ఫ్లాష్ బ్యాక్ @ 50

సతీ సుకన్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవ వైద్యులు అశ్వనీ కుమారులకు యజ్ఞ హవిర్భాగ్యం కలిగించిన చ్యవన మహర్షి, సుకన్య దంపతుల పౌరాణిక గాథ -సతీ సుకన్య చిత్రం.
శ్రీ వేంకటేశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన సినిమా జనవరి 30, 1959న విడుదలైంది. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రమిది.
‘సతీ సుకన్య’ చిత్రానికి మాటలు, పాటలు శ్రీరామచంద్. వీరు విఠలాచార్య నిర్మించిన చిత్రాలకు పనిచేశారు. 1957లో విఠలాచార్య, చలం, కృష్ణకుమారి, అమర్‌నాథ్, శ్రీరంజని కాంబినేషన్‌లో నిర్మించిన సాంఘిక చిత్రం ‘వద్దంటే పెళ్లి’ చిత్రానికి ఒక్కటి తప్ప మిగిలిన పాటలన్నీ రచించారు. తరువాత ‘సతీ సుకన్య’ చిత్రానికి రచన చేశారు.

ఎడిటింగ్: పద్మనాభన్
కళ: కోటేశ్వరరావు, సత్యనారాయణ
ఛాయాగ్రహణం: ఎస్‌కె వరదరాజన్
సంగీతం: ఘంటసాల
సహకార దర్శకుడు: ఎన్‌ఆర్ శర్మ
దర్శకత్వం: చంద్రమోహన్

భృగుమహర్షి, పులోమి దంపతుల పుత్రుడు చ్యవనుడు. మహా తపశ్శాలి. శర్వాతి మహారాజు (మిక్కిలినేని), మహారాణి (రమాదేవి)ల కుమార్తె సుకన్య (కృష్ణకుమారి). తల్లిదండ్రులు, చెలులతో వన విహారానికి వెళ్తుంది. అలా వన విహారంలో ఆమె విసిరిన పూమాల ఓ పుట్టపై పడుతుంది. దాన్ని తీయబోయి, అందులోనుంచి వచ్చే వింతకాంతులు చూసి ఓ పుల్లతో చిదిమివేస్తుంది. దాంతో ప్రకృతిలో ప్రళయ కంపనలు వస్తాయి. ఆ పుట్టలోని చ్యవనుడు (అమర్‌నాథ్) అంధుడు కావడం జరుగుతుంది. మహర్షి ఆగ్రహాన్ని శాంతింపచేసి, అతనికి పరిచర్య చేయటానికి నారద మహర్షి (పద్మనాభం) సూచనపై శర్వాతి తన కుమార్తె సుకన్యనిచ్చి అతనికి వివాహం చేస్తాడు. సుకన్య అనుకూలవతియైన ఇల్లాలిగా పతికి సేవ చేస్తుంటుంది. దేవ వైద్యులు, సంధ్యాదేవి పుత్రులు అయిన అశ్వనీ కుమారులు (కాంతారావు) తమకు యజ్ఞ్ఫలం అర్హతలేదని దేవేంద్రుడు సభలో నిరాకరించటంతో, నారదుని సలహాతో సుకన్యను ఆశ్రయించి ఆమెను సోదరిగా భావించి, ఆమె భర్త చ్యవనునికి యవ్వనం ప్రసాదిస్తారు. సుకన్య చ్యవనులు ఆనందంగా దాంపత్య జీవితం గడుతుంటారు. దేవేంద్రుడు కోపంతో విద్యాధారుని పంపి, చ్యవనుడిగా మార్చి అతడు మరణించినట్టు సృష్టిస్తాడు. చ్యవన మహర్షి శిష్యుడు మార్గానే్వషి (రమణారెడ్డి) అంత్యక్రియలు జరుపుతాడు. శర్వాతి మహరాజు తన కుమార్తె పర పురుషునితో ఉందని భావించి, ఆమెను, చ్యవనుని కారాగారంలో బంధిస్తాడు. జగన్మాత అనుగ్రహంతో సుకన్య అగ్నిపరీక్షలో జయంపొంది, అశ్వనీ దేవతలకోసం భర్త ఆధ్వర్యంలో తలిదండ్రులచే యజ్ఞం చేయిస్తుంది. జగన్మాత అనుగ్రహంతో దేవేంద్రుడు కల్పించిన ఆటంకాలను ఎదుర్కొని, యజ్ఞాన్ని పూర్తిచేయించి, అశ్వనీ దేవతలకు యజ్ఞ్ఫలం అందించటానికి దేవేంద్రుడు కూడా సిద్ధపడటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో సుకన్య చెలికతె్తైలుగా మీనాకుమారి, అమ్మాజీ నటించారు.
దర్శకులు చంద్రమోహన్ కథకు తగ్గట్టు సన్నివేశాలను అర్ధవంతంగా తీర్చిదిద్దారు. చ్యవనునికి జరిగిన అపచారం కారణంగా రాజ్యంలో ప్రజలకు ప్రకృతి నియమాలు (మూత్ర సంబంధాలు) వంటివి అవరోధం కల్గటం, సుకన్య పశ్చాత్తాపంతో చ్యవనుని వివాహం చేసుకోవటానికి సంసిద్ధత వ్యక్తం చేయటం, భర్తను వృద్ధుడు, అంధుడని నిరసన చూపక ఓర్పుకో సేవించటం, భర్త విసుగు, కోపాన్ని భరించటం, గార్ధబాలుగా మారిన ‘అశ్వని కుమారు’లకు తన పాతివ్రత్య బలంతో తిరిగి నిజ రూపమిప్పించటం, వారి వరంతో యవ్వనవంతుడైన భర్తతో ఆనందంగా గడపటంలాంటి సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. చ్యవన, సుకన్యలపై చక్కని గీతాలనూ చిత్రీకరించారు. వాటిలో ఒకటి సుకన్య కలలో పాడుకునే -నేడే హాయిహాయి ఆనందం చిందేరేయి (గానం: పి సుశీల, ఘంటసాల). ఆకాశంలో చంద్రుడు, తోటలో పూవులు, నదిలో అలలు చూపుతూ పాటను అద్భుతంగా చిత్రీకరించారు. యువకుడైన భర్తతో సుకన్య ఆనందమయ జీవితాన్నీ పాటగా చిత్రీకరించారు.
శిష్యుడు, చెలులు అనుమానించటం; తండ్రి నిందించి ఖైదుచేయగా సుకన్య జగన్మాతను ప్రార్థించటం; అగ్నిప్రవేశంతో నిజం నిర్ధారణ; ఇవికాక అశ్వని కుమారులు సూర్యుని పుత్రులని, సంజ్ఞాదేవికి తండ్రి శాపంవలన అశ్వరూపం రావటం; ఛాయాదేవి తన పుత్రులను ప్రేమించి, సంజ్ఞాదేవి పుత్రులను నిరసించటం, నిజం తెలిసి సూర్యభగవానుడు, సంజ్ఞాదేవి అశ్వరూపంలో కలుసుకోవటం; అందువలన వారెంతటి ప్రజ్ఞావంతులైన వైద్యులైనా దేవతల నిరసన; దేవేంద్రుని ఆగ్రహం; వారికోసం సుకన్య, చ్యవనునిచే చేయించే యజ్ఞాన్ని నిరోధించే దేవేంద్రుని (రాజనాల) యత్నాలు భంగంకావటం; దేవేంద్రుడు త్రిమూర్తులను వేడుకోవటం; వారు సుకన్య జగన్మాత వరప్రసాదిని అని, అశ్వని కుమారులకు యజ్ఞ్ఫలం ఇమ్మని ఆదేశించటం; దేవేంద్రుడు సుకన్యను శరణుకోరటం; సుకన్య తన పాతివ్రత్యాన్ని తెలిపే ‘నేను త్రికరణ శుద్ధిగా నా పతి పాదములు నమ్మితినేని’ మంత్రాన్ని పఠించటం; జగన్మాత ప్రార్థనతో వజ్రాయుధాన్ని ఎదిరించటం వంటి అంశాలను విపులంగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.
రమణారెడ్డికి ఇద్దరు భార్యల సన్నివేశాలు హాస్యంకోసం రూపొందించినా అవి అంతగా ఆకట్టుకోలేదు. మిగిలిన పౌరాణిక అంశాలను మూలానికి భంగం కలుగకుండా దర్శకుడు ఔచిత్యంతో రూపొందించటం విశేషం.
ఈ చిత్రంలో సుకన్యగా కృష్ణకుమారి పాత్రోచితంగా వివిధ భావాలను ఎంతో పరిపూర్ణంగా నటనలో ఆవిష్కరించారు. వృద్ధునిగా, యువకునిగా సన్నివేశానుగుణంగా చ్యవనుని పాత్రను అమర్‌నాథ్ సాత్వికత, తామస నటనతో మెప్పించారు. నారదునిగా పద్మనాభం ప్రశంసనీయమైన నటన, అశ్వని కుమారులుగా వీరోచిత, సాత్విక నటనతో కాంతారావు అలరించారు.
ఘంటసాల సంగీతంలో అలరించిన చిత్ర గీతాలు:
నారదునిపై భక్తిగీతం -జయజయ లోకాన భవభయ (ఘంటసాల). చిత్రం ప్రారంభంలో టైటిల్స్ వస్తుండగా రాకుమారి, చెలులపై సాగే గీతం -జీవితమే మనోహరమే జాజి సుమాల పరిమళమే (పి లీల బృందం). వీరిపైనే మరో గీతం -అందాల సొగసులు చిందెనే (పి.లీల). సుకన్య భర్తను సేవిస్తుండగా వచ్చే గీతం -పుణ్యవతీ, ఓ త్యాగవతీ ధన్యురాలివే. ఈ గీతంలో అలరించే చరణాలు ‘పర్ణశాలే రసరమ్య హర్మమా/ నార చీరలే చీనాంబరములు/ కందమూల విందుభోజనం/ కటిక నేలయే కుసుమ తల్పము/ త్యాగమే నీ వైభోగమా.. పతివ్రతల లక్షణాలను ఆదర్శంగా అక్షరబద్ధం చేసి ఓ ప్రత్యేకత ఈ గీతానికి శ్రీరామ్‌చంద్ కల్పించారు. దానికి ఘంటసాల గానం మరింత శోభస్కరంగా జతకూడటం విశేషం. మరో గీతం -హే జగన్మాతా కరుణాసమేతా (పి లీల). దేవేంద్రుని సభలో నృత్య గీతం -సోమపానం ఈ దివ్యగానం (కె జమునారాణి). చిత్రంలోని పద్య రచన శ్రీరామచంద్, కామరాజు, చెఱువు ఆంజనేయశాస్ర్తీ కావించారు.
-కన్నీరు నిట్టూర్పు కలతలే వీక్షింపకట్టెనే మాని (పద్యం: ఘంటసాల). -పతి సేవ దక్క ఇతర తాపస వృత్తి (సంవాద పద్యాలు -పి లీల, మాధవపెద్ది). -కోటి దేవేంద్రులేకమై కూడదన్న యజ్ఞంబులు (పి లీల). పౌరాణిక గాథలు జనావళికి చేరువకావాలనే సదుద్దేశంతో సహేతుకంగా, విపులంగా రూపొందించిన చిత్రంగా ‘సతీ సుకన్య’ నిలవటం విశేషం.
1967లో ఇదే కథతో కన్నడంలో ‘సతీ సుకన్య’ చిత్రాన్ని డి పుట్టుస్వామి నిర్మాతగా, వైఆర్ స్వామి దర్శకత్వంలో ఎం శ్రీరామచంద్ రచనతో రాజ్‌కుమార్, ఉదయకుమార్, హరిణి కాంబినేషన్‌లో రాజన్- నాగేంద్ర సంగీతంతో రూపొందించారు. ఆ సినిమా 1967 మార్చి 8న విడుదలైంది.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి