ఫ్లాష్ బ్యాక్ @ 50

సీతారామకల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నానికి చెందిన పినపాల వెంకటదాసు (పివి దాసు) స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ దక్షిణాదిలో ప్రారంభించాలనే భావనతో కొంతమంది భాగస్తులతో కలిసి 1934లో వేల్ పిక్చర్స్ ప్రారంభించారు. తొలి చిత్రంగా పౌరాణిక సినిమా ‘సీతాకల్యాణం’ను తీయాలనుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే సూచనతో బొంబాయిలోవున్న తెలుగు వ్యక్తి చిత్రపు నరసింహారావును దర్శకునిగా నిర్ణయించుకున్నారు. దీంతో దక్షిణాదిన రూపొందిన తొలి టాకీ చిత్ర దర్శకుడిగా చిత్రపు నరసింహారావుకు గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో రామునిగా నముడూరి వెంకట్రావు (మాస్టర్ కల్యాణ్), సీతగా (రాజరత్నం), లక్ష్మణుడిగా (నాగేశ్వరరావు), విశ్వామిత్రునిగా (మాధవపెద్ది వెంకట్రామయ్య), దశరధునిగా (నాగరాజారావు) రామతిలకం, మిస్ శ్రీహరి ఇతరులు నటించారు.
నటుడు ఎన్‌టి రామారావు దర్శకుడు కెవి రెడ్డితో కలిసి తను శ్రీరామునిగా, ఎస్‌వి రంగారావు రావణునిగా ఓ సినిమా తీయాలని సంకల్పించారు. ఇంతలో ఎన్‌టిఆర్ సన్నిహితులు ధనేకుల వెంకటకృష్ణ చౌదరి శివపురాణాది పలు గ్రంథాలనుంచి సేకరించి రావణునిలోని రసజ్ఞతను, కొన్ని కొత్త అంశాలను వెల్లడించిన పుస్తకాన్ని ఎన్‌టిఆర్‌కు ఇచ్చారు. ఆ పుస్తక పఠనంతో ఎన్‌టి రామారావుకు రావణుని పాత్ర పట్ల మక్కువకలిగి తానే ఆ పాత్రను పోషిస్తానన్నారు. దీనికి కెవి రెడ్డి ‘రాముడు, కృష్ణుడు’ పాత్రలో పేరుపొందిన ఎన్‌టిఆర్‌కు రావణ పాత్ర నప్పదేమోనన్న సంశయం వెలిబుచ్చారు. కాని ఎన్‌టిఆర్ మరింత పట్టుపట్టడంతో కెవి రెడ్డి దర్శకునిగా తప్పుకోవటం, ఎన్‌టి రామారావు తొలిసారి స్వీయ దర్శకత్వంలో ‘సీతారామకల్యాణం’ చిత్రాన్ని రూపొందించటం జరిగింది. తాను దర్శకత్వం వహించినా దర్శకునిగా తన పేరు వేసుకోక ఎన్‌ఏటి యూనిట్ పేరుతో టైటిల్స్ వేయటం ఎన్‌టిఆర్ స్పెషాలిటీ. చిత్రం ప్రథమార్థం రావణ పాత్రకు ప్రాధాన్యత వుండేలా రూపొందటం జరిగింది. శ్రీరాముని పాత్రకు యువ హీరో హరనాథ్‌ను, లక్ష్మణునిగా శోభన్‌బాబును, సీతగా అంతకుముందు రాణిరత్నప్రభతో ఓ నృత్య పాత్ర పోషించిన ‘మణి’ని ఎన్నుకున్నారు. తరువాత ఆమె తన పేరు గీతాంజలిగా మార్చుకుంది. ఈ చిత్రంలో నటీమణి టిజి కమలాదేవి సీత పాత్రకు డబ్బింగ్ చెప్పారు. మండోదరిగా నటించిన బి సరోజాదేవికి ‘మోక్షగుండం కృష్ణకుమారి’ గాత్రం అందించారు. నలకూబరునిగా హాస్య నటుడు సారథి ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మణి సిస్టర్ ‘స్వర్ణ’ శూర్పణఖ పాత్ర పోషించారు. కుంభకర్ణునిగా ఉదయకుమార్, విభీషణునిగా ఎవి సుబ్బారావు (జూ.), అహల్యగా అనురాధ, భరతునిగా కొమ్మినేని శేషగిరి, చిన్నప్పటి రామునిగా మాస్టర్ సుబ్రమణ్యం, లక్ష్మణుడు, ప్రహ్లాదునిగా మాస్టర్ నాగరాజు (లవకుశ ఫేం), మారీచుడిగా మహంకాళి వెంకయ్య, పరశురాముడి పాత్రలో కెవిఎస్ శర్మ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కథ, సేకరణ డివిబి కృష్ణచౌదరి. మాటలు, పాటలు సముద్రాల రాఘవాచార్య (సీ.సముద్రాల). సంగీతం గాలిపెంచల నరసింహారావు. నృత్యం వెంపటి సత్యం, కళ టీవీఎస్ శర్మ, కూర్పు ఎస్‌పిఎస్ వీరప్ప, ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్, సంయుక్త దర్శకుడు ఐఎన్ మూర్తి, నిర్మాణ సంచాలకుడు పుండరీకాక్షయ్య, నిర్మాత నందమూరి త్రివిక్రమరావు.
అలకాపురిని జయించి పుష్పక విమానంలో లంకకు వెళ్తూ రావణబ్రహ్మ ఈశ్వర దర్శనంకోసం కైలాసం వెళ్లి నందిచే శాపం పొందటం, పరమశివుని రుద్రగానంతో మెప్పించి వరాలు పొందటం, దేవతల వినతి, మహావిష్ణువు ఆజ్ఞతో మహాలక్ష్మి మాతంగిగా జన్మించి వేదవతిగా రావణుని స్పర్శచే భస్మమై లంకకు మందసంలో చేరటం, సముద్రానికావల భూస్థాపితమైన మందసంలో బాలికగా సీత జనకుని ఇంట పెరగటం, పుత్రకామేష్టి వలన దశరధునకు శ్రీరామాదులు జననం, విశ్వామిత్ర యాగసంరక్షణ, అహల్య వృత్తాంతతము, సీతా స్వయంవరం, రావణుని భంగపాటు, మండోదరి విచారం, రావణ ప్రేరణతో పరశురాముడు శ్రీరాముని చేత పరాజయం.. అవతార సమాప్తి, సీతారాముల కల్యాణంలోని ముఖ్య ఘట్టాలతో కూర్చిన కథ ‘సీతారాముల కల్యాణం’ చిత్రం. వశిష్టునిగా మల్లాది, విశ్వామిత్రునిగా గుమ్మడి, దశరథునిగా నాగయ్య, కౌసల్యగా రమాదేవి, జనకునిగా మిక్కిలినేని, అతని అర్ధాంగిగా ఛాయాదేవి, వైశ్యునిగా శివరాం, ఋష్యశృంగునిగా వల్లభనేని శివరాం వంటి వారెందరో నటించారు.
ఎన్‌టి రామారావు తొలి చిత్రం మనదేశంకు రెహమాన్ కెమెరామెన్. ఆ తరువాత ఎన్‌టిఆర్ సొంత సినిమాలకు రెహమాన్ కెమెరామెన్‌గా పనిచేశారు. కాని ఈ సీతారామకల్యాణం చిత్రం షూటింగ్‌కి వారు సమయానికి రాకపోవటంతో ఎన్‌టి రామారావు, భాభూ భాయి మీస్ర్తి సహాయకుడు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘రవికాంత్ నగాయిచ్’కు అవకాశమిచ్చారు. దాన్ని వారు ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించి ఎన్‌టి రామారావు మెప్పు పొందటమేకాక, ఆపైన వారి గులేబకావళి కథ, శ్రీకృష్ణపాండవీయం వంటి చిత్రాలకు, లవకుశ, వీరాభిమన్యు, సంపూర్ణరామాయణం వంటి పలు చిత్రాలలో తన ప్రత్యేకత నిలుపుకుని హిందీ రంగంలోనూ బిజీ అయ్యారు. ‘ఈ చిత్రంలో కైలాస పర్వతం, దాన్ని రావణాబ్రహ్మ తలలపై ధరించే సన్నివేశాన్ని ఎంతో నైపుణ్యంతో శ్రద్ధతో వెరైటీగా చిత్రీకరించటం, దానికి 30గంటలుపైగా సమయం పట్టడం, ఎన్‌టి రామారావు అంతసేపూ కదలకుండా కూర్చోవటం ప్రత్యేక విశేషం.
నటునిగా రావణాబ్రహ్మ పాత్రను పరిపూర్ణంగా ఆవిష్కరించటమేకాక, ఓ దర్శకునిగా సన్నివేశాలను ఎంతో నిబద్ధతతో శాంత, కరుణ, రౌద్రం వంటి నవరసాలను రసాత్మకంగా, ప్రశంసాపాత్రంగా తీర్చిదిద్దారు. ‘్భకైలాస్’ చిత్రంలో నారదుని సూచనలను రావణాబ్రహ్మ అనుసరించే విధానాన్ని ఈ చిత్రంలోనూ కొంతవరకూ అనుసరించటం, చిత్ర ప్రారంభంలో పుష్పకం ఆగటం, నారద ప్రోత్సాహంతో శివదర్శనం కోరటం, ధ్యానంతో ‘కానరారా కైలాస నివాస’ అని ప్రార్థించి బలంతో కైలాసాన్ని పెళ్లగిస్తానని ఆవేశపడడం, శివతాండవ స్తోత్రం, శివపార్వతుల (జయత్వదభ్రవిభ్రమత్భుజంగ) నృత్యం, శివుడు రావణగర్వభంగం చేయటం, భక్తితో కడుపులోని ప్రేగులు చీల్చి రుద్రవీణగా మార్చి రావణుడు మ్రోగించటం, ఈ సన్నివేశం కవుల కల్పనకు ధీటుగా చిత్రీకరించటం (ఈ సన్నివేశంలో నేపథ్యానికి వీణానాదం కీశే ఈమని శంకర శాస్ర్తీ రూపొందిస్తే, ఘంటసాల గానం, ఎన్‌టిఆర్ అభినయం.. ఓ చారిత్రక విశేషంగా ఈ సన్నివేశం నిలిచింది), భస్మంగామారిన వేదవతిని మందసంలో బంధించి తన తపోశక్తితో మావినిగా మారుస్తానని పలకటం, దానికి మండోదరి స్పందన, ఋష్యశృంగునిచే దశరథుడు అశ్వమేధం పుత్రకామేష్టి చేయటం, తరువాత ఓ భక్తుడు దశావతార వర్ణన గానం, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలు వివరంగా చూపటం, ఓ శిష్యురాలు జ్యోతి (నృత్యం), ఘంటసాల గానంలో చిత్రంలో గీతం ‘జయజగదీశ హరే’, శ్రీరామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట యాగ రక్షణకు వెళ్లిన సందర్భంలో విశ్వామిత్రుడు ‘కౌసల్యా సుప్రజారామా’ అని స్తుతించటం, మేలుకొలుపు, బల, అతిబల విద్యలు నేర్వటం, తాటక వధ ఈ అంశాలు వివరంగా చిత్రీకరించారు. స్వయంవరంలో భంగపడిన రావణుడు, సీతయే వేదవతి అని మండోదరి ద్వారా గ్రహించి తిరిగి ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటాననే సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ‘మీరే భాగ్యం, మాంగల్యం’ అని మండోదరి అనగా -వీరపుత్రివి.. ఇంద్రజిత్ బిరుదు పొందిన కుమారుడు మేఘనాధుని తల్లివి.. వీరమాతవు.. అప్రతిహత పరాక్రమోపేతుడైన రావణుని ఇల్లాలివి.. నీకు చిన్నతనం తేవటానికి నేనంగీకరించను. ఓ అబల ప్రతీకారేచ్ఛకు లొంగను. లంకాప్రాభవం నాశనం కాని.. నా వంశం నిర్వీర్యంకాని.. నా ప్రాణాలేపోనీ.. సర్వనాశనంకాని.. సీతను చెరపట్టి తీరతాను, అది తథ్యం అంటాడు రావణుడు. రచయిత సముద్రాల రచనకు, ఎన్టీఆర్ గంభీరమైన ఉచ్ఛారణ, నటన, అద్భుత చిత్రీకరణకు సన్నివేశం అద్దంపడుతుంది. సీతారాముల కల్యాణం చూతమురారండి పాటను వివరంగా, చాకలివారు వధూ వరులముందు దుప్పట్లుపర్చటం వంటి చిన్న అంశాలను, మరోవైపు పరశురాముడు రావటం చూపుతూ పాటను ఆకట్టుకునేలా చిత్రీకరించటం దర్శకునికే చెల్లింది. ‘సీతారాముల కల్యాణం చూతమురారండి’ (గానం; పి.సుశీల బృందం) పాటలో రాముని దోసిట నీలపురాలు, సీతదోసిట కెంపులపోగు వర్ణన అద్భుతం. ఆ తరువాత సంపూర్ణ రామాయణం చిత్రంలో ఈ సన్నివేశం రంగుల్లో అలరించటం, ఆపైన చిత్రాల్లో వాటిని అనుసరించటం ఓ విశేషం.
తొలుత ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించి -కానరార కైలాసావాసా పాటను, దండకాన్ని స్వరపరచారు. తరువాత వారు విరమించుకోవటం, గాలిపెంచల నరసింహారావు సంగీతం సమకూర్చటం జరిగింది. ఆ రోజుల్లో విజయా వాహిని స్టూడియోల్లో అడవులూ, తోటలూ అన్ని సెట్స్‌వేసి అవుట్‌డోర్‌లో తీసినట్టు అన్పించేలా చిత్రీకరించటం విశేషం. ఈ చిత్రం 1961 జనవరి 6న విడుదలై తొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకోవటం విశేషం. ఈ చిత్రాన్ని దర్శకులు కెవి రెడ్డి తొలుత ప్రత్యేక షోలో వీక్షించి ఎన్‌టిఆర్ ను అభినందించారు. అలాగే ఎన్‌టిఆర్ గురువు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఈ చిత్రం చూసి శిష్యుని ఆశీర్వదించటం, కంచి పీఠాధ్యక్షులు జగద్గురువు శ్రీపరమాచార్య చంద్రశేఖర్ సరస్వతి ఈ చిత్రం చూసి ఎన్‌టిఆర్‌ను ప్రత్యేకంగా ఆశీర్వదించటం ప్రత్యేక విశేషంగా పరిగణించాలి. ఆ తరువాత ఎన్‌టిఆర్ ‘శ్రీకృష్ణసత్య’ (1971)లో, 1978లో ‘శ్రీరామ పట్ట్భాషేకం’ చిత్రంలో రామరావణ పాత్రలు ధరించారు.
చిత్రంలోని గీతాలు: శ్లోకాలు పద్యాలన్నీ చిరస్మరణీయంగా రసవంతంగా నిలిచాయి. ముఖ్యంగా -సీతారాముల కల్యాణం చూతమురారండి గీతం వనె్నతగ్గని మేలిమి బంగారంలా నాటినుంచి నేటికీ ఓ శుభ మంగళప్రదమైన కళ్యాణగీతంగా శాశ్వతత్వాన్ని సాధించుకోవటం పరమానందకరమైన అంశం. ఈ చిత్రానికి రాష్టప్రతి యోగ్యతాపత్రం లభించింది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి