ఫ్లాష్ బ్యాక్ @ 50

మూగనోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1907 జూలైలో జన్మించారు ఏవి మొయ్యప్పన్. 1938లో ‘అల్లి అర్జున్’తో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టి 1940లో ప్రగతి స్టూడియోస్ ఆరంభించారు. 1945 నవంబర్ 14న శాంధోంలో ఏవీయం స్టూడియో ప్రారంభించి తరువాత వడపళనికి మార్చారు. 1950లో ‘జీవితం’ చిత్రం మొదలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వందకిపైగా సినిమాలు నిర్మించిన సంస్థ ఏవీయం. విశిష్ట స్థానం కలిగిన ఈ సంస్థ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించింది. 1979లో మొయ్యప్పన్ మరణించారు. తరువాత వారి కుమారులు శరవణన్, కుమరన్, మురుగన్ బాలసుబ్రహ్మణ్యంలు చిత్ర నిర్మాణం కొనసాగిస్తున్నారు. 1968లో రాము చిత్రం తరువాత 1969లో ఈ సంస్థ రూపొందించిన చిత్రం ‘మూగనోము.’ ఎల్‌వి ప్రసాద్‌వద్ద సహాయకునిగా పనిచేసి, 1953లో ‘అమ్మలక్కలు’ చిత్రంతో దర్శకునిగా ప్రస్థానం మొదలుపెట్టిన డి యోగానంద్ విజయవంతమైన చిత్రాల దర్శకునిగా ఖ్యాతిపొందారు. వారి దర్శకత్వంలో ‘మూగనోము’ చిత్రం రూపుదిద్దుకుంది.
ఈ చిత్రం తొలుత తమిళంలో ‘కలత్తూరు కన్నమ్మ’గా రూపుదిద్దుకుంది. సావిత్రి, జెమినీ గణేశన్ ప్రధాన పాత్రలు. టిఎస్ బాలయ్య (హీరో తండ్రి) ఎస్ సుబ్బయ్య, జావర్ సీతారామన్, దేవికలు ముఖ్య తారాగణం.
కథ: జావర్ సీతారామన్, సంగీతం: ఆర్ సుదర్శనం, దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్, నిర్మాత: మొయ్యప్పన్. 1960 ఆగస్టు 12న సినిమా విడుదలైంది. చిత్రంలో కన్నమ్మ కుమారుడు, బాలనటుడిగా కమల్‌హాసన్ తొలిసారి తమిళ తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం విజయం సాధించింది. అదే ఏడాది అక్టోబరులో ఈ సినిమాను తెలుగులో ‘మావూరి అమ్మాయి’గా అనువదించి విడుదల చేశారు. హిందీలో ఈ చిత్రాన్ని ‘మైనే ఛుప్ రాహోగే’గా 1962లో సునీల్‌దత్, మీనాకుమారి జంటగా నిర్మించారు. తరువాత సింహళంలో ‘మాంగలీక్’ టైటిల్‌తో నిర్మితమైంది. తెలుగులో ఏవీయం సంస్థ ‘మూగనోము’గా రూపొందించారు.
*
సంభాషణలు: డివి నరసరాజు
కథ: జావర్ సీతారామన్
సంగీతం: ఆర్ గోవర్ధనం
కూర్పు: ఆర్ విఠల్
కళ: ఏకె శేఖర్
ఛాయాగ్రహణం: పి భాస్కరరావు
దర్శకత్వం: డి యోగానంద్
నిర్మాతలు: మురుగన్, కుమరన్, శరవణన్
*
పెద్ద జమీందారు, దివాన్ బహద్దూర్ రాజగోపాలరావు (యస్వీ రంగారావు) జమిలో వ్యవసాయం చేసే రైతు సోమయ్య (నాగయ్య), కూతురు గౌరి (జమున). జమీందారు పుత్రుడు వేణుగోపాల్ (అక్కినేని) ఇంగ్లండులో చదివి ఇండియా వస్తాడు. అనుకోకుండా రైలులో కలిసిన గౌరితో తనొక ఎలక్ట్రిక్ ఉద్యోగినని పరిచయం చేసుకుంటాడు. ఊరికి వచ్చిన తరువాత అతడు జమీందారని తెలిసి దూరం కావాలనుకుంటుంది గౌరి. కాని తను మనసారా ప్రేమించానని ఆమెకు చెప్పి ఒప్పించి, ఊరి గుడిలో తాళికట్టి భార్యగా స్వీకరిస్తాడు. తరువాత తండ్రి చెప్పిన పనిమీద సింగపూర్ వెళ్తాడు. గౌరిని వేణు వివాహం చేసుకున్నాడని తెలుసుకుంటాడు జమీందారు. ఆమె గర్భవతి అని కూడా తెలుస్తుంది. దాంతో ఆమెను, ఆమె తండ్రిని ఊరువిడిచి వెళ్ళమంటాడు. వేణుతో వివాహం సంగతి ఎవరికీ తెలియనీయవద్దని ఆమెచే ప్రమాణం చేయించుకుంటాడు. ఆ ప్రకారం ఊరు వదిలి వెళ్లిన గౌరి ఒక మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. అయితే ఆమె తండ్రి, ఆ పిల్లాడిని రామాపురం అనాధాశ్రమంలో వదిలిపెట్టి, బాబు మరణించాడని గౌరికి చెబుతాడు. ఆమె బాధతో కుమిలిపోతుంది. సింగపూరు నుంచి వచ్చిన వేణు గౌరికోసం వెతికి, ఆమె జాడ తెలియక తాగుడు వ్యసనానికి బానిసవుతాడు. పట్నంలో ఒక నర్తకి (విజయలలిత) ఇంట్లో ఆమెను చూసి ఆమె శీలం గురించి నిందిస్తాడు. తరువాత గౌరి రామాపురం స్కూల్లో టీచర్‌గా చేరటం, అక్కడ ఆమె కొడుకు గోపి (బేబీ బ్రహ్మజీ) ఓ అనాధగా పరిచయమై ఆమెకు చేరువకావటం జరుగుతుంది. స్కూలు వార్షికోత్సవంలో గౌరిని ఊరు తీసుకెళ్తాడు. షావుకారు (రంగయ్య) రాజనాల, తన కూతురు రజని (వెన్నిరాడై నిర్మల)తో వేణుకు వివాహం చేయాలనుకొని పెద్ద జమిందారును ఒప్పిస్తాడు. గోపీ బలవంతంతో వేణు ఈ పెళ్లికి అంగీకరిస్తాడు. సోమయ్య వలన గోపియే తన కుమారుడని తెలిసి గౌరి అక్కడకు వస్తుంది. ఆమెను ద్వేషిస్తూ వేణు నిందిస్తాడు. గోపి తన కొడుకని చెప్పిన గౌరిని మరింతగా వేణు అవమానంగా మాట్లాడినా గౌరి ఏం మాట్లాడదు. అదే సమయంలో ఆస్తి మొత్తం పెళ్లికిముందే రాసిమ్మని కోరిన షావుకారు, అతని కుమార్తె నైజం గ్రహిస్తాడు జమిందారు. వెంటనే గౌరి తన కోడలని, గోపి తన మనవడని ప్రకటించటంతో ఆమె మూగనోము సమాప్తమై, అందరూ ఆనందించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
భారత స్ర్తి ఔన్నత్యాన్ని, కులంకంటె గుణం ప్రధానమని, ధనిక బీద తారతమ్యాలు పరిగణించక గుణానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలనే సందేశాన్ని చెబుతూ జావర్ సీతారామ్ సమకూర్చిన కథతో రూపొందిన చిత్రం అన్ని భాషల్లో విజయం సాధించటం ఓ విశేషం. చిత్రంలో నౌకరు రంగన్నగా పద్మనాభం, అతని జంటగా గీతాంజలి, ఇంకా కోళ్ల సత్యం, డాక్టర్ రమేష్‌లు నటించారు.
దర్శకులు యోగానంద్ తెలుగు వాతావరణానికి తగ్గట్టు సన్నివేశాలను తీర్చిదిద్దారు. వేణుకు గౌరి రెండుసార్లు నిజం చెప్పబోవటం, శరత్‌చంద్ర నవల వాగ చేతిలో ఉండటంతో తన వాగ్దానం మరచిపోకపోవటం, చివరిలో తన కన్న కొడుకని భర్తకే తెలియచేసే సన్నివేశంలో ‘ఈ బాబుకు తండ్రి ఎవరన్నది లోకం నన్ను కులట, పతిత, కళంకిని అని కాకుల్లా పొడిచి కాల్చుకుతిన్నా చెప్పలేదు. ఒకరింట్లో దీపం వెలగటానికి నా బతుకు దీపం ఆర్పుకున్నాను’ అంటుంది జమున. దానికి స్పందనగా జమీందారు మెట్టు మెట్టు దిగుతూ చివరలో ‘నీతికి మించిన ఆస్తి, నిర్మల మనస్సుకు మించిన అంతస్తు, త్యాగానికి మించిన ధనం లేదు. కంటినిండా నీరు, గుండెనిండా పాలు. ఇదీ ఆడదాని జీవితం’ అంటాడు. ఇలా పలు సందర్భోచిత సంభాషణల రచనను డివి నరసరాజు ఆవిష్కరించారు. తొలుత గౌరివద్ద జమీందారు వాగ్దానం తీసికొనేటప్పుడు ఆమె ఆవేదనను -గుడిలోని మద్దెల, తబలా వాయిద్యాలను జమున ముఖంపై సూపర్ ఇంపోజ్ చేసి చిత్రీకరించటం ఓ ప్రయోగం. అలాగే వైవిధ్యభరితంగా, ఆకట్టుకునేలా చిత్రం మధ్యలో సింహం- కుందేలు ఎపిసోడ్‌ను తమాషాగా అమర్చటం ప్రశంసనీయం. ఆయా సన్నివేశాలకు అక్కినేని, యస్వీ రంగారావు, జమున.. ముగ్గురూ తమ నటనతో బలం చేకూర్చారు.
చిత్ర గీతాలు:
జమున, అక్కినేనిలపై ప్రకృతిలో జాబిలితో చిత్రీకరించిన గీతం -పగడాల జాబిలి చూడు గగనాన (రచన: సి నారాయణ రెడ్డి, గానం: పి సుశీల, ఘంటసాల). అదే తోటలో పగటిపూట ఊయలపై జమున, అక్కినేనిలపై చిత్రీకరించిన గీతం -ఈ వేళ నీలో ఎందుకో (గానం: పి సుశీల, ఘంటసాల). ఈ పాటకు అంతకుముందు చేసిన ట్యూన్ నచ్చక లేత మనసులు హిందీ వర్షన్‌లోని పాటకు తగ్గట్టు దాశరధిచే పాట రాయించి, అక్కినేని కాల్‌షీట్స్ మళ్లీ తీసుకొని ఒక్కరోజులో పాట చిత్రీకరణ పూర్తి చేశారు దర్శకులు. విజయలలితపై చిత్రీకరించిన నృత్యగీతం -అలావుంటే ఎలా (రచన: దాశరధి, గానం: పి సుశీల). దాశరధి మరో రచనను అక్కినేనిపై చిత్రీకరిస్తే ఘంటసాల ఆలపించిన విషాద గీతం -నిజమైనా కలయైనా’. జమున, నాగయ్యలపై చిత్రీకరించిన గీతం -ఊరు మారినా/ ఉనికి మారునా (రచన: ఆరుద్ర, గానం: ఘంటసాల). మరో అద్భుత గీతం -తల్లివి నీవే తండ్రివి నీవే (రచన: ఆరుద్ర, గానం: పి సుశీల). చిన్న పిల్లల నాటకం -గొంతు విప్పి నే పాడితినా (రచన: కొసరాజు).
1969 ఫిబ్రవరి 1న మూగనోము విడుదలై శత దినోత్సవం జరుపుకుంది. గోపిగా నటించిన బేబీ బ్రహ్మాజికి మంచి గుర్తింపునిచ్చింది. మహిళా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రంగానూ ‘మూగనోము’ నిలవటం మరో విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి