ఫ్లాష్ బ్యాక్ @ 50

వీరపాండ్య కట్టబ్రహ్మన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత, నటుడు, దర్శకులు అయిన బి.ఆర్.పంతులు (బుడుగురు రామకృష్ణయ్య పంతులు) 1936లో ‘సంసార నౌక’ కన్నడ చిత్రం ద్వారా నటుడిగా ప్రవేశించారు. 1950లో పి.పుల్లయ్యగారితో కలిసి ‘మత్సరేఖ’ తమిళ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత రచయిత పి.నీలకంఠంతో కలిసి పద్మిని పిక్చర్స్ నెలకొల్పి 1954లో ‘కల్యాణం, పనియం బ్రహ్మచారి’ తమిళ చిత్రాన్ని నిర్మించారు. ‘రత్నగిరి రహస్యం’ చిత్రంతో దర్శకత్వానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత వీరి దర్శక, నిర్మాణంలో ‘57’కు పైగా చిత్రాలు రూపొందాయి. ‘స్కూల్ మాస్టర్’, ‘శభాష్‌మీనా’, ‘కిట్టారూ చిన్నమ్మ, బడిపంతులు వంటి చిత్రాల తరువాత 1959లో వీరు రూపొందించి విడుదల చేసిన చిత్రం వీరపాండ్య కట్టబ్రహ్మన్న. తొలుత తమిళంలో రూపొందిన ఈ చిత్రానికి కథ శక్తి టి.కె.కృష్ణస్వామి, సంగీతం: జి.రామనాథన్, శివాజీ గణేషన్, ఎస్.వరలక్ష్మి, జెమినీ గణేషన్, పద్మిని, రాగిణి, రామస్వామి, జావర్ సీతారామ్ నటించారు. 16-05-1959న తమిళనాడులో విడుదలయింది.
ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేశారు. ఈ చిత్రానికి రచన: డి.వి.నరసరాజు, సంగీతం: టి.కె.కుమారస్వామి, బి.గోపాలం. తమిళనాడుకు చెందిన, తిరుచందూర్‌కు దగ్గరలోని ప్రాంతం పాంచాలపురం. దానికి ప్రభువు కట్టబ్రహ్మన్న. వర్తకానికి భారతదేశం వచ్చిన ఈస్టిండియా కంపెనీవారు క్రమంగా పాలకుల నుండి శిస్తులు వసూలు చేసుకొనే అధికారం పొంది, అనేకులను తమ అనుయాయులుగా మార్చుకున్నారు. అట్టివారిలో ఎల్లపునాయుడు (వి.కె.రామస్వామి) ఒకరు. వారి అధికారాన్ని ఎదిరించిన తొలి విప్లవవీరుడు, మాన్యుడు వీరపాండ్య కట్టబ్రహ్మన్న (శివాజీ గణేషన్) దైవభక్తుడు, వీరుడు. భార్య జక్కమ్మ (ఎస్.వరలక్ష్మి) తమ్ముడు, మరదలు (రాగిణి) తమ్ముని కుమార్తె చిన్నారి పట్ల వాత్సల్యం కలవాడు. సేనాధిపతి వీరయ్య నాయుడు (జెమినీ గణేషన్) తన కోడెను వంచిన వానిని వివాహం చేసుకుంటాననే వీరయమ్మ (పద్మిని) మాటప్రకారం కోడెను వంచి, ఆమెను పెండ్లి చేసుకుంటాడు. ఒంటరిగా వచ్చి కలుసుకొమ్మని కోరిన జాక్సన్ దొరవద్దకు వెళ్లిన కట్టబ్రహ్మన అతనికి ధీటుగా జవాబిచ్చి, అతని అనుచరుల నుంచి, సైన్యం నుంచి వీరోచితంగా పోరాడి తప్పించుకుంటాడు. జాక్సన్ దొర బదులు బ్రిటీష్‌వారు లూపింగ్‌టన్ దొరను పంపటం. అను తన సైన్యంతో ఫిరింగి దళంతో యుద్ధంలో పాంచాలపురం కోటను ధ్వంసం చేయటం, సేనాపతి, పలువురు వీరులు అస్తమించటం, గాయపడిన కట్టబ్రహ్మన అతని తమ్ముడు తప్పించుకుని పుదుచ్చేరికి చేరటం. ఆ రాజు వలన బ్రిటీష్‌వారి చేతికి చిక్కిన కట్టబ్రహ్మనపై నేరారోపణ చేసిన అధికారి అతనికి ఉరిశిక్ష విధించటం, తానూ మరణించినా మరెందరో విప్లవవీరులు మాతృభూమి దాస్యశృంఖలాలు చేధిస్తారని ఉద్వేగప్రసంగం చేసి, ఉరి త్రాటిని ముద్దాడి దాన్ని మెడకు తగిలించుకోవటం, కట్టప్ప మరణంతో బ్రిటీష్‌వారి జండా అవనతమై, భారత త్రివర్ణపతాకం, స్వాతంత్య్ర సిద్ధికి సింబాలిక్‌గా పైకి నిలవటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్ర ప్రారంభానికిముందు చిత్రకథను, సూక్ష్మంగా వివరించిన దర్శకులు బి.ఆర్.పంతులు, సన్నివేశాలను ఎంతో వివరంగా కొన్నిటిని, వీరప్పసేనాని, వీరాయమ్మల ప్రేమ కోడె ఎద్దుతో సేనాది పోరాటం, కట్టబ్రహ్మన్న దైవభక్తి, చతురత, వీరత్వం, తమ్ముని కుమార్తెపై వాత్సల్యం, భార్యపై అనురాగం యుద్ధానికి వెళ్లే తరుణంలో ఆమెతో వీడ్కోలు, వీరప్పనాయకుని, యుద్ధానికి వెళ్లవద్దని వీరమ్మ వారించే గీతం ‘పోనేలా, పోనేలా’ దుస్వప్నం ఇపుడే కంటిలు పట్టపుటేనుగు భువిపై శయనించటం, అరటితోట, మల్లెతోటల మాడిపోవటం, పసుపుకొమ్ము అరగదీయగా, బొగ్గుగా మారటం (గానం- ఎస్.జానకి) కట్టబ్రహ్మనకై వెతుకులాటలో కొండచిలువల జంటలు, అతి దుర్భేద్యమైన ప్రదేశంలో, సైనికుల వెతకటం, బ్రహ్మన్న చివరి సన్నివేశం, ఎంతో హృద్యంగా అలరించేలా చిత్రీకరించి మెప్పించారు.
ఈ చిత్రానికి డి.వి.నరసరాజు కూర్చిన సంభాషణలు పౌరుషోపేతంగా, దేశభక్తి పెంపొందేలా, వీరులశౌర్యం ప్రకటించేలా సాగటం విశేషం. జాక్సన్ దొర, బ్రహ్మన్నను శిస్తు, కప్పం, వడ్డీ చెల్లించాలని కోరగా దానికి బ్రహ్మన్న బదులు ‘‘వర్షం కురుస్తోంది, భూమి పంట పండుతోంది’’ నీవెందుకు కట్టాలి శిస్తు, ఎండలోకి వచ్చావా, నడుంకట్టి నాగలి దున్నావా, నారుపోసావా, కలుపుతీశావా? రైతులకు గంజి పోశావా దొర బ్రహ్మన్న నడుంపై చేయివేయగా ‘నా బొడ్డులో చేయి వేసిన నీ శిరస్సు వ్రక్కలు చేస్తాననటం’ అణుకువ మా జాతికి భూషణం, చివర ఇంగ్లీషు దొర లూషింగ్‌టన్ (జావర్ సీతారామన్)వద్ద శౌర్య విజ్ఞాన వేదాంతాలను పంచిన దేశం మా దేశం’’అని అతడు క్షమాపణ కోరమనగా తిరస్కరించి, ఉరి కొయ్యవద్ద పరమపావని భరతమాత, దేశభక్తులెందరో నీ దాస్య శృంఖలాలు ఛేదింప ప్రతినబూని వస్తారు. (నటులు కె.వి.యస్.శర్మ, శివాజీ గణేషన్‌కి డబ్బింగ్ చెప్పారు)
కట్టబ్రహ్మన్నగా శ్రీ శివాజీ గణేషన్ అద్భుతమైన, సన్నివేశానుగుణమైన నటనతో మెప్పించారు. తమ్ముని కుమార్తెపై వాత్సల్యం ఆమె రణరంగంలో, బ్రహ్మన్న చేతిలో మరణించటం, చివర తన వారందరినీ తన కోటను పోగొట్టుకొని, వేరే ప్రదేశంలో దాగి వుండడానికి విచారం చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోతుందని వేదన, యుద్ధంలో వీర మరణం పొందక, ఇలా విచారణలో ఉరికొయ్యకు బలికావటం, హేయమని ఎంతో కరుణరస పూరితమైన భావప్రకటనతో ఆకట్టుకున్నారు. కట్టన్న భార్య జక్కమ్మగా ఎస్.వరలక్ష్మి, భర్తకు తగిన ఇల్లాలుగా సమర్ధవంతంగా, వీరయ్య సేనానిగా జెమినీ గణేషన్, దేశభక్తిగల యోధునిగా, ఒక ప్రియునిగా ప్రేయసికై ఆరాటం, కాని దేశం ముందు అది తృణప్రాయంగా భావించే, సమయంలో యుక్తమైన నటన చూపగా, అందం, దర్పంగల వీరాయమ్మగా, నృత్యంలో మెప్పించిన పద్మిని, భర్తపై కాల్పులు జరిపిన సిపాయిని కత్తితో పొడిచి, వీర వనితగానూ మెప్పించేలా నటించింది.
ఈ చిత్రంలోని గీతాలు, జెమినీ గణేషన్, పద్మలపై యుగళ గీతం ‘ఇంపుసొంపు వెనె్నలే వెలుగులే’ (ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్) కట్టబ్రహ్మన్నను నిదురపుచ్చాలని ఎస్.వరలక్ష్మి పాడగా, తమ్ముని కుమార్తె నృత్యంతో గీతం ‘చిన్నారి తల్లినీ చిరునవ్వు చోద్యాల’ మరో గీతం ఎస్.వరలక్ష్మి రాగిణి, పద్మినిలపై ‘టక్కు టక్కు దడదడ ఉరుకు’ (ఎస్.వరలక్ష్మి, ఎస్.జానకి, ఏ.పి.కోమల) జాక్సన్‌వద్దకు సైన్యంతో బ్రహ్మన్న, బృందం వెళ్లేటప్పటి గీతం ‘పసిపిల్లలైనా పాలు తాగరురా మన కట్టబొమ్మ దొర పేరంటే’ (మాధవపెద్ది) మారువేషంలో దొంగలను పట్టబోయిన శివాజీ గణేషన్, ఇతరులపై గీతం ‘పెళ్లిబండి కట్టుకొని సొమ్ములన్ని’(మాధవపెద్ది, సుందరమ్మ) కార్తికేయుని పూజిస్తూ శివాజీ గణేషన్, ఎస్.వరలక్ష్మిలపై గీతం ‘‘ప్రభో కృపాకరా వేల్పుదొరా’ (బి.గోపాలం, ఎస్.వరలక్ష్మి) మరో భక్తిగీతం సెట్టింగ్ నృత్యంతో సాగుతుంది. ‘‘జక్కమ్మా వేరేది దిక్కమ్మా’’(మాధవపెద్ది బృందం), ‘సైసైరా కట్టబ్రహ్మన్న నీ పేరు విన్న సర్దార్లే నిదుర పోరన్న’ (మాధవపెద్ది బృందం). చివరి పద్యం ‘‘ఓ వీర పాండ్యకట్టబ్రహ్మన్న వురిపాలై ఒరిగిపోయావా’’(మాధవపెద్ది) ఈ గీతాల రచన కొసరాజు, ఆరుద్ర, సముద్రాల (జూనియర్).
‘‘వీరపాండ్య కట్టబ్రహ్మన్న’’ చిత్రం తమిళంలో 175 రోజులు పైగా ప్రదర్శింపబడింది. తెలుగులోనూ విజయవంతంగా నడిచింది.
ఈ చిత్రాన్ని హిందీలో ‘అమర్ షాహిద్‌గా’ 1960లో రూపొందించారు.
ఆంగ్లేయుల, అధికార దాహాన్ని ఎదిరించిన తొలి సాహసవీరుడు కట్టబ్రహ్మన్నను చిరస్మరణీయం చేసే రీతిలో రూపొందించిన ఈ చిత్రం జనామోదం పొందటమేకాక, విప్లవవీరులకెందరికో స్ఫూర్తిదాయకంగా నిలవటం, హర్షదాయకం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి