ఫ్లాష్ బ్యాక్ @ 50

భలే మాస్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడలో చదువుకున్న సిఎస్ రాజు (చింతలపాటి సన్యాసిరాజు) వినోదావారి దేవదాసు చిత్రానికి సహాయ దర్శకత్వం వహించటం ద్వారా చిత్రసీమలోకి ప్రవేశించారు. 1961లో నిర్మాతగా మారి యన్‌టి రామారావు హీరోగా ‘టాక్సీరాముడు’ చిత్రం నిర్మించారు. 1969లో యన్‌టిఆర్ హీరోగా వీరు నిర్మించిన చిత్రం -్భలే మాస్టారు. తరువాత ‘పవిత్ర హృదయాలు’, ‘రాజపుత్ర రహస్యం’ చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాలన్నింటికీ హీరో యన్‌టిఆర్ కావటం విశేషం.
మోడరన్ థియేటర్స్ అధినేత టిఆర్ సుందరం నిర్మించిన ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంతో దర్శకునిగా ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్‌డి లాల్. 20 చిత్రాలకు పైగా సారథ్యం వహించి, ఎక్కువ హిందీ చిత్రాలు, రీమేక్‌ల నిర్వహణలో ‘రీమేక్ మాస్టారు’గా పేరుపొందారు. ఎస్‌డి లాల్ దర్శకత్వంలో 1969లో సిఎస్ రాజు నిర్మించిన చిత్రం -్భలేమాస్టారు. 1962లో విడుదలైన హిందీ చిత్రం ‘ప్రొఫెసర్’ ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రొఫెసర్ చిత్రానికి నిర్మాత ఎఫ్‌సి మెహ్రా కాగా, దర్శకత్వం లేఖ్ టాండన్. సంగీతం శంకర్ జైకిషన్. షమీకపూర్, కల్పన, బేలాబోస్, లలితాపవార్, టున్‌టున్, ఇఫ్టేకర్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ సాధించింది. 1962 మే 11న విడుదలైంది.
భలేమాస్టారు చిత్రం ‘విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ బేనర్’పై నిర్మించారు.

మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ
కళ: తోట
కూర్పు: బి గోపాలరావు
సంగీతం: టీవీ రాజు
నృత్యం: తంగప్ప, పసుమర్తి కృష్ణమూర్తి, చిన్ని, సంపత్
ఫొటోగ్రఫీ: కెఎస్ ప్రసాద్
స్టంట్స్: సాంబశివరావు
నిర్మాత: సిఎస్ రాజు.
దర్శకత్వం: ఎస్‌డి లాల్

మధుసూధనరావు (యన్‌టి రామారావు) డిగ్రీ చదివిన నిరుద్యోగి. కాలేజి క్రీడలు, నాటకాల్లో పతకాలు సాధిస్తాడు. అతని తల్లి (శాంతకుమారి)కి టీబీ వ్యాధి ముదరటంతో శానిటోరియంలో చేర్చటానికి డబ్బు కావాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రకటనలో 50ఏళ్ల వయసున్న ట్యూటర్ కావాలన్న షరతు చూసి, వేషం మార్చుకొని జమీందారిణి సీతాదేవి (అంజలిదేవి) ఎస్టేటుకు వెళ్తాడు. అక్కడ ఆమె తమ్ముని పిల్లలు విజయ (కాంచన), విమల (షీలా), బుచ్చిబాబు (రాజ్‌బాబు), మరో ఇద్దరు చిన్నవారికి ట్యూటర్‌గా కుదురుకుంటాడు. తల్లిదండ్రులు ప్రమాదంలో మరణించటంతో.. అవివాహిత, ఎస్టేటు యజమానురాలిగావున్న మేనత్తవద్దకు చేరిన పిల్లలు, ట్యూషన్ మాస్టారులను ఏదోక వంకతో పంపించేస్తుంటారు. కాని మధు తెలివిగా వారిని దారిలో పెడతాడు. ఆక్రమంలో విజయతో, మాస్టారి మేనల్లుడిగా మధు పేరిట పరిచయం పెంచుకుంటాడు. అదే సమయంలో సీతాదేవి మాస్టారును అభిమానిస్తుంటుంది. షీలా, గిరి (కృష్ణంరాజు) అనే వంచకుడివల్ల మోసపోవటం, నౌకరు జోగులు (అల్లు రామలింగయ్య) చెల్లెలు కాసులు (రమాప్రభ)ను బుచ్చిబాబు ఇష్టపడడం, చివరకు ఈ సంగతులన్నీ విజయ, మధుల ద్వారా సీతాదేవికి తెలుస్తాయి. మధు, గిరికి బుద్ధిచెప్పి తీసుకొచ్చి షీలాను రక్షించటంతో మధు నిజాయితీ రుజువై కథ సుఖాంతమవుతుంది. మూడు జంటలను సీతాదేవి, శాంతకుమారి ఆశీర్వదించటంతో చిత్రం ముగుస్తుంది. ఈ చిత్రంలో డాక్టరుగా మిక్కిలినేని, డ్యాన్స్‌ర్‌గా విజయశ్రీ నటించారు.
దర్శకులు ఎస్‌డి లాల్ -చిత్ర ప్రారంభంలోనే ఆటల్లో నాటకాల్లో విజేతగా హీరో పతకాలు సాధించటం, ఉద్యోగ ప్రకటన చూశాక తన నాటకానుభవం, పతకాలు చూసి గుర్తుకు తెచ్చుకోవటం, డబ్బుకోసం వాటిని విక్రయించినట్టు ఊహలో చూపటంలాంటి సన్నివేశాలను హస్యం, బాధను మేళవించిన భావంలో చూపించారు. ఉద్యోగం సంపాదించాక విజయ దూకుడు ప్రవర్తనకు మందలించి ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చినపుడు పిల్లల్లో ఆనందాన్ని చూసి -‘ఈ ఉద్యోగం నాకెంత అవసరమో మీకు తెలియదు’ అని వెళ్లిపోబోవటం, సీతాదేవి తిరిగి ఉద్యోగం ఇవ్వటంలాంటి సెంటిమెంట్ సన్నివేశాలను అద్భుతంగా పండించారు. మేనత్తను విజయ ద్వేషించే కారణం, పిల్లలను సీతాదేవి ఎందుకు అదుపులో ఉంచుతుందో మధుకు వివరించే సన్నివేశాలు అర్ధవంతంగా చిత్రీకరించారు. విజయను సరిదిద్దే సమయంలో సీతాదేవి త్యాగాన్ని మధు వివరించగా, విజయ దాన్ని మేనత్తకు తమాషాగా వక్రీకరించి చెప్పటం, ఆ మాటలకు సీతాదేవి స్పందన వినోదాన్ని పండిస్తాయి. రెండుసార్లు బాక్‌గ్రౌండ్‌లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ ట్యూన్ విన్పించటం, మాస్టారునూ సీతాదేవి సున్నితంగా హెచ్చరించటం తమాషాగా చిత్రీకరించారు. ఇక ముసలివేషం లేకుండా మాష్టారు మేనల్లుడినంటూ మధు పేరిట యన్‌టిఆర్ విజయను అల్లరిచేయటం, వారిరువురి మధ్య ప్రేమ, విమల -గిరివద్ద ప్రేమలో అతన్ని వారించే గీతం -ఉండనీ ఉండనీ ఎంతో సున్నితంగా చిత్రీకరించారు. మాస్టారివల్లే విమల జీవితం నాశనమైందని సీతాదేవి అతన్ని తుపాకీతో గాయపర్చటం, గిరిని గుర్రంపై యన్‌టిఆర్ తీసుకెళ్లటం, కారులో సీతాదేవి ఫాలో అవ్వటంలాంటి సన్నివేశాలను భారీ ఫైట్లు, అల్లరి సన్నివేశాలు లేకుండా కేవలం గుర్రం, కారు ఛేజింగ్‌తో ఉత్కంఠగా చిత్రీకరించారు. హీరో యన్‌టిఆర్ గిరికి బుద్ధిచెప్పి తీసుకురావటం, విమల ఆరోగ్యం బాగుపడటంలాంటి క్లైమాక్స్‌తో చిత్రం తీర్చిదిద్దటం ఆకట్టుకుంటుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సెంటిమెంట్, అమాయకపు ఆడపిల్లలు మోసపోయే తీరును చిత్రంలో చక్కగా చూపించారు. యన్‌టిఆర్, అంజలి, కాంచనల మధ్య తమాషా సన్నివేశాలూ చిత్రంలో అలరిస్తాయి.
యువకుడు మధుగా అల్లరి, ముచ్చట గొలుపుతూ, వయసుమళ్లిన వ్యక్తిగా యన్‌టిఆర్ నడక, మాట, చూపులో వైవిధ్యాన్ని నటనలో చూపారు. సీతాదేవిగా అంజలిదేవి ఆ పాత్రకున్న డిగ్నిటీ, పిల్లలపట్ల ఆమెకున్న ప్రేమ, దయ, లక్షణాలను ఆకట్టుకునే నటనతో మెప్పించారు. అంజలిదేవి నట జీవితంలో ఈ పాత్ర ఒక వెరైటీ పాత్రగా నిలిచిందని చెప్పుకోవాలి. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా నటించారు. విజయగా కాంచన పాత్ర పరిధిని చక్కగా ఆకళింపు చేసుకొని సన్నివేశానుగుణంగా సముచిత నటన చూపారు.
చిత్ర గీతాలు:
విజయ, స్నేహితులు యన్‌టిఆర్‌ను ఆటపట్టించే గీతం -రింగ్ మాస్టార్/ వయసులో ఏముంది (గానం: ఘంటసాల, ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం; రచన రచన: కొసరాజు). రమాప్రభ, రాజ్‌బాబులపై చిత్రీకరించిన గీతం -ఏదారి గోదారి (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి). విజయశ్రీ, కృష్ణంరాజు బృందంపై చిత్రీకరించిన క్లబ్ సాంగ్ -ఒన్ టూ త్రీ టిస్ట్ డాన్స్‌లే (రచన: దాశరథి, గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి బృందం). చాటునుంచి యన్‌టిఆర్ చూస్తుండగా, రాత్రిపూట కొలనులో షీలా, కాంచనలపై చిత్రీకరించిన ముచ్చట గొలిపే గీతం -నాలోన ఏమాయే ఏమాయనే (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పి.సుశీల, రచన: సినారె). యన్‌టిఆర్ కాంచనను ఉడికిస్తూ తోటలో పాడే గీతం -బుగ్గల్లో గులాబిరంగు నాదే నాదే (గానం: ఘంటసాల, రచన: దాశరథి). కాంచన, యన్‌టిఆర్‌లపై చిత్రీకరించిన అలరించే యుగళ గీతం -నీవునేనై నేను నీవే (గానం: పి సుశీల, ఘంటసాల, రచన: ఆరుద్ర). కృష్ణంరాజు, షీలాపై చిత్రీకరించిన -ఉండనీ ఉండనీ నీతోనే.. గీతాన్ని సినారె రచించగా, పి సుశీల పాడారు. హిందీలో నిర్మించిన ‘ప్రొఫెసర్’ చిత్రం సంగీతపరంగానూ విజయం సాధించినట్టే, భలేమాస్టారు చిత్రంలోని గీతాలూ శ్రోతలను అలరించాయి.
‘్భలే మాస్టారు’ చిత్రం తరువాత, 1990లో తమిళంలో ‘నాడేగన్’ పేరిట కొద్దిగా కథనుమార్చి రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై సత్యరాజ్, కుష్బూ, మనోరమ (మేనత్త వేషం), గౌండముని, అలాగే మలయాళ నటులు ప్రతాప్‌చంద్రన్, రాము విలన్‌లుగా ఎం రామనాథన్ నిర్మించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చగా, దర్శకత్వం వి వాసు నిర్వహించారు. ఆ చిత్రం 1990 నవంబరు 10న విడుదలైంది. తిరిగి ఈ చిత్రాన్ని 1991లో శ్రీ అన్నపూర్ణా సినీ చిత్ర బ్యానర్‌పై తెలుగులో సుమన్, నగ్మా, వాణిశ్రీ కాంబినేషన్‌తో శరత్ దర్శకత్వంలో ‘పెద్దింటి అల్లుడు’గా నిర్మాత టిఆర్ తులసి రూపొందించారు. ఈ చిత్రానికి రాజ్‌కోటి సంగీతం సమకూరిస్తే, మోహన్‌బాబు, బాబూమోహన్ తదితరులు నటించారు.
ఈ చిత్రాన్ని కన్నడంలో ‘గోపీకృష్ణ’ పేరిట 1992లో నిర్మాత ఎన్ వీరాస్వామి నిర్మించారు. నటుడు వి రవిచంద్రన్ దర్శకత్వం వహించి హీరోగా నటిస్తే, రూపిణి, సుమిత్ర, లోకేష్ తదితరులు నటించారు. సంగీతం హంసలేఖ సమకూర్చారు.
హిందీ చిత్రం ప్రొఫెసర్ తెలుగులో భలేమాస్టారు, తమిళంలో నాడేగన్‌గా రూపొందిస్తే, తిరిగి తెలుగులో పెద్దింటి అల్లుడు, కన్నడలో గోపీకృష్ట పేరిట రొమాంటిక్, కామెడీ, సెంటిమెంట్‌తో నిర్మించబడటం ఆనందించదగ్గ విషయం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి