Others

ఇల్లరికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: సదాశివబ్రహ్మం
మాటలు: ఆరుద్ర
పాటలు: కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర,
ఫొటోగ్రఫీ: వినె్సంటు
ఎడిటింగ్: ఎ సంజీవి
కళ: కృష్ణారావు, సుబ్బారావు
నృత్యం: హీరాలాల్, పసుమర్తి,
అసోసియేట్ దర్శకులు:
ప్రత్యగాత్మ, కోగంటి
సహాయ దర్శకులు:
తాతినేని రామారావు
దర్శకత్వం: టి ప్రకాశరావు
నిర్మాత: ఏవి సుబ్బారావు.
***
కృష్ణా జిల్లా పునాదిపాడులో జన్మించిన అనుమోలు వెంకట సుబ్బారావు ఇంటర్ విద్య అనంతరం మద్రాసు వెళ్ళారు. అక్కడ విజయ రాఘవాచారి రోడ్‌లో రిపబ్లిక్ గార్డెన్స్‌లో మకాం చేశారు. మహానటులు ఎన్టీ రామారావు, దర్శకులు తాతినేని ప్రకాశరావు ఆ ప్రాంతంలోనే ఉండటంతో, తాతినేని ప్రోత్సాహంతో సొంత నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించారు. అక్కినేని హీరోగా, ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘పెంపుడుకొడుకు’ చిత్రం తీయాలని సంకల్పించి అక్కినేనికి అడ్వాన్స్ ఇచ్చారు. కాని ఆ కథ నచ్చక అక్కినేని, ఆ చిత్రంలో నటించనని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. ‘శివాజీ గణేశన్’ హీరోగా ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళ భాషల్లో (పెంపుడుకొడుకు, పెట్రమనమ్)గా నిర్మించిన చిత్రాలు పరాజయం పొందాయి. రెండో ప్రయత్నంగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తమిళంలో శివాజీగణేశన్ (హీరోగా, విలన్‌గా) నటించి విజయం సాధించిన ‘ఉత్తమ పుత్రన్’ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి లాభాలు సాధించారు. 3వ చిత్రంగా ఈ సంస్థ రూపొందించిన చిత్రం ‘ఇల్లరికం’ మే 1, 1959లో విడుదలైంది. తాతినేని ప్రకాశరావు నిర్దేశకత్వంలో నిరుపేదలు (1954)లో జంటగా నటించిన అక్కినేని, జమున మరోసారి జతగా ఇందులో నటించారు.
***
తల్లిదండ్రులు గతించడంతో మేనమామ ధర్మయ్య (రమణారెడ్డి) వద్ద పెరిగిన బుద్ధిమంతుడు, తెలివైనవాడు వేణు (అక్కినేని). అతని చెల్లెలు కనకదుర్గ (గిరిజ). దుర్గకు వయసుమీరిన వానికిచ్చి పెళ్ళి చేయాలని మేనమామ నిశ్చయించగా, భరించలేక ఆత్మహత్యకు పాల్పడాలని దుర్గ ఇల్లు వదిలి వెళ్తుంది. కాలేజీలో వేణు సహద్యాయి, జమీందారు అమ్మాయి రాధ (జమున) వేణును ఇష్టపడి ప్రేమిస్తుంది. జమీందారు (గుమ్మడి) అతని భార్య సుందరమ్మ, రాధకు తమ అంతస్తుకు తగిన వాడితో పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకుంటారు. రాధ ఇష్టపడిన వేణుతో సుందరమ్మ అభీష్టానికి వ్యతిరేకంగా వారిరువురి వివాహం జరుగుతుంది. తన అన్న వరుసైన గోవిందయ్య (సియస్‌ఆర్), కొడుకు శేషగిరి (ఆర్ నాగేశ్వరరావు)లతో కలిసి సుందరమ్మ రాధ, వేణుల మధ్య కలతలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అనుకోకుండా ఒక నాటక ప్రదర్శనలో చెల్లెలు దుర్గను కలిసిన వేణు ఆమెకు సాయం చేయటం, ఈ విషయం రాధకు చెప్పకపోవటం, శేషగిరే దుర్గను పెళ్ళి చేసుకుని ఆమెను వదిలి వెళ్ళాడని తెలియటం, ఇలా పలు అనుమానాలు, అపార్థాలు రాధ, వేణుల మధ్య తలెత్తటం, తండ్రితో రాధ ఆస్తి వ్రాయించుకోవటం, తిరిగి ఆస్తి వేణు పేర వ్రాసి జమీందారు మరణించటం, ఆపై పలు సంఘటనల తరువాత అపార్థాలు తొలగి అంతా ఏకం కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో పేకేటి శివరామ్, బాల, రామకోటి, బొడ్డపాటి, రమాదేవి, అల్లురామలింగయ్య, టిజి కమలాదేవి, ఇల్లరికపుటల్లుడు బ్రహ్మానందంగా రేలంగి నటించారు.
వేణుగా అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్ర స్వరూప స్వభావాలకు తగ్గట్టు నటనతో జీవంపోసి మెప్పించారు. ప్రియునిగా, అల్లరి భర్తగా అనురాగం, ఆప్యాయత, పౌరుషంగల వ్యక్తిగా ఆత్మగౌరవం నిలబెట్టుకోవటం, న్యాయం, ధర్మంకోసం కార్మికుల తరఫున మేనేజర్‌ను ఎదిరించటం, చెల్లెలిపట్ల వాత్సల్యం, మామగారిపట్ల, వారి మాటపట్ల అణుకువ, అనుకోని పరిస్థితులకు ఏమాత్రం చలించని ధీరతతో అలరించారు.
ఇక రాధగా జమున అతిశయం, అనురాగం, ‘బంగారంకన్నా భర్త మనసే విలువ’ అని భావించటం, ఆ భర్త పరస్ర్తిలోలుడని, వ్యసనపరుడని అనుమానించి అవమానించటం, వెంటనే విచారించటం, ఆత్మాభిమానం మాటున అనురాగం, నిజం తెలిసి పశ్చాత్తాపం సన్నివేశాల్లో పరిణితిగల నటన చూపారు.
దర్శకులు టి ప్రకాశరావు సన్నివేశాలను రసవంతంగా, మంచి బిగువుతో కొంత హాస్యం, సంయమనంతో వైవిధ్యంగా తీర్చిదిద్దారు. తొలుత కాలేజీ నృత్య గీతంలో వేణు, రాధల నృత్యం, మహాబలిపురం వద్ద బృంద గీతం, చివరి ఫైటు చిత్రీకరణ, రాధను వేణు టీజ్ చేస్తూ పాడే గీతం ‘నిలువవే వాలుకనుల దానా’ (కొసరాజు- ఘంటసాల) లాంటివి దర్శకుని ప్రతిభకు అద్దంపడతాయి. మొదట అక్కినేని అపార్థాలుగల భార్యాభర్తల మధ్య టీజింగ్ సాంగ్ ఏమిటని, ఇటువంటి డాన్స్‌కు తాను అభినయిస్తే ప్రేక్షకులకు అంతగా నచ్చదని, పాట వద్దన్నారు. కానీ రచయిత కొసరాజు, దర్శకులు ప్రకాశరావు నచ్చచెప్పటం, ఆ సాంగ్ హిట్ కావటం ప్రేక్షకాదరణ పొందటం, అక్కినేని అన్నపూర్ణకు నచ్చటం జరిగింది. సన్నివేశాల్లో రాధ ఇంటి నౌకరు వేణును గౌరవించక సిగరెట్ కాల్చటం, వేణు అది గమనించనట్టు వెళ్ళి హాలులో ఫోన్ డయల్ చేస్తుండగా అక్కడకు గుమ్మడి రావడంతో నౌకరు సర్దుకొని నిలబడటం, వెంటనే ఏఎన్నార్ వచ్చి నౌకరును కొట్టడం.. అలాగే, శేషగిరి ఫోటోను పోలీసులకు అప్పచెబుతానన్న బాకీదారునికి దుర్గ తన తాళి ఇచ్చి ఫొటో తీసుకోవటంలాంటి సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
రాధ, వేణు భోజనం చేస్తుండగా కార్మికులు తరఫున మాట్లాడి తన ఆస్తి నష్టం చేశావని నిందిస్తూ ‘అన్నం ఎలా సహిస్తుంది’ అని అనటం, వేణు శాంతంగా ‘ఈ అవమానానికి నేను నిన్ను క్షమించినా, ఆ దైవం క్షమించడని అనడం లాంటి సన్నివేశాలు ఇల్లరికపు అల్లుళ్ళ పరిస్థితికి కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ‘ఆస్తితో ఏ భార్యా భర్తను ఆకట్టుకోలేదు’ లాంటి సన్నివేశాలకు తగిన సంభాషణలతో ఆరుద్ర మురిపించటం విశేషం.
టి చలపతిరావు సంగీతంతో వీనుల విందైన గీతాలు ‘ఇల్లరికం’ చిత్ర విజయానికి తగినంతగా సమకూరాయి. తొలుత అక్కినేని, జమునల నృత్య గీతం ‘అడిగిన దానికి చెప్పి’ (ఘంటసాల, పి.సుశీల- కొసరాజు). మరో గీతం -నిలువవే వాలుకనులదానా’ (ఘంటసాల, కొసరాజు). టైటిల్ సాంగ్‌లో ఇల్లరికపు అల్లుళ్ల గూర్చి హాస్యంగా నిజాలు చెబుతూ రేలంగి, బాల, పేకేటి తదితరులపై (మాధవపెద్ది-కొసరాజు) చిత్రీకరించారు. గిరిజపై చిత్రీకరించిన నృత్య గీతం ‘మధు పాత్ర నింపపోయి’ (జిక్కి బృందం- ఆరుద్ర), అక్కినేని, జమున, రేలంగి బృందంపై చిత్రీకరించిన గీతం ‘చేతులు కలిసిన చప్పట్లు’ (ఘంటసాల, సుశీల, మాధవపెద్ది బృందం- ఆరుద్ర). ఈ చిత్రంలోని మరో హిట్‌సాంగ్ ‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా’ (పి సుశీల- ఘంటసాల, ఆరుద్ర). అక్కినేని జమునను ఉడికిస్తూ పాడే గీతం ‘ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్’ (ఘంటసాల- శ్రీశ్రీ) ‘తుమ్ సా నహి దేఖా’ చిత్రం టైటిల్ సాంగ్ ఆధారంగా ట్యూన్ చేయటం విశేషం. ‘ఇల్లరికం’ చిత్రం రజితోత్సవాలు, శత దినోత్సవాలు జరుపుకుని విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్సే కన్నడంలో జయలలిత, కల్యాణ్‌కుమార్‌లతో ‘మళేఅళియ’గా, తమిళంలో ‘మాడివీట్టు మా పిళ్లై’ మలయాళంలో ప్రేమ, నజీర్‌షీలాతో ‘కవితోళన్’గా నిర్మించారు. హిందీలో ‘ససురాల్’గా ఎల్‌వి ప్రసాద్ నిర్మించటం, అన్ని భాషల్లో ఈ చిత్రం సక్సెస్ కావటం, కుటుంబ కథాచిత్రాల ప్రాముఖ్యం తెలియచేసింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి