ఫ్లాష్ బ్యాక్ @ 50

గొల్లభామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీర్జాపురం జమిందారు, వారు తమ సతీమణి, నటి, గాయని, నిర్మాత అయిన సి.కృష్ణవేణి, ప్రముఖ నటులు కె.రఘురామయ్యల కాంబినేషన్‌తో 1947లో రూపొందించిన చిత్రం ‘గొల్లభామ’. మధుర సుబ్బన్న దీక్షితులు తెలుగులో వ్రాసిన కాశీమజిలీ కథలు ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. తొలుత ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరిపి, కారణాంతరాలవలన దాన్ని పక్కకు తీసిపెట్టి, తిరిగి మొత్తం చిత్రాన్ని సి.పుల్లయ్య దర్శకత్వంలో పూర్తిచేశారు నిర్మాత రాజావారు. 22-02-1947 విడుదల.
1895లో కాకినాడలో జన్మించిన చిత్తజల్లు పుల్లయ్య సినిమాల పట్లమక్కువతో మద్రాస్, ముంబాయి, కలకత్తా పలు చోట్ల సినిమా కంపెనీలో అనుభవం సంపాదించారు. కలకత్తాలో ఈస్టిండియా కంపెనీ అధినేత బి.సి.కేంఖర్ కొన్ని బెంగాలు చిత్రాలు నిర్మించిన తరువాత నిర్మించిన తెలుగు చిత్రం సావిత్రి (1933)కు పుల్లయ్యను దర్శకునిగా ఎన్నుకున్నారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. అనసూయ-్ధృవ చిత్రం ద్వారా నటి కృష్ణవణిని శ్రీకృష్ణతులాభారం ద్వారా రేలంగిని ‘చల్‌మోహనరంగా’ ద్వారా పుష్పవల్లిని ‘వరవిక్రయం’ ద్వారా భానుమతిని, గొల్లభామ చిత్రం ద్వారా అంజలీదేవిని, చిత్రసీమకు పరిచయం చేశారు పుల్లయ్య. అందుచేత వారిని తారాబ్రహ్మగా అభివర్ణించారు. గొల్లభామ చిత్రానికి మాటలు, పాటలు సదాశివబ్రహ్మం, ఛాయాగ్రహణం డి.ఎస్.కోట్నిస్, కళ-టి.వి.యస్.శర్మ, నృత్యం వి.రాఘవయ్య, సిట్టింగ్స్ వి.చంగయ్య, సంగీతం- దినకర్‌రావు, హనుమంతరావు, నిర్మాణ-నిర్వహణ -బి.ఎ.సుబ్బారావు, దర్శకత్వం:సి.పుల్లయ్య, నిర్మాత:శోభనాచల పిక్చర్స్, మీర్జాపురం రాజావారు.
కాశి వెళుతున్న మణిసిద్ధుడనే గురువు, గొల్లగోపన్నకు దారిలో కథలు చెబుతుంటాడు. ఓనాడు దారిలో గొల్లభామ తలపై కుండతో, పక్కన రాకుమారుడు గల శిల్పం అక్కడగల ఓ పద్యం చూసి, దీని కథను అడగటంతో చిత్రం ప్రారంభం ఆ పద్యం, కథకు ఆధారం.
‘‘్భపతి చంపితిన్, మగడు భూరి
భుజంగము చేత చచ్చే నే
నాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి, వేశ్యనై
పాపము కట్టుకొంటి, అట పట్టి విటుండై
రాగచూసి, సం
తాపము చెంది అగ్ని పడి దగ్ధముగా కిటు గొల్లభామనై
రుూ పని కొప్పుకొంటి నృపతీ వగపేటికి చల్లచిందినన్’’

దీని కధను గోపన్నకు ఇలా వివరించసాగాడు సిద్ధుడు. విక్రమపురి రాజ్యంలోని మహారాజు కామపాలుడు (ఎ.వి.సుబ్బారావు) ఒక గొల్లపడుచు (కృష్ణవేణి)ను చేపట్టాలని, అవకాశం కోసం చూసే స్ర్తిలోలుడు. ఒకనాడు అడవిలో గొల్లలు వేస్తున్న ఆమెను బలాత్కరించబోగా, అతని ఒరలోని కత్తితో అతన్ని ఆమె అంతం చేస్తుంది. ఆమెను బంధించబోయిన రాజభటుని నుంచి మరో దేశపు యువరాజు (రఘురామయ్య) ఆమెను కాపాడి, తన రాజ్యానికి తీసుకువెళ్లి, స్వయంప్రభ పేరుతో ఆమెకు సకల విద్యలు, చదువు, సంగీతం, నృత్యం, కత్తియుద్ధం మొదలైనవి నేర్పించి తన తల్లిదండ్రుల అనుమతితో ఆమెను వివాహం చేసుకుంటాడు.
ఒకనాడు తోటలో విహరిస్తున్న దంపతులను చూసి, స్వర్గంలోని మోహిని (అంజలీదేవి) యువరాజుపై మరులుగొంటుంది. పాముకాటుచే యువరాజును చంపించి, ఆ దేహాన్ని తనతో దేవలోకానికి తీసుకువెళుతుంది. అతనికి జీవం పోసి, తనను వరించమని కోరుతుంది. కాదంటే అతని భార్యను, వంశాన్ని నాశనం చేస్తాననటం, ఒక్క రాత్రి తన భార్యతో గడిపి ఆమెకు లొంగిపోతానని మాట ఇస్తాడు యువరాజు. ఆ ప్రకారం స్వర్గానికి వచ్చిన భార్యతో ఒక రేయి గడిపి, ఆ ఆనందంలో అక్కడ అమృతం దంపతులు సేవిస్తారు. తిరిగి మరునాడు భూలోకంలో రాణీవాసానికి వచ్చిన స్వయంప్రభ, భర్తను కలిసిన విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. కొంతకాలానికి గర్భవతియైన ఆమెను అడవిలో వధించమని మహారాజు అనుజ్ఞ ఇవ్వటం, అమృతం సేవించిన కారణంగా ఆమెకు మరణం కలగకపోవడం, అక్కడనుంచి ఒక కోయగూడెంలో బాబును ప్రసవించి, అతడు దూరం కావడంతో ఉదయార్కుని పట్టణంలో ఓ వేశ్య ఇంట 18 సంవత్సరాలు గడుపుతుంది. ఆమె కొడుకు ఆ దేశ యువరాజుగా పెరుగుతాడు. ఆమె రూప లావణ్యాలు తగ్గకపోవటంతో, స్వయంప్రభను కలవాలని వెళ్లిన కుమారుని గుర్తించిన స్వయంప్రభ విచారంతో అక్కడినుండి వెళ్లి అడవిలో కార్చిచ్చుబడి ఒక గొల్లవానిచే కాపడబడి, వారింట ఆశ్రయం పొందుతుంది. దేవలోకంలో మోహిని, యువరాజుపై ప్రయోగించిన సృతిభంగం మందు కొనే్నళ్ళకి పనిచేయక, యువరాజు వేడికోలుపై మోహిని అతన్ని భూమికి పంపించివేస్తుంది. తల్లిదండ్రుల వద్దకు వచ్చిన యువరాజు, తన భార్య గురించి నిజం తెలియచేసి ఆమెకై వెదుకులాట మొదలుపెట్టి రాజ్యాలు తిరుగుతూ ఆమె వున్న గ్రామం చేరుకుంటాడు. ఆ గుర్రం ధాటికి చల్లనమ్మబోయిన ప్రభ కుండలు పగిలి చల్ల చిందగా, ఆమె నవ్వటం చూసి ప్రశ్నించిన యువరాజుకు తన కథను భూపతి భూపతి పద్యంగా వివరించటం, అది విన్న ఆమె భర్త, ఇంతలో అక్కడకు వచ్చిన ఆమె కుమారుడు నిజం తెలుసుకొని అందరూ ఏకం కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా యువరాజు స్నేహితుడిగా రేలంగి, ఇంకా వెల్లంకి, కోటేశ్వరరావు, వేశ్యగా గంగారత్నం, నల్ల రామ్మూర్తి, కోటరత్నం, మోహినితోబాటు మరో దేవకన్యగా జూ.శ్రీరంజని, రాజేశ్వరి నటించారు.
ఈ చిత్రంలో గొల్లభామగా తొలుత గొర్రెలు కాస్తూ, అమాయకంగా, రాజులంటే పడదు, అందరూ ఒకటేనటగా అంటూ యువరాజుతో చెబుతూ, ఆపైన అడవిలో యువరాజుతో ప్రేమగీతం, యువరాజు వద్ద ఒంటిచేత్తో కత్తియుద్ధం, వీణ, సంగీతం, నృత్యం అభ్యసించటం, పెళ్లిచూపుల్లో యువరాజును గుర్తించి, తమాషాగా చూడడం, స్వర్గంలో రఘురామయ్య, కృష్ణవేణిలపై గీతం (ప్రియతమా, ప్రియతమా ఆనందమాయే ప్రేమా’- చక్కని బొమ్మలతో, ఏనుగులతో కనువిందైన సెట్టింగులతో ఎంతో కనులవిందుగా చిత్రీకరణ, గానం సాగింది). ఆ తరువాత సన్నివేశంలో వేశ్య వద్ద గట్టిగా ఎదిరించి ఈ వృత్తి చేయననటం, పల్లె యువతిగా బెదురు, యువరాణిగా దర్పం, ఠీవీ, గర్భిణీగా విచారం, ఆపైన కష్టాలు అన్నింటినీ సహనంతో భరించి చివరకు చల్ల చిందినపుడు దుఃఖించక, ధైర్యంగా పద్యం చెప్పటం, ప్రతి సన్నివేశం ఎంతో పరిణతితో అభినయించారు.
ఇక పలు నాటకాలలో ప్రసిద్ధరాలైన రఘురామయ్య ఈ చిత్రంలో తన రమ్యమైన నటనతో, చూపులతో చక్కని అనుభూతిని ప్రేక్షకులకందించారు. దేవలోకంలో కూడా భార్యపై అనురాగం, మత్తుమందు ప్రభావంలో మోహినితో ప్రణయం, చివరకు జ్ఞప్తి కలిగాక, తిరిగి భార్య వద్దకు రావటం, ఆమెకై వెదుకులాట ఎంతో ఈజ్‌తో నటించారు.
మోహినిగా అంజలిదేవి అతి చలాకీగా అభినయించి పాత్రోచితంగా మెప్పించింది. మిగిలిన పాత్రధారులు చక్కగా నటించారు.
దర్శకులు సి.పుల్లయ్య సన్నివేశాలను ఆకట్టుకునే రీతిలో చక్కగా తీర్చిదిద్ది చిత్రీకరించి విజయం సాధింపజేశారు. ముఖ్యంగా దేవలోకంలోని సన్నివేశాలు, మోహిని పాత్రను, తొలుత తోటలో కళ్ళకు గంతలు వుండగా యువరాజు ఆమెను పొరపాటున కౌగిలించుకోగా, అతనిపై కలిగిన ప్రేమను తలచుకుంటూ, అతనికోసం పరితపించటం, ఆమెను ఇతర దేవకాంతలను అదిలించటం, చివరకు భార్యను మరచిపోవడానికి మత్తుమందు చల్లడం ఎంతో వివరంగా అర్థవంతంగా చిత్రీకరించారు.
చిత్రగీతాలు ఈ చిత్రంలో తొలుత కృష్ణవేణి గొర్రెలు మేపుతూ పాడే గీతం ‘పొద్దొడ్డిసింది రాయే, గొల్లడా పిల్లడా పోనారి గుల్లడా’, వేశ్యాగృహంలో చివరలో పాడే గీతం ‘ఉన్నావా లేవా కరుణింపవా ఓ దేవా’, రఘురామయ్య, కృష్ణవేణి కలిసి పాడిన గీతం ‘ప్రేమ సుధా మధుర కధా’ (తోటలో వారిరువురిపై చిత్రీకరణ), వీరిరువురూ గానం చేసిన మరో గీతం, తొలుత అడవిలో వెనె్నలరాత్రి పక్కన కొలనులో చందమామను కలువలను చూపుతూ ఆహ్లాదకరంగా చిత్రీకరణ (సందమామా, అందమైనా సందమామా) రఘురామయ్య పద్యం ‘వలపు తేనియలూరిన వనజ నీవు’, అంజలిదేవిపై చిత్రీకరించిన గీతం ‘హాయి నిండెగా రుతు శోభ నవజీవనమే’, కృష్ణవేణిపై ‘రావోయి ఈ రేరుూ ప్రియతమా’ ఇక చివర భర్త అని తెలియక పాడే కృష్ణవేణి పద్యం ‘్భపతి జంపితి’, మాటలు, పాటలు సదాశివబ్రహ్మంగారు అలరించేలా సాగాయి.
గొల్లభామ చిత్రం జనరంజకంగా నిలిచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత 20 ఏళ్ళకు 1968లో ఇదే కథతో శేఖర్ ఫిలింస్ బేనర్‌పై ఎన్.టి.రామారావు, దేవిక జంటగా, విజయనిర్మల మోహినిగా ‘్భమావిజయం’ పేరుతో చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకుడు సి.పుల్లయ్యగారే కావడం విశేషం.
గొల్లభామ చిత్ర నాయిక, రాజావారి సతీమణి, నిర్మాత ఎన్.ఆర్.అనురాధాదేవి మాతృమూర్తి సి.కృష్ణవేణిగారు జూబ్లీహిల్స్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. వారికి అభినందనలు అందజేద్దాం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి