ఫ్లాష్ బ్యాక్ @ 50

కథానాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామంలోని భూస్వామి కొడాలి గోపాలకృష్ణ. తమ అభిమాన హీరో యన్‌టి రామారావు హీరోగా, జయలలిత హీరోయిన్‌గా 1969లో వీరు నిర్మించిన చిత్రం -కథానాయకుడు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన బృంద గానంలోని ఓ స్టిల్‌ను తమ బ్యానర్ లోగోగా రూపొందించి ‘గోపాలకృష్ణ ప్రొడక్షన్స్’పై చిత్రాన్ని నిర్మించారు. తరువాత ‘దీర్ఘసుమంగళి’ (1974లో) నిర్మించారు. 23 ఆగస్టు, 1978లో గోపాలకృష్ణ పరమపదించారు. ‘కథానాయకుడు’ చిత్రంతో ‘బంగారు నంది పురస్కారం’ పొందిన నిర్మాత కావటం విశేషం. వీరి అల్లుడు వి బాలకృష్ణరావు ‘ఉషా పిక్చర్స్’ ద్వారా ప్రముఖ చిత్ర పంపిణీదారుగా ఖ్యాతి గడిస్తున్నారు. 27 ఫిబ్రవరి 1969న కథానాయకుడు చిత్రం విడుదలైంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కె ప్రత్యగాత్మ సోదరుడైన ప్రముఖ దర్శకుడు కె హేమాంబరధరరావు కథానాయకుడు చిత్రానికి దర్శకత్వం వహించారు.

కథ: ముళ్ళపూడి వెంకటరమణ
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
సంగీతం: టివి రాజు
కళ: బిఎస్ కృష్ణ
నృత్యం: తంగప్ప
స్టంట్స్: శ్యామ్‌సుందర్
కెమెరా: విఎస్‌ఆర్ స్వామి
నిర్మాత: కె గోపాలకృష్ణ
దర్శకత్వం: హేమాంబరధరరావు

ఒక పట్టణంలో ప్రజాసేవకులుగా పేరొందిన వ్యక్తులు దయానందం (నాగభూషణం), కంట్రాక్టర్ సత్యమూర్తి (మిక్కిలినేని). రేషన్‌షాపు ఓనర్ అప్పడు (అల్లు రామలింగయ్య), దయానందం సెక్రటరీ తాతారావు (కాకరావు), ప్రభుత్వ వైద్యుడు (డాక్టర్ రమేష్) న్యాయం, ధర్మం, నీతి నిజాయితీలకు తిలోదకాలిస్తారు. తమ అక్రమాలకు అడ్డుతగులుతున్న ధర్మారావును హత్యచేసి, గుండె జబ్బని ప్రచారం చేస్తారు. శిలా విగ్రహం ఏర్పాటు కోసం చందాలు వసూలు చేసి పంచుకుంటారు. దయానందం పెద్ద గుమాస్తా శ్రీనివాసరావు (్ధళిపాళ) నీతి నిజాయితీ కలవాడు. అతని భార్య టిజి కమలాదేవి, కూతురు శారద (కుట్టి పద్మిని), ఒక కొడుకు భరత్, అతని తమ్ముడు సారథి (యన్‌టి రామారావు). చిన్న ఉద్యోగం చేస్తూ నిజాయితీగావుంటూ దయానందం అక్రమాలకు అడ్డుతగులుతుంటాడు సారథి. అందుచేత వారు అతని ఉద్యోగం ఊడగొడతారు. అన్నచేత ఇంటినుంచి గెంటి వేయిస్తారు. పార్కులో పరిచయమైన పండ్లు అమ్ముకునే యువతి జయ (జయలలిత), ఆమె అన్న నాగులు (ప్రభాకర్‌రెడ్డి), గూడెం ప్రజల ఆదరణతో వారివద్ద పాకలో నివసిస్తుంటాడు సారథి. వాళ్ల సాయంతో ఆ పట్టణానికి చైర్మన్‌గా ఎన్నికవుతాడు. అక్కడ కూడా ఈ ప్రజాసేవకుల ఆటలు సాగనీయక పోవటంతో వారు అవిశ్వాస తీర్మానం ద్వారా అతన్ని పదవీచ్యుతుణ్ని చేస్తారు. విసిగిపోయిన సారథి, సిబిఐ ఆఫీసర్ జోగారావు (ముక్కామల) సాయంతో వారిని మోసంతో గెలుస్తాడు. అవినీతిపరుల్ని చట్టానికి పట్టించి కథానాయకుడు అనిపించుకుంటాడు. అన్న కుటుంబం, జయతో కలిసి కొత్త జీవితం ప్రారంభించుటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. చిత్రంలో సారథి స్నేహితుడు సింహగా పద్మనాభం, అతని భార్య రమగా రమాప్రభ, ఆమె తల్లిదండ్రులుగా రాధాకుమారి, రావి కొండలరావు, పక్కింటి ఇల్లరికపు అల్లుడిగా రాజ్‌బాబు, స్కూలు మాష్టారు చలపతిగా నాగయ్య, మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగిగా చలపతిరావు నటించారు.
చిత్ర దర్శకులు హేమాంబరధరరావు సన్నివేశాలను ఎంతో భావయుక్తంగా, పట్టుతో అర్ధవంతంగా రూపొందించి కథను సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత దయానందం, తరువాత సత్యమూర్తి, అప్పడు వరుసగా తమ చేతికర్రలతో ధర్మారావు వద్దకు వచ్చి, అతని మెడకు కర్రలతో బంధం వేసి అంతం చేయటం, బ్యాక్‌గ్రౌండ్‌లో సంఘంలో న్యాయం, ధర్మం, నీతి లక్షణాలను లెక్కచేయని వారి గురించి చెప్పించటం ఆసక్తికరం అనిపిస్తుంది. తిరిగి కైమాక్స్‌లో సారథిని అదేవిధంగా అంతం చేయాలని ముగ్గురూ కర్రలు బిగించగా, హీరో వాటిని ఛేదించి ముక్కలు చేసే సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఈ ముగ్గురు దుర్మార్గులున్న ఇంటి మెట్లమీది సన్నివేశంలో.. 10నెలల జీతం కోసం ఉపాధ్యాయుడు చలపతి దీనంగా అర్థిస్తూ ‘ఆకలితో మావాళ్లు అలమటిస్తున్నారని చెప్పే సందర్భంలో -అల్లు రామలింగయ్య (మంచింగ్) తినటం, గొంతులార్చుకుపోతున్నాయనగా మిక్కిలినేని మందు తాగడం, మెట్లకింద వున్న నాగయ్యను గెంటి వేయించటం, వారు రోడ్డుమీద ఆకలితో నీరసంతో తూలటం, మరోచోట నాగభూషణం మందు తాగిన మత్తుతో తూలటం సమాంతరంగా చూపి విశే్లషించటం దర్శకుని ప్రతిభకు తార్కాణంగా కనిపిస్తుంది. హాస్పిటల్‌లో డాక్టరు స్టాకులేదని మందివ్వక అతని మరణానికి కారణం కావటం, ఆ మెట్లముందు సారధి వార్నింగ్ ఒకసారి, మరోసారి చైర్మెన్ పదవి పోయిన సారథిని మెట్లమీంచి దిగుతూ దుర్మార్గ బృందం అతనిపై విస్కీ పోయటం, హేళన చేసి కొట్టిపడవేయటం వంటి సన్నివేశాలు కథలో పట్టును పెంచాయి. మార్పు స్వభావం తెలిసిన శ్రీనివాసరావు జనతా స్కీమ్ క్రింద పేదవారివద్ద వసూలు చేసిన సొమ్ము దాచటం, అతన్ని బంధించి ఈ దుష్టులు హింసించటం, క్లైమాక్స్‌లో డబ్బుకోసం త్రవ్వకంలో మిక్కిలినేని, అల్లు రామలింగయ్యకు పాము, గబ్బిలాలు, తేళ్లు రావటం, అక్కడ దుష్టులతో హీరో పోరాటం ఎంతో ఉత్సుకత, సాహసం ఉట్టిపడేలా చిత్రీకరించారు. నీతి, నిజాయితీ లక్షణాలు సామాన్యుల్లోనూ ఉంటాయని జయ పాత్ర ద్వారా చెబితే, తాగుబోతు నాగులు కూడా చెల్లెలికోసం మారటం ద్వారా మరింత బలంగా చూపించటం ఎన్నదగిన అంశం. లోగడ ‘పెద్దమనుషులు’, ‘దేశద్రోహులు’ వంటి పలు చిత్రాల్లోని అంశాలకు మరింత రంజుగా కథను సమకూర్చుకొని ముళ్ళపూడివారు, దానికి తగ్గ నిత్యసత్యాల్లాంటి సంభాషణల్ని (విలన్‌లు సారథితో- మాలాంటి వాళ్లు ఈ దేశంలో లక్షలమంది వున్నారు, వుంటారు. నీలాంటివాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.. మీవల్ల దేశంలో, మనుషుల్లో మార్పు రాదు) సమకూర్చి భమిడిపాటి రాధాకృష్ణ, దర్శకుల రూపకల్పనకు జోడిగా మహానటుడు యన్‌టిఆర్ సన్నివేశాలకు తగిన సంయమనంతో కూడిన ముచ్చటైన అభినయం, తోటి నటీనటుల సహకారం.. చిత్రాన్ని విజయపథంవైపు నడిపించింది. చిత్రంలో హీరో హీరోయిన్లపై ఒక్కటైనా యుగళగీతం, కనీసం కలలో కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క యుగళ గీతమైనా ఉంటే బావుంటుందేమోనని హీరో యన్‌టిఆర్ సూచించినపుడు, ఈ కథకు అది నప్పదు అని దర్శకులు హేమాంబరధరరావు చెప్పారట. దానిని యన్‌టిఆర్ ఎంతో హృద్యంగా అంగీకరించటం గొప్ప విశేషం.
అలాగే ఈ చిత్రాన్ని తమిళంలో రూపొందించటం కోసం విజయావారు, ఏవిఎం వారు, ఎంజి రామచంద్రన్ కోరటం, దానికి యన్‌టిఆర్ ఆ వ్యవహారాలన్నీ దర్శకులు, నిర్మాతల అభిష్టానికే వదిలివేయటం జరిగిందట.
చిత్ర గీతాలు:
జయలలితపై చిత్రీకరించిన గీతం -పళ్లండి పళ్లండి పళ్ళు జామ పళ్ళు’ (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). అద్దంలో హీరో తాను వలచిన అమ్మాయిగా జయను చూపించగా ఆనందంతో జయలలితచే నృత్య గీతం -ముత్యాల జల్లుకురిసే రతనాల’ (దాశరథి). ఈ చిత్రంలో హిట్ సాంగ్‌లో ఒకటిగా ఇది నిలిచింది. రాజ్‌బాబు, పద్మనాభంలపై చిత్రీకరించిన గీతం -రావేలా దయరాదా రావా ఇంటికి (గానం: పిఠాపురం, మాధవపెద్ది, రచన: దాశరథి). ఈ చిత్రంలోని మరో హిట్‌సాంగ్.. హీరో లక్షణాలను, కథను విశే్లషిస్తూ ఆకట్టుకునేలా వాద్యంతో, బృంద నృత్యంతో, యన్‌టిఆర్- జయలలితలపై చిత్రీకరించిన గీతం -వినవయ్యా రామయ్యా ఏమయ్యా భీమయ్య’ (గానం: పి సుశీల, ఘంటసాల బృందం, రచన: కొసరాజు). యన్‌టి రామారావు, జయలలిత నృత్య కళాకారులతో నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ముక్కామల హావభావాలను చూపుతూ చిత్రీకరించిన (ప్రత్యేకించి రంగుల్లో) గీతం -ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం’ (గానం: ఘంటసాల బృందం, రచన: దాశరథి). జయలలిత, నాగభూషణంలపై ఇంట్లో ఆరుబయట వెనె్నల్లో చిత్రీకరిస్తే, జయలలిత రకరకాల స్టెప్స్, అలరించే నృత్యంతో వెరైటీగా సాగే గీతం -వయసు మళ్లిన బుల్లోడా (గానం: పి సుశీల, రచన: దాశరథి). ‘కథానాయకుడు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడింది. శత దినోత్సవం జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా ‘బంగారు నంది’ పురస్కారంతో సత్కరించింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి