మెయన్ ఫీచర్

పేదల జేబుల్ని కొల్లగొడుతున్న పోంజీ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనవాళ్లంతా ఏం చేస్తున్నారు..?’ అంటూ ఓ స్నేహితుడు స్వంత ఊర్లో వుంటున్న మరో స్నేహతుడిని ప్రశ్నిస్తే, ‘ఏముంది..చదువుకున్న వారంతా ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ వుంటే, ఫెయిల్ అయిన వారంతా కొందరు రియల్ ఎస్టేట్, చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడితే, మరికొందరు ప్రైవేటు స్కూళ్లను పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాల్ని కల్పిస్తున్నారు..’ అనే తెలుగు సినిమా డైలాగు తెలిసిందే!
అది పంజాబ్ రాష్ట్రంలోని అట్టారి గ్రామం-పాలమ్ముకొని బతికే నిర్మల్ సింగ్ బంగూకు ఇలాంటి ఆలోచనే తట్టింది. 1980లో ఫీర్‌లెస్ ఏజెంట్‌గా పనిచేసిన బంగూ, తానే ఓ సంస్థను పెట్టాలన్న ఆలోచనకు వచ్చి, అట్టహాసంతో ఢిల్లీ కేంద్రంగా పెరల్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను, చండీగఢ్ కేంద్రంగా పెరల్ గోల్డెన్ ఫారెస్టు అనే మరో సంస్థను స్థాపించాడు. అతి తక్కువ ధరలకే వ్యవసాయ భూముల్ని ఇస్తామంటూ ప్రచారాన్ని సాగించి, సాధారణ ప్రజలన్ని, దినసరి కూలీల్ని, చిరు వ్యాపారులతో సహా, మధ్యతరగతి నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల దాకా నమ్మించి, అనతికాలంలోనే కోట్లాది రూపాయల్ని పోగుచేశాడు. పెట్టిన పెట్టుబడికి 12.5శాతం నుంచి 40 శాతం దాకా కమిషన్ వస్తుందని నమ్మబలికి దేశవ్యాప్తంగా 23 లక్షలమంది ఏజెంట్లను నియమించి, దాదాపు 1700 మంది ఏజెంట్లకు నెలనెలా 5 నుంచి 7 లక్షల రూపాయల కమిషన్ అందేలా చూశాడు. వీరంతా పోటీలు పడి ఓ కస్టమర్ మరోకస్టమర్‌ను చేర్పిస్తే, ఓ పిరమిడ్‌లా ఎదుగుతారని ప్రచారం చేసి పంజాబ్, రాజస్థాన్, యుపి, యంపి, తమిళనాడు, ఢిల్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో 2013 నుంచి 5కోట్ల85 లక్షల మందిని చేర్పించారు. వీరందరికి నమ్మకం కలిగించడానికై దేశ సరిహద్దులోని ఎడారి ప్రాంతమైన బార్మర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం దాకా కారు చౌకగా అటవీ భూముల్ని కొని ‘పెరల్ ఫాం’ అనే బోర్టులను పెట్టారు. భవిష్యత్తులో ఈ భూములన్నీ తమకే చెందుతాయని పెట్టుబడి పెట్టినవారు భ్రమించారు. దేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, మడగాస్కర్, దుబాయి వంటి విదేశాల్లో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అపార్ట్‌మెంట్‌లను కట్టిస్తానని నమ్మించాడు.
ఇలా దేశ విదేశాల్లో విస్తరించిన పెరల్ సామ్రాజ్యం, దొంగ అమ్మక పత్రాలను అందించడంతో వ్యవహారమంతా బయటపడింది. చివరకు వినియోగదారులు కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశాల మేరకు కదిలిన సిబిఐ, సేల్‌డీడ్‌లను పరిశీలించగా, 19,284 ఉత్తిత్తివేనని తేలింది. మీరట్‌లో నైతే స్మశాన వాటిక భూమినే పెరల్ గోల్డ్ ఫారెస్టుగా చూపించారు! ఇలా పోగేసిన మొత్తం అధికారికంగా రూ. 49 వేల కోట్లని తేలింది. కాని ఇది రూ. 75వేల కోట్లకు పైచిలుకేనని సెబి అంచనా!
కోట్లాది మందిని బురిడి కొట్టించి వేలాది కోట్లను పోగు చేసుకోవడానకి ఈయన వేయని ఎత్తు లేదు. అధికారికంగా అందని సహకారం లేదు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సిం గ్‌తో సహా పర్యావరణ సహాయమంత్రి కల్‌రాజ్ మిశ్రాలు, బం గూకు అనుంగులు కాగా, ఈ దోపిడి ముసుగులో ఈయన స్పాన్సర్ చేసే కబడ్డి టోర్నీకి, కింగ్స్-11 ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌కు, బ్యాడ్‌మింటెన్‌కు మహామహులను వాడుకున్నాడు. పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుబ్బీర్ భారత్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభిస్తే, బ్యాడ్‌మింటన్‌కు అక్షయ్‌కుమార్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఈ తతంగాన్ని జనంలోకి తీసుకెళ్లడానికై ఏకంగా డి7 అనే టీవీ ఛానల్‌ను ప్రపంచ సుందరి సుస్మితాసేన్‌చే రిబ్బన్ కటింగ్ చేయించాడు. ఇలా శిల్పాశెట్టి, ఈమె భర్త రాజ్ కుంద్రాతో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రెట్‌లీ ఈయనకు అత్యంత సన్నిహితులే! కేవలం వ్యాపారం ఒక్కటే బాగుండదని భావించిన బంగూ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధిపతిగా ఉన్న ఖేతన్ దేశాయికి ముడుపులిచ్చి, జ్ఞానిసాగర్ మెడికల్ కాలేజీకి అనుమతి తీసుకున్న ఘనుడు.
ఇలా అన్ని రంగాల్లో విస్తరించిన బంగూ పోంజీ పథకాల్ని మోసపూరితమైనవని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు పెరల్ పథకాలతో పాటు మరో 478 పోంజీ పథకాల్ని 1998లోనే నిషేధించినా, హర్యానా, పంజాబ్ హైకోర్టు ఇవి పోంజీ పథకాలు కావంటూ సెలవివ్వడంతో దేశవ్యాపితమయ్యాయి. అయితే ఈ మోసాల్ని ముందుగా ఎదుర్కొన్నది గ్వాలియర్ మెజిస్ట్రేట్ (కలెక్టర్) ఆకాశ్ త్రిపాఠి. చంబల్ లోయ ప్రాంత భూములన్నీ అన్యాక్రాంతవౌతున్నట్లు గుర్తించిన ఈయన 2010-11లో చర్యలు ప్రారంభిస్తే 18వేల కేసులు బయటపడ్డాయి. ఈయనపై బంగూ టీవీ ఛానల్ కారాలు మిరియాలు నూరింది కూ డా! తర్వాత ఈయన బదిలీకి గురయ్యాడు. అప్పటికి కదలని సిబిఐ బంగూని అరెస్ట్ చేయలేకపోయింది. ఈయనకు సహకరించిన కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయిన ఒక్క ఆస్తిని కూడా జప్తు చేయలేదు. చివరికి మొన్న ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు కలుగజేసుకొని పెరల్ అగ్రోటెక్, గోల్డెన్ ఫారెస్ట్‌లకు చెందిన అన్ని కార్యాలయాల్ని సీలు చేయాలని తీర్పునిస్తూ, లోధా కమిటీని నియమించి, ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకు చెల్లించమని కోరింది. వివిధ కోర్టులో పది సంవత్సరాలకు పైగా నలిగిన ఈ కేసులు, బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తాయో ఎదురు చూడాల్సిందే!
ఈ బంగూ జుట్టులోంచి పుట్టినవాడే సంతోషిలాల్ అనే పెరెల్ ఆగ్రోటెక్ మాజీ ఉద్యోగి. గ్వాలియర్ కేంద్రంగా 2010లో కాయిలా మాతాకి జై అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి, నడిపింది మాత్రం చిట్‌ఫండ్ కంపెనీని! స్నేహితులతో పాటు అందర్ని నమ్మించి, మూడు సంవత్సరాల్లో ఈయన కూడబెట్టింది అక్షరాల వెయ్యికోట్లు మాత్రమే. అనతికాలంలోనే ఢిల్లీలోని టాల్‌స్టాయ్ వీధిలో కార్పొరేట్ ఆఫీసు, కెఎంజె అనే టీవీ ఛానల్‌ను ప్రారంభించి దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. ఈయన కథ ఇంకా ఎటూ తేలలేదు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అవ్వా వెంకటరామారావు, అవ్వా వెంకట శేషు నారాయణలు అగ్రిగోల్డ్ అనే సంస్థను స్థాపించి, రియల్ ఎస్టేట్‌తో పాటుగా, టూరిజం, డైరీ, విద్యుత్, ఎక్స్‌పోర్ట్, ఫుడ్స్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రా, మీడియా లాంటి లాభసాటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాల్ని ఆర్జించవచ్చునని ప్రచారం చేసి తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 32 లక్షల మంది సభ్యుల్ని చేర్పించి, రూ.7,000 కోట్లను ఆర్జించారు. సినీ ప్రముఖులను అంబాసిడర్లుగావాడుకొని, రైళ్లలో, బస్సుల్లో, టీవీ ఛానళ్లలో ఆకర్షణీయమైన ప్రచారాన్ని ఈ సంస్థ సాగించింది. వీరు ప్రచారం చేసినట్టుగా ఏ ఒక్కరికి లబ్ది జరక్కపోగా, ఏజెంట్ల ఒత్తిడి పెరగడంతో కొం దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఉరితాళ్లను వెతుక్కున్నారు. కారణం? ఈ సంస్థ ఇచ్చిన రూ.700 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్ కావడమే. బాధితుల గోడు వినే నాథుడు లేకుండా పోవడంతో, కొంతమంది హైకోర్టులో ఎ. రమేశ్‌బాబు నాయకత్వాన కేసు వేయడంతో కదిలిన సిబిఐ పై ఇద్దరిని ఫిబ్రవరి 11న అరెస్టు చేసింది. వెంటనే అరెస్టు చేసి ఆస్తుల్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించినా, పట్టించుకోని సిబిఐని మందలించడం కూడ జరిగింది. ఇంతా చేస్తే, వీరు అక్రమంగా తరలించిన డబ్బు రూ.10 కోట్లేనని, ఆస్తులు ఏమీ లేవని ఇంటరాగేషన్‌లో చెప్పడం గమనార్హం. దాదాపు 70 ఆస్తులు బినామి పేర్లతో గుర్తించిన కోర్టు, వీటిని వేలం వేయడానికై ఓ నిపుణుల కమిటీని నియమించింది. కేవలం హైదరాబాద్‌లోని అగ్రిగోల్డ్ కార్యాలయమే రూ.25 కోట్లకు పైగా వుంటుందని ఈ సంస్థకు అప్పులిచ్చిన ఆంధ్రాబ్యాంకు తెలిపింది. అగ్రిగోల్డు మరో కొమ్మనే అక్షయ గోల్డ్. వివిధ పథకాల పేరున ఈ సంస్థ వసూలు చేసింది రూ.600 కోట్లకు పైగానే. ఈ విషయంగా కూడా హైకోర్టు సిబిఐని మందలించింది. 2012లో ఈ సంస్థకు సంబంధించిన 28 మందిపై 19 కేసులు నమోదు కాగా, 18 మంది ముందస్తు బెయిల్ పొందడం గమనార్హం. ఈ పుణ్యకాలంలోనే రూ.32 కోట్లను వివిధ బ్యాంకు ఖాతాల నంచి తీసేసుకున్నారు. 2,500 ఎకరాలకు పైగా భూమిని కలిగిన ఈ సంస్థ, బాధితులకు చెల్లించాల్సింది రూ.329కోట్లని అంచనా.
పశ్చిమ బెంగాల్ కేంద్రంగా సంచలనం సృష్టించిన సుభ్రత్రారాయ్ సహారా కథ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లే 31వేల కాటన్లు నిండిపోగా, 12 ట్రక్కుల్లో వీటని సెబి తెప్పించుకొని భద్రతపరచినందుకు గాను రూ.41.44 లక్షలు ఖర్చు చేసిందట. ఈ డబ్బును సెబికి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా చిల్లిగవ్వ లేదని చేతులెత్తేసి తీహార్ జైల్లో దర్జాగా కాలం వెళ్లబుచ్చుతున్న సుభ్రతా రాయ్‌కి 3టీవీ స్టేషన్లతో పాటు, టీవీ చానళ్లు, రెండు ఆంగ్ల దినపత్రికలు, ఓ బెంగాలి దినపత్రిక, పాలక పక్ష ఎంపిల అండ ఉన్నది. మిథున్ చక్రవర్తి లాంటి వారు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఏ ప్రభుత్వాలకు లెక్కలందనీ ఈ ఫోంజీ పథకాలు ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 33 వున్నట్టు 2011లో తేలింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో రూ.10వేల కోట్ల వ్యాపారంలో, 250 లక్షలంది కస్టమర్లతో దాదాపు 200 దాకా ఉన్నట్టు అంచనా. వీటన్నింటికి 24 గంటల టీవీ ప్రచారాలే నిలువెత్తు సాక్ష్యం.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162