క్రీడాభూమి

ధోనీ సేనకు తొలి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

=============
టి-20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ను భారత్ నాలుగు పర్యాయాలు ఢీ కొంది. ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2007లో టైటిల్‌ను సాధించినప్పుడు కూడా గ్రూప్ దశలో కివీస్ చేతిలో టీమిండియా ఓడింది. ఇంత వరకూ ఊరిస్తూ వస్తున్న న్యూజిలాండ్‌పై విజయాన్ని భారత్ ఈసారి సాకారం చేసుకోవచ్చు.
=============
నాగపూర్, మార్చి 14: టి-20 వరల్డ్ కప్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా మంగళవారం తొలి పరీక్షను ఎదుర్కోనుంది. న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో విజయభేరి మోగించి, సత్తా చాటాలని భారత్ పట్టుదలతో ఉంది. 2007లో జరిగిన మొదటి టి-20 ప్రపంచ కప్‌ను భారత్‌కు సాధించిపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి జట్టును విజేతగా నిలబెట్టడానికి సర్వశక్తులు ఒడ్డనున్నాడు. ఇటీవల భారత్ టి-20 ఫార్మెట్‌లో అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ 3-0 తేడాతో సొంతం చేసుకుంది. అనంతరం స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో గెల్చుకుంది. బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లను గెల్చుకొని టైటిల్ అందుకుంది. అయితే, వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా జరిగిన రెండు వాప్ మ్యాచ్‌ల్లో ఆడి, ఒక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌ను ఓడించిన ఈ జట్టు రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రాక్టీస్ కోసం ఉద్దేశించిన మ్యాచ్‌లో ఫలితానికి ప్రాధాన్యం లేకపోయినప్పటికీ, ఆ ఓటమితో కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ధోనీ బృందానికి ఏర్పడింది. నిలకడలేమి, కీలక సమయాల్లో తడబాటు వంటి లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందని దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి పాఠాలు నేర్పింది.
అన్ని విభాగాల్లోనూ న్యూజిలాండ్ కంటే భారత్ పటిష్టంగా ఉందన్నది వాస్తవం. వరుసగా ఆరోసారి టి-20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న ధోనీ, ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ తదితరులతో భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఒక రకంగా బ్యాటింగ్ విభాగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ నడుమ, ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలో, ఎవరిని బెంచ్‌కి పరిమితం చేయాలో తేల్చుకోవడానికి ధోనీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కాగా, హార్దిక్ పాండ్య చేరికతో జట్టులో సీమర్ ఆల్‌రౌండర్ లేని లోటు తీరింది. టెయిలెండ్ వరకూ బ్యాటింగ్ సమస్యలులేవు. బౌలింగ్ విభాగానికి వస్తే సీనియర్ ఆశిష్ నెహ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్ వంటి ప్రతిభావంతులున్నారు. హర్భజన్ సింగ్, పవన్ నేగీల్లో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ న్యూజిలాండ్ కంటే బలంగా ఉన్న భారత్ మంగళవారం నాటి మ్యాచ్‌ని గెల్చుకొని, శుభారంభం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
‘యువ’ న్యూజిలాండ్
సూపర్ హీరో బ్రెండన్ మెక్‌కలమ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో ఒక గొప్ప ప్రతిభావంతుడి సేవలను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది యువకులు ఉన్నారు. మెక్‌కలమ్ స్థానంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేన్ విలియమ్‌సన్ సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, గ్రాంట్ ఇలియట్, రాస్ టేలర్, కోరి ఆండర్సన్ బ్యాటింగ్ విభాగంలో కివీస్‌ను బలమైన శక్తిగా నిలబెడుతున్నారు. బౌలింగ్ విభాగానికి వస్తే, ప్రతిభావంతులైన పేసర్ల అండ జట్టుకు ఉంది. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడం మిల్నే తదితరులు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసరనున్నారు. స్థూలంగా చూస్తే, టీమిండియాను ఓడించే శక్తిసామర్థ్యాలు న్యూజిలాండ్‌కు లేకపోయినా గట్టిపోటీనివ్వడం ఖాయం. తనదైన రోజున కివీస్ ఆటగాళ్లు సంచలన విజయాలను నమోదు చేస్తారన్నది చాలా సందర్భాల్లో రుజువైంది. ఈ వాస్తవాన్ని టీమిండియా మరచిపోకూడదు.