ఫ్లాష్ బ్యాక్ @ 50

మహాబలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1931లో ఉత్తరప్రదేశ్ ఆలీఘర్ ప్రాంతంలోని ఆట్రాలి గ్రామంలో జన్మించారు రవికాంత్ నగాయిచ్. హీరో యన్‌టి రామారావు నిర్మించిన ‘సీతారామకల్యాణం’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత గులేబకావళి కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, వీరాభిమన్యు వంటి పలు చిత్రాలకు ట్రిక్ ఫొటోగ్రాఫర్‌గా వినుతికెక్కారు. హిందీ చిత్రసీమలోనూ పలు చిత్రాలకు పని చేసి పేరుపొందారు. ‘్ఫర్జ్’ హిందీ చిత్రం తరువాత ‘జిగ్రీదోస్త్’ హిందీ చిత్రానికి, తెలుగులో ప్రముఖ నిర్మాత పి మల్లిఖార్జునరావు ప్రోత్సాహంతో 1969లో వారు నిర్మించిన ‘మహాబలుడు’ చిత్రానికీ దర్శకత్వం వహించారు.
పలు బ్యానర్లపై పలు చిత్రాలను రూపొందించి తెలుగు, హిందీ చిత్ర రంగాల్లో విజయం సాధించిన నిర్మాత పి మల్లికార్జునరావు భారతీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన ‘మహాబలుడు’ చిత్రం 18 ఏప్రిల్ 1969లో విడుదలైంది.

మాటలు: కె అప్పలాచార్య
కెమెరా: విఎస్‌ఆర్ కృష్ణారావు
నృత్యం: శ్రీను
సంగీతం: ఎస్ కోదండపాణి
కూర్పు: ఎస్‌ఎస్ ప్రకాశం
కళ: ఎస్ కృష్ణారావు
స్టంట్స్: ఎఆర్ భాషా
డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రాఫ్: వి శివరాం
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, దర్శకత్వం: రవికాంత్ నగాయిచ్
నిర్మాత: పి మల్లికార్జునరావు

తల్లిదండ్రుల కోరిక మేరకు యువరాజు ప్రతాపసింహుడు (కృష్ణ) ధర్మపురి యువరాణి ఇంద్రప్రభ (వాణిశ్రీ) స్వయంవరానికి వెళ్తాడు. ఇంద్రప్రభ వద్దనున్న ఇంద్రమణిని అపహరించేందుకు మాంత్రికుడు సర్వజిత్ (త్యాగరాజు) శిష్యుడు దుర్ముఖి (రావి కొండలరావు) అక్కడికి వస్తాడు. అతని మాయతో ప్రతాపుడు యువరాణి వద్దవుండటం, ఇంద్రమణి నల్లగా మారటం, ఇంద్రప్రభ అచేతనమవటం జరుగుతుంది. వీటన్నింటికీ ప్రతాపుడు కారణమని భావించిన మహారాజు ఆజ్ఞమేరకు ప్రతాపుడిని రాజభటులు హింసించి నగరం వెలుపల పడేస్తారు. దాహంతో ఓ గుహచేరతాడు ప్రతాపుడు. అక్కడ దొరికిన పానీయం తాగి మహాబలుడవుతాడు. యువరాణిని రక్షించే ప్రయత్నంలో మరుగుజ్జు కోయరాజును కలుస్తాడు. అక్కడినుంచి మారువేషంలో దుర్ముఖి ద్వారా చంద్రమణి, సూర్యమణుల జాడ తెలిసికొని సాహసంతో వాటిని సాధిస్తాడు. దుర్ముఖి వలన మాయచే మధువు తాగి తన శక్తికి కారణం వెల్లడించటంతో తిరిగి అశక్తుడౌతాడు ప్రతాపుడు. అతడిని చిలకగా మార్చి మణులతో సహా దుర్ముఖి, సర్వజిత్ వద్దకు వెళ్లటం, అక్కడ మూడు మణులను ఏకం చేయటంతో ఇంద్రప్రభ, కోయయువతి, సూర్యప్రభ ముగ్గురూ ఒకటిగా మారతారు. ప్రతాపుని సంహరించాలనుకున్న సర్వజిత్ ప్రాణ రహస్యాన్ని దుర్జయుడు (పెమ్మసాని రామకృష్ణ) సాయంతో తెలిసికొని, మాంత్రికుని సంహరించి ఇంద్రసేనతో రాజ్యానికి రావటం, వారి కల్యాణంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ప్రతాపుని తండ్రిగా నాగయ్య, చెలికానిగా పొట్టి ప్రసాద్, మరుగుజ్జుల రాజుగా రాజ్‌బాబు, కోయదొరగా రామచంద్రరావు, ఇంకా లక్ష్మీ, కోళ్ల సత్యం, శేషయ్య, ఉదయలక్ష్మి, సుంకరలక్ష్మి, ప్రభావతి, వడ్లమాని విశ్వనాథం, గీతాంజలి ఇతర పాత్రలు పోషించారు.
ఓ జానపద చిత్రానికి కావలిసిన కథ, దానికి తగిన రూపకల్పన, చిత్రీకరణతో దర్శకుడు రవికాంత్ సన్నివేశాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. స్వయంవరానికి వెళ్లిన ప్రతాపుడు ముందు రాత్రి యువరాణిని కలుసుకోవాలని ప్రయత్నించటం, మిగిలిన వారిని సేనాని అయిన రాజుగారి మేనల్లుడు.. రాజనర్తకి నృత్యం ఏర్పాటు ద్వారా విష ప్రయోగంతో సంహరించటం.. గాయపడిన ప్రతాపుడు దాహంతో శక్తివంతమైన పానీయం త్రాగటం.. ముని (వడ్లమాని) అతడిని శపించబోతూ చేకూరిన బలం గురించి హెచ్చరిక చేయటం.. దాన్ని ప్రతాపుడు మర్చిపోయి దుర్ముఖివల్ల పతనం కావటంలాంటి సన్నివేశాలు కథనంపై పట్టుపెంచాయి. అలాగే ఓ పండు తినటంవల్ల ప్రతాపుడు స్ర్తిగా(లక్ష్మి) మారటం, తిరిగి మరో పండు ద్వారా మగవానిగా మారటం, చంద్రమణి కోసం వెళ్తూ ఒంటి కన్ను, కొమ్ము రాక్షసుడిని సంహరించటం.. కోయగూడెంలో దుర్ముఖిని సీసాలో బంధించటం, సూర్యమణి కోసం చేసే ప్రయత్నంలో సాహసాలు, యుద్ధం ఓ గుహలో చిత్ర విచిత్రంగా సాగటంలాంటి సన్నివేశాలను దర్శకుడు ఆసక్తికరంగా, వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. మణిని సాధించి సూర్యప్రభతో కోయదొర వద్దకు రావటం, తిరిగి చిలకగామారి మాంత్రికుని గుహ చేరటం, సర్వజిత్ భయంకర రూపానికి విరుగుడుగా 3 మణులను కలిపి దుర్ముఖి ప్రయోగించటం, దానివెనుక ఓ గాథ -మునిపత్ని శాపం వంటివి చెప్పించటం, మాంత్రికుని గుండె భద్రపరిచిన చోటుకువెళ్లిన ప్రతాపుడు తెలివితో దాన్ని ప్రయత్నించి సాధించటం, దుర్జయిని సాయంతో పలురకాల పోరాటాలతో మాంత్రికుని సంహరించటంలాంటి వైవిధ్యభరితమైన అంశాలను కథలో కూర్చి చిత్రీకరించి, వాటికితగ్గ ట్రిక్ ఫొటోగ్రఫీ విన్యాసాలు (వృశ్చిక (తేలు) ఆకారంలో ఉన్న దానికి 3 మణులు అమర్చటం, వాటినుంచి వచ్చే జ్వాలలలో మాంత్రికునికి విముక్తి, చివరదాని ప్రయోగంతో గుహ విచ్ఛిన్నం కావటం వంటి అంశాలు) ఎంతో ప్రయాసతో, నూతనత్వంతో రూపొందించి మెప్పించారు.
జానపద హీరో ప్రతాపుసింహునిగా కృష్ణ పాత్రోచిత హావభావాలు, పోరాటాలను యుక్తంగా ప్రదర్శించి రాణించారు. వాణిశ్రీ దానికి ధీటుగా 3 పాత్రల వైవిధ్యాన్ని -కోయపిల్లగా గడుసుతనం, అమాయకత్వం, హీరోతో యుగళగీతం, చివర గుహలో మాంత్రికుని ఎదుట నృత్యగీతం, సూర్యప్రభగా రాజసం వంటి భావాలను నటనలో వైవిధ్యాన్ని చూపి అలరించింది. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా మెప్పించారు. నటి లక్ష్మి, రాజ్‌బాబుతో పాటలో (మగాడంటే మజా ఉన్నా.. గానం: పి సుశీల, రాజ్‌బాబు; రచన:ఆరుద్ర) కవ్వింపు మాటలు, విసురు (మహాబలుడు కృష్ణ స్ర్తిగా (లక్ష్మి) మారిన సందర్భం), తమాషా నడక, నటనలో వెరైటీ ఆకట్టుకునేలా చూపటం ఈ చిత్రంలో ప్రత్యేకాంశం.
మిగిలిన గీతాలు: కృష్ణ, యువరాణి ఇంద్రసేన (వాణిశ్రీ) మందిరంలో పాడే ప్రణయగీతం -ఏమే ఒప్పుల కుప్పా నిను ప్రేమిస్తే’ (గానం: ఎస్పీ బాలు, రచన: ఆరుద్ర). గీతాంజలిపై రాజకుమారులతో పాడే నృత్య గీతం -చూడండి మీకు చూపిస్తాను రుచి (గానం: పి సుశీల, రచన: దాశరథి). సూర్యప్రభ వద్ద చెలులు.. వాణిశ్రీ, కృష్ణతో పాడే గీతం -ఏటికి ఎదురీదకు ఇక్కడే ఉన్నది (గానం: పి సుశీల బృందం, రచన: ఆరుద్ర). మరో ఆరుద్ర గీతం ఈ చిత్రంలో హిట్ సాంగ్‌గా నిలిచింది. నేటికీ అలరిస్తూ ఆనందింప చేసే గీతం -విశాల గగనంలో చందమామ (గానం: ఎస్పీ బాలు, పి సుశీల). కోయగూడెంలోని గదిలో రాత్రిపూట కిటికీలోంచి చంద్రుని చూపుతూ కృష్ణ, వాణిశ్రీలపై చిత్రీకరించిన విధానం పాటకే వనె్న తెచ్చింది. ఈ చిత్రంలో సి నారాయణరెడ్డి రాసిన గీతం, గుహలో మాంత్రికుడు త్యాగరాజుముందు వాణిశ్రీపై చిత్రీకరణ -రావేలా జాగేలా ఓ ప్రియా (గానం: పి సుశీల). జయాపజయాలతో నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దల్ని అలరించేలా రూపొందిన జానపద చిత్రంగా మహాబలుడు ఆకట్టుకుంది అనవచ్చు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి