తగిన కృషి చేస్తున్నామని జిల్లా మలేరియా నివారణాధికారి పిఎస్‌వి ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన గంగవరం మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పిహెచ్‌సీలో వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఏజన్సీలో మలేరియా వ్యాప్తి చాలా తక్కువగానే ఉందన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా నిర్మూలన చర్యలు వేగవంతం చేశామని, వైద్యులు, వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ప్రతీ గిరిజన గ్రామంలో జ్వర పీడితుల నుంచి రక్తపూత నమూనాలు సేకరిస్తున్నామన్నారు. గ్రామాల్లో అధికంగా జ్వర పీడితులు ఉన్నట్టు గుర్తిస్తే అటువంటి గ్రామాల్లో తక్షణమే వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రెండవ విడత మలేరియా స్ప్రేయింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మలేరియా సిబ్బంది, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జ్వర పీడితులను ఆసుపత్రికి తరలించడం గానీ లేదా వైద్యులకు సమాచారం ఇవ్వాలని క్షేత్రస్థాయి వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఆయన వెంట పిహెచ్‌సి వైద్యాధికారిణి సౌజన్య, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.
రౌతులపూడి మండలంలో
హెలీకాప్టర్ కూలిందని వదంతులు!
-పరుగులు పెట్టిన అధికారులు, మీడియా
రౌతులపూడి, జూలై 11: రౌతులపూడి మండలం ఎన్‌ఎన్ పట్నం గ్రామ శివారు కొండల్లో సోమవారం హెలీకాప్టర్ కూలిందనే వదంతులు మండలం అంతా వ్యాపించాయి. ఈ వార్తలతో మండల ప్రజలంతా ఎన్‌ఎన్ పట్నం వైపు పరుగులు తీశారు. హెలికాఫ్టర్ కూలిందనే సమాచారంతో చుట్టుపక్కల మండలాల నుండి మీడియా ప్రతినిధులు ఎన్‌ఎన్ పట్టణం గ్రామంలోని కొండల చుట్టూ తిరిగారు. కొండపై ఎక్కడ పొగ వస్తుంటే అక్కడకు పరుగులు పెట్టారు. విషయం తెలిసిన గ్రామ రెవెన్యూ అధికారులు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న కొండలపై తిరిగారు. చివరకు అవాస్తవమని తేలడంతో అంతా వూపిరి పీల్చుకున్నారు.
విద్యను దళిత వర్గాలకు దగ్గర చేసిన ముఖ్యమంత్రి
డి.గన్నవరం, జూలై 11: విద్యను దళిత వర్గాలకు దగ్గర చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఉద్ఘాటించారు. ఆయన సోమవారం మండల పరిధిలోని నరేంద్రపురం గ్రామంలో 13 కోట్ల రూపాయలతో నిర్మించిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి విద్యే దోహదపడుతుందన్న సిద్ధాంతాన్ని నమ్మి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు దేశంలో మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో రెసిడెన్షియల్ విద్యను ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో 21 కోట్ల రూపాయలతో 15 గురుకుల పాఠశాలలు సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, చిత్తూరు జిల్లా కుప్పంలో గురుకుల పాఠశాల 25 కోట్ల రూపాయలతో స్విమ్మింగ్ పూల్‌తో సహా నిర్మిస్తున్నామని రావెల చెప్పారు. తాము చదువుకునే రోజుల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు పూరిగుడిసెలు, మట్టిగోడలతో ఉండేవని, నేడు అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యను వ్యాపారంగా మార్చి పిల్లల తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్న స్కూళ్లు, కాలేజీల జోలికి పోకుండా ప్రభుత్వం సమకూరుస్తున్న రాయితీలను అందిపుచ్చుకుని ఉన్నతులుగా ఎదగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశంలో నాలుగు ఉన్నత విద్యాలయాల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించి ఇండియన్ సర్వీసెస్‌లో ఉద్యోగం సాధించేందుకు తర్ఫీదు ఇస్తుందన్నారు. విదేశాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నవారికోసం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ వైయాసిస్ విద్యాపథకాన్ని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా 15 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఖర్చుపెట్టనున్నదని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 4 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్మాణాలు పూర్తయ్యాయని, నేడు నరేంద్రపురంలో ప్రారంభించామని, మిగిలిన 3 త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈ సాధనకు కృషిచేసిన ఉపాధ్యాయులు అభినందనీయులని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ పి.గన్నవరం నియోజకవర్గం వెనుకబడిన పేద నియోజకవర్గం అని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రులకు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా గురుకుల పాఠశాలకు వచ్చే రహదారి, ప్రహారీగోడ నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరు చేయాలని పులపర్తి మంత్రి రావెలను కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ గురుకుల పాఠశాల అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేస్తానని సభాముఖంగా ఫ్రకటించారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.సత్యనారాయణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంసాని లక్ష్మీగౌరి పెద్దిరాజు, గ్రామ సర్పంచ్ తరపట్ల సుభాషిణీ ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు రాణీ శ్రీనివాస్ శర్మ, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు పులపర్తి రవికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మట్టపర్తి రామకృష్ణ, ఎంపిటిసి నేలపూడి సత్యనారాయణ, డిడి శాంతామణి, జెఇ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబంలో పెను విషాదం
రాజవొమ్మంగి, జూలై 11: ఓ నిరుపేద కుటుంబంలో తట్టుకోలేని పెను విషాదం సంభవించింది. అల్లారు ముద్దుగా పెంచిన తొమ్మిదేళ్ల కన్నకూతురు మరణంతో కుటుంబం విలపిస్తున్న తరుణంలో వారు నివాసముంటున్న ఇల్లు షార్ట్ సర్క్యూట్‌తో తగులబడిన సంఘటన మండలంలో ఆదివారం ఆర్థరాత్రి చోటుచేసుకుంది. మండలంలో కిమ్మలిగెడ్డ గ్రామంలో కూలిపని చేసుకొని జీవిస్తున్న గిరిజన కుటుంబానికి చెందిన పుట్టపల్లి చిన్నబ్బాయి కుమార్తె దివ్య కీళ్లవాపు, గుండెజబ్బుతో ప్రాణాలు విడిచింది. అమ్మిరేకుల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న దివ్య 15 రోజుల క్రితం కాళ్లు, చేతులు వాచి జ్వరం రావడంతో స్థానిక పిహెచ్‌సికి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించి మెరుగైన చికిత్సకై కాకినాడ జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. తల్లిదండ్రులు ఆ బాలికను వైజాగ్ కెజిహెచ్‌కి తరలించారు. అక్కడ రెండు వారాలపాటు చికిత్స పొందినా పరిస్థితి మెరుగుపడలేదు సరికదా పరిస్థితి మరింత విషమంగా మారింది. ఎట్టకేలకు ఆ బాలిక ఆదివారం మరణించింది. దివ్య మృతదేహాన్ని కిమ్మలిగెడ్డ తీసుకొచ్చి మృతదేహం వద్ద విలపిస్తున్న తరుణంలో తాటాకు ఇంటి పైకప్పు నుండి పెద్ద మంటలు వచ్చి అరగంట వ్యవధిలోనే కాలి బూడిదైంది. రెండు సంఘటనలు ఒకే రోజు జరగడంతో ఆ కుగ్రామంలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలసుకున్న మండలవాసులు కంట తటిపెట్టారు. చిన్న వయసులోనే తమ ఏ కైక కుమార్తెను కోల్పోయిన దివ్య తల్లిదండ్రులు చిన్నబ్బాయి, రామలక్ష్మిలు దేవుడు తమ కుంటుంబంపై చిన్నచూపు చూశాడని కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. దివ్య రుమాటిక్ గుండెజబ్బుతో బాధపడుతూ ఇన్‌ఫెక్షన్ సోకి మరణించి ఉండవచ్చని, ఇది చాలా అరుదైన జబ్బు అని స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి రవిచంద్ర తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నబ్బాయి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కాలి బూడిదవడంతో బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలారు. లక్ష రూపాయల వరకు ఆస్తినష్టం సంభవించిందని విఆర్వో ప్రకాష్ తెలిపారు.