ఆటాపోటీ

ముదురుతున్న సంక్షోభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అవినీతి ఊబిలో కూరుకుపోయి అల్లాడుతున్నది. తీగ లాగితే డొంక కదిలిన రీతిలో ఒక్కొక్కరిగా బయటపడుతున్న అవినీతిపరుల జాబితా రోజురోజుకూ పెరుగుతున్నది. అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షులు చుంగ్ మాంగ్ జూన్, మైఖేల్ ప్లాటినీ, ప్రధాన కార్యదర్శి జేరోమ్ వాల్కేపై ఇప్పటికే అవినీతి ఆరోపణల నేపథ్యంలో వేటు పడింది. ఫిఫా ఆధ్వర్యంలోని ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు బ్లాటర్, ప్లాటినీలను ట్రిబ్యునల్ మూడేసి నెలలు సస్పెండ్ చేయడం సమస్య తీవ్రతను పెంచింది. అదే సమయంలో చుంగ్ మాంగ్ జూన్‌ను ఆరు సంవత్సరాలు నిషేధించింది. మొదట్లో బ్లాటర్‌కు అత్యంత సన్నిహితుడిగా ప్లాటినీ ముద్ర పడ్డాడు. చుంగ్ మాంగ్ జూన్ కూడా అతని సహచరుడే. కానీ, హఠాత్తుగా వీరంతా ఎవరికివారే అన్న చందంగా వ్యవహరించడం ఆరంభమైంది. ముడుపులు స్వీకరించి, కతార్, రష్యా దేశాలకు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించే అవకాశాన్ని కట్టబెట్టారన్న ఆరోపణలు చాలాకాలంగా ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లాబీయింగ్ కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అమెరికా తీరా హక్కులు లభించకపోయేసరికి ఫిఫా భరతం పట్టేందుకు సిద్ధమైంది. కేసును నిఘా విభాగానికి అప్పగించింది. తక్షణమే రంగంలోకి దిగిన అమెరికా నిఘా విభాగం కొంత మందిని దోషులుగా పేర్కొంటూ ప్రాథమిక జాబితాను తయారు చేసింది. ఈ విభాగం సూచనల మేరకే జ్యూరిచ్ అధికారులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఫిఫా సీనియర్ ఉపాధ్యక్షుల నుంచి ప్రధాన కార్యాలయంలో పని చేసే అధికారుల వరకు పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు. ఫిఫాపై ఐరోపా దేశాల పెత్తనం పెరిగిపోతున్నదన్న ఆగ్రహం కూడా తోడుకావడంతో ముడుపుల వ్యవహారాన్ని ఫిఫా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన బ్లాటర్‌పై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా ఎన్నికైన కొన్ని రోజుల్లోనే అతను తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా, అప్పటి వరకూ తాను పదవిలో కొనసాగాలని అనుకున్నాడు. అదే సమయంలో, బ్లాటర్‌కు ఒకప్పుడు నమ్మిన బంటు, యూఫా అధ్యక్షుడు ప్లాటినీ, దక్షిణ కొరియా వ్యాపార దిగ్గజం చుంగ్ మాంగ్ జూన్ అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్టు ప్రకటించారు. అవినీతి ఆరోపణలపై బ్లాటర్‌తోపాటు వీరిపైనా వేటు పడడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయం కంటే, దాదాపు అన్ని కానె్ఫడరేషన్లలోనూ అవినీతిపరులు ఉన్నారని అమెరికా దశల వారీగా విడుదల చేస్తున్న జాబితాలతో స్పష్టం కావడం అందరినీ ఉత్కంఠకు గురిచేస్తున్నది. ఎప్పుడు ఎవరి పేరు తెరపైకి వస్తుందో? ఎవరు అరెస్టవుతారో? అన్న ప్రశ్నలు ఇప్పుడు సాకర్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
లాబీయింగ్‌లో ముడుపులు
వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలు, నిబంధనల ప్రకారం ఒలింపిక్స్, ప్రపంచ సాకర్ చాంపియన్‌షిప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని దక్కించుకోవడానికి లాబీయింగ్ చేయడం తప్పుకాదు. సభ్య దేశాల అధికారులు, ప్రతినిధులతో చర్చలు జరపడం, వారి మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నించడం చట్టబద్ధమే. అయితే, ఎవరికీ ముడుపులు ఇవ్వకూడదు. డబ్బుతో సంబంధం లేకుండా ప్రచారం చేసుకోవచ్చు. అయితే, ప్రపంచ కప్ పోటీలకు కతార్, రష్యా దేశాలతో పోటీపడిన స్పెయిన్, అమెరికా తదితర దేశాలు శక్తివంచన లేకుండా లాబీయింగ్ చేశాయి. అయితే, 2018లో కతార్‌కు, 2022లో రష్యాకు వరల్డ్ కప్ నిర్వాహణ హక్కులను ధారాదత్తం చేస్తూ ఫిఫా సర్వసభ్య సమావేశం తీర్మానాలను ఆమోదించడంతో ముమ్మర లాబీయింగ్ చేసిన దేశాలన్నీ కంగుతిన్నాయి. భారీగానే ముడుపులు చెల్లించుకున్నప్పటికీ, అలాంటిదేమీ లేదంటూ స్పెయిన్ తప్పించుకుంది. ముడుపులు తీసుకోవడమేకాదు... ఇవ్వడం కూడా నేరమే అవుతుంది కాబట్టి కొత్త సమస్యలను కొనితెచ్చుకోవడం ఎందుకున్న ఉద్దేశంతో వౌనంగా ఉండిపోయింది. అయితే, అమెరికా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముడుపులు తీసుకొని మరీ నిలువునా ముంచేశారంటూ ఫిఫా అధికారులపై మండిపడుతున్నది. అందుకు, ముడుపుల అంశంపై అటోఇటో తేల్చుకోవడానికి సిద్ధమైంది. మొత్తం వ్యవహారాన్ని నిఘా విభాగానికి అప్పగించింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ విభాగం దశల వారీగా పేర్లను ప్రకటిస్తున్న తరుణంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (కాన్‌కకాఫ్) చీఫ్ జేమ్స్ పేరు కొత్తగా జాబితాలో చేరడంతో అతనిని తొలగించారు. ఆ పదవిని ఆల్ఫ్రెడ్ హవిట్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు. కానీ, తాజా జాబితాలో హవిట్ పేరుకూడా చేరింది. ఇక గత్యంతరం లేదనుకున్న కాన్‌కకాఫ్ అసలు అధ్యక్షుడే లేకుండా పాలనా వ్యవహారాలను నడిపించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మే 12న మెక్సికో సిటీలో జరిగే సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గం ఎన్నికయ్యే వరకూ ఎవరినీ తాత్కాలికంగా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టరాదని తీర్మానించింది. ప్రపంచ సాకర్‌లో నెలకొన్న అస్థిరత్వానికి ఇదో నిదర్శనం.
అధికార దుర్వినియోగం!
కతార్, రష్యా దేశాలకు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ నిర్వాహణ బాధ్యతలను అప్పగించడానికి ముడుపులు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బ్లాటర్ లేడు. ఈ కేసులో అతనిపై ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు. అయితే, 2011లో అధ్యక్ష పదవికి నాలుగోసారి అతను పోటీపడినప్పుడు ప్లాటినీ మద్దతు కోరాడు. అందుకు ప్రతిఫలంగా అతనికి ఫిఫా ఖజానా భారీ మొత్తాన్ని చెల్లించినట్టు సాక్ష్యాధారాలున్నాయి. అంతకు ముందు సుమారు దశాబ్దం క్రితం ఫిఫా కాంట్రాక్టును పొందిన ప్లాటినీ అందుకు అనుగుణంగా పనులను పూర్తి చేశాడని పేర్కొంటూ, రెండు మిలియన్ డాలర్లు (సుమారు 13 కోట్ల రూపాయలు) చెల్లించాడు. ఈ మొత్తం ఫిఫా ఖజానా నుంచి ప్లాటినీ ఖాతాలోకి వెళ్లడమే వివాదానికి కారణమైంది. ప్లాటినీని మంచి చేసుకుని, అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకే ఈ చెల్లింపులు జరిపాడన్న ఆరోపణలను బ్లాటర్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై జ్యూరిచ్ అటార్నీ జనరల్ కార్యాలయం విచారణ జరిపింది. ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారించింది. నాలుగోసారి అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే, ఆతర్వాత పోటీ చేయబోనని అప్పట్లో ప్లాటినీకి బ్లాటర్ బహిరంగంగానే హామీ ఇచ్చాడు. తాను ఎన్నికయ్యేందుకు సహకరించాల్సిందిగా కోరాడు. అందుకు ప్రతిఫలంగా తన వారసుడిగా ప్రకటిస్తానని ప్లాటినీకి ప్రతిపాదించాడు. ఇవన్నీ బహిరంగ ప్రకటనలే. అందరికీ తెలిసిన విషయాలే. ఆ క్రమంలో భాగంగానే భారీ మొత్తాన్ని ప్లాటినీకి చెల్లించాడన్నది మాత్రమే తాజా ఆరోపణ. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, సాక్ష్యాధారాలను సేకరించిన జ్యూరిచ్ అటార్నీ జనరల్ కార్యాలయం ఈ ఆరోపణలన్నీ నిజాలేని తన నివేదికలో తేల్చిచెప్పింది. ఆ నివేదికను పరిశీలించిన ఫిఫా ఎథిక్స్ కమిటీ కూడా దాదాపు ఆ అభిప్రాయంతో ఏకీభవించింది. ఫలితంగా బ్లాటర్, ప్లాటినీలపై సస్పెన్షన్ వేటు పడింది.

- బిఎల్‌ఎన్