Others

వదిన -- ఫ్లాష్‌బ్యాక్ @ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవి మొయ్యప్పన్ 1938లో అల్లిఅర్జున్‌తో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. 1945లో మద్రాస్ శాంధోమ్‌లో ఎవియం స్టూడియో నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా చిత్రాలు నిర్మించారు. 1950లో ‘జీవితం’, ‘సంఘం’, ‘జాతకఫలం’, ‘శ్రీకాళహస్తి మహత్యం’ (1954) చిత్రాల తరువాత 1955లో వీరు నిర్మించిన చిత్రం ‘వదిన’. 9 సెప్టెంబర్ 1955లో విడుదలైంది. ఈ చిత్రానికి కథ సమకూర్చింది జావర్ సీతారామ్. లాయర్‌గా వృత్తి ప్రారంభించి, సినిమాపట్ల అభిరుచితో నటునిగా, దర్శకునిగా, స్క్రిప్ట్ రచయితగా, తమిళ, హిందీ చిత్రాల్లో పేరుపొందిన వ్యక్తి సీతారామ్. 1950లో నాగయ్య హీరోగా నటించిన ‘బీదలపాట్లు’ చిత్రంలో ఇన్‌స్పెక్టర్ జావర్ పాత్రలో పాపులర్ కావటంతో జావర్ సీతారామ్‌గా ప్రసిద్ధి చెందారు. శివాజీగణేషన్ నటించిన ‘వీరపాండ్య కట్టబ్రహ్మన’లో ఆంగ్లేయ ప్రతినిధిగా మరో గుర్తింపు కలిగిన పాత్ర పోషించారు. ఎవియం వారి ‘మూగనోము’ హిందీ వర్షన్ ‘మై చుప్ రహుంగీ’కి బెస్ట్ స్టోరీ రచయితగా ఫిలింఫేర్ అవార్డ్ 1963లో స్వీకరించారు.

మాటలు, పాటలు: తోలేటి వెంకటరెడ్డి
కళ: హెచ్ శాంతారాం
ఛాయాగ్రహణం:
జి ముత్తుస్వామి, యూనప్ మోల్జీ
సంగీతం: ఆర్ సుదర్శనం
ఎడిటింగ్, దర్శకత్వం:
ఎంవి రామన్
నిర్మాత: ఏవి మొయ్యప్పన్.

చిన్నతనంలో తల్లిదండ్రులు గతించటంతో అన్న నరసయ్య (బిఆర్ పంతులు), వదిన శాంతమ్మ (కన్నాంబ)ల వద్ద పెరుగుతాడు రఘు (అక్కినేని). శాంతమ్మ గారాబంవల్ల చెడు సావాసాలకు అలవాటుపడతాడు. రఘుచేసే ఈ సావాసాలు అన్నగారికి తెలియనివ్వదు శాంతమ్మ. పెద్దవాడయిన రఘు జూదగాడిగా, తిరుగుబోతుగా మారతాడు. అదేవూరికి చెందిన లలిత (సావిత్రి)కు సినిమా తార కావాలని కోరిక. ఆమెను సినిమాల్లో నటింపచేస్తానని ఆశపెట్టి రఘు ఆమె ప్రేమను పొందుతాడు. పెళ్ళి చేస్తే రఘుకు బాధ్యత వస్తుందనే ఆశతో శాంతమ్మ, నరసయ్య తన బంధువులమ్మాయి చిట్టి (పండరీబాయి) నిచ్చి రఘుకు వివాహం జరిపిస్తారు. రఘు మారకపోగా, లలితను సినిమాల్లో చేర్చటానికి అన్నగారి కొట్లోనుంచి కొంత సొమ్ము దొంగిలిస్తాడు. అంతేకాక వదినను మాయచేసి ఇల్లు తాకట్టుపెట్టి కొంత డబ్బు తీసుకుని, లలితను, ఆమె అన్న కలికాలం (రేలంగి)ను తీసుకొని కోయంబత్తూరు వెళ్తాడు. లలితకు సినిమా ఛాన్సులు రాకపోవటం, తెచ్చిన డబ్బు ఖర్చయిపోయి రఘు ఇబ్బందుల్లో పడతాడు. ఆ దశలో రఘు స్నేహితుడు సూర్యం (ముస్త్ఫా) కలిసి తన దొంగనోట్ల చలామణిలో రఘును కలుపుకుంటాడు.
రఘు చేసిన దొంగతనం వల్ల నరసయ్య ఉద్యోగం పోతుంది. అప్పుల పాలైన నరసయ్య సాయంకోసం తమ్ముడు రఘువద్దకు వస్తాడు. రఘు అన్నగారికి తనవద్దగల సొమ్ము సాయం చేస్తాడు. అవి దొంగనోట్లని పోలీసులు నరసయ్యను అరెస్ట్‌చేసి, జైలులో పెట్టినా, అతడు తమ్ముని పేరు బయటపెట్టడు. శాంతమ్మ ఈ పరిస్థితులకు దిగులు చెందుతుంది.
చిట్టి మగవాని వేషంలో, భర్త రఘు ఇంటిలో కోయంబత్తూరులో పనికి చేరుతుంది. రఘువల్ల లాభంలేదని తెలిసిన లలిత, డైరెక్టర్ యముడు (గుమ్మడి)తో సాన్నిహిత్యంలో పడుతుంది. వారిద్దరి సంగతి తెలుసుకున్న రఘు డైరెక్టర్‌కు, లలితకు బుద్ధిచెప్పి, పశ్చాత్తాపంతో తన వూరుచేరి భార్యను చేరదీసి మంచివాడుగా మారటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
పిల్లల పెంపకం పట్ల, అమిత గారాబం తగదని, ఆదరించటం, దండించటం సరిగావుంటే వారి భవిష్యత్ బాగుంటుందనే మంచి సందేశంతో రూపొందిన చిత్రం ‘వదిన’.
ప్రతిభ సమర్ధతగల నటీనటులు బిఆర్ పంతులు, కన్నాంబలు శాంత, కరుణ రసాలను తమ నటనలో ఎంతో సహజంగా చూపి అన్నా వదినెలుగా రాణించారు. రఘుగా ఏఎన్నార్, లలితగా సావిత్రి, సన్నివేశానుగుణంగా, పాత్రోచితంగా నటించి పాత్రల వైరుధ్యాన్ని చక్కగా ప్రదర్శించారు. కలికాలంగా రేలంగి లలితను ఆటపట్టిస్తూ హాస్యాన్ని, కొంత సీరియెస్‌నెస్‌తో ఒప్పించగా, సున్నితమైన విలనినీ, తడబాటును డైరెక్టర్‌గా గుమ్మడి చూపారు. చిట్టిగా పండరీబాయి, తోడికోడలు శాంతమ్మపట్ల బాధ్యత, భర్త వైఖరికి విచారం, అతనివద్ద మారువేషంలో ఉంటూ భర్తపై ప్రేమను, అనురాగాన్ని, తడబాటును ఎంతో సున్నితంగా ప్రదర్శించి ఆకట్టుకుంది.
ఎవియం వారి ‘జీవితం’, ‘సంఘం’ చిత్రాల దర్శకులైన ఎంవి రామన్, ఈ చిత్రాన్ని చక్కని సన్నివేశాలతో, సెంటిమెంటుతో రూపొందించారు. తరువాత అక్కినేని హీరోగా నటించిన ‘అతిశయపెణ్’ తమిళ చిత్రానికి, వదిన తమిళ వెర్షన్‌కు కూడా వీరే దర్శకులు. ఇదిలావుంటే, వదిన తమిళ చిత్రం చెళ్ళపిళ్ళైను -సావిత్రి, టిఎస్ బాలయ్య, కెఆర్ రంగస్వామి కాంబినేషన్‌లో ఎవిఎం వారు 1955లో రూపొందించారు.
చిత్ర గీతాలు:
సావిత్రి, రేలంగిలపై చిత్రీకరించిన స్టేజి నాటక గీతం -ఆనందం ఇందేగలదిటు చూడండి/ ఇదిగో చూడండి (పి.సుశీల, మాధవపెద్ది). సావిత్రిని ఆటపట్టిస్తూ రేలంగి పాడే గీతం -నడకలో తిప్పులొద్దంటా స్నాన మాడేవేళ పాటలు పాడవద్దంటా (మాధవపెద్ది). తాను సినిమా స్టారు అవ్వాలని ఆశిస్తూ సావిత్రి హుషారుగా పాడే గీతం -ఓ టింగురంగారు, రంగు బంగారు స్టారౌదునే షోకిల్లారాణి నేనే సినిమాస్టార్ అవుదునే’ (పి.సుశీల). రేలంగి, సావిత్రిలపై చిత్రీకరించిన మరో స్టేజి నృత్య నాటిక గీతం -దేశం మెలిగే తీరులలో దారితెన్నూ తెలియదోయ్ (పి.సుశీల, మాధవపెద్ది). తనపై అలిగిన సావిత్రిని బుజ్జగిస్తూ అక్కినేని ఆమెతోపాడే ప్రణయ గీతం -నవ్వితే నవరత్నాలు రవ్వలురాలే జవ్వనీ నా మనోరాణి (ఘంటసాల). రేలంగిపై చిత్రీకరించిన గీతం -వెయ్యాలోయ్, టోపీ వెయ్యాలోయ్ మనం ధనం ఘనం (మాధవపెద్ది). పండరీబాయి భర్త ఇంటిలో మగవేషంలో అతనికి సేవలుచేస్తూ పాడే గీతం -నా భాగ్యతరువే విరబూచునా, నా నాధుని సేవాదొరుకునా. అక్కినేనిపై అతని మానసిక స్థితిని విశే్లషిస్తూ వచ్చే నేపథ్య గీతం -ఎంచి చూడరాయోచించి చూడరా మంచిదేదో చెడుగదేదో (ఘంటసాల). -వచ్చునే హై మంచిరోజులు వచ్చునే సినిమా ఛాన్స్, మరో గీతం -అంతా లల్లిమయం ఊరంతా లల్లిమయం’.. సావిత్రిపై చిత్రీకరణ. మరో గీతం -జగమే సుఖ సంయోగమా మనకే వియోగమా (ఎ.ఎం.రాజా). ఈ చిత్రంలోని క్లైమాక్స్ ముందువచ్చే గీతం, గుమ్మడి గిటార్ వాయిస్తుండగా, సావిత్రి అతని ముందు నృత్యంచేస్తూ పాడటం, మధ్యలో ఏఎన్నార్ వచ్చి తుపాకీతో వారిద్దరిని బెదిరిస్తూ, మధ్యలో ఆమెను నిందిస్తూ పలికే మాటలతో ముగ్గురిపైనా సీరియెస్‌నెస్ తమాషా కలబోసి వైవిధ్యంగా చిత్రీకరించిన గీతం -నేడే ఈనాడే వలరేడా రావో తళుకుగని చెళుకు గని.. మధ్యలో -చిన్నదాన నోయి వనె్నదాననోయి, సతతం నవ వసంతకాలం రాదోయి, రాదోయి (గానం పి సుశీల). ఈ చరణానికి స్పీడ్‌గా సావిత్రి నృత్యం, సంగీతం సాగటం విశేషం.
‘వదిన’ చిత్రం చక్కని సందేశంతో, యువతకు ఆదర్శంగా రూపొందింది. కానీ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోయింది. అక్కినేని, సావిత్రి నెగెటివ్ టచ్‌వున్న పాత్రలు పోషించటం ‘వదిన’ చిత్ర విశేషంగా లెక్కించాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి