ఫ్లాష్ బ్యాక్ @ 50

టక్కరి దొంగ- చక్కని చుక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రికి చెందిన వైవి రావు (‘సువర్ణమాల’ చిత్ర నిర్మాణ బాధ్యతలకై 1948లో మద్రాస్ వచ్చారు) జర్నలిజంపై ఆసక్తితో టెంపోరావ్‌తో కలిసి ‘్ఫల్’, ‘టెంపో’ మొదలైన డిటెక్టివ్ సంపాదకవర్గంలో 1954 నుంచి పని చేశారు. వీరి బావ నిర్మాత భావన్నారాయణ స్థాపించిన గౌరీ ప్రొడక్షన్స్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1968లో పూర్ణాకామరాజు సహకారంతో ‘రవి చిత్ర ఫిలిమ్స్’ నెలకొల్పి తొలి ప్రయత్నంగా కృష్ణ, విజయనిర్మల కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం ‘టక్కరి దొంగ- చక్కని చుక్క’.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కె సుబ్బరామదాసు (కెయస్‌ఆర్ దాస్) నిర్మాత భావన్నారాయణ ప్రోత్సాహంతో మద్రాస్ చేరి, వారి చిత్రాలకు ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. భావన్నారాయణ 1966లో నిర్మించిన ‘లోగుట్టు పెరుమాళ్లుకెరుక’ చిత్రం ద్వారా దర్శకునిగా ప్రస్థానం మొదలెట్టారు. 2012లో అమరులయ్యారు. అంతవరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువభాగం హీరో కృష్ణ నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించటం విశేషం. 1969లో ‘టక్కరిదొంగ- చక్కని చుక్క’ చిత్రానికి దర్శకులుగా కెయస్‌ఆర్ దాస్‌ను ఎన్నుకున్నారు నిర్మాత వైవి రావు. ఈ సినిమా 1969 మే 16న విడుదలైంది. మ్యూజియంలో దొంగతనం... తరువాత టైటిల్స్, డిజైన్స్ ప్రారంభమవుతాయి.

సంగీతం: సత్యం
నృత్యం: కెఎస్ రెడ్డి
స్టంట్స్: మాధవన్
కళ: చలం
ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్
మాటలు: టిపి మహరథి
కూర్పు, దర్శకత్వం: కెఎస్‌ఆర్ దాస్
నిర్మాత: వైవి రావు

ఆ ఊరిలో దాదా (రాజనాల), భయంకర్ (సత్యనారాయణ) ఇద్దరూ గ్యాంగ్ లీడర్లు. దోపిడీలు దొంగతనాలు చేస్తూ రౌడీలను పెంచి పోషిస్తూ దందాలు చేస్తుంటారు. భయంకర్ సూచనతో ముఠాకు చెందిన శ్యామ్ (కృష్ణ) మ్యూజియంలోంచి అతి విలువైన పరిటాల వజ్రాలు దొంగిలించి తన హోటల్ రూములో సీలింగ్ ఫ్యాన్‌లో దాస్తాడు. బిఏ చదివి, ఏ ఉద్యోగం దొరక్క రిక్షా నడుపుతూ జీవించే వ్యక్తి గోపి (మరో కృష్ణ). ఒకరోజు శ్యామ్ గోపీ రిక్షాను కారుతో ఢీకొట్టడం, అతన్ని తన రూమ్‌కు తీసుకొచ్చి తనకు బదులుగా రూమ్‌లో నెల రోజులు ఉండమని 50వేల రూపాయలు ఇస్తాడు. గోపి అందుకు అంగీకరించటంతో, శ్యామ్ దూరంగా వెళ్లిపోవటం జరుగుతుంది. వజ్రాలు తెచ్చివ్వలేదని భయంకర్, శ్యామ్ కోసం వెతుకుతుంటాడు. అలాగే ఆ వజ్రాల కోసం దాదా గోపీని బంధిస్తాడు. గోపి తనకేమీ తెలియదని చెబుతాడు. తరువాత రూమ్‌కి వచ్చి, అక్కడ శ్యామ్ మరణించి ఉండటాన్ని గమనించి, ఇక భయంకర్‌ను, దాదాను తానే ఒంటరిగా ఎదుర్కొంటుంటాడు. ప్రభుత్వ సైనికుల శక్తి సామర్థ్యాల కోసం తలపెట్టిన ప్రయోగాన్ని సైంటిస్ట్ (పిజె శర్మ), అతని అసిస్టెంటు గీత (విజయనిర్మల) సక్సెస్ చేస్తారు. గీతను ఇష్టపడి ప్రేమించిన గోపి, ఆ ఫార్ములా కాగితాల కోసం సైంటిస్ట్‌ను హత్యచేసి తీసుకోవాలనుకున్న దుండగుల బారినుంచి గీతను, ఫార్ములాను కాపాడతాడు. పత్రాలను ప్రభుత్వానికి అప్పగించటంతో గోపిని ప్రభుత్వం ధనంతో సత్కరిస్తుంది. గీతతో కలిసి తల్లివద్దకెళ్లి వారి ప్రేమ పెళ్ళికి అంగీకారం పొంది, ఇరువురూ ఒకటవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో గోపి స్నేహితుడు, మాలిష్‌వాలా చిన్నయగా రాజ్‌బాబు, అతని జంటగా మీనాకుమారి, పోలీస్ సూపర్నెంట్‌గా ధూళిపాళ, ఇన్స్‌పెక్టర్ కామేశంగా త్యాగరాజు, గోపి తల్లిగా మాలతి, శ్యామ్ ప్రియురాలు లైలాగా విజయలలిత నటించారు.
యాక్షన్, క్రైమ్ సెంటిమెంటుతో కూడిన చిత్రాన్ని దానికి తగ్గట్టు సన్నివేశాలను వైవిధ్యంగా రూపొందించారు దర్శకులు కెఎస్‌ఆర్ దాస్. వజ్రాలు దొంగిలించిన శ్యామ్ వాటిని పదిలంగా దాచటం, అసలు మ్యూజియమ్‌నుంచి వజ్రాల దొంగతనాన్ని ఎంతో విపులంగా చూపించారు. తన స్థానంలో గోపిని ఉంచటం, చిత్రం చివరలో గోపి, శ్యామ్‌లను చూసిన దొంగలు పొరపడి శ్యామ్‌ను గోపి అనిభావించి అంతం చేయటం, ఆ శవాన్ని హోటల్ రూమ్‌లో ఉంచటం, ఇక చిత్రంలో శ్యామ్ బదులు గోపీ సాహసంతో పలుమార్లు దుండగులను ఎదిరించటం, దాదా, భయంకర్‌ల డెన్‌లో ప్రవేశించినా తప్పించుకోవటం, పులిబోనులో అంతకుముందు ఓ వ్యక్తి ఆహారం కావటం, కృష్ణ దానితో పోరాడి తెలివిగా జేబులో చిన్న కత్తితో సంహరించటం లాంటి సన్నివేశాలను ఉత్కంఠ రేకెత్తించేలా దర్శకులు చిత్రీకరించారు. విజయనిర్మలతో కత్తులబోనులో బంధించబడి చిన్నయ్య సాయంతో (తమాషాగా చిత్రీకరించిన పాట -నేనే మాలిష్ వాలా/ నా పేరే చిన్నయ్యలాలా- ఈ చిత్రంలోని హిట్ సాంగ్స్‌లో ఇదొకటి) తప్పించుకోవడం లాంటి సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. మార్వాడి వద్ద నగలు కొట్టేసిన సన్నివేశం.. గీత, గోపిలు పోలీస్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో పలు ఛేజింగ్‌లు.. సైంటిస్ట్ హత్య తరువాత గీత దుండగులకు చిక్కడంతో, ప్లాన్ కోసం భయంకర్, దాదాలు గోపీని ఉపయోగించుకోవాలని అనుకున్న క్రమంలో వైవిధ్యభరితమైన ఫైటింగ్‌లు, క్లైమాక్స్‌లో దాదాను తేలిగ్గా అంతం చేయటం.. భయంకర్, గోపిల మధ్య ఎంతో థ్రిల్లింగ్‌గా రైలుపెట్టెలు, క్రేన్‌లు, వంతెనలమీద శ్రమతో రూపొందించిన షాట్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. మధ్యలో తల్లి మాలతితో గోపి, కామేశం (ఇన్‌స్పెక్టర్)తో సెంటిమెంటు సన్నివేశాలు, చిత్రం చివరలో గోపి మంచివాడని చెప్పించటంతో తల్లి గీత, గోపిల పెళ్లికి అంగీకరించటం.. ఇలా యాక్షన్, సెంటిమెంటుల కలబోతగా చిత్రీకరణ సాగింది.
చిత్రంలో శ్యామ్‌గా, గోపిగా కృష్ణ సన్నివేశానికి తగ్గట్టు ప్రశంసనీయమైన చురుకుదనం చూపించారు. గీతతో ప్రేమ, ప్రణయం సన్నివేశాల్లో లవర్ బోయ్‌గా ఒదిగిపోయారు. తొలుత గీతను వెంబడిస్తూ పాడే గీతం -ఓ చక్కని చుక్క/ నీ నడకలు చూస్తే మనసౌతుంది (రచన: సినారె, గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం). మరో సినారె గీతం -నువ్వు నేను ఇంకెవ్వరూ లేరు (గానం: పి సుశీల). అద్దాల మధ్య రివాల్వింగ్ బెడ్‌పైన పలు నృత్య భంగిమలతో నర్తిస్తూ, కృష్ణను కవ్వించే విజయలలితపై ఈ పాటను చిత్రీకరించారు. సుశీల వైవిధ్యమైన గానంతో మరింత కైపు కలిగించే గీతంగా ఇది సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రారంభంలో డెన్‌లో విజయలలితపై చిత్రీకరించిన మరో గీతం -వయసు కుర్రది వంపులున్నది (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, రచన: ఆరుద్ర). సత్యనారాయణ వద్ద జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన సినారె గీతం -కిల్లాడి మామయ్యా/ నావల్లకాదయ్యా (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి). ఈ చిత్రంలోని చక్కని యుగళగీతం కృష్ణ, విజయనిర్మలపై చిత్రీకరణ -కలలుకనే కమ్మని చిన్నారి/ నీ సొగసులన్నీ నావే (గానం: ఎస్పీ బాలు, పి సుశీల, రచన: దాశరధి). సత్యం సంగీతంతో అలరించేలా ఆకట్టుకునేలా గీతాలు సాగాయి.
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం, తప్పక చూడండంటూ పబ్లిసిటీ ఇచ్చి, చూసినవారికి ఓ వెరైటీ అనుభూతిని అందించి, మాస్ ప్రేక్షకులను, పిల్లల్ని థ్రిల్స్‌తో అలరించిన చిత్రంగా ‘టక్కరి దొంగ- చక్కని చుక్క’ గుర్తింపు పొందటమే కాదు, మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తరువాత కెఎస్‌ఆర్ దాస్ -కృష్ణ కాంబినేషన్‌లో పలు యాక్షన్ చిత్రాలు, దొంగలకు దొంగ, దొంగలకు సవాల్ వంటి కౌబాయ్ చిత్రాలు రూపొందాయి. ఆ తరువాత కెఎస్‌ఆర్ దాస్ దర్శకత్వంలో పద్మాలయా పతాకంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ‘మెక్‌నాస్ గోల్డ్’ చిత్రం ఆధారంగా రూపొందించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దర్శకునిగా దాస్‌కి, హీరోగా కృష్ణకు ఎనలేని కీర్తిని అందించటం.. వీరి కాంబినేషన్ ఓ స్పెషాలిటీగా పేరుపొందటం విశేషం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి