ఫ్లాష్ బ్యాక్ @ 50

రేచుక్క- పగటిచుక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1911లో బందరులో జన్మించిన కమలాకర కామేశ్వరరావు తొలుత జర్నలిస్ట్‌గా పనిచేశారు. నిర్మాత హెచ్‌ఎం రెడ్డి ద్వారా 1937లో దర్శకత్వ శాఖలోకి ప్రవేశించారు. వాహిని, విజయా సంస్థలతో, బిఎన్ రెడ్డి, కెవి రెడ్డిల సన్నిహితత్వంతో తొలిసారి చంద్రహారం (1954) చిత్రానికి దర్శకత్వం వహించారు. 1999 వరకూ 30 తెలుగు చిత్రాలు, ఆరు తమిళ చిత్రాలకు దర్శకత్వం నెరపారు. ఆయన తీసిన చిత్రాలతో పౌరాణిక బ్రహ్మ బిరుదు పొందారు. కమలాకర దర్శకత్వంలో విజయా అధినేత బి నాగిరెడ్డి, నందమూరి త్రివిక్రమరావులు స్వస్తిశ్రీ పతాకంపై 1959లో రూపొందించిన జానపద చిత్రం ‘రేచుక్క- పగటిచుక్క’. 1959 మే 14న విడుదలైంది.
మాటలు- పాటలు: సముద్రాల జూనియర్
నృత్యం: వెంపటి సత్యం
కళ: తోట
కెమెరా: ఎం రెహమాన్
కూర్పు: జిడి జోషి
స్టంట్స్: మాస్టర్ సోము
పర్యవేక్షణ: పుండరీకాక్షయ్య
దర్శకత్వం: కె కామేశ్వరరావు
చిత్రానువాదం, నిర్మాత: త్రివిక్రమరావు.

ఈ చిత్రానికి కొద్దిపాటి మార్పులు చేసి ఇదే టీముతో తమిళంలో ‘రాజా సై లేవా’గానూ రూపొందించారు.
చక్రవర్తి వీరరాఘవులు (సీఎస్‌ఆర్) అసమర్ధుడు, పిరికివాడు. దీంతో అతని తమ్ముడు విక్రమసింహుడు అధికారం చెలాయిస్తుంటాడు. సామంత రాజు విజయరాయలు (ఎస్‌వి రంగారావు), భార్య సుమతి (కన్నాంబ) తనయుడి పుట్టిన రోజు వేడుకల్లో ఉండగా, సమావేశానికి హాజరుకావాలంటూ చక్రవర్తి నుంచి ఆహ్వానం వస్తుంది. ఆ సభలో విక్రమసింహుని వల్ల తాను గర్భవతినయ్యానని, తనను స్వీకరించమని ఆటవిక నాయకుడు పులిరాజు (మహంకాళి వెంకయ్య) కుమార్తె గౌరి (ఎస్ వరలక్ష్మి) వేడుకుంటుంది. అయితే విక్రమసింహుని తిరస్కారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతుంది. దానికి ఆగ్రహించిన పులిరాజు, అతని అనుచరులను విక్రముడు దండించబోగా విజయరాయలు వారిస్తాడు. దాంతో విక్రమసింహుడు విజయరాయలను బంధించి అతని తోట తగలబెట్టిస్తాడు. ఆ ప్రమాదం నుంచి సుమతి, కొడుకు తప్పించుకుంటారు. పులిరాజు విజయరాయలను విడిపించి తనతో తీసుకెళ్తాడు. రాయలకోసం వెళ్లిన సేనాధిపతి ధర్మదేవుడు (నాగయ్య)కి బాలుడు, దాదిగా సుమతి లభిస్తారు. వారిని తన భవనానికి తెస్తాడు. విజయరాయలు రేచుక్కగా మారి విక్రమసింహుని అన్యాయాలు ఎదిరిస్తుంటాడు. చక్రవర్తి వీరరాఘవులుకు జన్మించిన ఆడపిల్లను విక్రమ్ అంతం చేయబోగా రేచుక్క ఆ పిల్లను రక్షించి పెంచి పెద్దచేస్తాడు. విజయ్‌కుమార్ (ఎన్టీఆర్)గా పెరిగిన రాయల కుమారుడు సకల విద్యలునేర్చి విజయదశమి వేడుకల్లో పోటీల్లో స్నేహితుడు అయోమయం (రేలంగి)తోపాటు పాల్గొంటాడు. అంతకుముందుగా విక్రమసింహుని కుమారుడు ఉత్తరకుమారుని (రాజనాల) రేచుక్క బంధిస్తాడు. పోటీల్లో విజయం సాధించిన విజయుని, తన కుమారుని విడిపించి రేచుక్కను బంధించి తెమ్మని విక్రమసింహుడు ఆదేశిస్తాడు. ఆరు నెలల గడువులో సాధించమన్న ఆ లక్ష్యం కోసం వెళ్లిన విజయుడు, యువరాణిని (జానకి) కలుసుకోవటం, ఆమెతో ప్రేమలో పడటం జరుగుతుంది. తొలుత ఉత్తర కుమారుని విడిపించి, ఆపైన రేచుక్కతో తలపడి అతన్ని బంధించి తెస్తాడు విజయుడు. సుమతి అతడు తన భర్తేనని గ్రహించి, ఈ నిజం విజయునికి తెలియచేయటం, వారందరినీ బంధించి హింసించబోయిన విక్రమసింహుని రేచుక్క, విజయుడు ఎదుర్కొని విజయం సాధించటం, యువరాణి, విజయుల వివాహంతో కథ సుఖాంతమవుతుంది.
దర్శకులు కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రంలో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. చిత్రం పేరుకుతగ్గట్టు విజయరాయలు రేచుక్కగా మారటంతో, ఆ పాత్రకు ప్రాధాన్యం కల్పించారు. కొండ గుహలో భారీ సెట్టింగ్స్‌తో పెట్టిన విగ్రహం, స్తంభాలకు నాలుగు విగ్రహాలు, -్భళీ, భళీ భళ్లారి దేవా గీతం అద్భుతం అనిపిస్తాయి. తన జీవితం ముసుగులో గడపటానికి కారణాన్ని కళ్లకు, మొహానికి ముసుగుదీసి చివర వివరించటం, విక్రమసింహుని అరాచకాలు అడ్డుకోవటం, యుక్తితో రాకుమారిని రక్షించి ప్రేమతో పెంచటంలాంటి సన్నివేశాలు కమలాకరకే చెల్లాయి అనిపిస్తుంది. కొలువు వంకతో వచ్చిన విజయుని శక్తియుక్తులను విజయరాయులు అభినందించటం, విజయునితో పోరులో ‘తాను తన బిడ్డకిచ్చిన రక్ష గొలుసు’ చూచి నిరుత్తరుడై విజయుని దెబ్బకు లొంగిపోయిన సన్నివేశం దర్శకుని ప్రతిభకు తార్కాణం అనిపిస్తాయి. చెరలో భార్యను, కుమారుని కలుసుకొని ఆనందించటంతోపాటు యువరాణిని మహారాణిగా నిలబెట్టాలన్న వాంఛను వారికి వెల్లడించటం, విక్రమునిచే తిరిగి శిక్షించబడే సమయంలో పులిరాజు సాయంతో తిరగబడి యుద్ధం పలురకాలుగా విన్యాసాలతో తలపడి విక్రమసింహుని అంతంచేయటం ప్రధాన పాత్ర ప్రాధాన్యతను తేటతెల్లం చేస్తుంది. అలాగే పూటకూళ్లమ్మ ఛాయాదేవివద్ద, పులిరాజువద్ద తన మిత్రుడు పగటిచుక్క అని అయోమయం ప్రకటించగా, అయోమయం, జబ్బకున్న రక్షను పులిరాజు తెలివిగా తీయటం, దాన్ని విజయుడు చాకచక్యంతో తీసుకోవటం, మరోసారి ఆటవికుల బృంద నృత్యంలో పులిరాజు ఉంగరం సంపాదించి, దానిసాయంతో బందీగావున్న ఉత్తర కుమారుని, అయోమయంలను విడిపించటం, తండ్రిని కలుసుకున్నాక, వారు విక్రమసింహునితో పోరుచేయటం, తాను మిగిలిన సైన్యాన్ని ఎదిరించి విజయం చేకూర్చటం, పగటిచుక్క బిరుదుకు తగ్గట్టు వర్తించటం వంటి అంశాలతో ఎన్టీఆర్ పాత్రకు ప్రాధాన్యత కల్పించారు. చిత్రంలో ఎస్‌వి రంగారావు ధీరగంభీర సున్నిత శౌర్య విక్రమనేత నటన ప్రదర్శించారు. ధీటుగా దానికితగ్గ నటన, యువరాణితో సున్నిత ప్రణయం, ఓ చక్కని యుగళగీతం (కొండప్రక్కన జలపాతం, చంద్రుడు, వారి సంకేత స్థలంగా ఆహ్లాదకరమైన సెట్టింగ్‌లో) -ఔనాకాదా ఏదని మీరు (ఘంటసాల, పి సుశీల)లో ముచ్చట గొలిపేలా అభినయించి, -మనవి సేయవే (ఘంటసాల) మధుర గీతంతోనూ ఎన్టీఆర్ మెప్పించారు. యువరాణిగా షావుకారు జానకి సున్నితత్వం, గాంభీర్యం, కొద్దిపాటి ఉద్రేకం, విజయునిపట్ల అనురాగం, అతడు మోసం చేశాడేమోనని సంశయం, తండ్రి రేచుక్కపట్ల ఆప్యాయత.. ఇలా పలు భావాలను ఎంతో ఈజ్‌తో నటనలో చూపారు. కన్నాంబ తనదైన శైలిలో నిబ్బరంతో కూడిన నటన, క్లయిమాక్స్‌లో సైనికుల శూలాలను ఒక్కొకటి ఛేదిస్తూ ఆవేశంగా చక్రవర్తినుద్దేశించి విజయరాయలకు, ప్రజలకు జరుగుతుతున్న అన్యాయాలను వివరించే సన్నివేశంలో దర్శకుల అంచనాలకు దీటుగా ప్రదర్శించటం ఎన్నదగిన అంశం. అలాగే గౌరిగా అతిథి పాత్రను పోషించి ఎస్ వరలక్ష్మి ఆ పాత్ర ప్రవేశం, వేడుకోలు, ఆత్మత్యాగం వంటి సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు, వరలక్ష్మి నటనకు ప్రతీకగా నిలిచాయి. టక్కుగా పద్మనాభం, టిక్కుగా బాలకృష్ణ, విక్రముని అనుచరుడుగా పేకేటి, ఇంకా వంగర నటించారు.
చిత్రంలోని గీతాలు: రేలంగి, గిరిజలపై -కుచ్చుటోపి జాడ చూసి వచ్చావనుకొంటి (స్వర్ణలత, ఘంటసాల), కన్నాంబ, బాలునితో ప్రారంభంలో -‘వర్ధిల్లు రాకుమారా మా ఇంట (పి లీల), యువరాణిపై సాగే గీతం -మా ఆశ నీవేగా గారాల మా తల్లి (పి లీల బృందం), రేలంగి, ఎన్టీఆర్ రేచుక్క కోసం వెళ్తూ పాడే గీతం -పంతంపట్టి మేం పయనమయ్యాం (ఘంటసాల), విజయదశమి వేడుకల్లో -అన్నలారా, తమ్ములారా ఆరోగ్యమే భాగ్యం (ఘంటసాల బృందం) గీతాలు అలరిస్తాయి. అన్నలారా, తమ్ములారా పాటలో మల్లయోధులు ఆంధ్రా టైగర్ కాంతారావు, కర్రసాములో పొట్లూరి సత్యనారాయణ, పులి ఆట గర్రా అప్పారావువంటి ప్రముఖులు పాల్గొనటం, ఎన్టీఆర్ పాటకుతగ్గ విన్యాసాలు, పోరాటాలు చేయటం విశేషం. ఆటవికుల నృత్యంలో ఎన్టీఆర్, పులిరాజు ప్రధానంగా కనిపిస్తారు. రేచుక్క- పగట్టిచుక్క చిత్రం అలరించే జానపద చిత్రంగా నిలిచింది. చిత్రంలోని రెండు గీతాలు ‘ఔనా కాదా’, ‘మనవి సేయకే’ ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి