ఫ్లాష్ బ్యాక్ @ 50

నేనంటే నేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొడుకులు-కోడళ్ళు’ అనే డబ్బింగ్ చిత్రంతో నిర్మాతగా మారిన పి.మల్లిఖార్జునరావు పలు బ్యానర్‌లపై అనేక చిత్రాలు రూపొందించారు. పలు హిందీ చిత్రాలను రూపొందించిన వీరు 1968లో సుజాత ఫిలిమ్స్ బేనర్‌పై నిర్మించిన చిత్రమే ‘నేనంటే నేనే’.
‘మరపురాని కథ’, ‘అసాధ్యుడు’ వంటి హీరో కృష్ణ చిత్రాలకు దర్శకత్వం వహించి పేరుపొందిన ఓరుగంటి రామచంద్రరావు నిర్దేశకత్వంలోనే ఈ చిత్రమూ రూపొందింది. వీరు తరువాత హీరో కృష్ణతో చేసిన ‘దేవుడుచేసిన మనుషులు’, ‘అల్లూరి సీతారామరాజు’ హిట్స్ సాధించాయ.
***
1967లో విడుదలైన ‘నాన్’ తమిళ చిత్రం ఆధారంగా రూపొందిన చిత్రం ‘నేనంటే నేనే’. తమిళ చిత్రానికి కథ-టిఎన్ బాలు. శ్రీ వినాయక్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత టికె రామరాజన్ నిర్మించిన ‘నాన్’చిత్రానికి దర్శకుడు టిఆర్ రామన్న. సంగీతం టికె రామ్మూర్తి సమకూర్చారు. రవిచంద్రన్, జయలలిత, ముత్తురామన్, ఆర్‌ఎస్ మనోహరన్, నాగేష్, మనోరమ, ఎస్‌ఎ అశోకన్, విజయశ్రీ, జూ.శ్రీరంజని, కుట్టిపద్మిని తదితరులు నటించారు.
***
‘నేనంటే నేనే’ చిత్రానికి కళ-ఎస్ కృష్ణారావు, ఫొటోగ్రఫీ- ఎస్ వెంకటరత్నం, ఎడిటింగ్-ఎన్‌ఎస్ ప్రకాశం, సంగీతం- ఎస్‌పి కోదండపాణి, దర్శకత్వం- వి రామచంద్రరావు, నిర్మాత- పిఎన్ బాబ్జీ.
***
రంగాపురం రాజావారు రఘునాథరావు (జూనియర్ సుబ్బారావు) కొడుకు కుమార్‌రాజా. అతని పుట్టినరోజు పార్టీకి పిలిచిన స్నేహితులను తండ్రి వెళ్ళగొడతాడు. దాంతో తండ్రిపై కోపంతో కుమార్ ఎస్టేటు విడిచి వెళ్లిపోతాడు. రంగూన్‌లో కామాక్షమ్మ (జూ.శ్రీరంజని)వద్ద పెరిగి పెద్దవాడవుతాడు. ఆమె సొంత కొడుకు ఆనంద్ (కృష్ణంరాజు)కంటే కుమార్ (చంద్రమోహన్)ను ఎక్కువగా అభిమానిస్తుంది. బంగ్లా నుంచి కుమార్ వెళ్లిపోయాక రాజా రఘునాథరావుకు ఒక కుమార్తె జన్మిస్తుంది. అనంతర కాలంలో రాణీ మరణించటం, కుమార్ ఎంత కాలానికీ ఇంటికి తిరిగి రాకపోవటంతో రాజా రఘునాథరావు బెంగ పెట్టుకుంటాడు. తన ఆస్తిని నమ్మకమైన ముగ్గురు ట్రస్టీలు ఉద్దండం (వి రామచంద్రరావు), సుకుమారి (సూర్యాకాంతం), బాజాలు (కెవి చలం), దివాన్ (రావికొండలరావు)కు అప్పగిస్తూ కుమార్ వివరాలు అందచేస్తాడు. కుమార్ ఆచూకీ తెలుసుకుని ఆస్తిని, చెల్లెలిని అప్పగించమని కోరతాడు. అలాగే దివాన్ కుమార్తె గీత (కాంచన)తో కుమార్‌కు వివాహం జరిపించమని కోరుతూ మరణిస్తాడు. రఘునాథరావు మరణించటంతో తానే రాజ్‌కుమార్ అంటూ ఆనంద్ (కృష్ణంరాజు), శేఖరం (కృష్ణ), భూషణం, అతని భార్య మోహిని (నాగభూషణం, రాధాకుమారి) బంగళాకు వస్తారు. వీరికితోడు భూపతి (నెల్లూరి కాంతారావు)అనే పెద్ద గుండా తన ముఠాతో ఆనంద్‌కు అండగా వుండి ఆస్తి కాజేయాలని కుట్రలు పన్నుతాడు. ఆ క్రమంలో కుమార్ (చంద్రమోహన్)ను బంధించటం జరుగుతుంది. దాంతో కథ పలు మలుపులు తిరిగి శేఖర్, భూషణంకారణంగా నిజం తెలుస్తుంది. అసలైన కుమార్ చంద్రమోహన్ అని, ఆస్తికి వారసుడుగా అతనిని నిర్ణయించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. చిత్రంలో చంద్రమోహన్ ప్రియురాలు సరళగా సంధ్యారాణి, మాస్టర్ విశే్వశ్వరరావు తదితరులు కనిపిస్తారు.
దర్శకులు వి రామచంద్రరావు తెలుగుదనానికి తగ్గట్టుగా మాతృకను మలుచుకున్నారు. చిన్న చిన్న మార్పులతో చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దారు. సస్పెన్స్, ఫైట్స్‌తో తమిళ చిత్రానికి కొద్దిగా భిన్నంగా రూపొందించారు. కథ పలుమలుపులు తిరగటం, ప్రతి మలుపులో ఓ చక్కని పాట, ఓ ఫైట్ వాటిలో కొంత తమాషా చూపిస్తూ తెలుగు నేటివిటీకి దగ్గరగా డిజైన్ చేశారు. నాగభూషణం ఓ రహస్య స్థావరంలో లేడీ ఫైటర్‌కు మాయమాటలు చెప్పటం, దాంతో కృష్ణను బాధించే రౌడీలను లేడీ ఫైటర్స్ వచ్చి చితకబాదడం, జలపాతాల వద్ద ఫైట్లు గొప్పగా చిత్రీకరించారు. నాగభూషణం, భార్య, బేబీని కాపాడుతూ మిమిగ్రీ సాంగ్స్ ‘అనుకున్నది ఒక్కటి’ తమాషాగా, ‘నా మాట నమ్మితివేం.. కత్తి గుండెల్లో దిగబోదులే’ అంటూ రకరకాల పాటలు యాక్షన్‌తో చిత్రీకరించటం దర్శకుడి ప్రతిభను చాటిచెప్పేవే. కృష్ణ, కాంచనలపై తోటలో, స్విమ్మింగ్ పూల్‌లో ఎంతో ఆహ్లాదకరంగా గులాబి పూలతో కాంచన మొహం కప్పుకోవటం, బాతుల టైపు డాన్స్ ‘క్యా క్యా’ అంటూ ‘ఒకే ఒక గులాబిపై వాలిన తుమ్మెదలెన్నో’ (గానం: సుశీల, ఎస్.పి.బాలు- రచన: ఆరుద్ర) చిత్రీకరించారు. స్టంట్ డైరెక్టర్ సాయంతో ఫైట్లు అంతే స్పీడ్‌గా చిత్రీకరించటం దర్శకుని టేకింగ్ ప్రతిభకు అద్దంపడుతుంది. యాక్షన్ చిత్రాల హీరోగా పేరుతెచ్చుకున్న కృష్ణ ఈ చిత్రంలోనూ తనదైన శైలితో అభినయించి మెప్పించారు. హీరోగా చిత్రసీమలో ప్రవేశించి సాఫ్ట్ విలన్‌గా, విలన్‌గా ప్రత్యేకత సంపాదించుకున్న కృష్ణంరాజు మరోసారి సాఫ్ట్ విలన్‌గా పాత్రోచిత నటనను ప్రదర్శించారు. తమిళంలో నాగేష్, మనోరమ పోషించిన జంట పాత్రలను తెలుగులో నాగభూషణం, రాధాకుమారి పోషించారు. రాధాకుమారి ప్రత్యేకమైన నటన చెప్పుకోదగ్గ విధంగా అభినయించటం విశేషం. ఈ పాత్రను హిందీ చిత్రంలో మహమూద్ పోషించారు.
ఈ చిత్రంలోని ఇతర గీతాలు
కాంచన, నాగభూషణం, కృష్ణంరాజు ఇతరులపై చిత్రీకరించిన గీతం ‘అంబవో శక్తి ఓ హోహో’ (ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు, మాధవపెద్ది బృందం)కు రచన కొసరాజు. వీరిదే మరో గీతం కృష్ణ, కాంచనలపై ‘ఓ చిన్నదాన నన్ను విడిచి’ పెద్ద హిట్. పాటలో ‘ఘుంతలకిడి గుమ్మా’ (గానం-ఎస్.పి.బాలు) ప్రయోగం తమిళ చిత్రం ‘నాన్’లో ఉండటం విశేషం. కారులో కాంచన, కృష్ణలపై యుగళ గీతం ‘చాలదా ఈ చోటు రాదులే’ (ఎస్.పి. బాలు, పి.సుశీల- దాశరథి రచన), కాంచన, కృష్ణంరాజును కవ్విస్తూ పాడే గీతం ‘నువ్వే నువ్వే నన్ను చేరుకోవా’ (ఎస్.జానకి రచన-సి.నా.రె), నాగభూషణం, రాధకుమారిల పాట ‘్భలే భలే నరసింహస్వామినిరా’ (ఎస్.పి.బాలు, కౌసల్య- రచన- అప్పలాచార్య) అప్పట్లో శ్రోతల ఆదరణకు నోచుకున్నాయ. ‘నేనంటే నేనే’ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడింది. హిట్ చిత్రంగా పేరపొందింది.
ఈ చిత్రాన్ని నిర్మాత వాసూమీనన్, వాసు స్టూడియోస్ బేనర్‌పై, టి రామన్న దర్శకత్వంలో హిందీలో ‘వారిస్’ పేరుతో నిర్మించారు. జితేంద్ర, హేమమాలిని జంటగా నటించగా, ప్రేమ్‌చోప్రా, తెలుగులో కృష్ణంరాజు పాత్రను ధరించారు. సంగీతం ఆర్‌డి బర్మన్ సమకూర్చిన ‘వారిస్’ హిందీ చిత్రం 12-12-1969న విడుదలై విజయం సాధించింది. 3 భాషల్లోనూ చిత్రం విజయవంతం కావటం కథాబలాన్ని స్పష్టం చేస్తుంది.

- సివిఆర్ మాణిక్యేశ్వరి