ఫ్లాష్ బ్యాక్ @ 50

పంతాలు-పట్టింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ వెంకన్నచౌదరి, శంభూ ఫిలిమ్స్ పతాకంపై ‘నమ్మినబంటు’, ‘పూజాఫలం’, ‘శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ’ చిత్రాలను రూపొందించారు. వీరి భాగస్వాములలో ఒకరైన యార్లగడ్డ లక్ష్మీనారాయణ, శంభూ ఫిలిమ్స్ బేనర్‌పై, 1968లో నిర్మించిన చిత్రం ‘పంతాలు-పట్టింపులు.’
అభ్యుదయవాది, అభిరుచిగల నిర్మాత, స్వతంత్ర భావాలుగల వ్యక్తి శ్రీ కె.బి.తిలక్ (కొల్లిపర బాలగంగాధర్ తిలక్) అనుపమ పతాకంపై పలు చిత్రాలు నిర్మించిన, వీరి దర్శకత్వంలో శంభూ ఫిలిమ్స్‌వారు ‘పంతాలు- పట్టింపులు’ రూపొందించారు. తిలక్‌గారికి మరాఠీ భాషలోగల నాటకాలు, సినిమాల పట్ల గల శ్రద్ధ అభిరుచితో, ఆ నాటకాల్లోగల ‘తమాషాలు’ వీరిని ఆకర్షించాయి. వాటి ఆధారంగానే ఓ విజయవంతమైన మరాఠీ చిత్ర కథను ఆధారం చేసుకుని రూపొందించిన చిత్రం ‘పంతాలు- పట్టింపులు’. ఆ చిత్రంలో ‘తమాషా’ నృత్య సన్నివేశాలలో నటించే మేటి నటి ‘లీలాగాంధీ’నే ఈ చిత్రంలోనూ నటింపచేశారు.
ఈ చిత్రానికి మాటలు- పినిశెట్టి, ఎడిటింగ్- సత్యం, కళ- ఎ.కె.శేఖర్, స్టంట్స్- పరమశివమ్, ఛాయాగ్రహణం- లక్ష్మణ్‌గోరే, నృత్యం- ఎ.కె.చోప్రా, దొమ్మరి నృత్యాలు (జయరాం), సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు, దర్శకత్వం- కె.బి.తిలక్, నిర్మాత- యార్లగడ్డ లక్ష్మీనారాయణ. కళల పట్ల మక్కువగల మురళి (శోభన్‌బాబు), తన వూరు వదిలి వచ్చి పట్నంలో కళారంజని (లీలాగాంధి), అనే నర్తకిని తీర్చిదిద్ది, తాను మృదంగం వాయిస్తూ, ప్రదర్శనలిప్పిస్తుంటాడు. ఒక నాటి నృత్య ప్రదర్శనలో, తన నృత్యానికంటే, అతని మృదంగ విన్యాసానికి ప్రశంసలు రావటంతో కళారంజని అతన్ని నిందించి, అవమానిస్తుంది. ఆమెతో పంతంపట్టి, ఆమెను మించిన నర్తకి తయారుచేస్తానని మురళి, తన వూరు వెళతాడు తల్లి సరస్వతమ్మ(మాలతి) చెల్లెలు వాణి (రమాప్రభ), బావ హార్మోనిష్టు రమణారెడ్డిలను కలుసుకుంటాడు. తన ఆశయసాధనకు తగిన వారుగా ఊరి చివర దొమ్మరి యువతులు జిమ్మి (వాణిశ్రీ), సోనీ (గీతాంజలి)లను ఎన్నుకొని, వారి తండ్రి తాగుబోతు మల్లయ్య (గుమ్మడి) అనుమతితో, వారికి ఆటపాటలు నేర్పించి నృత్య కళాకారిణిలుగా తీర్చిదిద్దుతాడు. వూరివారి చెప్పుడు మాటలు నమ్మిన మల్లయ్య, మురళి పట్నంలో జిమ్మి, సోనీల ప్రదర్శన ఏర్పాటుచేసిన మురళిని అవమానిస్తాడు. కూతుళ్ళను తనతో తీసికెళ్ళిపోతాడు. కాని, మురళిపై నమ్మకంగల జిమ్మి, సోనీలు తండ్రికి చెప్పకుండా మురళితో, వారి బావతో పట్నం చేరి, ప్రదర్శన ఇచ్చి కళారంజనిని ఓడిస్తారు. మరో 10రోజుల్లో చివరి పోటీ కళారంజనిలో వుండగా, జిమ్మికీ సోనీకి, వారిరువూరు మురళినే ప్రేమిస్తున్న కారణంగా విబేధం కలుగుతుంది. సోనీ అక్కపై కోపంతో, కళారంజని, చెప్పుడు మాటలు విని, ఆమెవద్దకు చేరుతుంది. చివరి పోటీలో, కళారంజనితో జిమ్మి ఒక్కతే పోటీపడి ఆమెను ఓడించగా, అక్కతో పోటీకి సోనీ సిద్ధపడి వారిరువురూ నృత్యం చేస్తుండగా, మురళిని అంతం చేయాలని వచ్చిన మల్లయ్య విసిరిన కత్తి తగిలి, సోనీ మరణించటం, మల్లయ్యను పోలీసులు అరెస్ట్‌చేయగా, జిమ్మితో తన వూరిలో మురళికి వివాహం జరగటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో కళారంజని తల్లిగా ఛాయాదేవి(గెస్ట్) ఆమె సహాయకుడిగా పొట్టిప్రసాద్ (రామప్ప) మురళి ఇంటి నౌకరు సుబ్బన్నగా పెరుమాళ్ళు, పూజారిగా మద్దాలి కృష్ణమూర్తి, ఇంకా చిడతల అప్పారావు, వల్లం నరసింహారావు, లక్ష్మీకాంతమ్మ ఇతరులు నటించారు.
అభ్యుదయ భావాలుగల తిలక్ ఈ చిత్రంలోనూ, దొమ్మరి కులానికి చెందిన జిమ్మి, సోనీలను, ఆ వూరి పెద్దమనిషి నాగన్న, సొంతం చేసుకో ప్రయత్నించటం, వారి గుడిసె తగులబెట్టించగా, మురళి వారికి గుడిలో ఆశ్రయం కల్పించటం, పూజారి వారిని వూరికి దూరంగా వుంచాలనటం, నాగన్న ప్రభుత్వమే షెడ్యూల్డ్‌కులాల వారిని వేరుచేసిందని చెప్పటం తిరిగి, నృత్యం నేర్చి నాగరికులుగా వస్తే, వారెవరో, తెలియక నాగన్న, పూజారి గౌరవించటం, హీరో మతంకన్నా మానవత్వమే కాదు, కులంకన్నా గుణమే అంతకన్నా గొప్పది’. కళాకారులు, విద్యావంతులు ప్రజలకోసమే బ్రతకాలి’అని చెప్పించటం, హీరో తల్లికూడా చివరకు కొడుకుమెచ్చిన యువతి ఏ కులమైనాసరే నన్పించటం. ఇంక దొమ్మరి నృత్యాల, వారి విన్యాసాలు ఎంతో విపులంగా ఆకట్టుకునేలా, గుమ్మడి పొట్టపై కర్రను గీతాంజలి ఎక్కి విన్యాసాలు, దానికి వాణిశ్రీలో బెదురు చూపటం, మిగిలిన నృత్యం, తాటిపై నడక వంటివి ‘‘ఝమా ఝం, ఝాం ఝమా’’ (గానం ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి పట్ట్భా బృందం రచన- కొసరాజు) పాటలో చిత్రీకరించటం ఆకట్టుకుంటుంది. జిమ్మి, సోనీలకు నృత్యం ఆరంభిస్తూ ‘నమో, నమో నటరాజా’ (గానం-బి.గోపాలం, శ్రీశ్రీ) గీతం జరుగుతుండగా గోడపైన చిత్రపటంలో ఋతువుల మార్పును సూచిస్తూ 2 సం.కాలం గడిచినట్లు చూపటం, ఇక వారు ఇష్టపడిన తమాషా గీతాల చిత్రీకరణ సవాల్. జవాబుదారిలో సాగే ఆ గీతాలను, ఈ చిత్రంలోనూ, అదే విధంగా బహురమ్యంగా అర్ధవంతంగా చిత్రీకరించారు. తొలుత లీలాగాంధీ తన బృందంతో చేసే నృత్యగీతం ‘నేటిదా ఒక నాటిదా సిరులకొరకు సాగేటి పోటీ దేవదానవుల కాలంనాటిది’అంటూ, అమృత కలశంకోసం పోటీ గీతం (రచన శ్రీశ్రీ, గానం పి.సుశీల, బి.గోపాలం బృందం) లీలాగాంధీ నృత్యం అలరిస్తుంది. అలాగే జిమ్మి, కళారంజని (లీలాగాంధీతో పోటీ నృత్యంలో ‘దేశదిమ్మరులు రవికెను ధరించక పోవటానికి కారణం సీతమ్మ కష్టాలని’ సంద్రానికి, చంద్రునికి బంధం’ రంజని ప్రేయసి ప్రియులని చెప్పటం, జిమీకాదని తండ్రికొడుకుల బంధంగా ‘చంద్రుడు సుతుడు సంద్రం జనకుడు’’అని తెలియచెప్పటం (రచన- శ్రీశ్రీ, గానం పి.సుశీల, ఎస్.జానకి బృందం) జిమ్మి, సోనీల ‘గంగాగౌరీ సంవాదం’ నృత్యంలో వారి స్వభావాలు వెలిబుచ్చేలా జిమ్మి ‘పరమశివుని ప్రేమించిన పార్వతిని అనటం, పరమశివుడు ప్రేమించిన గంగను అని సోనీ అంటూ సాహిత్యం చిత్రీకరణ, సంగీతం మూడు ఒకదానితో ఒకటి జతపడి అలరించేలా సాగాయి.
మిగిలిన గీతాలు జిమ్మి, సోనీల కోలాటం పాట నృత్యగీతం ‘ఆటపాటల కృష్ణుడెంత వాడే’ (ఎస్.జానకి- ఎల్.ఆర్.ఈశ్వరి) శ్రీశ్రీ రచన) వారిదే మరో గీతం ‘నినే్ననినే్న మెచ్చుకున్నా’ ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, గోపాలం బృందం- రచన ఆరుద్ర. వీరిపైన వెస్టర్న్ శైలిలో మరో గీతం ‘రమ్మంటే రాడు పెద్ద సోగ్గాడు’(ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి- ఆరుద్ర) లీలాగాంధీ, వాణిశ్రీ, గీతాంజలిలపై గీతం ‘పళ్ళోరయ్యా, పళ్ళు’ (పి.సుశీల, ఎస్.జానకి, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం- రచన కొసరాజు). ఈ చిత్రంలో శ్రీశ్రీ రచన, ఘంటసాల గానం, కల్లుపాకలో గుమ్మడి, ఇతరులపై చిత్రీకరించిన తత్వగీతం సాగే గీతం ‘ఇనుకోరా, ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా’ అనుపమా వారి చిత్రాలవలెనే, శంభూ ఫిలిమ్స్‌వారి ఈ చిత్రంలోనూ శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజుల సాహిత్యానికి, పెండ్యాలవారి సంగీతం, తిలక్ కృషితోడుగా, ఈ చిత్ర గీతాలు అలరించేలా సాగాయి. పెండ్యాలవారికి అఖిల భారత స్థాయిలో అవార్డును ఈ సినిమా ద్వారా లభించటం విశేషం.
మొదట ఈ చిత్రంలో మురళి పాత్రకు ‘కృష్ణ’ ను అనుకున్నారు. కారణాంతరాలవల్ల శోభన్‌బాబును తీసుకున్నారు. తన పాత్ర పరిధి మేరకు తగిన అభినయంతో వీరు దాన్ని పరిపూర్ణత కలిగించారు. వాణిశ్రీ, గీతాంజలి, ఇరువురూ, పోటీపడి సినిమాలో ఎలా నృత్యాలలో ఢీకొన్నారో, మిగిలిన భాగమంతా అదే విధంగా సమర్ధవంతంగా నటించి మెప్పించారు. గుమ్మడికి తాగుబోతు మల్లయ్యగా ఓ వెరైటీ పాత్ర. దాన్ని వారు అదే అదే స్థాయిలో నటించి ఓ ప్రత్యేకత నిలుపుకున్నారు.
‘పంతాలు- పట్టింపులు’ చిత్రం ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోయినా, ఓ ప్రత్యేకమైన అంశంతో రూపొందిన చిత్రంగా మన్ననలు అందుకుంది. విమర్శకుల ప్రశంసలు పొందింది.

- ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి