ఫ్లాష్ బ్యాక్ @ 50

పెళ్ళికాని పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు, పాటలు: ఆరుద్ర
సంగీతం: మాస్టర్ వేణు
నృత్యం: చిన్ని, సంపత్
కూర్పు: సంజీవి
కళ: సూరన్న
ఫొటోగ్రఫీ: జి సత్యమూర్తి
సహాయ దర్శకుడు:
పి సాంబశివరావు
నిర్మాత: పి గంగాధరరావు
దర్శకత్వం: సిఎస్ రావు
==================================

స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా రాణించిన పి గంగాధరరావు నిర్మాతగామారి పలువురు భాగస్తులతో నవశక్తి సంస్థ నెలకొల్పారు. తొలుత హైదరాబాద్‌లో తొలి తెలుగు చిత్రం ‘మా ఇంటి మహాలక్ష్మి’, ఆపైన మద్రాస్‌లో ‘కలిమిలేములు’ చిత్రాలు నిర్మించారు. హైద్రాబాద్ మూవీస్ పేరిట మరో నిర్మాణ సంస్థ నెలకొల్పి జల్సారాయుడు (1960), పెళ్ళికాని పిల్లలు (1961), ‘కీలుబొమ్మలు’ వగైరా చిత్రాలు నిర్మించారు.
వన్ థౌజండ్ బెడ్ రూమ్స్ -అనే ఇంగ్లీషు నవల ఆధారంగా 1960లో మరాఠీ భాషలో దర్శకుడు అనంతమన్ రూపొందించిన చిత్రం -అవగాచిసంసార్. దాని ఆధారంగా రూపొందించిన చిత్రమే -పెళ్ళికాని పిల్లలు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు సి పుల్లయ్య కుమారుడు, పలు పౌరాణిక సాంఘిక చిత్రాల దర్శకుడిగా వాసి గడించిన సిఎస్ రావు (సి.శ్రీనివాసరావు) దర్శకత్వం వహించారు. పెళ్లికాని పిల్లలు అని టైటిల్స్ చూపిస్తూనే, అబ్బాయిలు, అమ్మాయిల బొమ్మల్ని గీతలతో తమాషాగా చూపడం అప్పట్లో సెనే్సషన్.
సంపన్నుడు, భూస్వామి గోపాలరావు (గుమ్మడి). అతని భార్య కాంతమ్మ (హేమలత). వారి దత్తపుత్రుడు వేణు (జగ్గయ్య), సొంత కుమారుడు శేఖర్ (కాంతారావు). వేణు (జగ్గయ్య) బుద్ధిమంతుడు. పట్నంలో బిఏ చదువుతుంటాడు. శేఖర్ చదువుమాని దురలవాట్లకు, వ్యసనాలకు బానిసై ధనం నాశనం చేస్తూ, తండ్రి పరువు తీస్తుంటాడు. ఆ బెంగతో జబ్బుపడిన గోపాలరావు మరణిస్తూ, తన ఆస్తినంతా దత్తపుత్రుడు వేణు పేరిట వ్రాస్తాడు. తన స్నేహితుడు కుటుంబరావు (రమణారెడ్డి) తీసుకున్న అప్పు తాలూకు నోటు అతనికి ఇచ్చివేయమని భార్యకు చెబుతాడు. ఆస్తి మొత్తం అన్న వేణు పేరవుందని మండిపడుతున్న శేఖర్‌కు ఆస్తిని అప్పగించేసి, వేణు పట్నం వెళ్లిపోతాడు. తన స్నేహితుడు హరి (పద్మనాభం) ఫొటో స్టూడియోలో పని చేస్తుంటాడు. దారిలో కలిసిన రాధ (జమున)ను ప్రేమిస్తాడు. కుటుంబరావు, సంతాన లక్ష్మి (సూర్యాకాంతం)ల 5వ కుమార్తె రాధ. ఆమెకు నలుగురు అక్కలు. పెద్దమ్మాయి రమాదేవి (సూర్యకళ), రెండో అమ్మాయి ఉమాసుందరి (పద్మిని ప్రియదర్శిని), సంగీత సరస్వతి అయిన 3వది వాణి (పార్వతి), క్రీడల్లో చాంపియన్ అయిన 4వది తార (కృష్ణవేణి). వారి కోర్కెలకు తగిన వరులను కుదర్చలేక కుటుంబరావు ఇబ్బంది పడుతుంటాడు. రాధను ప్రేమించిన వేణు, వారికి తగ్గ వరులను కుదురుస్తానని మాట ఇస్తాడు. కుటుంబరావు సలహా, సాయంతో చిన్న తమాషా నాటకం ఆడతాడు. మంచివారు, సమర్ధులైన తన స్నేహితులు శంకరం (రామకృష్ణ), బ్రహ్మం (హరనాథ్), గిరి (చలం), హరిలతో వారికి పెళ్లిళ్లు చేయించేస్తాడు. శేఖర్ అంతకుముందు సీత (రాజశ్రీ)ని మోసంతో పెళ్లాడి విడిచి వచ్చేస్తాడు. ఆమె అతనింటికి వచ్చినా ఛీదరిస్తాడు. రాధను చూసి మోజుపడి, ఆమె తండ్రిని అప్పుకోసం వత్తిడితెస్తాడు. రాధను బెదిరించి, తల్లిని, వేణును బంధించి పెళ్లికి సిద్ధపడతాడు. ముహూర్తం సమయానికి కాంతమ్మ, వేణు, సీతలతో వచ్చి అందరికీ నిజం వెల్లడించి శేఖర్‌ను నిందించటంతో, అతనిలో పరివర్తన వస్తుంది. వేణు, రాధలతోపాటు, నలుగురు జంటలకు వివాహం జరగుతుంది. శేఖర్, సీతను ఆదరించటంతో చిత్రం సుఖాంతమవుతుంది.
మధ్య తరగతి జీవితాల్లో ఆడపిల్ల పెళ్లి ఎంతో కష్టసాధ్యమైన విషయం. దానికితోడు ఐదుగురు ఆడపిల్లలు, ఎన్నుకొన్న రంగాల్లో పరిణితి సాధించి, తమ అభిరుచికి తగిన వరులను కోరుకోవటం, దానికోసం తల్లితండ్రులు పడేయాతన, అవమానాలు.. హీరో సాయంతో వధూవరులు ఇద్దరూ ఒకే అభిరుచి కలవారు కానక్కర్లేదన్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని, దానికి చక్కని హాస్యం మేళవించి రూపొందించిన చిత్రమిది. శేఖర్ వంటి దురాలోచనకల వ్యక్తి ప్రవర్తన, మోసంవంటి అంశాలతో ‘పెళ్ళికాని పిల్లలు’ చిత్రాన్ని దర్శకుడు రక్తికట్టించారు.
రాధను ప్రేమించిన వేణు అవస్థలు, ఆమె అక్కల వివాహం కోసం వారి స్థాయికి తగిన విద్వాంసులు, కళాకారులను తెచ్చేందుకు తంటాలు పడటం, సంతానలక్ష్మి గద్దింపు, కాబోయే భర్త అవస్థలు చూసి రాధ, కుటుంబరావు విచారించడంలాంటి సన్నివేశాలు మధ్యతగరతి ఇళ్లలోని జీవితాలను ప్రతిబింబిస్తాయి. చిన్న ఉపాయాలతో తమాషాలు చేసి, జంటలను అంగీకరింప చేయటం వంటి సన్నివేశాలను దర్శకులు సిఎస్ రావు ఎంతో ఈజ్‌తో ఆకట్టుకునేలా రూపొందించారు. మధ్యలో సీత (రాజశ్రీ) అత్తగారు హేమలత, కాంతారావుల మధ్య సెంటిమెంటుతో బరువుగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుడిని కదలనివ్వవు. చిత్రం చివరిలోనూ దెబ్బ తగిలిన హేమలత మనోబలంతో లేచి వేణును విడిపించటం, పెళ్లి మండపంలో శేఖర్‌పై తుపాకీ గురిపెట్టడంవంటి సినిమాటిక్ సన్నివేశాలతో చిత్రానికి నిండుదనం తెచ్చారు. శేఖర్‌గా కాంతారావు విలనీని ఎంతో సమర్థవంతంగా పోషించారు. చివరివరకూ శేఖర్‌ను, అతని ప్రవర్తనను పట్టించుకోకున్నా, ఆఖరున భార్యకోసం వేణు రియాక్ట్ కావటంలాంటి సన్నివేశాలు సజీవం అనిపిస్తాయి. తొలుత రాధను ప్రేమించి, ఆమెకు మురిపెంగా ప్రేమను వ్యక్తపర్చటం, మిగిలినవారి పెళ్లికి వరులను కుదర్చటం.. అంతా చక్కని హాస్యం, ముచ్చటైన నటనతో జగ్గయ్య ఆకట్టుకున్నారు. పరిణితిగల యువతి రాధగా మురిపెం, ముచ్చట, అంతలోనే కోపం, వెంటనే చక్కని చిరునవ్వు, జగ్గయ్యను అదిలించటం, చివరలో వేణుని రక్షించుకోడానికి శేఖర్‌తో పెళ్లికి సిద్ధపడి తన జీవితం త్యాగం చేయబోవటంలాంటి సన్నివేశాల్లో అద్భుతమైన భావాలు ప్రదర్శించి అలరించింది జమున. మిగిలినవారు తమ పాత్రల పరిధిమేరకు ఒప్పించగా, సంతానలక్ష్మిగా సూర్యాకాంతం ఐదుగురు ఆడపిల్లల తల్లిగా సాత్వికమైన, గడుసుతనంతో కూడిన ప్రత్యేక నటనతో మెప్పించింది. తండ్రిగా రమణారెడ్డి ఆమెకు ధీటుగా నటించారు.
హైద్రాబాద్ మూవీస్ అంటూ చార్మినార్ చిత్రంపై తొలుత సంస్థ పేరు, చిత్రం పేరు చూపటం, హైద్రాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ మొదలైన ప్రదేశాల్లో పాటలు చిత్రీకరించటం విశేషం. కాంతారావు, రాజశ్రీలపై చక్కని తోటలో చిత్రీకరించిన ఆహ్లాదకర గీతం -చల్లని గాలి, చక్కని తోట పక్కన నీవుంటే (గానం: ఘంటసాల, పి సుశీల). ఫొటో స్టూడియోలో జమున ఫొటో చూస్తూ జగ్గయ్య, మధ్యలో కిటికి అవతలినుంచి జమున ఇద్దరిపై చిత్రీకరించిన ముచ్చటైన గీతం -మొన్న నిన్ను చూసాను/ నిన్న మనసు కలిపాను (గానం: ఘంటసాల, పి సుశీల). వీరిరువురిపై చల్లని వెనె్నలలో రాత్రి ఎఫెక్ట్‌తో చిత్రీకరించిన మధుర గీతం -నాలోని మధురప్రేమ లోలోన దాచలేను (గానం: ఘంటసాల, సుశీల). జమున, ఆమె అక్కలపై ఇంట్లో చిత్రీకరించిన గీతం -తెలియని హాయి ఇది ఎందుకో (సుశీల). వాణి (పార్వతి)పై వీణ గీతం -ప్రణయ వీధిలో/ ప్రశాంతి నిధిలో (మరపురాని మరువలేని బిట్, గానం: పి.సుశీల). నృత్యంతో భేటీ గీతం -ఎవరివే, నీవెవరివే శివుని తలపై (గానం: బెంగుళూరు లత, ఎల్‌ఆర్ ఈశ్వరి; పద్మిని ప్రియదర్శిని, సుకుమారిలపై చిత్రీకరణ). హరనాథ్, వాద్య బృందంపై చిత్రీకరించిన ఘంటసాల హాయైన గీతం -ప్రియతమా రాధికా రావే రయమున.
‘పెళ్ళికాని పిల్లలు’ చక్కని అలరించే కాలక్షేప చిత్రంగా నిలిచింది. ఇందులోని గీతాలు నేటికీ శ్రోతలను ఆనందపరవశులను చేయటం ఈ చిత్రం ప్రత్యేకతగా చెప్పాలి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి