ఫ్లాష్ బ్యాక్ @ 50

మహాకవి కాళిదాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవిగా ఘనత వహించిన ‘కాళిదాసు’పై పలు చిత్రాలు నిర్మితమయినాయి. తెలుగులో ‘్భక్తప్రహ్లాద’ తరువాత ఇంపీరియల్ కంపెనీ, హెచ్‌ఎం రెడ్డి దర్శకత్వంలో తొలి తమిళ టాకీ ‘కాళిదాసు’ (1931లో) నిర్మించారు. విద్యాధరిగా నటించిన టిపి రాజ్యలక్ష్మికి తమిళం తప్ప వేరే భాష రాకపోవటంతో ఆమె పాటలు, మాటలు మాత్రం తమిళంలోనూ, కథానాయకుడిగా నటించిన శ్రీనివాసరావు సంభాషణలు తెలుగులో సాగాయి. ఈ చిత్రం విజయం సాధించింది.
తరువాత 1940లో తెలుగులో మీర్జాపురం రాజావారు జయా ఫిలిమ్స్ బ్యానర్‌పై హెచ్‌వి బాబు దర్శకత్వంలో ‘్భజ కాళిదాసు’ పేరిట అద్దంకి, కన్నాంబ ప్రధాన పాత్రధారులుగా రూపొందించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
1959లో కవి కాళిదాసుగా ఎస్‌ఎన్ త్రిపాఠి హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించారు. 1955లో కన్నడంలో ‘మహాకవి కాళిదాసు’గా నిర్మాత హుసేన్, భాగవతార్ జివి అయ్యర్, బి సరోజాదేవి, రాజసులోచన, డి రాఘవేంద్ర కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని రూపొందించారు. తెలుగులో 1960లో ప్రముఖ నాటక, సినీ గాయకుడు, నటుడు, సంగీతకర్త, సినీ నిర్మాత పువ్వుల సూరిబాబు, నిర్మాత ఎం నాగమణి (లవకుశ చిత్రంలో నటించి విశేష ప్రజాభిమానం, ప్రశంసలు, రివార్డులు పొందిన నటి సీనియర్ శ్రీరంజని భర్త, ప్రముఖ దర్శకుడైన ఎం మల్లిఖార్జునరావు తండ్రి)తో కలిసి ‘సారణి ప్రొడక్షన్స్’ స్థాపించి నిర్మించిన తొలి చిత్రం ‘మహాకవి కాళిదాసు’. ఆ తరువాత ఎం నాగమణి 1965లో ‘ప్రమీలార్జునీయం’ రూపొందించారు.
చిత్రానికి కథ, మాటలు, పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: పి సూరిబాబు (పద్యాలు, శ్లోకాలు), పెండ్యాల నాగేశ్వరరావు, కెమెరా: అన్నయ్య, కళ: గోఖలే, కూర్పు: ఆర్‌వి రాజన్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి సత్యం (రామనాటక నృత్యం), దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు, నిర్మాతలు: ఎం నాగమణి, పి సూరిబాబు.
అవంతీ రాజకుమారి విద్యాధరిని (జూనియర్ శ్రీరంజని) జగన్మాత ఆలయం వద్ద ఓ సిద్ధుడు అద్భుత కథకు నాయకివి అవుతావని ఆశీర్వదిస్తాడు. అది విని అవంతి ప్రభువు (లింగమూర్తి) తన కుమార్తెకు మహాపండితుని వరునిగా అనే్వషించమని మహామంత్రి (కెవిఎస్ శర్మ)ని ఆదేశిస్తాడు. తన కుమారుడిని తిరస్కరించారన్న కోపంతో మహామంత్రి, విద్యాగంధం లేని ఓ మూర్ఖుడు కాలుడు (ఏఎన్‌ఆర్)ని మహాపండితునిగా నమ్మించి రాకుమారితో వివాహం జరిపిస్తాడు. వివాహానంతరం విద్యాధరి నిజం తెలిసికొని దేవీ ఆలయంలో భర్తను విద్యావంతుని చేయమని కోరి మూర్ఛిల్లుతుంది. తనకు విద్యలురానిదే భార్య బ్రతకదని నమ్మిన కాలుడు, హఠంచేసి మహాకాళిని ప్రార్థించి విద్యాగంధం అబ్బేట్టు వరం పొందుతాడు. దాంతో గతంమరచి గొప్ప కవిగా రాణించి చివరకు ధరానగరం భోజరాజు (ఎస్‌వి రంగారావు) వద్దకు చేరతాడు. అక్కడ రఘువంశం, కుమారసంభవం వంటి కావ్యాలు రచిస్తాడు. అవంతీ వేగులవలన భర్త జాడ తెలిసికొన్న విద్యాధరి అక్కడ ఆశ్రమానికి చేరినా, ఆమెను గుర్తించడు. భర్తను రాజనర్తకి విలాసవతి (రాజసులోచన) ఆకట్టుకుంటుందేమోనని సంశయస్తుంది విద్యాధరి, కాళిదాసు భార్యగా ఆమెను గుర్తించకపోయినా, ఆమె సహకారంతో, మేఘసందేశం, అభిజ్ఞాన శాకుంతలం కావ్యాలు పూర్తిచేస్తాడు. మహాకవిని సన్మానించటానికి భోజరాజు ఆహ్వానంపై సభకు వచ్చిన అవంతీ ప్రభువు, కూతురు అల్లుడిని గుర్తిస్తాడు. తన భర్త తనను గుర్తించేట్టు చేయమని ప్రార్థించి విద్యాధరి మూర్ఛిల్లుతుంది. కాళిదాసుకు గతం గుర్తుకురావటం, కాళీమాత (వాసంతి) అందరికీ ప్రత్యక్షమై నిజం వెల్లడిస్తుంది. భార్యాభర్తలు, ప్రజలు దేవిని స్తుతించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో శంభుదాసుగా బొడ్డపాటి, ఇంకా సీతారామ్, సూత్రధారిగా రేలంగి, మహారాణిగా సంధ్య, భరతాచార్యులుగా సూరిబాబు, కలి రాక్షసునిగా సిఎస్‌ఆర్, శిష్యునిగా లవకుశ ‘నాగరాజు’, ప్రభావతి, డ్యాన్సర్లుగా కుచలకుమారి, యల్ విజయలక్ష్మి, వంగర తదితరులు నటించారు.
ప్రతిభావంతులైన దర్శకులు కమలాకర కామేశ్వరరావు సన్నివేశాలను సహజంగా, ఉదాత్తంగా, అర్ధవంతంగా తీర్చిదిద్దారు. తొలుత అక్కినేని ‘కాలుడి’గా శ్రీరామకథను, ఆంజనేయుడు (తోకరాయుడు), రాభణుడు (రావణుడు), సీత, లక్ష్మణ పాత్రలు తానే ప్రదర్శించటం, తోకరాయుడు, రావణ సంవాదంలో అటు ఇటు మారటం, భార్య మూర్ఛిల్లగా కాళికాదేవిని శాసించి హఠం చేయటం, విద్య లభించగా ఉదాత్తంగా బయటకు వెళ్లటం, ఆపైన హనుమంతుడు రామాయణం వ్రాసినట్టు, కాళిదాసుచే ఓ పంక్తి పూరించటం, దానికి నిదర్శనంగా ఆంజనేయుడు సభలో ప్రత్యక్షమై రాక్షస కలిని తోకచే బంధించటం, కాళిదాసుకై అనే్వషించే భోజునికి బ్రహ్మరాక్షసుడు మాయలు కల్పించి, ప్రశ్నలు సంధించి, శారదామాత విగ్రహాన్ని మహారాజుకు, కాళిదాసుకు అందించటం, దానిని ఆశ్రమంలో ప్రతిష్టించటం, శారదాదేవి ముందు ‘జయ, జయ శారద’ నృత్యగీతం రాజనర్తకి ప్రదర్శించటం, కాళిదాసు పట్ల ఆమె అనురాగం, సభకు వచ్చిన విద్యాధరిలో సంక్షోభం వెల్లడిచేయటం, విద్యాధరిని ఉమగా సంభోదించిన కాళిదాసు ఆమె పరిచర్యలో ‘కుమార సంభవ’ కావ్యం ఆశువుగా వర్ణించగా, ఆమె దాన్ని వ్రాతరూపంలో పూర్తికావించటం, వియోగం గూర్చి కావ్యం వ్రాయమని భోజరాజు ప్రార్థనలో ‘మేఘసందేశం’ ఓ నృత్య నాటిక, దుష్యంతుని గూర్చి వ్రాయమని కోరిన రాజాజ్ఞ తిరస్కరించిన కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల కావ్యం రచన సాగించటంలాంటి సన్నివేశాలను దర్శకుడు పట్టుతో చిత్రీకరించారు. అభిజ్ఞాన శాకుంతలం చిత్రీకరణలో దుష్యంతునిగా అక్కినేని, శకుంతలగా శ్రీరంజని జూ., కణ్వ మహర్షిగా పి సంజు అభినయించారు. తాను కాళిదాసును ప్రేమిస్తున్నానని విలాసవతి, విద్యాధరికి చెప్పి ఆమెపై కోపించటం, దానికి విద్యాధరి వౌనం, భరతాచార్యుడు విలాసవతికి నిజం తెలియచేయగా ఆమె తిరిగి విద్యాధరిని క్షమాపణకోరి నటరాజు ముందు కళాసేవలో తరిస్తానని విన్నవించుకోవటం, మహాకవిని అర్థసింహాసనంతో సత్కరించే సభకు అవంతీ మహారాజు రావటం, భర్త తనను గుర్తించలేదని విద్యాధరి మూర్ఛిల్లగా, అది చూసిన కాళిదాసులో పూర్వస్మృతి కలిగి గతం వెల్లడికావటం, కాళికామాత దర్శనంలో ప్రజలు స్తుతించటం.. ఇలా ప్రతి చిన్న సంగతినీ ఎంతోనేర్పుతో తీర్చిదిద్ది చిత్రీకరించి ఓ చక్కని అనుభూతిని ప్రేక్షకులకు అందచేశారు దర్శకులు. అక్కినేని నాగేశ్వరరావు అటు అమాయకుడైన కాలునిగా, ఇటు మహాకవి కాళిదాసుగా సహజమైన నటనను, ఉదాత్తతతో కూడిన పరిపూర్ణతను సన్నివేశానుగుణంగా ప్రదర్శించారు. విద్యాధరిగా జూ.శ్రీరంజని పాత్రోచితమైన భావావేశాలను నిండుగా తన నటనలో ఆవిష్కరించింది. మిగిలిన పాత్రధారులంతా సముచిత నటనతో మెప్పించారు. సందర్భానుసారమైన గీతాలు, శ్లోకాలు, పదప్రయోగాలతో పింగళివారు అలరించేలా రచన సాగించారు.
జూ. శ్రీరంజనిపై -శ్రీకరమగు పరిపాలన నీవే జగదీశ్వరి (పి లీల, పివి రత్నం బృందం), -ఎందుకువేసిన వేషమయా (పి సుశీల), -ప్రణయకారిణి వౌచు (పద్యం: పి లీల), -శ్రీల విలసిల్లు కళలతో (పద్యం: పి లీల), -ఈ విపరీత వియోగముతో (గానం: పి లీల) గీతాలను చిత్రీకరించారు. రాజసులోచనపై -జయ జయ శారదా (పి.సుశీల), -ఔనులే ఔననులే (పి.సుశీల) చిత్రీకరించారు. రాజసులోచన, రేలంగి, సిఎస్‌ఆర్‌లపై చిత్రీకరణ -నిను వర్ణించిన కవే కవే లేకుంటే... (మాధవపెద్ది, యల్‌ఆర్ ఈశ్వరి బృందం), రాజసభలో ఎల్ విజయలక్ష్మి, కుచలకుమారిలపై చిత్రీకరించిన నృత్య గీతం -రసికరాజ మహిరాజిత సభలో (గానం: పి లీల, టివి రత్నం -మహరాజు, కాళిదాసు, సభికులముందు ప్రదర్శన), అక్కినేనిపై చిత్రీకరించిన నృత్యనాటిక -నాలోనాయి నన్నాడమంటే (గానం- ఘంటసాల), జూ.శ్రీరంజని, అక్కినేనిలపై తొలిరేయి తమాషా గీతం -నీకెట్టుందోగాని పిల్లా నాకు భలేగావుందిలే. ఈ గీతానికి ఘంటసాల హుషారుగా తమాషాలతో గానం సాగించటం విశేషం. రేలంగి, ఆశ్రమవాసినులకు నృత్యం నేర్పుతూ సాగించే గీతం -ఆ మాటంటే ఎందుకు కోపం రమణులకు (గానం: జిక్కి, మాధవపెద్ది బృందం). ఈ చిత్రంలో ఇంకా పి సూరిబాబు పద్యాలు, శ్లోకాలు విశిష్టత సంతరించుకున్నాయి. ఆపై శకుంతల నాటకాన్ని -హలాహలా శకుంతల (గానం: ఘంటసాల, పి లీల, పి సూరిబాబు బృందం) ఆలపించారు. పింగళి రచనకు, దర్శకుల ప్రతిభకు, నటీనటుల సముచిత నటనతో చక్కని కరుణ, సాహిత్య, హాస్యప్రియంగా అలరించేలా చిత్రం రూపొందించబడి ప్రాజ్ఞుల మన్ననలు పొందింది.
మహాకవి కాళిదాసు చిత్రానికి 1960లో రాష్టప్రతి రజిత పతకం లభించింది. 1960 ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రాన్ని ఆనాటి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్, ఉప రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌లు ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించి అక్కినేనికి ప్రశంసలు అందించారు.
‘మహాకవి కాళిదాసు’ చిత్రం విడుదలైన 36ఏళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం, కాళిదాసు అకాడెమీ ఆఫ్ ఉజ్జయినీ యూనివర్సిటీ కలిసి 1996వ సంవత్సరానికి ‘కాళిదాసు కౌస్త్భుం’ అవార్డును అక్కినేనికి ప్రకటించారు. 1996 నవంబరు 21న ఉజ్జయిని యూనివర్సిటీలోని కాళిదాసు దర్బారు హాలులో మధ్యప్రదేశ్ సీఎం దిగ్విజయ్‌సింగ్, పలువురు మంత్రులు, త్రిపుర గవర్నర్‌వంటి ప్రముఖుల సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు ఈ అవార్డు అందుకోవటం సంతసించదగిన అంశం. ‘మహాకవి కాళిదాసు’ పాత్రను ఆవిధంగా చిరస్మరణీయం చేసిన నటునిగా నాగేశ్వరరావుకిది ‘సరస్వతీ ప్రసాదమే’ అనవచ్చు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి