ఫ్లాష్ బ్యాక్ @ 50

శ్రీరామకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ హాస్య నటుడు, నిర్మాత బి పద్మనాభం తొలిసారిగా దర్శకత్వం వహించి, తన తమ్ముడు బి పురుషోత్తం నిర్మాతగా రూపొందించిన చిత్రం -శ్రీరామకథ. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరామునిగాథ పలు అంశాలతో వైవిధ్యభరితంగా పలు చిత్రాలు రూపొంది ప్రజాదరణ పొందాయి. ఒకే అంశంతో కూడిన ఈ చిత్రాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఈ శ్రీ రామకథ చిత్రంలో సీతారాములకు ఎందుకు వియోగం సంభవించిందన్న అంశం ప్రాథమికంగా పరిగణించి, దానికి కల్యాణం అంశం జోడింపుతో ప్రముఖ రచయిత వీటూరి కథ, మాటలు, పద్యాలు సమకూర్చారు. 1969 జనవరి 1న ఈ చిత్రం విడుదలైంది.

సంగీతం: ఎస్‌పి కోదండపాణి
కళ: మాధవపెద్ది గోఖలే
ఛాయాగ్రహణం: సత్యనారాయణ
నృత్యం: వెంపటి సత్యం, పసుమర్తి, కెఎస్ రెడ్డి
ఎడిటింగ్: హరినారాయణ
నిర్మాత: బి పురుషోత్తం
దర్శకత్వం: బి పద్మనాభం

నారదుడు (పద్మనాభం) శ్రీరామ కథా గానంలో శ్రీరామ జననం మొదలు సీతావియోగంతో తల్లడిల్లుతున్న రామునికి గతం గుర్తు చేయటంతో సినిమా మొదలవుతుంది. ఒకనాడు వైకుంఠం చేరిన నారదుడు, అక్కడ శ్రీహరిసహా బ్రహ్మాది దేవతలు రతీ మన్మథులను ఆరాధించటం గమనిస్తాడు. రక్తి గొప్పదా? భక్తి గొప్పదా? అని శ్రీహరిని ప్రశ్నించి వారిని, వారి ఆరాధనను విమర్శిస్తాడు. దీంతో మన్మథుడు నారదునిపై ఆగ్రహిస్తాడు. శ్రీహరి అనునయిస్తాడు. నారదుని ప్రోత్సాహంతో వైకుంఠం వచ్చిన భూదేవి, శ్రీహరి అనురాగం పొందిన శ్రీలక్ష్మిని (శారద) నిందిస్తుంది. దీంతో భూదేవి, శ్రీలక్ష్మిలు పరస్పరం ఆగ్రహానికి గురై ఒకరినొకరు శపించుకుంటారు. భూదేవిని రాక్షస కులంలో జన్మించమని శ్రీలక్ష్మి శపిస్తే, శ్రీలక్ష్మిని మానవకాంతగా జన్మించి రాక్షసులచే బాధలు పడమని భూదేవి (జయలలిత) శపిస్తుంది. వారిద్దరినీ శ్రీహరి అనునయించి భూదేవి భూలోకంలో తనకు శ్రీమతిగా జన్మించి తన అనురాగం పొందగలదని, శ్రీలక్ష్మి రామావతారంలో సీతగా తన అర్ధాంగి కాగలదని వరమిస్తాడు. ఆ ప్రకారం భూలోకంలో రాక్షసరాజు, విష్ణ్భుక్తుడైన మకరధ్వజుడు (గుమ్మడి) భవాని (అంజలి దేవి) దంపతులకు భూదేవి కుమార్తెగా జన్మిస్తుంది. భార్య గర్భవతిగా ఉన్నపుడు విష్ణు సాక్షాత్కారం కోసం తపస్సుకు వెళ్లిన మకరధ్వజుడు, కుమార్తె శ్రీమతికి (జయలలిత) 18 ఏళ్లు వచ్చిన తరువాత నిరాశతో తిరిగొస్తాడు. విష్ణుదర్శనం కాకపోవడంతో విష్ణుద్వేషిగా మారతాడు. తన భార్య, కుమార్తెల విష్ణు పూజను, రాజ్యంలోని దేవాలయాలు, ఋషుల పూజలను నిషేధిస్తాడు. శ్రీహరి ఆరాధకురాలైన తన కుమార్తెను ఆ ధ్యాసనుంచి మరల్చాలని గురువు ప్రగల్భాచార్యులు (రేలంగి), నాట్య గురువుగా వచ్చిన వల్లభాచార్యుల (హరనాథ్)ను నియమిస్తాడు. వల్లభాచార్యులుగా వచ్చిన శ్రీహరినే శ్రీమతి ఆరాధించటం, మకరధ్వజుని మేనల్లుడు ధూమ్రాక్షుని (ప్రభాకర్‌రెడ్డి) తిరస్కరించటం జరుగుతుంది. నారదుని మేనల్లుడు పర్వతుడు రాజేంద్రుడు (రామకృష్ణ), నారదుడు కూడా శ్రీమతిచే వరించాలనుకుంటారు. అందుకోసం -నారదుడు కోతిలా కనిపించాలని పర్వతుడు, పర్వతుడు గాడిదలా కనిపించాలని నారదుడు ఒకరికి తెలియకుండా మరొకరు శ్రీహరిని వేడుకుంటారు. అయితే స్వయంవరంలో శ్రీమతి శ్రీహరిని మాలవేసి వరిస్తుంది. అలా ఆకసానికెగిసిన శ్రీమతీ శ్రీహరిలను వెంబడించిన మకరధ్వజుడు విష్ణుస్తుతి చేస్తాడు. నారదుడు మాత్రం ఆగ్రహంతో శ్రీహరిని శపిస్తాడు. ఆ శాప ఫలం రామావతారంలో దక్కుతుందని శ్రీహరి శెలవివ్వడంతో చిత్రం ముగుస్తుంది. చిత్రంలో రతీదేవి, లహరిగా గీతాంజలి, ఇంద్రునిగా చలపతిరావు, ప్రగల్భాచార్యుని భార్య చారుశీలగా సూర్యకాంతం, రాజగురువు శలభాచార్యునిగా పెరుమాళ్లు, రావణాసురునిగా సత్యనారాయణ నటించారు.
నాటకరంగంలో విశేషానుభవం, సినీరంగంలో హాస్యనటుడు, అభిరుచి కలిగిన నిర్మాతగా రాణించిన పద్మనాభం తొలిసారి దర్శకుడిగా మారిన చిత్రమిది. సీతావియోగానికి ముందు శ్రీమతి కల్యాణం అనే ఇతివృత్తంతో ‘శ్రీరామకథ’ను చిత్రీకరించారు. చక్కని సన్నివేశాలు, రూపకల్పనతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
తొలుత శ్రీ రామకథను రాముడి జననం నుంచి అడవిలో పర్ణశాల వరకూ కొంత భాగం, మరలా కొన్ని సన్నివేశాలతో సీతాపహరణం, కొంత చిత్రం జరిగాక హనుమంతుడి కథను పాటగా చూపిస్తూ చిత్రం పూర్తి చేయటం జరిగింది. ప్రతి చరణాన్నీ దృశ్యంగా చిత్రీకరించటం; దశరధుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయిగా నాగయ్య, హేమలత, నిర్మల, మాలతి, మందరగా లక్ష్మీకాంతమ్మ, మరికొన్ని పాత్రల్లో మిక్కిలినేని, ముక్కామల కనిపిస్తారు. దేవతల మన్మధ పూజను నారదుడు విమర్శించటం, భూదేవిని శ్రీలక్ష్మితో పోల్చి రెచ్చగొట్టడం, శ్రీహరి అనురాగానికై ఆమె వేదన, విష్ణ్భుక్తుడైన మకరధ్వజుడు అహంకారంతో తపమొనర్చి విష్ణు సాక్షాత్కారం లభించక విష్ణుద్వేషిగా మారటంలాంటి సన్నివేశాలు దర్శకుడి ప్రతిభకు అద్దంపడతాయి. పర్వతరాజు రామకృష్ణ కన్యానే్వషణకు శ్రీహరి ‘మానిని మనోదర్శిని’ అద్దం (దర్పణం) ద్వారా యోగ్యురాలైన కన్యకై అనే్వషణ; మన్మధబాణ ప్రయోగంలో నారదుడు శ్రీమతిపై మోహం పెంచుకోవటం; మామా అల్లుళ్ళిద్దరూ శ్రీమతికై వెంపర్లాట; ప్రగల్భాచార్యుడు పేరుకు తగ్గ ప్రగల్భాలు వల్లించటం, అవి విఫలమవటాన్ని హాస్యంగానూ; శ్రీమతిని వశం చేసుకోబోయిన ధూమ్రాక్షుని పరాభవంవంటి చిన్న అంశాలను ఎంతో వివరంగా చిత్రీకరించి మెప్పించాడు దర్శకుడు పద్మనాభం. మకరధ్వజునిగా గుమ్మడి, నారదునిగా పద్మనాభం పాత్రోచితమైన, నిండుదనంతో కూడిన నటనతో మెప్పించారు.
చిత్రంలోని గీతాలు, పద్యాలు:
-ఒద్దికతో ఉన్నది చాలక (రచన వీటూరి, గానం: ఘంటసాల), -ఓం మదనాయ శృంగార (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం), -చక్కనివాడు మాధవుడు (పద్యం గానం: పి సుశీల, జయలలిత, పద్మనాభం, రామకృష్ణలపై చిత్రీకరించిన గీతం -టింగురంగా, నామోహనరంగా (గానం: పి సుశీల, పిఠాపురం, మాధవపెద్ది), అంజలిదేవీపై గీతం -రావేల కరుణాలవాలా (గానం: పి సుశీల, జయలలితపై చిత్రీకరించిన పద్యం -శౌరిపైగల నా ప్రేమ సత్యమేని (గానం: పి సుశీల), -యతోహస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, పి సుశీల), -శృంగార రస సందోహం (శ్లోకం గానం: ఎస్‌పి బాలు, పి సుశీల), గీతాంజలి, జయలలితపై చిత్రీకరించిన నృత్య గీతం -సర్వకళాసారము నాట్యము (గానం: పి సుశీల, ఎస్ జానకి), లహరి, రేలంగి, సూర్యాకాంతంపై గీతం -చారూ చారు నా బంగారు చారు (రచన: అప్పలాచార్య, గానం: రేలంగి, తిలకం), హరనాథ్, జయలలితపై చిత్రీకరించిన హిట్టు సాంగ్ -మాధవా, మాధవా నను లాలించరా, నీ లీలాకేళి (రచన: వీటూరి, గానం: పి సుశీల, ఘంటసాల). ఈ చిత్రంలో శ్రీ రామకథ భక్తిగీతాన్ని సీనియర్ సముద్రాల రచిస్తే, ఎస్‌పి బాలు బృందం ఆలపించింది. -రామకథ శ్రీరామకథ ఎన్నిసార్లు (చిత్రంలో రెండుసార్లు వస్తుంది).
కాగా తొలుత ‘కనకతార’ చిత్రంలో భక్తిగీతం (దేవుని మహిమ తెలియవశమా)తో మొదలుపెట్టి చివరి పాటను రాముని కథను వివరిస్తూ
సీనియర్ సముద్రాల ముగించారు. చివరిగా రాముని కథను వివరిస్తూ రాసిన పాటను నిర్మాత పద్మనాభానికి వినిపించమని చెప్పి, నిద్రకోసం గదిలోకి వెళ్లిన సముద్రాలవారు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవటం విశేషమైన విషాదాంతం.
జయాపజయాలను లెక్కించక, శ్రీరామకథ చిత్రాన్ని ఓ చక్కని ప్రయత్నం, సంగీత, సాహిత్య విలువలకు పట్టంగట్టిన భక్తిరస చిత్రంగా పరిగణించాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి