ఫ్లాష్ బ్యాక్ @ 50

సుడిగుండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1964వ సం.లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉత్తమ చిత్రాలకు, నంది పురస్కారాలు ఇవ్వటం ప్రారంభించింది. అన్నపూర్ణ సంస్థ వారు నిర్మించిన ‘డాక్టరు చక్రవర్తి’ చిత్రానికి నంది పురస్కారం, బంగారు నంది (ఉత్తమ చిత్రంగా) అవార్డు పొందింది. ఆ పురస్కార ప్రదానోత్సవ సభకు విచ్చేసిన, ఆనాటి ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన నిర్మాత దుక్కిపాటి, అభ్యుదయ భావాలుగల దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, సమర్థులైన నటులు ఎన్.టి. రామారావు, అక్కినేని వంటి వారు, ప్రయోజనాత్మక, చిత్రాలను రూపొందించవచ్చు కదా. దానికి ప్రభుత్వం సహకారం వుంటుందని సూచన ఇచ్చారు. ఆ ఆలోచన నచ్చిన దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత దుక్కిపాటి వారితో దాని గురించి ప్రస్తావించగా వారు ప్రస్తుతం తమకు అటువంటి ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఆదుర్తి తరువాత అక్కినేని వారి అభిప్రాయం కోరగా, వారు అంగీకరించటం జరిగింది. అక్కినేని, ఆదుర్తిల కలయిక ఓ నూతన చిత్రనిర్మాణ సంస్థ ఆవిర్భవించింది. దీనికి ప్రస్తావన డా. చక్రవర్తి పురస్కార సభ కావటంతో తమ నిర్మాణ సంస్థకు ‘చక్రవర్తి చిత్రం’ పేరు ఖాయం చేశారు. ఈ బేనర్‌పై వీరు రూపొందించిన తొలి చిత్రం ‘సుడిగుండాలు’ 28-06-1968 విడుదల.
ఈ చిత్రానికి కథ-బి.ఎస్. ధాపా, స్క్రీన్‌ప్లే-కె.విశ్వనాథ్, మాటలు - ఎన్.ఆర్.నంది, సంగీతం - కె.వి.మహదేవన్, నృత్యం - పార్వతి కుమార్, కుర్పు - టి.కృష్ణ, కళ - జి.వి.సుబ్బారావు, దర్శకుడు - ఆదుర్తి సుబ్బారావు, నిర్మాతలు - అక్కినేని, ఆదుర్తి, దర్శకత్వం - ఆదుర్తి సుబ్బారావు.
పేరు మోసిన జడ్జి చంద్రశేఖర్ (అక్కినేని) న్యాయనిర్ణయంలో నిష్కర్షగా వుంటూ, తనవల్ల శిక్షపడిన వ్యక్తుల ఆత్మీయులు, ఏ దిక్కులేని వారయితే వారికి తన ఇంట ఆశ్రయం కల్పిస్తుంటాడు. అలా ఆశ్రయం పొందిన వారు సంధ్యారాణి (సీత) పుష్పకుమారి (పెద్దమ్మ), డ్రైవర్ జాన్ (మాడా), హెడ్ గుమాస్తా వెంకటప్పయ్య (సాక్షిరంగారావు) ఇంటి వ్యవహారాలు చక్కబెడుతుంటారు. చంద్రశేఖర్ భార్య లక్ష్మీ (సావిత్రి) ఒక బిడ్డను కని మరణిస్తుంది. ఆ బాబు రాజాను అల్లారు ముద్దుగా పెంచుతాడు చంద్రశేఖర్. తెలివి, చురుకుతనం గల రాజా, స్కూల్లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో స్వాతంత్య్ర పోరాట నృత్యనాటికలో పాల్గొని ప్రయిజ్ సంపాదిస్తాడు. ఆ మరునాడు రాజా (మాస్టర్ రాజా, కాంతారావు కుమారుడు) పుట్టినరోజు నాడు, అతడు హత్య చేయబడతాడు. దానికి కారణం అయిన నిందితుడు పసన్నరాణి (రాణి), మాస్టర్ కృష్ణంరాజు (విక్రమ్) కారకులని పోలీసు ఇన్‌స్పెక్టర్ (రాంమ్మోహన్) అరెస్టు చేస్తాడు. కోర్టులో విచారణ జరగటం పబ్లిక్ ప్రాసిక్యూటర్ (గుమ్మడి) జడ్జి, ఆధారాలు బట్టి నిందితులకు శిక్ష విధించబోగా, చంద్రశేఖర్ లాయర్‌గా, వచ్చి విక్రమ్, రాణిలను వారి తల్లిదండ్రులను తిరిగి విచారణ చేస్తాడు. గదిలో విక్రమ్ తండ్రి పానకాలరావు (వెంకటేశ్వరావ్), పానకాలరావు రెండవ భార్య పంకజం (సుకన్య) వయసు మళ్ళిన వ్యక్తిని పెళ్ళాడి కోరికలు తీరక, చౌవకబారు పుస్తకాల పఠనంలో కాలం గడిపే స్ర్తి అని, రాణి (ప్రసన్నరాణి) తండ్రి కోటేశ్వరరావు (ఐ.వి.సుబ్బారావు) తల్లి (శశికళ) ధనవంతులు కావటం చేత డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం, క్లబ్బులకు, పేకాట, పార్టీల సంస్కృతికి అలవాటుపడడం చేత, కుమార్తెను అదుపులో వుంచుకోకపోవటం, వారిలో విచ్చలవిడితనం, రాణికి, స్నేహానికి, ప్రేమకు, ఇష్టానికి తేడా తెలియకపోవడం, ఎవరినయినా హత్య చేయాలన్న విక్రమ్ వాంఛ, ఈ హత్యకు కారణాలని వివరించి, ఈ అశ్లీల సాహిత్యం, అసభ్యచలన చిత్రాలు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, సమాజంలో వ్యాపిస్తున్న విష సంస్కృతి వివరంగా చర్చించి, దీనికి ఈ నిందితులు కారణం కారని, సమాజం, వ్యక్తులు మారాలని కోరుతూ, ఆవేదనతో, ఆవేశంతో కోర్టు హాలులో కుప్పకూలిపోయి చంద్రశేఖర్ మరణిస్తాడు. ఈ సమాజం ఏమయిపోతుంది అన్న ప్రశ్నతో చిత్రం ముగుస్తుంది.
కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకులు ఆదుర్తి సుబ్బారావు చిన్న, చిన్న సన్నివేశాలతో, మాటలు తక్కువగా, ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువగా, అర్థవంతంగా తీర్చిదిద్దారు. భార్య మరణించిందని ఆసుపత్రికి వెళ్ళాక తెలిసి, దుప్పటి తొలగించేలోగా బాబు ఏడ్పు వినిపించటం, బాబు ఊయల చూపుతూ టైటిల్స్ బాబు పెద్దవాడు కావటం, అతని స్విమ్మింగ్‌లో డెరింగ్, తెలివితేటలు అభిరుచి చిన్నమాటలతో వెలిబుచ్చటం, బాబుకి తండ్రి గాంధీ పాత్రను వివరించటం, బాబుకోసం వెదికి ఇంటికి వచ్చిన తండ్రికి, తమ పిల్లలకోసం ఫోన్స్ రావటం, బాబుకోసం ఆసుపత్రికి వెళ్ళి దుప్పటి కొద్దిగా తొలగించి, ఎస్ హీ ఈజ్ మై సన్ అని చెప్పించటం. బాధ్యతలేని తల్లిదండ్రుల లక్షణాలను, మొదటవారితో సన్నివేశాల్లో తిరిగి కోర్టులో తమాషాగా వెల్లడి చేయించటం, బాబును గూర్చి చింతిస్తుండగా టేప్ రికార్డ్‌లో ‘‘హరిశ్చంద్ర’’లో లోని పద్యం సందర్భానుసారంగా విన్పింప చేయటం, అక్కినేని రియాక్షన్ ‘మాయామేయి జగంబే నిత్యంబని’ ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం బుర్రకథను వివరంగా ఆంగ్లేయులు భారతదేశానికి రావటం, ఝాన్సీరాణి, తాంతియాతోపే, రామకృష్ణ పరమహంస, రాజారామోహన్‌రాయ్, జమిందారు ఉద్యమం, రైతుల కష్టాలు, స్వాతంత్య్ర యోధులు, తీవ్రవాద వీరులు అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, వందేమాతరం, దండి ఉద్యమాలు, గాంధీరాక స్వాతంత్య్ర పోరాటం ‘‘జలియన్ వాలాబాగ్ ఉదంతం’’ చెప్పుకోదగ్గదిగా భారత విభజన, గాంధీజీ మరణంవరకూ, బాలలచే ఎంతో చక్కగా ప్రదర్శింపజేసి, చిత్రీకరించారు.
ఈ చిత్రంలో జడ్జి చంద్రశేఖర్‌గా అక్కినేని ఎంతో, నిండుతనం, పరిపక్వత కూడిన నటన చూపారు. కోర్టులో దోషుల తల్లిదండ్రులను విచారించేటప్పుడు, తన ప్రశ్నలకు, వారి జవాబులు వాటికి తగిన రీ-యాక్షన్, హావభావాలు సున్నితంగా ప్రదర్శించటం ముగింపులో అన్నిటిని విశే్లషించటంలో తన అంతరగ మధనం ఎంతో సహజంగా నటనలో ఆవిష్కరించారు.
ఈ చిత్రంలో కోర్టు సీన్ సన్నివేశాలను ఒక భవంతిలో, కెమెరామెన్ రామకృష్ణ సాయంతో సెట్స్ వేసి చక్కగా చిత్రీకరించారు దర్శకులు. ఈ చిత్రంలో ‘‘మాయామేయిజగంచే’’ పద్యం పి.సుశీలగానం చేయగా బుర్రకథ, స్వాతంత్య్ర పోరాట గీతాన్ని ‘‘వినరా సోదర భారత వీరుల’’ (రచన - దాశరధి, గానం - పి.సుశీల, ఘంటసార, బి.వసంత బృందం) ఈ చిత్రంలో మాస్టర్ రాజాగా కాంతారావు కుమారుడు నటించారు. అతడు చక్కని హావభావాలతో ముందు తండ్రి వద్ద ‘‘హిందూ ముస్లిమ్ భాయి భాయి’’ అని నేర్చుకోవటం, పనివాళ్ళవద్ద, తండ్రివద్ద చురుకుగా వుండటం ఎంతో పరిణితి చూపాడు. ఇక ప్రసన్నరాగి, మాస్టర్ కృష్ణంరాజు ఆ వయసుకు తగ్గ పెంకితనం, విసురు, పొగరు, నిర్లక్ష్యం చివరలో కొద్దిపాటి బాధ, విస్మయం, మార్పులను తమ నటనలో వెల్లడి చేసారు. టీనేజ్‌లో వుండే స్వభావ సిద్ధమైన కొన్ని లక్షణాలకు తగ్గట్టు రూపొందించిన పాత్రలకు వారు న్యాయం చేకూర్చారు. మిగిలిన పాత్రధారులు, పాత్రోచితంగా మెప్పించారు.
ఈనాటి సమాజంలో, ముఖ్యంగా యువతలో చెలరేగుతున్న హింసామార్గాలు, నేర ప్రవృత్తిని, దానికి దోహదపడే సాధనాలను 50 సం.ల క్రిందటే వివరంగా విశే్లషిస్తూ, సన్నివేశాల ద్వారా కాక, చిత్రాల ద్వారా, పోస్టర్స్ ద్వారా చూపుతూ, సమాజంలో మార్పుకోరుతూ, ఈ చిత్రాన్ని రూపొందించిన నిర్మాతలు ఆర్థిక విజయానికంటే హార్థిక విజయానికి ప్రాముఖ్యతనివ్వటం ప్రశంసనీయం.
ఈ చిత్రానికి 1967 సం.లో ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తమచిత్రంగా బంగారు నంది పురస్కారం లభించింది. మద్రాస్ ఫిలిం ఫాన్స్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఫాన్స్ వారి అవార్డులు పొందింది.
ఆ తరువాత చక్రవర్తి చిత్రం వారు మరో ప్రయోజనాత్మక చిత్రం ‘‘మరో ప్రపంచం’’ నిర్మించారు.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి