ఫ్లాష్ బ్యాక్ @ 50

అదృష్టవంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జిల్లా ఊడ్పుగల్లులోని సామాన్య కుటుంబంలో 1922 జూన్ 14న జన్మించారు వీరమాచినేని మధుసూధనరావు (వి మధుసూధనరావు). పునాదిపాడులో హైస్కూలు చదువు, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. యల్‌వి ప్రసాద్, కెయస్ ప్రకాశరావు, టి ప్రకాశ్‌రావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద ఫిల్మ్ క్రాఫ్ట్‌లోని అంశాలు బాగా అధ్యయనం చేశారు. సతీ తులసి (1959) పౌరాణిక చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 70 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అనేక చిత్రాల విజయాలు సాధించి విక్టరీ మధుసూధనరావుగా ప్రశంసలు అందుకున్నారు. జగపతి సంస్థ తొలి చిత్రం ‘అన్నపూర్ణ’కు వీరే దర్శకత్వం వహించారు. తరువాత వారు రూపొందించిన చిత్రాలకు వీరే సారథ్యం వహించటం.. జగపతి, మధుసూధనరావు మైత్రీబంధానికి నిదర్శనం. ‘అదృష్టవంతులు’ చిత్రానికి మధుసూధనరావు దర్శకత్వం వహించారు.
వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్ (విబి రాజేంద్రప్రసాద్) కాలేజీ చదువుకునే రోజుల్లో పలు నాటకాల్లో నటించేవారు. అక్కినేనికి వీరాభిమాని. వారి ప్రోత్సాహం, చిత్ర రంగంపట్ల మక్కువతో మద్రాసు వెళ్లి ‘జగపతి’ నిర్మాణ సంస్థ ప్రారంభించారు. విజయవంతమైన కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా, ‘దసరాబుల్లోడు’ చిత్రం నుంచి దర్శకునిగానూ పేరు పొందిన వ్యక్తి. అ, ఆల క్రమంలో టైటిల్‌తో చిత్రాలు నిర్మించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు తరువాత రూపొందించిన చిత్రం అదృష్టవంతులు. 1969 జనవరి 3న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్ వెంకటరత్నం, ఎడిటింగ్: ఎన్‌ఎస్ ప్రకాశం, స్టంట్స్: రాఘవులు, నృత్యం: చిన్న, సంపత్, సంగీతం: కెవి మహదేవన్, కళ: జివి సుబ్బారావు, మాటలు: ఆచార్య ఆత్రేయ, నిర్మాత: విబి రాజేంద్రప్రసాద్, దర్శకత్వం: వి మధుసూధనరావు
అదృష్టవంతులు చిత్రాన్ని ‘వన్స్ ఏ థీఫ్’ అనే ఆంగ్ల చిత్ర కథ ఆధారంగా రూపొందించటం గమనార్హం.
రఘు (మాస్టర్ ఆదినారాయణ) చిన్నతనంలో జబ్బుతోవున్న తల్లికి మందులు తెస్తుండగా, ఓ దొంగ అతని సంచిలో నగలువేసి పారిపోతాడు. పోలీసులు రఘును అరెస్ట్ చేయడంతో, అతని తల్లి (ఝాన్సీ) ఆవేదనతో మరణిస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకున్న రఘు (ఏఎన్నార్) దొంగల గుంపులో చేరి ఆరితేరిన దొంగగా మారతాడు. వారి నాయకుడు దొర (జగ్గయ్య), సహచరులు రాజు (ప్రభాకర్‌రెడ్డి), రజాక్ (ఆనందమోహన్)లతో పలు దోపిడీలు సాగిస్తుంటాడు. ఓరోజు ఓ బిడ్డను తల్లినుంచి దూరం చేసే చోరీలో, తన తల్లి, గతం గుర్తుకొచ్చి బిడ్డను ఆమెకు అందచేసే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయి ఐదేళ్ల శిక్షను అనుభవిస్తాడు. మంచివాడిగా జీవించాలని నిర్ణయించుకొని, అదే విషయాన్ని ఇన్‌స్పెక్టర్‌కు చెబుతాడు. దొర తిరిగి తనవద్దకు రమ్మని కోరినా తిరస్కరిస్తాడు. జాకీ (పద్మనాభం)తో కలిసి లారీ నడుపుతూ, జయ (జయలలిత)ను పెళ్లి చేసుకుంటాడు. వారికొక పాప బేబి (బేబిరాణి) పుడుతుంది. ప్రశాంతంగా జీవిస్తున్న రఘును పోలీస్ అధికారి మూర్తి (గుమ్మడి) ఒకవైపు, తిరిగి తన దారిలోకి మళ్లించేందుకు దొర మరోవైపు సాగించిన ప్రయత్నాల ఫలితంగా ఏ నేరమూ చేయకనే దొంగగా సమాజం ముద్రవేస్తుంది. రాజు లారీని తగలబెట్టడం, రఘుకు పని లేకపోవటం, జయ క్లబ్ డ్యాన్సర్‌గా కుటుంబాన్ని గడుపుతుంది. తిరిగి పాత జీవితంలోకి వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని రఘు పోలీసు అధికారికి తెలియజేస్తాడు. ఏమాత్రం అనుమానం రాకుండా ముఠాలోకి వెళ్లి, దొర చెప్పిన దోపిడిని అరికట్టి, నేరస్తులను పోలీసులకు పట్టిచ్చి తన నిజాయితి నిరూపించుకుంటాడు రఘు.
చిత్రంలో పద్మనాభం జంటగా గీతాంజలి, జాకీ తల్లి పెసరట్ల పేరమ్మగా సూర్యాకాంతం, గీతాంజలి తల్లి పుల్లట్ల పుల్లమ్మగా ఛాయాదేవి, వైవి రావు, అతిధి పాత్రలో రేలంగి, లారీ కంపెనీ ఓనరుగా సాక్షి రంగారావు, డబ్బింగ్ జానకి, రామచంద్రరావు నటించారు.
ఒకసారి నేరానికి పాల్పడి శిక్ష అనుభవించిన వ్యక్తిలో పరివర్తన కలిగి మంచివాడుగా మారినా.. సమాజం, పోలీసు వ్యవస్థ అతన్ని ఇంకా నేరస్తుడిగానే భావించి తరిమికొట్టడం, అలాంటి పరిస్థితుల్లో ఏర్పడే మానసిక సంఘర్షణలను తట్టుకొని నిలవటం అన్న విషయాలను ప్రధానాంశంగా ఈ చిత్రంలో రూపొందించారు. కొన్ని సన్నివేశాల రూపకల్పన దర్శకుని ప్రతిభకు అద్దంపట్టినట్టు ఉంటాయి. రఘు తన సహచరులతో కలిసి సినిమా షూటింగ్ ప్లానుతో పబ్లిక్‌గా ధనవంతుని దోచుకోవటం (ఈ సన్నివేశ ఆలోచనను కొద్దిగా అటూ ఇటూ మార్చి చాలా చిత్రాల్లో చూపించారు. కొన్నిచోట్ల నిజంగానూ ఇలాంటి దోపిడీలు జరిగాయి); అలాగే రేలంగిని ఎక్కిళ్లు ఆపొద్దని చెప్పి అతనిచేతే ఇనప్పెట్టె తెరిపించటం; పసివాడిని అపహరించే ప్రయత్నంలో హీరోకి అతని తల్లి గుర్తుకురావటం; హీరోయిన్ జయ మగవేషంతో ప్రవేశించటం, ఒక రాత్రి ఆమె జుట్టు కనపడి రఘుకు నిజం తెలియటంలాంటి సన్నివేశాలు అప్పట్లో క్రియేటివిటీ అనిపించుకున్నాయి. ఈ సన్నివేశంలోనే హీరో సాంగ్ -అయ్యయ్యో బ్రహ్మయ్యా (రచన: సినారె, గానం: ఘంటసాల)లో తొలిసారి అక్కినేనితో వెరైటీ స్టెప్పులు వేయించారు. తరువాత ఏఎన్నార్ అనేక చిత్రాలు ఇలాంటి స్టెప్స్‌తోనే కొనసాగడం గమనార్హం. రెండో దొంగతనం ముగించిన రఘుకు మందు ఇమ్మని దొర సూచించగా విజయలలిత తన బృందంతో, అక్కినేని తమాషా స్టెప్పులతో చిత్రీకరించిన గీతం -ము ము ముద్దంటే చేదా’ (రచన: ఆరుద్ర, గానం- ఘంటసాల, పి సుశీల). ఓ హత్య కేసులో నిందితుడు రఘు అని అనుమానించిన పోలీసు అధికారి మూర్తి, అతన్ని పలు గెటప్‌లు, కోటుతో పరీక్షించి విఫలమవటం; దీని కారణంగా రఘును జనం అనుమానించటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో చిత్రీకరించే సన్నివేశాల మాదిరే -50ఏళ్ల కిందటే దొర (జగ్గయ్య) తన స్థావరంలోకి వస్తున్నదెవరో ఎదురుగావున్న టీవీ స్క్రీన్‌పై చూడటంలాంటి సన్నివేశాన్ని రూపొందించటం దర్శకుడు ముందుచూపునకు తార్కాణం. పోలీసులకు రఘు ఫోను చేసే విషయం గ్రహించటం, దాన్ని హీరోకు తెలియచేసి దోపిడి ప్లాను మార్చటం, అలాగే పరుగెడుతున్న రైలుమీద తొలిసారి హీరో, విలన్ ఆనందమోహన్‌ల ఫైట్లు చిత్రీకరణ, ఎత్తయిన టవర్‌పై వివిధ భాగాల్లో ప్రభాకర్‌రెడ్డి, ఆనందమోహన్‌లతో ఫైట్ ఎంతో వివరంగా, విపులంగా చిత్రీకరించి, ఉత్సుకత కలిగించారు. చిత్రంలో రఘుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసనీయమైన నటన చూపటం, జయలలిత దానికి తగ్గట్టు.. చివరి సన్నివేశంలో భర్త మానసిక స్థితి అర్థం చేసుకుని పాత జీవితానికి వెళ్తాడేమోనని ఆవేదనపడటం లాంటి సన్నివేశాలను నిండుతనంతో చూపించారు. క్లబ్‌లో ‘మొక్కజొన్నతోటలో’ పాట
చిత్రీకరణలో దర్శకుడు ఎంతో థ్రిల్లింగ్‌గా చివర చరణానికి -రఘు, దొర, రాజు రావటం, రఘు జయను లాకెళ్లటం, చిత్రీకరణకు తగినట్టు మహదేవన్ మ్యూజిక్ అందించటం ఆకట్టుకుంటుంది. సూర్యాకాంతం, ఛాయాదేవీల హాస్యం ఇబ్బందికరంగా అనిపించినా, మిగిలిన చిత్రంయొక్క జిగిబిగిలో అది పెద్దగా పట్టించుకోరాదు.
గీతాలు: చిత్రంలోని గీతాలన్నీ ఘంటసాల, సుశీలే ఆలపించారు. పద్మనాభం, గీతాంజలిలపై చిత్రీకరించిన (హిందీ చిత్రం సంగంలోని ‘చోర్ రాధా చోర్’) చరణం పేరడీ -నా మనసే గోదారి/ నీ వయసే కావేరి (రచన: ఆరుద్ర). విజయలలిత, ఏఎన్నార్ బృందంపై డెన్‌లో చిత్రీకరించిన గీతం -పడిన ముద్ర చెరిగిపోదు రోయి (రచన: ఆరుద్ర). అక్కినేని, జయలలితలపై చిత్రీకరించిన తొలిరేయి గీతం (చల్లని వెనె్నలలో ఆహ్లాదకరంగా సున్నితంగా చిత్రీకరించారు) -కోడి కూసే ఝాముదాకా (రచన: ఆత్రేయ). వీరిరువురిపై ఆరుబయట స్టెప్పులతో సాగే గీతం -చింత చెట్టు చిగురు చూడు (ఆరుద్ర). జయలలిత డాన్స్‌తో చిత్రీకరించిన గీతం -మొక్కజొన్న తోటలో (రచన: కొనకళ్ళ వెంకటరత్నం. ఒరిజినల్ పాటను సినిమా కోసం కొంతమార్చారు). ఈ చిత్ర కథాంశాన్ని తెలియచేస్తూ అక్కినేనిపై చిత్రీకరించిన మరో గీతం ‘నమ్మరే, నేను మారానంటే నమ్మరే’ (ఆత్రేయ).
చిత్ర గీతాలు, పటిష్టమైన కథ, చిత్రీకరణ, సంగీతం, నటీనటుల అభినయం, అదృష్టవంతులు చిత్రాన్ని విజయపథంవైపు నడిపాయి. సూపర్ హిట్ సాధించిన చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్’ (1970)గా నిర్మాత పి మల్లిఖార్జునరావు, రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో నిర్మించారు. 15 ఏప్రిల్ 1970న విడుదలైన హిందీ చిత్రంలో హీరోగా జితేంద్ర, హీరోయిన్‌గా ముంతాజ్ నటించారు. విలన్ దొరగా అనంత్‌నాగ్, అనురులుగా ప్రభాకర్‌రెడ్డి, ఆనంద్‌మోహన్ హిందీలోనూ నటించారు.
ఈ చిత్రాన్ని తమిళంలో ‘తిరుడన్’గా శివాజీ గణేషన్, కెఆర్ విజయ, జయలలిత, కె బాలాజీ, మేజర్ సౌందర్‌రాజన్, ఎస్‌వి రామదాసు, నగేష్, కాంబినేషన్‌లో ఏసీ త్రిలోకచందర్ దర్శకత్వంలో ఎంఎస్ విశ్వనాథం సంగీతంతో నిర్మించారు. 1969 అక్టోబర్ 17న సినిమా విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రాన్ని సింహళంలో ‘ఎదత్ సూర్య, అదత్ సూర్యగా’ 1972లో రూపొందించారు. ‘అదృష్టవంతులు’ చిత్ర గీతాలు, చిత్రం నేటికీ వీక్షకులకు, శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయంటే ఆ చిత్రం దర్శకుడు, యూనిట్ కృషే.

-సీవీఆర్ మాణిక్వేశ్వరి