ఫ్లాష్ బ్యాక్ @ 50

బాగ్దాద్ గజదొంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటలు: సముద్రాల జూనియర్
నృత్యం: చోప్రా, చిన్న, సంపత్
కూర్పు: జిడి జోషి
స్టంట్స్: స్వామినాథన్
కళ: ఎస్ కృష్ణారావు
ఛాయాగ్రహణం: జికె రాము
ఎఫెక్ట్స్: రవికాంత్ నగాయిచ్
సంగీతం: టీవీ రాజు
నిర్మాత, దర్శకుడు: యోగానంద్
*
దర్శకుడు యోగానంద్ 1922 ఏప్రిల్ 16న మద్రాస్‌లో జన్మించారు. దత్తత కారణంగా కొంతకాలం బందరులో నివసించారు. తిరిగి మద్రాస్‌లో రేడియో టెక్నాలజీ చదివి జెమినీ సంస్థలో స్టిల్ కెమెరామెన్‌గా పని చేశారు. న్యూటోన్ స్టూడియోలో కెమెరా అసిస్టెంట్‌గా కొంతకాలం పనిచేశారు. తరువాత ఆంధ్ర సినీటోన్ ‘్భక్తజయదేవ్’ చిత్రానికి హీరేన్ బోస్‌వద్ద పని చేశారు. గూడవల్లి రామబ్రహ్మం సలహాతో ఎడిటింగ్ నేర్చుకుని, మాయాలోకం చిత్రానికి ఎడిటింగ్ అసిస్టెంట్‌గా అనుభవం సంపాదించారు. 1953లో వచ్చిన ‘అమ్మలక్కలు’ చిత్రానికి దర్శకత్వం వహించి, తరువాత పలు విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా పేరు సంపాదించారు. హీరో ఎన్టీ రామారావు ప్రోత్సాహంతో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు యోగానంద్. వాటిలో ఎక్కువ భాగం ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రాలే కావటం విశేషం. అలా అగ్రశ్రేణి దర్శకుడిగా రాణించిన యోగానంద్, నిర్మాతగా మారి పద్మగౌరీ పతాకంపై రూపొందించిన చిత్రమే -బాగ్దాద్ గజదొంగ. 1968 అక్టోబర్ 24న ఈ చిత్రం విడుదలైంది.
కథ:
బాగ్దాద్ సుల్తాన్ షంషుద్దీన్ ఖాన్ (మిక్కిలినేని). అతని భార్య బేగమ్ సాహెబ్ (పండరీబాయి). యువరాజు ఫరూక్ పుట్టిన రోజున -నజరానాల పేరిట వజీరు హుస్సేన్ (రాజనాల) ప్రజలను బాధించటం తెలుసుకున్న సుల్తాను ఒక పేదవాడిని కాపాడబోయి వజీరు చేతిలో హత్యకు గురవుతాడు. బేగంను ఖైదు చేసి, యువరాజును అంతం చేయాలనుకున్న వజీరు కుట్ర సాగదు. అక్కడినుంచి తప్పించుకున్న యువరాజు, ఫకీర్ దాదా (ముక్కామల) ఆశ్రయంలో ఆబూ (ఎన్టీఆర్)గా పెరుగుతాడు. ధనికులను దోచి పేదవారికి పంచుతుంటారు ఆబూ, అతని మిత్రుడు ఆలీ (పద్మనాభం). చాద్రసుల్తాన్ (రేలంగి) కుమార్తె నస్రీమ్ (జయలలిత)ను వివాహం చేసుకోవాలన్న తలంపుతో ఆమె తండ్రికి ఆకాశ గమనంగల గుర్రం బహూకరించి, బదులుగా నస్రీమ్‌ను కోరతాడు వజీర్ హుస్సేన్. ఆ వివాహం ఇష్టంలేని నస్రీమ్ హుస్సేన్ బారినుంచి తప్పించుకుని, అంతకుమునుపే మనసిచ్చిన ఆబూను కలుసుకునేందుకు వెళ్లిపోతుంది. అలా వెళ్లిన నస్రీమ్ చివరకు బాగ్దాద్ వజీర్ చేతికే చిక్కుతుంది. ఆమెకోసం బాగ్దాద్ రాజ భవనం చేరిన ఆబూ, అక్కడ నస్రీమ్ సాయంతో తన తండ్రిని వజీరు హత్యచేసి, తల్లిని బంధించాడన్న నిజం తెలుసుకుంటాడు. నస్రీమ్, ఆలీల సాయంతో తల్లిని చెర విడిపించి, తన శక్తి యుక్తులతో వజీర్‌ను ఎదిరించి అంతం చేస్తాడు. కంటకుడిని హతమార్చి ప్రజాభిమానం చూరగొన్న ఆబూ, నస్రీమ్‌ను వివాహమాడి తల్లిసహా బాగ్దాద్ సుల్తాన్‌గా సింహాసనం అధిష్టించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో ఆలీ ప్రియురాలు గుల్నార్‌గా గీతాంజలి, ఆమె తండ్రిగా నల్ల రామ్మూర్తి, చెరసాల అధికారిగా రామచంద్రరావు నటించారు. అరేబియన్ నైట్స్ కథల ఆధారంగా కథ అల్లుకుని, దానికి పలు ఇతర అంశాలు జోడించి సమకూర్చిన బాగ్దాద్ గజదొంగ చిత్రానికి సముద్రాల జూనియర్ సందర్భోచిత, పసందైన సంభాషణలు సమకూర్చారు. దర్శకుడు యోగానంద్ సన్నివేశాలను అర్ధవంతంగా రూపొందించి గొప్ప చిత్రంగా మలిచారు. నజరానాల గురించి సిబ్బంది మాటల్ని సుల్తాను వినటం, అలా ఓ పేదవాని ఇంట సైనిక దౌర్జన్యాన్ని ఆపటంలో మరణించటంలాంటి సన్నివేశాలతో కథపై ముందు ఆసక్తి పెంచారు. ఫకీర్‌దాదాను అంతం చేయాలనుకున్న వజీర్, అతడు గ్రుడ్డివాడని భ్రమపడి వదిలేయటం, అతని వద్ద పెరిగి పెద్దవాడైన ఆబూ నడివీధిలో బాగ్దాద్ (వజీర్) సుల్తాన్ హుస్సేన్‌ని చూసి, అతన్ని ఎక్కడో చూసినట్టు భావించటం.. అలా ఫకీర్‌దాదా ద్వారా తాను కందకంలో దొరికిన అనాధ అని తెలిసికోవటంతో కథను గొప్ప మలుపు తిప్పడంలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. హుస్సేన్ బంధించి తీసుకెళ్లిన నస్రీమ్‌ను కలుసుకోవటం కోసం బాగ్దాద్ రాజ మందిరంలో ప్రవేశించగా, పాత జ్ఞాపకాలు గుర్తుకు రావటం, నస్రీమ్ ద్వారా వజీర్ చేత -ఇది పాత రాణి బేగమ్ ప్యాలెస్ అని చెప్పించినపుడు ఆబూ అసలు విషయాన్ని గ్రహించినట్టు చూపించటం సినిమాటిక్ స్క్రీన్‌ప్లే అద్భుతంగా తోస్తుంది. తమాషా జానపద, చందమామ కథల్లో కనిపించే అంశాలు.. సీసాలో భూతం, వరాలు, దివ్య తేజస్సు ప్రకాశం వంటి వాటిని చొప్పించి దర్శకుడు చిత్రాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేయడం మెచ్చదగిన అంశం. ఇక టీవీ రాజు తన సంగీతంతో చిత్రాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ చిత్రాలకు యోగానంద్, టీవీ రాజు కాంబినేషన్ ప్రత్యేకం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లోని ఎన్నో చిత్రాలు మధురమైన స్వరాలతో అలరించాయి.
చిత్రంలో సినారె రచనతో సాగిన గీతాలు ఆడియన్స్‌ని అలరించాయి. చక్కని ఉద్యానవనంలో ఎన్టీఆర్, జయలలితపై చిత్రీకరించిన గీతం -రావే ఓ చిన దానా/ అనురాగం దాచిన దానా. వీరిరువురిపైనే మరో ప్రణయగీతం -హాయ్ అల్లా/ ఎలాగా నేననుకోలేదు ఇలాగా (గానం: ఘంటసాల, సుశీల). జయలలిత, రాజనాలపై చిత్రీకరించిన మరో సినారె గీతం -సైసై సరదారు దిల్‌దారు (గానం: పి సుశీల). సినారె రచననే ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన తమాషా గీతం -ఎవడురా దొంగ ఎవడూ (గానం: ఘంటసాల). యువరాజు పుట్టిన రోజున పండరీబాయిపై చిత్రీకరించిన సినారె గీతం -ఈరోజు మా యువరాజు పుట్టినరోజు (జిక్కి బృందగానం). గీతాంజలి, పద్మనాభంపై చిత్రీకరించిన మరో గీతం -మేరే బుల్‌బుల్ ప్యారీ వయ్యారి (రచన-కొసరాజు, గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి). తండ్రి నుంచి పారిపోయిన నస్రీమ్ (జయలలిత) ఓ గుడారంలో అరబ్బీల ముందు, తరువాత వజీర్ రాజనాల, అల్లు రామలింగయ్యల ముందు చేసే నృత్య గీతం -ఘల్ ఘల్ మువ్వల గలగలలు తీసుకో (రచన: సినారె, గానం: పి సుశీల). చిత్ర గీతాలు ఆకట్టుకునేలా సాగి అలరించాయి.
కథానాయకుడు ఎన్టీ రామారావు ఆబూగా ఎంతో ఈజ్‌తో తన పాత్రను పోషించి మెప్పించారు. తల్లెవరో, తండ్రెవరో తెలియని అనాధనని భావించటం, చివరకు నిజం తెలిసి ఆమెను ఎంతో ఒప్పించి ఖైదునుంచి విడిపిస్తున్నపుడు ఆమె స్థితిపట్ల పడిన ఆవేదన ఎన్టీఆర్‌కే చెల్లింది. తొలి చూపులోనే నస్రీమ్‌ను తోటలో కలుసుకుని ఆమెపై అనురాగం, ప్రేమ ప్రదర్శించిన సన్నివేశాలు, తొలుత తమాషాగా, తరువాత స్థిరంగా మనసు వెల్లడించిన సన్నివేశాలను ఎన్టీఆర్ రక్తికట్టించారు. సీసా భూతంతో చతురత, హాస్యం, వృద్ధుని తేజోప్రకాశంకోసం, శ్రమతో తీసుకువెళ్ళటంలో జాలి, ముగింపులో వజీర్‌తో ఫైట్ సన్నివేశంలో వీర ప్రతాపాన్ని సన్నివేశానుగుణంగా ప్రదర్శించి మెప్పించడంలో ఎన్టీఆర్ కృతకృత్యులయ్యారు.
జయలలిత నస్రీమ్‌గా ఒదిగిపోయింది. ఆబూ ప్రేమలో పరవశం, తండ్రి తనను ప్రాణంలేని వస్తువుగా భావిస్తూ మార్పిడికి సిద్ధపడిన సమయంలో విచారం, కోటవదలి వెళ్లటంలో సాహసం, వజీర్‌కు దొరికిపోవటంతో నిస్సహాయత్వం, తిరిగి ప్రియుడు ఆబూని కలిసిన ఆనందం, పరవశం, పలువిధాలైన భావాలను నటనలో చూపి అలరించారు. రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ఫొటోగ్రఫీ షాట్స్ సీసా భూతం వంటివి పిల్లల్ని ఆకట్టుకుంటాయి. బాగ్దాద్ గజదొంగ -సక్సెస్‌తో సంబంధం లేకుండా చక్కని కాలక్షేప చిత్రంగా పేరు తెచ్చుకుంది. అలరించే రచన, స్వరాలతో వినసొంపైన గీతాలతో సినిమా సాగటం ఆనందించతగ్గ విషయం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి