అక్షర

అక్షరాలలో జ్వలించే ‘కొన్ని రాత్రులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని రాత్రులు
-పుష్యమీసాగర్
వెల: రూ.100/-
ప్రతులకు:
విశాలాంధ్ర, ప్రజాశక్తి,
నవోదయ, దిశా, పాలపిట్ట
కవితలు రాసే వాడికి కవిత్వం నాడి తెలియాలి. దాని లోతు అంతుబట్టాలి. సంఘర్షణాత్మకమైన క్షణాల్ని, దృశ్యాల్ని అక్షరాలలో ఒడిసిపట్టుకోవాలి. ఈ అంతర్మథనం జరిగితే తప్ప... అతను కవి కాలేడు. బహుముఖ కోణాల స్పర్శను, తాకిడిని, తీవ్రతను అనుభూతించి ఆస్వాదిస్తేగాని జీవితానుభవాలను కాచి ఒడబొయ్యలేడు. ఈ తపనంతా ఎందుకంటే- కవిత్వాన్ని కవిత్వంతో తూచే ఒక కవి దొరికాడు కనుక. అతని పేరు పుష్యమీ సాగర్. ‘‘కొన్ని రాత్రులు’’ అతని కవితా సంపుటి. 45 కవితలతో కొలువుదీరిన ఈ సంపుటికి నలుగురు ముందుమాటలు రాయడం కొసమెరుపు. జీవితపు లోతుల్ని జీర్ణించుకొని అక్షర సత్యాలుగా సజీవ దృశ్యాలుగా కళ్లముందు పరచడం, వర్తమాన వాస్తవికతకి అద్దంపడుతుంది.
‘‘నవ మాసాలు/ కళ్లల్లో పెట్టుకొని
ఎదిగి వచ్చిన/ పేగు తెంచిన బంధం
ప్రాణాలతో మరొకరి చేతుల్లో పెడ్తుంటే
అమ్మతనం కన్నీళ్లు పెట్టింది’’ అని అంటారు ‘‘అద్దె అమ్మలు’’ కవితలో కవి పుష్యమీసాగర్. కాసిన్ని పచ్చనోట్లకోసం మాతృత్వాన్ని అవసరార్థం ఎరువుతెచ్చుకొని పేగుబంధాన్ని తెంచుకునే అతి దయనీయమైన స్థితిని కవితాత్మకంగా చిత్రించారు కవి. మనిషి పుట్టుకకు కూడా వెలకట్టే ‘అద్దె అమ్మ’లున్న సామాజిక నవ నాగరికతా వ్యవస్థలో ఈవాళ మనమున్నాం. ఇది కడుపుతీపికి- పసిగొడ్డు బంధానికి మధ్య నలిగిపోయే సంఘర్షణాత్మక పెనుగులాటకి దర్పణం పడుతుంది.
‘‘ఉనికి ప్రశ్న’’ కవితలో పుష్యమీసాగర్ ఆత్మఘోష ఇలా బొమ్మ కడుతుంది.
‘‘అరవై గజాల చీరని/ అగ్గిపెట్టలో దాచినా
ఎండిన నీ డొక్క సాక్షిగా
ఆకలి మంటలను ఆర్పలేని అర్భకుడివి’’ అని నొక్కి చెప్పడంలో చేనేత కళాకారుడి ఆర్థిక దుస్థితిని, పస్తుల పూటల రుచిని, భరోసా లేని బతుకు వెతల దీనగాధని కళ్ళకి కట్టిస్తారు కవి. ఇందులో వస్తువూ, విషయమూ పాతవే! వ్యక్తీకరణలో కవితాత్మక ధ్వని కొత్తది. ఎలాంటివాడైనా చదివిన తర్వాత కంట తడిపెట్టలేకుండా ఉండలేని మానసిక స్థితి. అదే ఈ కవితా నిర్మాణానికి గీటురాయి.
‘‘వ్యసనం’’ కవితలో మద్యపానం అమలుపై ప్రభుత్వంపై కనె్నర్రజేస్తారు కవి.
‘‘మరణానికి బాటలు వేసి/ పబ్బం గడుపుకునే
ప్రభుత్వాలు ఉన్నంతవరకు/ అమృతానికి చావు లేదు
వీధికొక్క అంగడిలో/ సురాపానానికి అంతే లేదు’’ అంటూ ఒక విషాద వాస్తవికతను తూర్పారబెట్టి అక్షరీకరించే ప్రయత్నం చేస్తారు పుష్యమీసాగర్. ‘కల్లు మానండోయ్- కల్లు తెరవండోయ్’అన్న మాటల్ని ఏనాడో పక్కనబెట్టి, చాపకింద నీరులా సాగిపోతున్న ప్రభుత్వ వ్యవహార చర్యలకు అడ్డుకట్టవేసే ప్రయత్నం చేస్తారు కవి.
‘‘ఇప్పుడు నేను కోయిలను/ కాలంతో పని లేని గొంతుకను
పాటను వినిపిస్తూనే వున్నాను
నీ చెవిని చేరేదాకా’’ అని అంటున్నప్పుడు ధ్వనించే స్వరం చాలా నర్మగర్భంగా వినిపిస్తుంది. అంతర్గత వేదనని పొదివిపట్టి అక్షరాల తడిలో చూపిస్తుంది. ఈ స్పర్శకు అంతరాంతరాళాలలో గూడుకట్టుకున్న స్తబ్ద గొంతుకలన్నీ చైతన్య స్వరాలుగా మారిపోతాయి. అలాంటి రాటుదేలే సున్నిత స్వభావాన్ని ‘‘అక్షర వంతెన’’ శీర్షికలో ప్రతిభావంతంగా చిత్రిస్తారు కవి సాగర్‌గారు.
‘‘ట్రాఫిక్కులో
పసి పోరడు
రోజుకో దేవుడే/ సూరీడు సాచ్చిగా’ అని అంటారు ‘‘కూడలి’’ కవితలో.
రోడ్లపై బొమ్మలేసి, చిల్లర జీతంతో జీవితం గడుపుకునే బాల కార్మికుడి కళాత్మక హృదయాన్ని అక్షరాల వెలుగులో ఆవిష్కరిస్తారు కవిసాగర్. ఇది మన దేశ సంస్కృతిలో తరతరాలుగా వస్తున్న వారసత్వపు సంప్రదాయ సంపదగా మిగిలిపోయినట్టు అనిపిస్తుంది.
‘‘నా లాంతరు’’ కవితలో వ్యంగ్యాత్మకమైన వాక్యప్రయోగం మనల్ని కట్టిపడేస్తుంది.
‘‘పవర్‌కట్ నుంచి తెగిపడిన
చిమ్మ చీకట్లను చీల్చడానికి
అటక మీద నిద్రపోతున్న
మా లాంతరు బుడ్డీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది’’
ఈ కవితలో పైకి కనిపించని హాస్యస్పోరకమైన వ్యంగ్యోక్తి లీలామాత్రంగా ప్రతిధ్వనిస్తుంది. కవిత్వానికి కావల్సిన విరుపుమెరుపులా మెరిసి మాయమైపోతుంది. ఈ తరహా వాక్యాలు పాఠకుల మెదళ్ళకు పదునుపెట్టి ఆలోచింపజేస్తాయి.
ఇలా ఈ కవితా సంపుటి నిండా కవితాత్మక వాక్య నిర్మాణానికి కోకొల్లలుగా కనిపిస్తాయి. ‘‘నిశ్శబ్దంగా/రాలిపడిన కొన్ని జ్ఞాపకాలు/ గుండెను తడి చేస్తుంటాయి’’, ‘‘వౌనం నా నరాల్లో ప్రవహిస్తుంది/ మాటల కొమ్మకు వేలాడుతూ’’, ‘‘విచారాన్ని వంట్లో నింపుకొని/ కాగితంపై ఇంకు చుక్కలా రాలుతుంటాను.’’, ‘‘నువ్వు వెళ్ళే దారిలో/ మనసు పరిచి ఉంచా’’, ‘‘సంఘర్షణలను అక్షరాల్లో కుక్కి/ పదంగా మార్చి అభిషేకం చేశాను’’, ‘‘కటిక చీకట్లు నన్ను కమ్మినప్పుడు/ నీ ఊహల కాగడాలు నా ఆలోచనలను చీల్చుతూ/ నడిపిస్తూనే ఉన్నాయి’’, ‘‘చితి ఎక్కబోతున్న ప్రతి ప్రేమికుడి కళ్ళల్లో/ రేపటి బతుకుపై ఆశనుచూడాలని వుంది’’, ‘‘అక్షరం నా నుంచి విడిపోయింది’’, ‘‘ముక్కలైన హృదయం/ జారిపడిన జ్ఞాపకాలు/ గుక్కపట్టి ఏడుస్తున్నాయి’’వంటి వాక్యాలు కవితాత్మకంగా సున్నితంగా మనసులను తడుముతాయి. స్ర్తిలకు సంబంధించిన కవితలు ఈ సంపటిలో చాలా ఎక్కువగానే దర్శనమిస్తాయి. ‘‘్ఫస్టు’’లాంటి కవిత ప్రాథమిక దశలో అంత్యప్రాసలతో రాసినది. ఈ పుస్తకంలో వెయ్యకూడదగినదిగా అనిపించక మానదు. మంచి కవితాత్మక శైలితో సామాజిక స్పృహను మెండుగా ప్రతిబింబించే ఈ ‘‘కొన్ని రాత్రులు’’ సంపుటి బాధతో, వేదనతో రగిలిపోయేవారికి ఎప్పటికీ ‘నిద్రలేని రాత్రుల’నే మిగుల్చుతుంది. ఇది తొలి ప్రయత్నమే అయినా, సారవంతమైన చిక్కటి కవిత్వాన్ని అందించిన కవి పుష్యమీసాగర్ గారిని మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేం!

- మానాపురం రాజా చంద్రశేఖర్