ఫ్లాష్ బ్యాక్ @ 50

జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాలింగం వెంకటరామన్ (ఎంవి రామన్) తమిళనాడులోని తిరుచునాపల్లిలో 1913 జూన్ 26న జన్మించారు. అకౌంటెన్సీలో పట్ట్భద్రులయ్యారు. ఆపైన మద్రాసు శ్రీనివాసా స్టూడియోలో కెమెరామెన్‌గా, సౌండ్ ఇంజనీరుగా, ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో అనుభవం సాధించారు. 1945 నుంచీ దర్శకునిగా ప్రయాణం మొదలెట్టారు. రామన్‌లోని ప్రతిభను గమనించిన నిర్మాత ఎవి మొయ్యప్పన్ తమ ఏవిఎం సంస్థలో రూపొందించిన ‘వాళ్‌గై’ చిత్రానికి దర్శకునిగా ఎన్నుకున్నారు. ఆ చిత్రాన్ని 1950లో ‘జీవితం’ టైటిల్‌తో తెలుగులో, ‘బహర్’గా హిందీలోనూ ఏవీఎం సంస్థే రూపొందించింది. వాటికీ ఎంవి రామన్ దర్శకత్వం వహించి, మూడు భాషల్లో సినిమాను విజయవంతం చేశారు. తరువాత ఎంవి రామన్, పెన్, లడ్కీ, పహ్లాజలక్, సంఘం, భాయి భాయి, వదినె, ఆషా, పట్టనాతిల్ భూతమ్ -పాయల్ కా ఝలక్ వంటి పలు హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకునిగా, కొన్నిటికి ఎడిటర్‌గా పనిచేశారు. తరువాత స్వీయ దర్శకత్వం, ఎడిటింగ్‌తో 1971లో నిర్మాతగా రూపొందించిన చిత్రం జ్వాలా. సునీల్‌దత్, మధుబాల కాంబినేషన్‌లో ఆ సినిమా విజయం సాధించింది.

మాటలు-పాటలు: తోలేటి
సంగీతం: ఆర్ సుదర్శనం
కళ: ఎ బాలు
నృత్యం: హీరాలాల్
ఛాయాగ్రహణం: టి ముత్తుస్వామి
కథ, ఎడిటింగ్, దర్శకత్వం: ఎంవి రామన్
స్క్రీన్‌ప్లే: ముకుందన్
చిత్ర పర్యవేక్షణ, నిర్మాత: ఏవి మొయ్యప్పన్

ఏవి మొయ్యప్పన్ తమిళ చిత్రం ‘వాళ్‌గై’ ద్వారా వైజయంతిమాలను నటిగా సినీ రంగానికి పరిచయం చేశారు. తెలుగు, హిందీ రీమేక్ చిత్రాల్లోనూ వైజంతిమాల నటించారు. తమిళ చిత్రంలో ఎంఎస్ ద్రౌపది, తెలుగులో ఎస్ వరలక్ష్మి, హిందీలో పండరీబాయి రెండో కథానాయిక పాత్రలు పోషించారు. తమిళ, తెలుగు చిత్రాల్లో టిఆర్ రామచంద్రన్, వైజయంతిమాల జంటగా నటిస్తే, తమిళంలో ఎంఎస్ ద్రౌపదికి జోడీగా ఎస్ సహస్రనామం నటించారు. హిందీలో వైజయంతిమాల, కరణదేవన్, పండరీబాయి, ప్రాణ్, ఓంప్రకాష్ నటించగా సంగీతం ఎస్‌డి బర్మన్ సమకూర్చారు.
మద్రాస్‌లోని ప్రముఖ వ్యక్తి శివశంకర లింగేశ్వర ప్రసాద్ (సిఎస్‌ఆర్). అతని కుమార్తె మోహిని (వైజయంతిమాల) విద్యావతి, నృత్యకళాకారిణి అయిన అందమైన యువతి. శివశంకర్ రెండో భార్య దుర్గమ్మ (అన్నపూర్ణ) తమ్ముడు మూర్తి (సిహెచ్ నారాయణరావు) మోహినిని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మోహినీ అందుకు అంగీకరించదు. అశోక్ అనే రచయితను ఇష్టపడుతుంది. ఆ రచయిత, బ్యాంక్ ఉద్యోగి అయిన నారాయణపతి (టిఆర్ రామచంద్రన్) పక్కింట్లో ఉంటుంటాడు. అతనే అశోక్ అని తెలియకపోయినా, వారిరువురూ ఒకరినొకరు ఇష్టపడడం, వివాహం చేసుకోవాలనుకుంటారు. మూర్తి పనిమీద పల్లెటూరికి వెళ్తాడు. ఆ వూరిలో పేద, అమాయక యువతి వరలక్ష్మి (ఎస్ వరలక్ష్మి). వడ్డీ వ్యాపారి బసవయ్య (కంచి నరసింహారావు) వృద్ధుడు. ఆమెను తండ్రి బాకీల నిమిత్తం పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మూర్తి ఆ బాకీలు తీరుస్తానని, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తాడు. ఫలితంగా గర్భవతియైన వరలక్ష్మి మూర్తిని వెతుకుతూ మద్రాస్ వెళ్తుంది. ఆసుపత్రిలో బాబును ప్రసవించి మూర్తిని కలుసుకున్న ఆమెను ‘కులట’ అని నిందించి, మూర్తి తిరస్కరిస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలని వరలక్ష్మి బాబును పతి కారులో విడిచివెళ్తుంది. ఈ బాబును చూసి, మూర్తి చెప్పుడు మాటలవల్ల పతికి, మోహినికి జరిగే పెళ్లి నిశ్చితార్థం ఆగిపోతుంది. జాలరులచే కాపాడబడిన వరలక్ష్మి తిరిగి బాబుకోసం వచ్చి, పతివద్ద చూసి, దూరంగా బతుకుతుంటుంది. మోహినికి, మూర్తికి పెళ్లి నిశ్చయం కావటం, బాబుకు ప్రమాదంగా వుందని చూడాలని వెళ్లి మోహిని, అక్కడకు వచ్చిన వరలక్ష్మి, మూర్తిలను గురించి నిజం తెలుసుకోవటం, మూర్తిని, పతి దెబ్బలనుంచి కాపాడబోయిన వరలక్ష్మి తీవ్రంగా గాయపడటం, ఈ సంఘటనతో మూర్తిలో మార్పువచ్చి వరలక్ష్మిని, బిడ్డను స్వీకరించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో వరలక్ష్మి తల్లిదండ్రులుగా వెంకుమాంబ, దొరైస్వామి, నృత్య గీతంలో పద్మిని, లలిత, ఇంకా ఓ నృత్యంలో సీత, మూర్తి అనుచరుడిగా పి నారాయణరావు కనిపిస్తారు.
దర్శకులు చిత్రంలోని సన్నివేశాలను అద్భుతంగా మలిచారు. తొలుత మోహిని ఆభిరుచిని తెలియచేస్తూ నవలా పఠనం, నృత్యం రిహార్సల్స్‌లో ఓ పాట -చక్కనైన కోయరాణిని ఎక్కడైనా చూశారా (రాజేశ్వరి టి.ఎస్.్భగవతి) ద్వారా పరిచయం చేశారు. తరువాత పల్లెటూరిలో వరలక్ష్మిని పరిచయం చేస్తూ -తెల్లవారె తెల్లగా (ఎస్ వరలక్ష్మి) పాటలో పల్లె అలవాట్లు చూపిస్తారు. మూర్తి పల్లెటూరుకు ఎడ్లబండిలో వస్తూ రోడ్ల పరిస్థితిని బండివానితో చర్చించటం, దానికితోడు ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు, వాటి ఫలితాలు వివరించటం (నేటికి కొనసాగుతున్న అదే పరిస్థితిని ఆనాడే వివరించటం) విశేషం. వరలక్ష్మి కోసం మూర్తి ఆశపడిన సన్నివేశంలో ఓ జాలరి చేపకోసం వలవేయటం, వరలక్ష్మితో ప్రేమ ముగిసి ఆమెను వదిలిపెట్టేసినపుడు.. జాలరి చేపను బుట్టలో వేసుకొని వెళ్లిపోవటం లాంటి సింబాలిక్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. పట్నం వెళ్లినా మూర్తి పేరు వరలక్ష్మి చెప్పకపోవటం, బాబు క్షేమంకోరి దూరంగా బ్రతకటం వంటి బరువైన సన్నివేశాలను అత్యంత సున్నితంగా హృద్యంగా రూపొందించారు. మోహిని నారాయణపతిల ప్రేమ, కలహంతో పతిని రేడియో పెట్టవద్దన్న మోహిని, తానుమాత్రం రికార్డ్ పెట్టుకొని నృత్యం చేయటం, తన అభిమాన రచయితే పక్కింటి పతి అని తెలిసి ఆనందం, స్నేహం, ప్రేమవంటి సరదా రొమాంటిక్ సన్నివేశాలను తమాషాగా చిత్రీకరించి మనోల్లాసాన్ని కలిగించారు. మోహిని.. పతిని వేళాకోళం చేస్తూ పార్కులో ఆటపట్టించే గీతం -నీ కనే్న నిను భ్రమించినా నాపై కోపం (ఎంఎస్ రాజేశ్వరి). తిరిగి పతి ఆమెను ఆటపట్టిస్తూ అదే గీతం మార్చి రిపీట్ చేయటం (ఎం సత్యనారాయణ) బావుంటుంది. బాబును పెట్టెలో పెట్టి పతి ఆఫీసుకు తీసుకురావటం, అలా ఏడాది గడిచి బాబు పెద్దవాడవటం, సెక్రటరీ మందలించి ఉద్యోగంనుంచి పతిని తొలగించటం, ఓపక్క వరలక్ష్మి భర్తతో సంవేదన, మరోవైపు పతి, మోహినిల ప్రేమ, ద్వేషం, తిరిగి అభిమానం.. ఇలా చిత్రంలో సన్నివేశాలను బాలెన్స్ చేయటం కనిపిస్తుంది. ముగింపులో హీరో హీరోయిన్ల వివాహంతో చిత్రం ముగించకుండా ‘బాబు 2వ జన్మదిన ఉత్సవానికి తల్లిదండ్రులు మూర్తి, వరలక్ష్మిల ఆహ్వానం, ఫంక్షన్‌తో ముగింపు చేయటంతో ఓ కొత్తదనం పాటించటం దర్శక, నిర్మాతల ఆలోచన విధానం మెచ్చదగిన అంశగా నిలవటం చిత్ర విశేషం.
తమిళ చిత్రాల వాళ్‌గైతో చిత్రరంగంలోకి ప్రవేశించిన వైజయంతిమాల తెలుగులోనూ ఎంతో ఈజ్‌తో గడుసుతనం, తెలివి, అమాయకత్వం నిండిన చూపులతో, మాటలతో, నటనతో మోహిని పాత్రను రక్తికట్టించారు. దానికి ప్రతిగా నారాయణపతిగా సి రామచంద్రన్ నిదానంతో అర్ధవంతమైన నటన, కొంత తమాషా, సీరియెస్‌నెస్ కలగలిపిన నటన చూపి ఆకట్టుకున్నారు. మూర్తిగా సిహెచ్ నారాయణరావు విలనినీ ఎంతో సహజంగా ప్రదర్శించటం, ఇక వరలక్ష్మిగా ఎస్ వరలక్ష్మి తొలుత అమాయకంగా చక్కని చిరునవ్వుతో, తరువాత బాబు తల్లిగా పరిణితిగల యువతిగా ఎన్నదగిన నటన చూపించారు. సిఎస్‌ఆర్ హాస్యాన్ని, గంభీరతను జోడించి పాత్రోచితంగా సునాయాసంగా నటించి అలరించారు.
ఇతర గీతాలు:
వరలక్ష్మిపై చిత్రీకరించిన గీతాలు -ఆశలన్నీ గాలిలోన కలిసిపోయెనే. -చూపవా నాపతి త్రోవదేవా. తొలుత పల్లెటూరిలో -ఆనందవౌగా పల్లెసీమ (గానం: వరలక్ష్మి). రైతు దంపతులపై చిత్రీకరించిన నృత్యగీతం -్భమి దున్నవోయ్, మన దేశం పండాలోయ్. పద్మిని, లలితలపై చిత్రీకరిస్తే టిఎస్ భగవతి, ఎంఎస్ రాజేశ్వరి బృందం ఆలపించారు. టిఆర్ రామచంద్రన్, వైజయంతిమాలపై కారులో వెళ్తూ చిత్రీకరించిన యుగళ గీతం -మన మనసు మనసు ఏకమై (ఎం సత్యనారాయణ, టిఎస్ భగవతి). వైజయంతిమాలపై నృత్యగీతం -గోపాల నీతో నేనాడుతానోయి (టిఎస్ భగవతి). ఈ చిత్రంలో పాటలన్నీ అలరించేలా సాగటం, సంగీత దర్శకులు ఆర్ సుదర్శనం స్వరాలు, తోలేటి వెంకటరెడ్డి కృషికి నిదర్శనం. -ఆనందవౌగా పల్లెసీమ, -మన మనసు మనసు, -నీ కనే్న నిను భ్రమించినా శ్రోతలను నేటికీ అలరించటం విశేషం. చిత్రంలోని ముగింపు గీతం వైజయంతిమాల వీరజవాన్ దుస్తుల్లో పాడే గీతం -ఇదే మా దేశం, ఇదే నా భారతదేశం (గానం: మాధవపెద్ది) జాతి గర్వించదగ్గ గీతం. అమాయకపు ఆడపిల్లలకు హెచ్చరికగా, మంచి సందేశంతోకూడిన చిత్రంగా ‘జీవితం’ మన్ననలు పొందింది. 70ఏళ్లు దగ్గరపడుతున్నా, ఈ చిత్ర అంశాలు నేటికీ సమాజంలో ఎదురవుతుండటం, మనోధైర్యంతో మహిళలు మెలగాలని ఆశించటంలో తప్పులేదు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి