యువ

లోలోపలి భయాలు పారదోలితేనే జయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో భయాలకు లోనవుతూనే ఉంటారు. వర్థమాన తారలను చూస్తే సూపర్‌స్టార్లకు భయం. యువ నాయకులను చూస్తే వృద్ధ నాయకులకు భయం. తామున్న రంగంలో కొత్త నీరు ప్రవేశించిందంటే అందరికీ భయమే. దానిని ‘ఫేస్’ చేయడం మానేసి నిందారోపణలకు దిగుతారు. లేదా ఎస్కేప్ అవుతుంటారు. అసలు తమకు ఎదురుపడినదేమిటో, దాని మంచి చెడులేమిటో కూడా కనీసం విశే్లషించుకోరు.

చీటికీ మాటికీ ఉత్కంఠకి లోనుకావడం, కన్‌ఫ్యూజ్ కావటం- ఇవన్నీ అవలక్షణాలు. ఈ లక్షణాలు అందరిలోనూ ఉంటాయి. అయితే వాటి తీవ్రతలోనే తేడా. ఈ అవలక్షణాల మోతాదు ఎక్కువగా ఉంటే మనకు తెలియకుండానే మన జీవితం గందరగోళంలో పడిపోతుంది. ఇందుకు చాలా కారణాలుంటాయి. కొన్ని భయాలు బాల్యంలోనే ఏర్పడి ఉంటాయి. వాటిలో కొన్నిటిని సరైన అవగాహన పెంచుకోవడం వలన తగ్గించుకోవచ్చు. భయాల తీవ్రత ఎక్కువైనపుడు తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించడం మంచి పద్ధతి. రోగానికి నిర్మూలనే ఉత్తమమైన మార్గమైనట్లు, సంసిద్ధతే భయా న్ని తరిమి కొట్టడానికి మూలం. కొత్త ప్రాంతం, కొత్త అనుభవం ఎలా ఉన్నా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఆ అనుభవాన్ని ఎదుర్కోవడానికి కాస్త శిక్షణ కూడా అవసరం.
చిన్నపిల్లల విషయమే చూద్దాం. స్కూల్లో చేర్పించిన తొలి రోజునే డైరెక్టుగా క్లాసులో కూర్చోపెట్టకుండా ప్లేగ్రౌండ్‌కి తీసుకువెళ్లి, అక్కడ ఆడుకుంటున్న పిల్లలతో మాట్లాడించటం వంటి పనులు చేస్తే స్కూలంటే వారిలో ఉన్న భయం తొలగిపోతుంది.
జనరల్‌గా మిలటరీకి ఇచ్చే ట్రైనింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఇంటికి దూరంగా ఎలా జీవించాలనే విషయాన్ని ముందుగా నేర్పుతారు. ఆయుధాల వాడకాన్ని అలవాటు చేస్తారు. కొత్త ఆహారపు అలవాట్లను నేర్పుతారు. మానసికంగా, శారీరకంగా ఎదురయ్యే సమస్యలను తట్టుకుని నిలబడటంలో శిక్షణ ఇస్తారు.
బ్రిటన్ ప్రధానిగా పేరొందిన విన్‌స్టన్ చర్చిల్ కూడా లోలోపల భయస్తుడే. కానీ ఆయన తన ప్రసంగాలు వినే ప్రజలకన్నా తానెంతో మేధావినని, ప్రజ్ఞాశీలినని భావించేవాడు. ఇలా భావించటం మూలంగానే తానెటువంటి స్టేజి ఫియర్‌కు లోనుకాకుండా అద్భుతమైన ప్రసంగాలు చేసేవాడు.
తాము చేపట్టబోయే అంశాలపట్ల అవగాహన ఏర్పరచుకోవటం, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం మూలంగా మనలో ఉన్న ఒత్తిడులు, భయాలు పూర్తిగా తొలగిపోతాయి. మనలో ఉన్న ఒత్తిడులు, భయాలు అసలెందుకు ఏర్పడ్డాయో, వాటి స్వరూప స్వభావాలేమిటో అవగాహన ఏర్పరచుకుంటే వాటినుంచి పూర్తిగా బయటపడటమే కాక చక్కటి ఆత్మవిశ్వాసాన్ని కూడా ఏర్పరచుకోగలుగుతారు.
అసలు మీలో భయాన్ని రేపి, మీ మనోనిబ్బరాన్ని బలహీనపరిచే అంశాలను ఒక పేపర్‌మీద రాసుకోండి. వాటిని ఇతరులతో పంచుకోండి. అవి మిమ్మల్ని ఎందుకు వేధిస్తున్నాయో విశే్లషించుకుని వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నించండి.
మీలో అంతర్గతంగా ఇప్పటివరకూ ఎవరికీ చెప్పుకోలేని భయాలుంటే మీ శ్రేయోభిలాషుల వద్ద దాపరికం లేకుండా చెప్పుకోండి. వాటి గురించి చర్చించండి. ఇలా చేయటం వలన మీలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. వెంటనే ఆ భయాల్ని వదిలించుకునే చర్యల్ని కూడా చేపట్టగలుగుతారు.
మీలో మీకు విచారాన్ని, భయాన్ని కలిగిస్తున్న భావాలను తొలగించుకుని, ఆనందకర విషయాలతో భర్తీ చేసుకోగలుగుతారు. భయాలను వదిలించుకోండి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించుకోండి.

-పివి రమణకుమార్