ఫ్లాష్ బ్యాక్ @ 50

కన్నతల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లా కోలవెన్నలో 1914లో జన్మించారు కోవెలమూడి సూర్య ప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు). ప్రజానాట్య మండలిలో సభ్యునిగా సమర్ధవంతమైన పాత్ర పోషించారు. నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో ‘అపవాదు’, ‘పత్ని’ చిత్రాల్లో నాయక పాత్రలు పోషించారు. ‘బభ్రువాహన’ పౌరాణిక చిత్రంలోనూ నటించిన తరువాత, ఒకవైపు నటన మరోవైపు దర్శకత్వంలో మెళుకువలు సాధించారు. పిమ్మట నిర్మాతగామారి యల్‌వి ప్రసాద్ దర్శకత్వంలో ‘ద్రోహి’ (1948) చిత్రాన్ని రూపొందించారు. అందులో హీరోగా నటింటి, పెండ్యాల నాగేశ్వరరావును సంగీత దర్శకునిగా సినీ రంగానికి పరిచయం చేశారు. 1949లో ప్రకాష్ స్టూడియో నిర్మించి అదే బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో ‘మొదటిరాత్రి’ (కెఎస్ ప్రకాశరావు, జి. వరలక్ష్మి హీరో హీరోయిన్లు), తరువాత ‘దీక్ష’ (ఈ సినిమాతోనే ఆత్రేయ సినీ రంగానికి పరిచయమయ్యారు) నిర్మించారు. 1953లో ప్రకాష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి వరలక్ష్మి ప్రధాన పాత్రగా కెఎస్ ప్రకాశరావు తన స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రమే -కన్నతల్లి.

హిందీ చిత్రాలు ‘ఔరత్’, న్యూ థియేటర్స్‌వారి ‘సౌగంధ’ ఆధారంగా రచయితలు తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సుంకర, వాసిరెడ్డివంటి ప్రముఖులు ఈ చిత్రానికి పాటలు, కథా రచన సమకూర్చటం ఓ విశేషం కాగా, ప్రముఖ గాయని పి సుశీల, నటీమణి రాజసులోచన ఈ చిత్రం ద్వారానే సినీ రంగానికి పరిచయం కావటం మరో విశేషం.

ఫొటోగ్రఫీ: బిఎస్ జాగిర్థార్
కళ: ఘోడ్ గాంకర్
ఎడిటింగ్: ఎవిఎస్ సుబ్బారావు
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సహనిర్మాత: భావన్నారాయణ
నిర్మాత, దర్శకుడు: కెఎస్ ప్రకాశరావు.

చలపతి (ఆర్ నాగేశ్వరరావు), శాంత (జి వరలక్ష్మి) దంపతులు. వారికి రాము (అక్కినేని), శంకరం (నంబియార్) పిల్లలు. తల్లి మాటలు చెవినిపెట్టక బాధ్యతారహితంగా ప్రవర్తించిన చలపతి అప్పులపాలవుతాడు. కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి సన్యాసులతో కలిసి దూరంగా వెళ్లిపోతాడు. ఆత్మస్థయిర్యంతో శాంత పొలం పనులు చేసుకుంటూ బిడ్డలను పెంచుతుంది. తల్లి కష్టం అర్థం చేసుకున్న రాము చదువుకు స్వస్తిచెప్పి తల్లితోపాటు శ్రమపడతాడు. అలా ఒక దుకాణం నడిపే స్థాయికి వస్తాడు. హైస్కూలు చదువు పూర్తిచేసిన శంకరాన్ని పక్కింటి అమ్మాయి గౌరి (వసంత) ఇష్టపడుతుంటుంది. కాలేజీలో చేరేందుకు పట్నం వెళ్లిన శంకరం, అక్కడ చెడు సావాసంతో వ్యసనాలకులోనై చంచల అనే ఓ యువతి మాయలో పడతాడు. అన్న రాము తన చదువుకోసం పంపిన డబ్బును శంకరం వృధాగా ఖర్చు చేస్తుంటాడు. నిజం తెలుసుకున్న రాము తమ్ముని నిలదీసి చివరకు అవమానింపబడటంతో, అతనికి డబ్బు కట్టడి చేస్తాడు. గౌరి ప్రేమకోసం కుమారుని మార్చాలనే ఉద్దేశ్యంతో పట్నం వెళ్తుంది శాంత. అక్కడ శంకరం ఆవేశంతో చంచలను హత్యచేయగా, కుమారుడి క్షేమం కోసం ఆ నేరం తనమీద వేసుకుని జైలుకెళ్తుంది శాంత. తల్లి కోసం పట్నంవెళ్లిన రాముకు శంకరం విషయం చెపుతాడు. తనకోసమే ఇంతటి త్యాగానికి ఒడిగట్టిందని జైలుకు వెళ్లి తల్లివద్ద బోరున విలపిస్తాడు. ఆమె అతన్ని వారించి అన్నతో కలిసి వెళ్లమని చెబుతుంది. అదే సమయానికి పక్క సెల్‌లో అరెస్టైవున్న చలపతి ఈ విషయం గ్రహించి శాంతను, ఆమె కృషిని ప్రశంసిస్తాడు. శిక్ష అమలుకోసం శాంత పోలీసులతో కలిసి దూరంగా వెళ్లిపోవటంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో చిన్నతనంలో రాముగా సుధాకర్, హాస్టల్ వార్డెన్‌గా రమణారెడ్డి, శంకర్ స్నేహితుడు శర్మగా పేకేటి శివరాం, ఇంకా కోడూరు అచ్చయ్య, యక్షగాన నృత్యంలో రాజసులోచన, పసుమర్తి కృష్ణమూర్తి కనిపిస్తారు.
దర్శకులు కెఎస్ ప్రకాశరావు చిత్రంలోని సన్నివేశాలను ఎంతో ఆకట్టుకునేలా ఆర్ధ్రత, పట్టుతో తీర్చిదిద్దారు. చలపతి తల్లి మాటలు లెక్కించక వృధా ఖర్చులు చేయటం, ఇల్లొదిలి వెళ్లిపోవటం; శాంత ‘నీదారి నీవు చూసుకున్నావా?’ అని భర్తగురించి వేదన పడుతూనే, పిల్లల కోసం పలు కష్టమైన పనులు నిబ్బరంగా చేయటంలాంటి దృశ్యాలు హృదయాన్ని ద్రవింపచేసేలా తీశారు. ఇరుగు పొరుగుల మాటలు శాంతంగా భరించే సన్నివేశాలు మనల్ని కదిలిస్తాయి. కష్టం విలువ తెలిసిన రాము బాధ్యతగా మెలగటం, అది తెలియని శంకరం అన్నను ఎదిరించి లెంపకాయ కొట్టడం; రాములో కొంత ఆవేశం, తిరిగి ఆలోచన చేసే సన్నివేశాల్లో ఆర్థ్రత ఉట్టిపడుతుంది. తల్లి ఒంటరితనంతో మాటలు పడటం, విస్తళ్లు కుడుతూ కష్టపడటం, ఆ సన్నివేశాల్లో రాము రియాక్షన్ దర్శకుడు ప్రకాశరావు ప్రతిభకు అద్దంపడతాయి. గౌరీ సూచనపై శంకరాన్ని చక్కదిద్దాలని తల్లి శాంత పట్నంవెళ్లటం, శంకరం నేరాన్ని తనపై వేసుకోవటం.. టైటిల్‌కు న్యాయం చేసే సన్నివేశాలు. సన్యాసులతో అరెస్టయిన చలపతి జైలులో మొదట శాంతను చూసి ‘నీవు మాత్రం ఏం సాధించావు, నా పక్కనే వున్నావు’ అని హేళన చేస్తాడు. కొడుకు శంకరం కోసం ఆమె చేసిన త్యాగం తెలిసుకొని ఆమెకు నమస్కరిస్తాడు. శిక్ష కోసం పోలీసులతో కలిసి దూరంగా వెళ్లిపోతున్న శాంతను చూసి రాము, శంకరం, గౌరి, ఊళ్లొని ముఖ్యులు పరుగున వచ్చి దుఃఖించే సన్నివేశాలు మనసును హత్తుకుంటాయి. చెడు అలవాట్లకు గురైన బిడ్డలపట్ల మాతృవేదన, బాధ్యతను ఎంతో హృద్యంగా చిత్రీకరించి బరువైన ముగింపుతో చిత్రానికి ప్రత్యేకత అందించారు కెఎస్ ప్రకాశరావు.
బారిష్టరు పార్వతీశం ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యారు జి వరలక్ష్మి. ‘స్వప్నసుందరి’, ‘పెళ్లిచేసి చూడు’, ‘దొంగల్లో దొర’, ‘దొంగలున్నారు జాగ్రత్త’వంటి పలు చిత్రాల్లో అక్కినేని, ఎన్టీఆర్, ఇతర హీరోల సరసన ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించారు. పెదవి విరుపులు, కనుచూపుల కొసమెరుపులు, పాత్రోచితమైన అమాయకత్వాన్ని వైరుద్యంగా ప్రదర్శించగల ధీశాలి ఆమె. ఈ చిత్రంలో అక్కినేని, నంబియార్‌లకు తల్లిగా గుండె నిబ్బరం, గాంభీర్యాలతో కూడిన శాంత పాత్రను సునాయాసంగా పోషించి పరిపూర్ణత కలిగించారు. ఆమెకు తగ్గట్టు రాముగా అక్కినేని అంతే ధీటుగా, సౌమ్యంగా, కొండొకచో కోపం, నిరసన, విసుగువంటి భావాలను లిప్తకాలం, ఆపైన వెంటనే మరోభావం.. ఇలా బాధ్యత, అభిమానం కలిగిన పెద్దకొడుకుగా ఎంతో సంయమనంతో కూడిన నటనను ప్రదర్శించారు. మిగిలిన పాత్రధారులు ప్రాతోచితంగా మెప్పిస్తే, శంకరంగా తమిళనటుడు నంబియార్ ఆ పాత్రకున్న లక్షణాలను ఈజ్‌తో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
చిత్రగీతాలు: యక్షగాన నృత్యగీతం -గుమ్మనే ముద్దుగుమ్మనే (గానం: పసుమర్తి కృష్ణమూర్తి, లలిత బృందం, రచన: శ్రీశ్రీ, ఆరుద్ర). సన్యాసులు పాడే గీతం -సాంబసదాశివ సాంబశివా (గానం: మాధవపెద్ది బృందం, రచన శ్రీశ్రీ -ఆరుద్ర). -సిరికించి చెప్పడు (్భవగతం నుంచి, గానం: జి వరలక్ష్మి). మరో భాగవత పర్వం -లావొక్కింతయు లేదు (గానం: పి సుశీల). చిన్నతనంలో సుధాకర్ విస్తళ్లు అమ్ముతూ పలు వ్యాపారాలు చేస్తూ పాడే గీతం చివరలో రిపీటవ్వటం, జి వరలక్ష్మి, అక్కినేనిపై చిత్రీకరణ -చూస్తారెందుకు రారండి (గానం: ఎం సరోజిని, రచన: తాపీ ధర్మారావు). చంచలపై చిత్రీకరించి గీతం -డేగలాగ వస్తా తూనీగలాగా వస్తా (గానం: కె రాణి, రచన: ఆరుద్ర). చంచల, శంకరంపై గీతం -ఇదే ఇదే సరాగం ఇదే కదా అనురాగం (గానం: కె రాణి, ఎఎం రాజా, రచన: ఆరుద్ర). తమ్మునిచే అవమానింపబడిన రాముపై చిత్రీకరించిన గీతం -చూశావా చివరికిదే నా చావా (గానం: ఘంటసాల, రచన ఆత్రేయ). ఘంటసాల మరో గీతం -ఎంత మంచిదానవోయమ్మ నీదెంత’’ (రచన: శ్రీశ్రీ, ఆరుద్ర). ఈ చిత్రం ద్వారా గాయకురాలు సుశీల పరిచయమైన గీతం -ఎందుకు పిలిచావెందుకు ఈల వేసి (గానం: పి సుశీల, ఏఎం రాజా, రచన: శ్రీశ్రీ, ఆరుద్ర).
కన్నతల్లి చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని కొద్ది మార్పులతో నర్గీస్, సునీల్‌దత్, రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్‌లతో హిందీలో ‘మదరిండియా’గా రూపొందించారు. దీనినే తిరిగి తెలుగులో జగ్గయ్య, జమున ప్రధాన పాత్రలతో ‘బంగారు తల్లి’గా, ఆ తరువాత జయసుధ ముఖ్యపాత్రలో శక్తి పేరుతో నిర్మించారు.
కన్నతల్లి చిత్రం ఆర్థిక, హార్ధిక విజయం సాధించింది. కానీ ఈ చిత్రం తమిళ వర్షన్ ‘ప్రెటతాయి’ నిరాశపర్చింది.
1951లో ‘స్ర్తి సాహసం’ చిత్రంలో కస్తూరి శివరావు జంటగా నటించిన సి వరలక్ష్మి, కన్నతల్లి చిత్రంలో అక్కినేని సరసన గయ్యాళి భార్యగా నటించింది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన పెండ్యాల నాగేశ్వరరావు పేద రైతు పెళుమాళ్లు (గౌరి తండ్రి)గా కనిపించటం విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి