ఫ్లాష్ బ్యాక్ @ 50

ఆస్తులు- అంతస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రదేశంలో తొలి ఎగ్జిబిటర్ అయిన పోతిన శ్రీనివాసరావు, అచ్చాయమ్మల రెండో కుమారుడు డూండేశ్వరరావు (డూండీ) 1932 జూన్ 9న విజయవాడలో జన్మించారు. విజయవాడ, రిషీవ్యాలీ, మద్రాస్‌లలో విద్య అభ్యసించారు. విజయవాడకు వచ్చే సినీ ప్రముఖులతో పరిచయాలు కలిగాయి. అలా విజయ నాగిరెడ్డి సలహాతో -అంజలీదేవి, రంజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘నీలమలై తిరుడన్’ చిత్రాన్ని తెలుగులో ‘కొండవీటి దొంగ’గా అనువదించారు. ఆ చిత్రం విజయం సాధించటంతో, శభాష్‌రాముడు చిత్రానికి రాజశ్రీ పిక్చర్స్ అధినేత సుందర్‌లాల్ నహతాతో భాగస్వామిగా వ్యవహరించారు. తరువాత సుందర్‌లాల్ నహతా, డూండీ భాగస్వాములుగా శ్రీ ప్రొడక్షన్స్ ప్రారంభించి భరణి అధినేత పిఎస్ రామకృష్ణ దర్శకత్వంలో ‘శభాష్‌రాజా’ (1961) చిత్రాన్ని రూపొందించారు. అలా -1969లో శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై వీరు రూపొందించిన సాంఘిక చిత్రమే ‘ఆస్తులు- అంతస్తులు’. 1969 మే 15న సినిమా విడుదలైంది.
వి మధుసూధనరావు వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకునిగా పనిచేసి, డూండీ నిర్మించిన ‘మరపురాని కథ’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి రామచంద్రరావుకే ఈ చిత్రానికీ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.

మాటలు: ముళ్లపూడి వెంకటరమణ
సంగీతం: ఎస్‌పి కోదండపాణి
ఎడిటింగ్: ఎస్‌ఎస్ ప్రకాశం
కళ: ఎస్ కృష్ణారావు
కెమెరా: దేవరాజ్
నృత్యం: చిన్ని, సంపత్
కెమెరా: విఎస్‌ఆర్ స్వామి
దర్శకత్వం: వి రామచంద్రరావు
నిర్మాతలు: సుందల్‌లాల్ నహతా, డూండీ

తరతరాలుగా ఆస్తి అంతస్తుగల శ్రీమంతురాలు రమాదేవి (ఎస్ వరలక్ష్మి). ఆమె భర్త పద్మనాభరావు(రేలంగి). సొసైటీలో పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే రమాదేవికి పేదవారంటే చులకన భావం. వారికి ఒక కుమారుడు బాబ్జీ (పద్మనాభం), ఒక కుమారె్తై శాంతి (వాణిశ్రీ). తల్లి ఆడంబరం, అహంభావం నచ్చని బాబ్జీ విమర్శిస్తుంటాడు. ఒక సామాన్య యువతి సుబ్బులు (విజయలలిత)తో ప్రేమలో పడతాడు. ఇక కాలేజీలో చదివే శాంతి, తన కారు ట్రబులివ్వటంతో లోకల్ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ అక్కడ చిత్రకారుడు శంకరం (కృష్ణ)ను కలుసుకొని అతనితో ప్రేమలో పడుతుంది. రమాదేవి ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేసే రాజయ్య (వెంకటేశ్వరరావు) కుమారుడే శంకరం. పేదవాడన్న సంగతి తెలియకుండా శంకరాన్ని శాంతి ప్రేమించటం, తమ పెళ్లికి తల్లి అంగీకరించక పోవటంతో ఆస్తి అంతస్తు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కూతురు మీది ప్రేమతో రాజీపడిన రమాదేవి, శంకరాన్ని ఇల్లరికానికి ఒప్పించి వారి వివాహం జరిపిస్తుంది. తాను ప్రేమించిన సుబ్బులు ధనవంతుల బిడ్డగా అమ్మను నమ్మించి, రెండు వివాహాలు ఒకేసారి జరిగేలా చూస్తాడు బాబ్జీ. పెళ్లయ్యాక శంకరాన్ని అవహేళన చేస్తూ ధనవంతుల బిడ్డగా నమ్మిన కోడల్ని గారంగా చూస్తుంటుంది రమాదేవి. శాంతిమీద ఆశలు పెట్టుకున్న మేనమామ, శంకరంపై హత్యాయత్నం చేస్తాడు. దీంతో శాంతి, శంకరం ఇల్లొదిలి వెళ్లిపోయి స్వతంత్రంగా జీవిస్తుంటారు. కోడలు సుబ్బులు అత్తగారిపట్ల అమర్యాదగా ప్రవర్తించటం, కూతురుపట్ల ప్రేమ, భర్త హితోక్తుల నేపథ్యంలో శాంతిని ఇంటికి రమ్మని కోరుతుంది రమాదేవి. శంకరం గీసిన చిత్రానికి అమెరికా నుంచి అవార్డు లభించటం, శాంతి తాము ఎందుకు విడిగా వచ్చామో తండ్రికి వివరించటం, రమాదేవి తన తమ్ముడిని ఇంటినుంచి వెళ్లగొట్టి కూతురు, అల్లుడు, కొడుకు, కోడళ్లు, బంధువులతో దీపావళి పండుగ జరుపుకోవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో బర్మానుంచి వచ్చిన ధనవంతులుగా రామచంద్రపురం జూ భానుమతి, మహిళామండలి సభ్యులుగా నవీనలక్ష్మి, ఉదయలక్ష్మి, ఇంకా ఏడిద నాగేశ్వరరావు ఇతరులు నటించారు.
దర్శకుడు వి రామచంద్రరావు చిన్న చిన్న సన్నివేశాలను సైతం ఎంతో విపులంగా తీర్చిదిద్ది ఆకట్టుకునేలా సినిమాను చిత్రీకరించారు. చిత్రం ప్రారంభంలోనే ఓ సభలో రమాదేవి గొప్పతనం బాబ్జి చేత, ఆమె మాటల్లో చెప్పించటం; మిల్లులోని మేస్ర్తీ కొడుకు పెళ్లికి 10 రూపాయలు చదివించమని చెప్పిన రమాదేవి, మహిళా మండలి భవనం శంకుస్థాపనకి 10 వేలు చెక్కు ఇవ్వటం; అందకు ఆమె వివరణను -రమాదేవి స్వభావాన్ని తేటతెల్లం చేసే సన్నివేశాలుగా దర్శకులు చిత్రీకరించారు. అలాగే, సభలో తల్లికి వేసిన దండను కొలిచిన బాబ్జీ ఆమె విరాళం ఎంత ఇచ్చిందో దండ పొడుగునుబట్టి చెప్పటంలాంటి సన్నివేశంతో హస్యస్ఫోరకమే కాకుండా, రమాదేవి పాత్ర తీరుతెన్నులను విశే్లషించారు. శాంతి ప్రేమలో పడిందని తెలుసుకున్న తండ్రి, అసలు శంకరం ఎవరో శాంతి, రమాదేవికి తెలిసేలా చేయటం, దాంతో శాంతికి శంకరంతో పెళ్లి వద్దని రమాదేవి ఆవేదన, ఆజ్ఞ, దానికి శాంతి రియాక్షన్‌లను దర్శకులు హృద్యంగా చిత్రీకరించారు. శాంతిని ప్రేమించలేదని శంకరం చేత చెప్పించటానికి లక్షలు ఎరచూపటం, శాంతి ఆ విషయాలు తెలుసుకుని ఇంటినుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడటం, శాంతి పెళ్లి జరగగానే, శంకరం చెల్లెలిని అయినింటి వారబ్బాయితో ఆ తల్లి సంబంధం కుదుర్చుకోవటం, దానికి రమాదేవి స్పందన, దానికి శంకరం తండ్రి వెంకటేశ్వరరావు ఘాటైన ప్రతిస్పందన లాంటి సన్నివేశాలు వాస్తవికతను ప్రతిబింబిస్తూ హృదయానికి హత్తుకుంటాయి. శంకరంతో విడిగా గుడిసెలో జీవిస్తూ ఎంతో నిబ్బరంగా, ధైర్యంగా ప్రవర్తించే శాంతి పాత్రతో మహిళ మానసిక బలాన్ని దర్శకుడు చూపించారు. ‘అప్పు చేయకుండా, శంకరం తన సంపాదనతో చీరకొన్నప్పుడే నాకు దీపావళి’ అని శాంతి పాత్ర చెప్పడం, అంతకుముందు రోజు ‘10 చీరలు కట్టేదాన్ని. ఇప్పుడు ఒకే చీర పది రోజులు కడతాను’ అని శాంతి చేత సామాన్యంగా చెప్పించటంలో ఆ పాత్రకు దర్శకుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది అర్థమవుతుంది. ఆ మాటల్ని చాటునుంచి విన్న తల్లి ఆశ్చర్యపోవటాన్ని చూపించి, సన్నివేశానికి మరింత బలాన్ని చేకూర్చారు. కోడల్ని కూతురులా చూడాలని ప్రయత్నించి రమాదేవి భంగపడటం, వీటన్నిటినీ సమన్వయం చేస్తూ పద్మనాభరావు విశే్లషించటం లాంటి సన్నివేశాలను దర్శకులు చాలా సహజంగా రూపొందించారు. వీటికి ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అందించిన సంభాషణలు ఎంతో నిండుదనాన్ని చేకూర్చాయి. లోకల్ ట్రైన్‌లో స్ర్తిల వస్తధ్రారణ గురించి శంకరం ఉదహరించిన సత్యాలు నేటికీ అన్వయించబడడం -రచయిత దూరదృష్టికి, సహజత్వానికి సంకేతం అనుకోవాలి.
ఈ చిత్రంలో శంకరంగా కృష్ణ ఎంతో సాత్వికతతో కూడిన నటనతో మెప్పించారు. శాంతిగా వాణిశ్రీ ఎంతో నిండుతనం, పరిపూర్ణతను అభినయంలో చూపించారు. రమాదేవిగా ఎస్ వరలక్ష్మి సన్నివేశానుగుణమైన ఆవేశకావేశాలు ఎంతో ఈజ్‌తో ప్రదర్శించగలిగారు. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా రేలంగి పాత్రోచితంగా, నిండుగా, గంభీరంగా ఒప్పించారు. ‘అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పుడే ఏమీలేని నిరుపేద జీవితం చూడాలి’ అంటూ పలు నీతివాక్యాలను సినిమాపరంగా శాంతికి బోధించినా, అవి అందరికీ ఆదర్శంగా నిలవటం చిత్ర ప్రత్యేకతగా పరిగణించాలి. ఆస్తులు -అంతస్తులు చిత్రం సెంటిమెంటుతో కూడిన చిత్రంగా, తల్లికూతుళ్ల అనుబంధానికి అద్దంపట్టే సన్నివేశాలతో రూపొందించిన చిత్రంగా ప్రశంసలు అందుకుంది.
చిత్రంలోని గీతాలు:
విజయలలిత రేగుపళ్లు అమ్ముతూ పాడే పాట -అహ ఎర ఎర్రని పళ్లు.. తియ్య తియ్యని పళ్లు (రచన: కొసరాజు, గానం: పి సుశీల). పద్మనాభం, విజయలలితలపై చిత్రీకరించిన గీతం -కలకండ పలుకుకన్నా నీ సొగసు (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: అప్పలరాజు). వాణిశ్రీ తన ఇంటిలో ఒంటరిగా శంకరాన్ని తలచుకుంటూ పాడే గీతం -నినె్నమో అనుకున్నాను/ నేడేమో అయిపోతున్నాను (గానం: పి సుశీల). వాణిశ్రీ, కృష్ణలపై చక్కని తోటలో ఆహ్లాదకరంగా చిత్రీకరించిన యుగళగీతం -ఒకటైపోదామా ఊహల వాహినిలో మమతల (గానం: ఎస్‌పి బాలు, పి సుశీల, రచన: ఆరుద్ర) హీరో హీరోయిన్లపై వచ్చే పలు సన్నివేశాలకు ఈ పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా వినిపిస్తూ ఉండటం ఓ విశేషం. ఈ గీతం -సినిమాను నేటికీ చిరస్మరణీయం చేయటం ఓ ముచ్చటైన అంశం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి