ఫ్లాష్ బ్యాక్ @ 50

విచిత్ర కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత, దర్శకులు, నటులు కోవెలమూడి సూర్యప్రకాశరావు (కెఎస్ ప్రకాశరావు) దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా వాసిగాంచిన నందమూరి తారక రామారావు 2 చిత్రాల్లో నటించారు. 1967లో రామానాయుడు రూపొందించిన ‘స్ర్తిజన్మ’ ఒక చిత్రమైతే, 1969లో శ్రీరాజ్ ఆర్ట్స్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన ఆ రెండో చిత్రమే ‘విచిత్ర కుటుంబం’. ఈ 2 సినిమాల్లో యన్‌టిఆర్, కృష్ణలు సోదరులుగా నటించటం ప్రత్యేకాంశం.
విచిత్ర కుటుంబం 1969 మే 28న విడుదలైంది. ప్రముఖ హాస్య రచయిత భమిడిపాటి కామేశ్వరరావు కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ, తండ్రి ఒరవడిలోనే డిగ్రీ పూర్తిచేశాక తొలి నాటికకు ఉత్తమ రచన బహుమతి సాధించి, తరువాత పలు హాస్య నాటికలు, నాటకాలు రచించి ప్రసిద్ధిపొందారు. నిర్మాత డూండీ ద్వారా ‘మరపురాని కథ’ చిత్రానికి సినీ రచయితగా ప్రవేశించి పలు చిత్రాలకు రచన చేశారు. వాటిలో వింతకాపురం, దేవత, పొట్టిప్లీడరులాంటి చిత్రాలు చెప్పుకోవచ్చు. ఆ కోవలో 1969లో ఎన్‌టిఆర్ కథానాయకుడు చిత్రానికి వీరు సమకూర్చిన సంభాషణలు చిత్ర విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. ఆ చిత్రం తమిళంలో విజయానాగిరెడ్డి రూపొందించిన (నామ్‌నాడ్), 1969లో హిందీ వెర్షన్ ‘అప్నాదేశ్’లోనూ వీటిని భాష మార్పుతో యథాతథంగా ఉపయోగించటం విశేషం. ఈ విచిత్ర కుటుంబం చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ సందర్భోచిత, పసందైన, పదునైన సంభాషణలు సమకూర్చి మెప్పించారు.
1969లో నిర్మాత వికెపి సుంకవల్లి శ్రీరాజ్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం -విచిత్ర కుటుంబం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలను, చక్కని డిజైన్స్, బొమ్మలతో తమాషాగా చూపుతూ టైటిల్స్‌ను ఎస్‌ఎస్ లాల్ రూపొందించారు.

కళ: బి నాగరాజన్
ఎడిటింగ్: ఆర్ దేవరాజన్
సంగీతం: టివి రాజు
స్టంట్స్: సాంబశివరావు
కెమెరా: కె జయరాం
ఫొటోగ్రఫీ: ఆర్ సంపత్
నృత్యం: హీరాలాల్, చిన్ని- సంపత్, కెఎస్ రెడ్డి
దర్శకులు: కెఎస్ ప్రకాశరావు

ప్రముఖ లాయర్ రాజశేఖరం (ఎన్‌టి రామారావు). అతని భార్య కమలమ్మ (సావిత్రి). తమ్ముడు కృష్ణ (కృష్ణ), చెల్లెలు మల్లిక (సంధ్యారాణి). కమలమ్మ చెల్లెలు రాధ (విజయనిర్మల). వారి తల్లి (మాలతి). ఆ ఊరిలో ధనవంతుడు, పెద్దమనిషి ముసుగులో అవినీతిపరుడు, పేదవారిని దోచుకునే కుయుక్తిపరుడు నాగరాజు (నాగభూషణం). అతని భార్య సుశీల (పుష్పకుమారి), అతని తమ్ముడు రాఘవ (శోభన్‌బాబు). రష్యాలో చదువుతుంటాడు.
లాయర్ రాజశేఖర్ పేదవారికి అండగావుండి, నాగరాజు అన్యాయాలను కోర్టుద్వారా అరికట్టడంతో, నాగరాజు అతనిపట్ల ద్వేషం పెంచుకుంటాడు. కృష్ణ ముక్కోపి. అన్యాయంగా ప్రవర్తించే వారిపై చెయ్యి చేసుకుని దండిస్తుంటాడు. కమలమ్మ తండ్రి నాగరాజువద్ద దాచిన డబ్బుకోసం వారింటికి వెళ్లిన ఆమెను నాగరాజు బెదిరిస్తాడు. తిరిగి వస్తూ దారిలో నాగరాజు అనుచరుడు సింగన్న (ప్రభాకర్‌రెడ్డి) చేసిన హత్యను చూసిన కమలమ్మ, మరోసారి నాగరాజుతో గొడవపడిన మరిది కృష్ణకు వ్యతిరేకంగా సాక్ష్యంచెప్పి అతన్ని జైలుకు పంపుతుంది. నాగరాజు తమ్ముడు రాఘవ, జూలీ (షీలా) అనే యువతిని పెళ్లాడి తమ ఊరికి తీసుకొస్తాడు. మంచి మాటలతో వారిద్దరినీ నమ్మించిన నాగరాజు, విహారయాత్రకు పంపించి తన అనుచరుడు సింగన్నతో వారిని అంతం చేయించాలనుకుంటాడు. దాన్నించి తప్పించుకున్నవారిని తన పాత బంగళాలో బంధిస్తాడు. విషయం నిగ్గు తేల్చే ఉద్దేశంతో రాజశేఖర్ గండ్ర గంగన్న వేషంలో నాగరాజు అనుకూలుడుగా నటిస్తాడు. కృష్ణ, సింగన్న, రాఘవ వారందరినీ, గంగన్నగా కమలమ్మను, రాధను బంధించి పాత బంగళాకు తెచ్చిన రాజశేఖర్ సహా అందరినీ అంతం చేయాలనుకుంటాడు నాగరాజు. అయితే, సుశీల అంతకుముందే తుపాకీలో గుళ్లు మార్చివేయటంతో, రాజశేఖర్, రాఘవ, కృష్ణ, నాగరాజు అనుచరులతో పోరాడి వారిని పోలీసులకు అప్పగించటంతో నాగరాజుకు జైలుశిక్ష పడుతుంది. చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో భూలోకంగా రాజ్‌బాబు, అతని జంటగా మీనాకుమారి, ఇంకా రామచంద్రరావు, సిహెచ్ కృష్ణమూర్తి, వంగర, వడ్లమాని విశ్వనాథం, మద్దాలి కృష్ణమూర్తి తదితరులు నటించారు.
దర్శకులు కెఎస్ ప్రకాశరావు సన్నివేశాలను పాత్రోచిత లక్షణాల కనుగుణంగా వైవిధ్యం, సెంటిమెంటు, ప్రేమ, అనురాగం, భయం, బెదురు, క్రౌర్యం, మోసం మేళవించి రూపొందించారు. తనదికాని స్థలంలో నాగరాజు నలుగురిని చంపించి గోతిలో పాతించి దానిపై దేవాలయం నిర్మింపచేసి ఎవరో పుణ్యాత్ముడు ఆలయం నిర్మించాడని చెప్పటం; రాజశేఖర్, కమల మధ్య వాదనలు; కమల బెదురు, భయం స్వభావం; భర్తతో కాపురం గురించి విశే్లషణలు; కృష్ణ కోపం అదుపు చేయటం కోసం పడే పాట్లు; చెల్లెలు రాధ స్వభావం అదేనని దిగులు; కమలమ్మ, నాగరాజు ఇంటికి తండ్రి దాచిన సొమ్ముకోసం వెళ్లి సింగన్న చేసిన హత్య చూడటం; మరోసారి మరిది వెళ్లి గొడవ పడటంలో భయం; చిత్రం చివరలో మరిదికోసం నాగరాజు ఇంటికి వెళ్లి కమలమ్మ అతన్ని పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరించటం వంటి సన్నివేశాలను ఎంతో సహజంగా రూపొందించారు. ఆయా సన్నివేశాల్లో సావిత్రి స్థాయిని మించిన పరిపూర్ణతను చూపిస్తే, ఆమెకు పోటీగా యన్‌టి రామారావు ఎంతో ఈజ్‌తో నటించటం విశేషం.
ఈ చిత్రంలోని మరో ముఖ్య సన్నివేశం కోర్టులో నాగరాజు -కృష్ణ తనను కుడిచేత్తో ఎడమ చెంపమీద కొట్టాడనటం. దాన్ని రాజశేఖర్ సాక్షులచేత ఎడమ చేతితో కొట్టినట్టు నిరూపించటం, కమల సాక్ష్యంలో జడ్జి కృష్ణకు ఎడమ చేయి అలవాటు లేదామ్మా అని అడగటం, దానికితగ్గ జవాబు కమల ఇస్తూ ధైర్యంగా ఎడమచేయి తాను పట్టుకున్నానని చెప్పటం, కృష్ణ జైలుకు వెళ్లటంతో ఆగ్రహించిన భర్త కమలను గొడ్రాలు అని నిందించటం, ఆ సన్నివేశంలో సంభాషణలు, దానికి ప్రతిగా భార్య జవాబు, అది విని చెల్లెలు రాధ, కమల భర్త ఆమెను అక్కున చేర్చుకోవటం.. తిరిగి జైలునుంచి విడుదలైన కృష్ణకోసం బయలుదేరిన కమలను భర్త, చెల్లెలు వద్దని వారించటం, దానికి ఆమె స్పందన, బయటనుంచి వచ్చిన మరిది కృష్ణ ప్రతిస్పందన.. ఈ విచిత్ర కుటుంబం చిత్రంలో హైలెట్‌గా నిలిచి మహిళాలోకం ప్రశంసలు పొందిన సన్నివేశాలు కావటం ఎన్నదగిన అంశం. దర్శకులు పాటల చిత్రీకరణలోనూ ఆ వైవిధ్యం చూపారు.
చెల్లెలు మల్లికను హాస్టల్‌నుంచి తీసుకువస్తూ కృష్ణ, మల్లిక బైకు పైవుండగా చిత్రీకరించిన గీతం -రంగు రంగుల పూలు నింగిలో మేఘం మా చెల్లికి ఆభరణాలు (గానం: పి సుశీల, ఘంటసాల). రోడ్డుమీద, పడవలో, కొండమీద అలరించేలా సాగుతుంది. పాట పూర్తయ్యాక జనం కృష్ణను మందలించటం, అతడు చేయిచేసుకోవటం.. చిత్రం ప్రారంభంలోనే పాత్ర లక్షణాన్ని పరిచయం చేశారు. రాఘవ పెళ్లివిందులో వైవిధ్యంగా జ్యోతిలక్ష్మి, మరో నర్తకిల నృత్యగీతం -నలుగురు నవ్వేరుగా గోపాలా (పి సుశీల). స్టేజ్‌పై దేవాలయం, వీణలు, మృదంగాల చిత్రాలు వాటిపై రాధ, కృష్ణల నృత్యం సాగటం. కృష్ణ, విజయనిర్మలపై గీతం తమాషాగా పోట్లాట గురించి సాగటం విశేషం. ‘కాచుకో, చూసుకో దమ్ము తీసి, రొమ్ములేచి’ (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, ఘంటసాల). కోపంతో వెళ్తున్న కృష్ణను చూసి విజయనిర్మల పాడే గీతం -పోతున్నారా తొందరపడు (పి.సుశీల). రాజ్‌బాబు, మీనాకుమారి, సింగన్న జాడకోసం ఊరు చివర పాడే యుగళ గీతం -ఎర్రాఎర్రాని దానా బుర్రాబుగ్గల (పిఠాపురం, ఎల్‌ఆర్ ఈశ్వరి). విచిత్ర కుటుంబం చిత్రం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిరస్మరణీయ గీతం శోభన్‌బాబు, షీలాలపై చిత్రీకరించారు. కృష్ణవేణి, గోదావరి, తుంగభద్ర ప్రాశస్థాలతో, ప్రదేశాల వర్ణనతో రమ్యంగా చిత్రీకరించిన (నాగార్జునకొండ, శిల్పాలు, హంపీ రథాలు, శిల్పాలు చూపటం) ఆడవే జలకమ్ము లాడవే/ కలహంస లాగ (గానం: ఘంటసాల, పి సుశీల బృందం). చిత్ర గీత రచన సి నారాయణరెడ్డి, స్వరాలందించింది టివి రాజు. ఇవి శ్రోతలకు మనోల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ చైతన్యవంతంగా సాగుతోంది.
చక్కని సెంటిమెంటుతో కూడిన కుటుంబ కథాచిత్రంగా విచిత్ర కుటుంబం చిత్రం నిలవటం, ప్రశంసలు పొందటం ఆనందించదగ్గ విషయం. యన్‌టి రామారావు, సావిత్రి, కృష్ణ, విజయనిర్మల, శోభన్‌బాబు, షీలా, నాగభూషణం వంటి ముఖ్య తారాగణంతో చిత్రం రూపొందించిన నిర్మాత వికెపి సుంకవల్లి అభినందనీయులు.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి