సబ్ ఫీచర్

‘ఫ్యామిలీ ఫొటో’ ఎంత మధురం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్చితార్థమో, పెళ్లో, ఏదైనా శుభకార్యమో జరిగినపుడు బంధుమిత్రులంతా ఒకచోట కలుసుకోవడం మధురమైన జ్ఞాపకం. రెక్కలొచ్చిన పక్షుల్లా ఎక్కడెక్కడికో ఎగిరిపోయి ఉద్యోగాల పేరిట దూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు శుభకార్యాల సందర్భంగా తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో కొన్నిసార్లు మాత్రమే వస్తుంటాయి. తల్లిదండ్రులు, పిల్లలు, బామ్మలు, తాతలు, అత్తమామలు, పిన్నీ బాబాయిలు.. ఇలా ఎంతోమంది కుటుంబ సభ్యులు, ఎన్నో తరాలవాళ్ళు.. పిల్లాజెల్లతో ఒక దగ్గర కలుసుకుని ఆనందోత్సాహాలను పంచుకుంటూ ఉంటారు. అలా కబుర్లతో, నవ్వులతో గడిపే ఆ రోజులు నిజంగా గుండెల్లో పదిలంగా కలకాలం దాచుకోవాల్సిన మధుర క్షణాలు. ఆ కలయికకు సంబంధించిన అందమైన ‘దృశ్యాలను’ పదే పదే జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇలాంటి అరుదైన సందర్భాల్ని కెమెరాలో బంధిస్తే వచ్చే ‘ఫ్యామిలీ ఫొటో’లు తరతరాలకూ తీపి జ్ఞాపకాలను పంచిపెడతాయి. ఏ పల్లెటూరికైనా వెళ్లి ఏ ఇంటిగోడమీదైనా దృష్టి సారిస్తే సరిపోతుంది. అనుబంధాలు, ఆత్మీయతలతో నిండిన ఆ తీపి జ్ఞాపకాలను ఫొటోఫ్రేముల్లో బంధించి గోడమీద వరుసగా తగిలిస్తారు. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నపుడు ప్రతిరోజూ ఆ ఫొటోలు ఎదురుగా గోడమీద కనిపించి.. ఆ వ్యక్తులను కళ్ళముందు నిలిపి.. వాళ్ళతో పెనవేసుకున్న ఆత్మీయ బంధాన్ని మనసులో మెదిలేలా చేస్తాయి.
పాతకాలంలో అయితే పెళ్ళిళ్ళప్పుడు కుటుంబ సభ్యులంతా కలిసి తప్పక ఫొటో తీయించుకునేవాళ్ళు. స్టాండుకు డబ్బాలాంటి పెద్ద కెమెరా ఫిక్స్ చేసి దానికి నల్ల బట్ట కప్పి.. ఫొటో తీసే సమయానికి ఆ కెమెరా మ్యాన్ కూడా ఆ బట్టలో తలదూర్చి... ‘అందరూ నవ్వండి.. రెడీ...!’ అంటూ ‘క్లిక్’మని ఫొటో తీసేవాడు. దాన్ని ఓ పల్చటి అట్టకు అంటించి నాలుగైదు రోజుల తర్వాత ఇంటికి తెచ్చి ఇస్తే ‘చూసేవాళ్ళకు చూడముచ్చట’ అన్నట్లుగా ఉండేది ఆ ఫొటో.
నాలుగైదు తరాలతో కూడిన ఆ కుటుంబం ‘ఈ మూల నుంచి ఆ మూలకి’ అన్నట్టు ఏ పాతికమందితోనో నిండిపోయేది. మగవాళ్ళు దర్జాగా కుర్చీలో కూర్చుంటే.. ఎవరి భర్తల వెనుక వాళ్ళ భార్యలు అమాయకపు ముఖాలతో.. జరీ అంచు చీరలతో, పొట్టి చేతుల రవికెలతో.. మెళ్ళో బోలెడు నగలతో నిల్చుని ఉండేవాళ్ళు. ఇక పిల్లలలయితే.. అందరూ వరసగా బాసింపట్లు వేసుకుని కింద కూర్చుని.. బుద్ధిగా కనిపించేవాళ్ళు. ఆ ప్యామిలీ ఫొటోలో అన్నిరకాల వయసువాళ్ళూ వుండేవాళ్ళు. మెడలో పూలదండలతో పెళ్లికొడుకు, పెళ్లికూతురూ అమాయకత్వం ఉట్టిపడే ముఖాలతో నిల్చుని ఉండేవాళ్ళు. ఇదీ పాతకాలపు కుటుంబ ఛాయాచిత్రపు రంగు, రూపు, గత వైభవం. ఎనే్నళ్ళక్రితమో దిగిన ఫొటోలు గనుక కొన్ని అక్కడక్కడా నలుపు రంగు వెలిసి తెల్లటి మరకలతో శిథిలావస్థకు చేరువవుతున్నట్లుగా కనిపించినా.. నట్టింట్లో గోడమీద ఫ్రేముల్లో ఈ చివర నుంచి ఆ చివరకు కొలువై ప్రతిరోజూ కంటికి విందు చేసే ఫొటోలు మాత్రం చాలాకాలం పాడుకాకుండా బాగానే వుండేవి. ఏది ఏమైనా ఆ కాలం ఫొటోలు మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఆనవాళ్ళు. కుటుంబ సభ్యుల మధ్య ఉండే మమతానురాగాలకు ప్రతిబింబాలు. ఇక ఈ రోజుల విషయానికివస్తే.. ఇపుడు పెళ్ళిళ్ళల్లో గ్రూప్ ఫొటోలు, ఫ్యామిలీ పొటోలు దిగడం అన్నది ఓ వేలం వెర్రిలా మారిపోయింది. ఫొటోగ్రఫీలో వచ్చిన కొత్త సాంకేతికత, ట్రెండ్ ఆధారంగా ఫొటోలను తీయటంలో రకరకాల గిమ్మిక్కుల, మిక్సింగులు, మ్యూజిక్కులు చేసి ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చూపిస్తున్నారు. మోడ్రెన్ డ్రెస్సుల మాయదారి ఫ్యాషన్ల కాలంలో ఫొటోలకు ఫోజులిచ్చి నించున్నవాళ్ళలో ఆడవాళ్ళెవరో, మగవాళ్ళెవరో పోల్చుకోవటం కష్టంగా ఉంటోంది. అంతెందుకు..? జుట్లు విరబోసుకుని.. పళ్ళు ఇకిలిస్తూ నిల్చున్న ఆ గ్రూపు అసలు మనుషులేనా? లేక మరెవరన్నా అని అనుమానం కలుగుతోంది. ఇక పిల్లలు వేసే కోతివేషాలు అన్నీ ఇన్నీ కావు. పక్కన నిల్చున్న వాళ్ళ నెత్తిన రెండు వేళ్ళతో కొమ్ములు పెట్టడం, వెక్కిరింతలు, వింత వింత భంగిమలు వంటివి ఎన్నో! ఇలా గ్రూఫ్ ఫొటోకి ఇపుడు అర్థం, ప్రయోజనం మారిపోతూ అపహాస్యం పాలవుతోంది. అయినా ఇపుడు ఫ్యామిలీ ఫోటోలో ఉండేది ఎంతమంది అనీ..? పట్టుమని పదిమంది కూడా ఉండటం లేదు. చిన్న కుటుంబాలలో ఉండే ఆ పదిమందిలోనైనా ఒకరు అమెరికాలో ఉంటే.. మరొకరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. లేకుంటే ఏ లండన్‌లోనో, మలేషియాలోనో ఉంటున్నారు. ‘చెట్టుకొకరు.. పుట్టకొకరు’... కాదు కాదు ‘దేశానికి ఒకరు’ అన్నట్టు అందరూ దేశాలు పట్టిపోతున్నారు. తమ ఒక్క కుటుంబాన్ని కలిసికట్టుగా ఉంచుకోలేనివాళ్ళు ‘జగమంత కుటుంబం’ అంటూ వట్టి కబుర్లు చెబుతున్నారు.
కుటుంబ సభ్యులవి.. ఫ్యామిలీవి ఫొటోలు గోడలకు తగిలించడం ఇపుడు మోటు, అనాగరికం అయిపోయింది. ఆల్బమ్‌లో, వీడియోలో, సీడీలో నిక్షిప్తం చేయడం తప్ప అప్పుడప్పుడూ బయటికి తీసి చూసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవటం.. వివిధ దశలను, సందర్భాలను గురించి ముచ్చటించుకోవటం.. మన మధ్యలేని పెద్దలను గుర్తుచేసుకుంటూ నివాళి అర్పించటం వంటివి ఇప్పటి సంస్కృతికి సరిపడని విషయాలు అయిపోయాయి. అందుకే ఇపుడు ఫ్యామిలీ ఫొటోలు అలమారాల్లో ఓ మూలనో, పెట్టె అడుగునో పడి ఉంటూ నిరాదరణకు గురవుతూ ఈ కాలం మనిషి నిర్లక్ష్యనికి, ప్రేమరాహిత్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఇపుడు డబ్బా పెట్టెల్లాంటి ముసుగుల స్టాండు కెమెరాలు.. చిన్నసైజు ఫ్లాష్ కెమెరాలు.. డిజిటల్ కెమెరాలు అన్నీ పోయి స్మార్ట్ఫోన్లలో సెల్ఫీలు దిగటం లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. ఫ్యామిలీ ఫొటోలు కూడా అందులోనే... ఎంతయినా ఆ పాతకాలపు సకుటుంబ సమేత బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు సాటి ఏవీ రావు కదూ...!

- కొఠారి వాణీ చలపతిరావు