ఫ్లాష్ బ్యాక్ @ 50

ముగ్గురు మరాఠీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటుడి, నట జీవితానికి పునాది వేసిన వ్యక్తి శ్రీ ఘంటసాల బలరామయ్య. 1906న నెల్లూరు జిల్లాలోని పొట్టిపామెలో జన్మించారు. నలుగురు అన్నదమ్ములలో 3వ వారు. పెద్దన్నయ్య రాధాకృష్ణయ్యతో కలిసి పలు నాటకాలలో నటించారు.
మిత్రులతో కలిసి ‘శ్రీరామా ఫిల్మ్’ సంస్థ పేరిట ‘సతీతులసి’ (1936) నిర్మించారు. ఆ తరువాత వెంకటరెడ్డి అనే వ్యక్తితో కలిసి కుబేరా పిక్చర్స్ సంస్థను, కుబేరా స్టూడియో నిర్మించి మైరావణ (1940), మార్కండేయ నిర్మించారు. ఆ తరువాత దర్శకులు పి.పుల్లయ్యతో కలిసి 1941లో ప్రతిభా సంస్థను స్థాపించి, (1941) ‘పార్వతీ కల్యాణం’. గరుడ గర్వభంగం (1943), శ్రీ సీతారామ జననం (1944) అక్కినేని హీరోగా తొలి పరిచయ చిత్రం నిర్మించారు. ఆ తరువాత ముగ్గురు మరాఠీలు (1946) హీరోగా అక్కినేని 3వ చిత్రం రూపొందించారు. అక్కినేనితో ఆపైన బాలరాజు (1948), శ్రీలక్ష్మమ్మ కథ (1950), స్వప్నసుందరి (1950) తరువాత చిన్నకోడలు (1952), ఎన్.టి.ఆర్‌తో రేచుక్క రూపొందిస్తుండగా స్వర్గస్థులయినారు. దర్శకులు పి.పుల్లయ్య రేచుక్క పూర్తిచేయటం, అక్కినేని ఈ చిత్రంలో అతిథి పాత్రను పోషించటం విశేషం. విజయవంతమైన చిత్రాల నిర్మాతగా ఘనత వహించిన, మంచిమనిషి ఘంటసాల బలరామయ్య.
‘ముగ్గురు మరాఠీలు’ చిత్రానికి కథ-మాటలు- బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, ఎడిటింగ్-జి.డి.జోషి, ఫొటోగ్రఫీ- పి.శ్రీ్ధర్, పాటలు- తాపీ ధర్మారావు, ప్రయాగ నరసింహశాస్ర్తీ, కళ- ఎస్.వి.ఎస్.రామారావు, నృత్యం- వేదాంతం రాఘవయ్య, సంగీతం- ఓగిరాల రామచంద్రరావు, నిర్మాత- దర్శకులు శ్రీ ఘంటసాల బలరామయ్య.
మహారాష్టక్రు చెందిన వీరులగాథ, ముగ్గురు మరాఠీలు. బడేగ్రావ్ నుసిద్దోజి మహారాజు (గోవిందరాజుల సుబ్బారావు) పాలిస్తుంటాడు. అతని భార్య మహారాణి రుక్కూబాయి (కన్నాంబ) వారికి సంతానం లేదు. అన్నగారి కుమారులు సోమోజి (సిహెచ్.నారాయణరావు) సుబంధి (జి.నారాయణరావు), ఫిరోజి (అక్కినేని)లను పెంచి పెద్దచేస్తాడు. వారి పట్ల రుక్కుబాయి ద్వేషం పెంచుకొని, భర్త మనసులో విష బీజాలు నాటుతుంది. దానివలన సిద్దోజి, అన్న కుమారులను రాజ్యం నుంచి, పంపివేసి ముగ్గురికి 2 ఊళ్ళను ‘పత్తికోట’, ‘్ధరణికోట’ల అధికారం ఇస్తాడు. వారి మేనకోడలు రఘుబాయి (టి.జి.కమలాదేవి), ఫిరోజి ప్రేమించుకుంటారు. రుక్కుబాయి వారిని విడదీయాలని, తన తమ్ముడు తిమ్మోజి (కస్తూరి శివరాం)తో ఆమెకు వివాహం చేయాలనుకుంటుంది. అన్నదమ్ములు ముగ్గురిని కోటకు పిలిపించి, సిద్దోజి వారిని ఖైదుచేసి, తాను ధరణికోటపై దండెత్తి, దాన్ని తగలబెడతాడు. ఒంటరిగా వున్న సోమోజి భార్య అంశుబాయి (కుమారి) మామగారిని ఎదిరించి ఓడిస్తుంది. అన్నదమ్ములు తప్పించుకుని వచ్చి, నిలువ నీడలేక, ఒక గొల్ల ఇంటిలో తల దాచుకుంటారు. ఎల్లమ్మదేవి గుడిలో పూర్వీకులు దాచిన నిధిని ఫిరోజి సాహసంలో సాధిస్తాడు. సిద్దోజి కుట్రతో మంత్రాల రామిగాడితో సోమోజిని చంపిస్తాడు. భర్త చావుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న అంశుబాయి దానికోసం మరుదులను పంపుతుంది. ఆమె కుమారుడు పెద్దమరిది సుబంధి, రాజ నటులకు చిక్కుతారు. ఫిరోజి మరో సంస్థానానికి రాజవుతాడు. సుబంధిని, మనవడిని బలిచేయబోయిన మహారాజుకి ఒకవైపు అంశుబాయి ప్రజాసైన్యంతో, మరోవైపు ఫిరోజి తన సైన్యంతో వచ్చి వారి కాపాడడం, సిద్దోజికి, అంశుబాయికి మధ్య పోరులో, సిద్దోజి మరణించగా, ప్రాణత్యాగం చేసుకోబోయిన రుక్కుబాయిని తమ పెద్ద దిక్కుగా వుండమని, అందరూ కోరటం, ఆమెలో మార్పు వచ్చి, రఘుబాయిని, ఫిరోజి చేతిలో పెట్టటం, అందరూ ఆనందించటం చిత్రం శుభంగా ముగుస్తుంది.
మరో మహాభారతాన్ని తలపించే ఈ చిత్రకథలో రాజ్యభాగం కోరిన వారికి, 3 గ్రామాలను ఇవ్వటం, కుక్కలకు బదులుగా, ఒక గ్రామం తిరిగి తీసుకోవటం, సోమాజి పేదలపట్ల దయతో 3 సం. వసూలుచేయని శిస్తులను, దివాన్‌జీ సైన్యంతో కలిసి పశువులను బంధించి వ్యవసాయ పనిముట్లు స్వాధీనం చేసుకొని, సిద్దోజి ఆజ్ఞలు అమలుచేయటం, భట్రాజుల మాన్యాలను రద్దుచేయటం. ధర్మరాజు వంటి సోమోజీగా సిహెచ్.నారాయణరావు ప్రజాక్షేమమే ప్రభుత్వం కర్తవ్యం అని సామరస్యంగా వర్తించటం, అన్న కుమారుల పట్ల వాత్సల్యం, భార్య ఉద్బోధపై వారిపట్ల కాఠిన్యం, వివిధ ఉద్రేకాలను భావాలను గోవిందరాజుల సుబ్బారావు సిద్దోజిగా ప్రదర్శించగా, నయవంచన, ఆప్యాయత, ద్వేషం, అసూయ కలగలిసిన రుక్కుబాయిగా కన్నాంబ, తన స్వభావము తెలిపే గీతాలు ‘‘స్ర్తిభాగ్యమే, భాగ్యము’’, ‘‘పేరుకు నాపతి రాజీకాని పెత్తనమంతా నాదే కదా’’(కన్నాంబ) సుబంధి, మనవడు బంధించబడ్డాక ‘‘తీరుకదా నా ఆశ అంటూ అద్దంముందు అలంకరణ, విలనీని చక్కగా ప్రదర్శించటం దేవత (1941) సుమంగళి (1940) సాంఘిక చిత్రాల సాత్విక పాత్రపోషణకు వాసిగాంచిన కుమారి అంశుబాయిగా పౌరుషవంతురాలైన మరాఠీ వనితగా, ప్రతిజ్ఞ చేయటం, మామగారిపై కత్తిదూయటం ఇక ఫిరోజిగా అక్కినేని సాహసం, దుడుకుగల వీరునిగా వాటాలు పంచేటప్పుడు ‘మరో మహాభారత యుద్ధమే’ అనటం ఎల్లమ్మ గుడిలో నిధిని భక్తితో, సాహసంతో దక్కించుకోవటం, ప్రియురాలు రఘుబాయితో ‘‘చల్ ఛేల్ వయారి షికారి’అని (అక్కినేని టి.జి.కమలాదేవి) గానం చేయటం చిత్ర ప్రారంభ గీతం ‘‘జైజై భైరవ త్రిశూల ధారి’’గానం (కన్నాంబ, అక్కినేని, టి.జి.కమలాదేవి బృందం). ఇలా ఎంతో వైవిధ్య భరితమైన నటన చూపగా, రఘుబాయిగా కమలాదేవి బావకోసం ‘్ఫరోజి నా చిన్నిబావా’ గీతాన్ని బావ విరహంలో ‘‘రాలిపోతివా మాలతి’’ విచార గీతాన్ని, బావను తప్పించబోయి ఖైదీగా అతనికై వేచియుండడం పాత్రోచితమైన నటన చూపారు. ఈ సన్నివేశాలను ఎంతో అర్ధవంతంగా తీర్చిదిద్ది, ఆకట్టుకున్నారు. చిత్రీకరించి, చిత్రానికి నిండుతనం తెచ్చారు దర్శకులు బలరామయ్య. ముఖ్యంగా మంత్రాల రామిగాడు సోమోజిని చంపటం, కుక్కలు సోమోజి తలను తెచ్చి సోదరులకు ఇవ్వటం, కోటలను అన్యాయంగా రాజు తగల బెట్టించటం వంటి సన్నివేశాలు చిత్రానికి బలం చేకూర్చాయి.
ఈ చిత్రంలో గొల్ల వెంకన్న కూతురుగా నటించిన బెజవాడ రాజరత్నంపై రెండు గీతాలు ఒకటి చల్ల చిలుకుతూ ‘‘కృష్ణ కధా రాధాకృష్ణకధా’ ఖద్దరు వడకటం గూర్చి ‘‘వడకుమా రాటము భరతనారి కవచము’’ అంటూ రాట్నాలు కుమారి, రాజరత్నం ఇతరులు త్రిపుటం. కస్తూరి శివరావుపై గీతాలు రెండు ‘‘అప్పనా తన్నామన్న’’ మరో గీతం ‘‘జై వీరహనుమాన్ చలో’’ (గానం కస్తూరి శివరావు) రెండు బుర్రకథలు ప్రయాగ నరసింహమూర్తి బృందం ఆలపించారు. అవి ‘‘కరుణ మాని తన కొడుకుల తలలుగోరే’ మరొకటి ‘తగులబెట్టెను కోటలు.’’
‘‘ముగ్గురు మరాఠీలు’’ చిత్రం ఘన విజయం సాధించింది. 100 రోజులుదాకా ప్రదర్శింపబడింది. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి ప్రజామోదం పొందింది.
పౌరాణిక చిత్రాలతో మొదలుపెట్టి, జానపద, సాంఘిక చిత్రాలను, చారిత్రక చిత్రాలను, ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించి, విజయవంతమైన చిత్రాల నిర్మాతగా, దర్శకునిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకత సాధించిన ఘంటసాల బలరామయ్య సమర్ధతకు ‘‘ముగ్గురు మరాఠీలు’’ చిత్రం కూడా దోహదపడడం ఆనందించదగ్గ విషయం.

- సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి