Others

జయంమనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణ సంస్థ:
రాజశ్రీ పిక్చర్స్
రచన:
ముద్దుకృష్ణ
సంగీతం:
ఘంటసాల
ఛాయాగ్రహణం:
కమల్‌ఘోష్
దర్శకుడు:
తాతినేని ప్రకాశరావు
--

నిరుపేదలు, అసహాయులకు జరిగే అన్యాయాలను ఎదిరించే పాత్ర రాబిన్‌హుడ్. అతని వీరోచిత గాథలు జన బాహుళ్యంలో పేరొందాయి. వాటి ఆధారంగా పలు ఇంగ్లీషు చిత్రాలు నిర్మించారు. ఆ స్ఫూర్తితో 1951లో అమియా చక్రవర్తి దర్శకత్వంలో బ్లాక్ అండ్ వైట్‌లో హిందీలో నిర్మించిన చిత్రం -బాదల్. ప్రేమనాథ్, మధుబాల జంటగా నటించారు. సంగీతం శంకర్ జైకిషన్.
చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూటర్స్, రాజశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ వంటి పంపిణీ సంస్థలలో ప్రధాన పాత్ర వహించిన సుందర్‌లాల్ నహతా, తారాచంద్ బర్జాత్యాతో కలిసి రాజశ్రీ పిక్చర్స్ నెలకొల్పారు. బాదల్ చిత్రం ఆధారంగా 1956లో వీరు నిర్మించిన జానపద చిత్రమే -జయం మనదే. ప్రముఖ దర్శకులు ఎల్‌వి ప్రసాద్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి, తొలిసారి పల్లెటూరు (1952) చిత్రానికి దర్శకత్వం వహించిన తాతినేని ప్రకాశరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాతినేని ప్రకాశరావు ఆ తరువాత తెలుగు చిత్రాలకు, తమిళ చిత్రాలకు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుపొందారు. అటుపైన నిర్మాతగా మైనర్‌బాబు, ఆశాజ్యోతి, గంగాభవాని రూపొందించారు.

--

మహరాజు గుమ్మడికి సామంతరాజు మహీపతి (సిఎస్‌ఆర్). వారి సేనాధిపతి ప్రచండుడు (ఆర్ నాగేశ్వరరావు). ప్రజలను బాధించి, దౌర్జన్యంగా అధిక శిస్తులు వసూలు చేస్తుంటాడు. అతని దురాగతానికి మాజీ సైనికుడు, వృద్ధుడు రోశయ్య (పెరుమాళ్ళు) మరణిస్తాడు. రోశయ్య కుమారుడు ప్రతాప్ (ఎన్టీ రామారావు). అతని స్నేహితుడు జోగులు (రేలంగి). జోగులు చెల్లెలి (మల్లిక) సాయంతో ప్రచండుడిపైనా, మహీపతిపైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రచండుడు, మహీపతి కుమార్తె శోభ (అంజలిదేవి)ను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. జోగులు శోభను బంధించగా, విడిపించి ప్రదీప్‌గా పరిచయమైన తరువాత ప్రతాప్, శోభ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మారువేషంలో ప్రజలను కాపాడుతున్న ప్రతాప్ ఒక గుహలో యువకులకు స్వీయ రక్షణ, యుద్ధవిద్యలు నేర్పుతూ, అనాధలను ఆదరిస్తుంటాడు. మహరాజుకు, ప్రతాప్ తిరుగుబాటుదారుడని, అతన్ని శిక్షించాలని మహీపతి వర్తమానం పంపుతాడు. ప్రచండుడు ప్రతాప్‌ను బంధించగా, శోభ అతని నుంచి తప్పిస్తుంది. మహరాజు మారువేషంలో బయలుదేరి ప్రతాప్ స్థావరం చేరి జరుగుతున్న అక్రమాలను, ప్రచండుడి కుట్ర తెలుసుకుంటాడు. ప్రతాప్‌ను మరోసారి బంధించిన ప్రచండుడు, అతనికి ఉరిశిక్ష అమలు చేయనుండగా, ప్రజలు, ప్రతాప్ అనుచరులు, రాజధానికి చేరి తిరుగుబాటు చేస్తారు. ప్రచండుని కుతంత్రాలు బట్టయలవడంతో మహరాజు అతన్ని శిక్షించి, ప్రతాప్‌కు రాజ్యభారం అప్పగించి వీర వనిత శోభతో వివాహం జరపటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ప్రతాప్‌గా ఎన్టీఆర్ నీతి, నిజాయితీ, కష్టాలు, బాధలు కలిగిన సామాన్య యువకునిగా, ప్రజాక్షేమంకోరి ప్రచండుని, మహీపతిని ఎదిరించిన విప్లవవీరునిగా కనిపిస్తాడు. వివేకం, శౌర్యం, సాహసం కలిగిన దేశభక్తునిగా, దేవుడు, మహరాజు పట్ల విశ్వాసం, శోభకు ప్రియునిగా ఉల్లాసాన్ని, ప్రణయాన్ని రమ్యంగా ప్రదర్శించి పలు విధాలైన నటనతో అలరించారు.
శోభగా అంజలిదేవి.. ప్రతాప్‌ను ప్రదీప్‌గా భావించి ప్రేమించటం, నిజం తెలిశాక విచారం, తరువాత అతని పోరాటంలోని నిజాయితి గుర్తించి తండ్రికి వ్యతిరేకంగా ప్రతాప్‌కు సాయపడటం, ముసుగు మనిషిగా మంచికోసం, దేశంకోసం పాటుపడుతూ ప్రజలకు కర్తవ్యం బోధించి తిరుగుబాటుకు సిద్ధంచేయటం, ప్రచండుని కర్కశత్వానికి తలవొగ్గినట్టు నటించి తిరిగి ఎదిరించటం, ప్రేయసిగా, సాహసిగా సందర్భోచిత నటన చూపారు. విలనినీ, ప్రతాప్‌తో కత్తియుద్ధాల్లో చురుకుతనం, శోభతో ప్రణయంలో బేలతనం, మరోపక్క కరుకుదనం చూపుతూ మోసం, దౌర్జన్యం లక్షణాల ప్రదర్శించిన నటనతో ఆర్ నాగేశ్వర రావు ఆకట్టుకున్నారు. ప్రతాప్ పట్ల ప్రేమ, ఆరాధన, ఆత్మాభిమానంగల యువతిగా జానకి మెప్పించింది.
దర్శకులు తాతినేని ప్రకాశరావు మంచి పట్టుతో సన్నివేశాలను రూపొందించి అర్థవంతంగా చిత్రీకరించారు. తరువాత వచ్చిన పలు జానపద చిత్రాలకు ఈ చిత్రం మార్గదర్శకంగా ఉండేలా తీర్చిదిద్దటం విశేషం. అధిక శిస్తుల భారం.. ప్రజాజీవనం సంక్షోభం.. ఆరుబయట కొండ గుహలో సైనిక శిక్షణ.. మహరాజును, శోభను, ప్రచండుని గుహలో బంధించటం.. రాజభవనం, తోటలో ప్రతాప్, రాకుమారి శోభల ప్రణయం.. ప్రచండుని, ప్రతాప్, శోభల టీజింగ్ సాంగ్ పలు వైవిధ్యాలను చూపటం ప్రశంసనీయం.
చిత్ర గీతాలు:
ప్రతాప్ తండ్రి మరణించాక విషాదంతో వస్తుంటే, మల్లిక పాత్రధారి జానకి పాడే ఓదార్పు, సందేశంతో కూడిన గీతం -వినవోయి బాటసారి కనవోయి ముందుదారి (జిక్కి- కొసరాజు). కొండ గుహలో వీర యువకులు, యువతులు పాడే ఉత్సాహభరిత గీతం -వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి రండయా (గానం-జిక్కి, పిఠాపురం బృందం- రచన కొసరాజు). కాగడాలతో, డ్రమ్ములతో వైవిధ్యభరితంగా నృత్యం చేయటం అద్భుత సన్నివేశంగా తోస్తుంది. కెయస్ రెడ్డి, రీటా, బాల రేలంగి ప్రభృతులు కన్పిస్తారు. శోభ (అంజలిదేవి) ప్రతాప్‌ను తలపోస్తూ తన మదిలో అతని అందం, మాటతీరు గురించి పాడే గీతం, (అంజలి ఆహ్లాదభతమైన అభినయంతో) -మరువజాలని, మనసు తాళని మధురభావన లేవో నాలోమెదలసాగె నిదేలో (లీల- సముద్రాల సీనియర్). ప్రదీపే ప్రతాప్ అని తెలుసుకుని, తాను మోసపోయానని తలంచి విషాదంతో శోభ (అంజలీదేవి) పాడే గీతం -ఎంత మోసపోతినే అంతుతెలియలేకనే (లీల- సముద్రాల సీనియర్). ఎన్టీఆర్, అంజలీదేవిని గుర్రంబండిలో నగరానికి తీసుకెళ్తుండగా, దారిలో పచ్చని పొలాలు, ప్రకృతి ఆకాశం చూపుతూ హుషారుగా సాగే గీతం -దేశభక్తిగల అయ్యల్లారా, జాలిగుండెగల అమ్మల్లారా ఆలోచించండి, న్యాయం ఆలోచించండి (ఘంటసాల- కొసరాజు). ఎన్టీ రామారావు, అంజలీదేవి కోసం తోటలోకి వచ్చి సితార వాయిస్తూ పాడే మధుర గీతం (ఈ పాట మొదలవగానే మ్యూజిక్ వస్తున్నపుడు అంజజీదేవి అలంకరణ, పాట చరణాలు పూర్తయ్యేసరికి అలంకరణతో శోభ ప్రతాప్ వద్దకు రావటాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించారు) -ఓ చందమామ, అందాల భామా ఎందున్నదో పల్కుమా (ఘంటసాల- పి లీల, హమ్మింగ్- ముద్దుకృష్ణ). మనోల్లాసాన్ని కలిగించే చిరస్మరణీయ గీతం. ఇక -శోభ ప్రియునికోసం ఎదురుచూస్తూ రాత్రిపూట చంద్రుని, తోటలో కలువలను చూపుతూ చిత్రీకరించిన గీతం -కలువల రాజా నాకథ వినవా కదిలే మదిలో నిరాశ (పి లీల-జంపన). తోటలో శోభ, ప్రతాప్‌లు (అంజలి, ఎన్టీఆర్ నృత్యంతో) ప్రచండుని ఆటపట్టిస్తూ అతని కళ్ళకు గంతలుకట్టి పాడే తమాషా గీతం చూడచక్కని చుక్క చురుకు చూపులెందుకే (ఘంటసాల, జిక్కి- సదాశివబ్రహ్మం). ప్రతాప్‌ను బంధించగా అతని కోసం జోగులు, ఒక బాలునిపై చిత్రీకరించిన గీతం, అంజలీదేవి అంతఃపురం నుంచి జవాబు చెప్పటం -చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచెవనె్నల రామచిలకా (మాధవపెద్ది, జిక్కి-కొసరాజు). ప్రతాప్ శిక్షణ ఇచ్చిన సైనికులు గుహలో ఆరుబయట, ఆనందంతో పాడే ఉత్సాహ భరిత ఉద్దీపన గీతం చెప్పుకోతగ్గది. గుమ్మడి గుర్రంపై వస్తుండగా కొండలు, కోనలు చూపుతూ సాగుతుంది. రేలంగి, రీటా మొదలైనవారు నృత్యం, చప్పట్లతో సాగుతుంది. -వస్తుందోయి, వస్తుంది కారే పేదల చెమట ఏరులైపారే రోజు వస్తుంది/ ఈ చెమటే రేపింతై, అంతై, తీరి చూడ తుఫాను రూపంలో ధూమధాములలో ప్రపంచాన్ని కబళించే రోజు. విప్లవాలకి, కార్మికులకు స్ఫూర్తిగా నిలిచి పేరుపొందిన గీతం. శ్రమజీవుల కష్టానికి విలువ నందించిన గీతంగా ఇది ప్రాచుర్యం పొందింది. (ఘంటసాల, జిక్కి బృందం- రచన కొసరాజు).
జయం మనదే చిత్రం జనరంజకంగా రూపొందింది. విజయం సాధించి శత దినోత్సవాలు జరుపుకుంది. ఈ చిత్రంలో ఘంటసాల గానంతో, స్వరాలతో అలరించిన గీతాలు నేటికీ శ్రోతలను పరవశింప చేస్తున్నాయి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి