ఫ్లాష్ బ్యాక్ @ 50

కదలడు -వదలడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ తాలుకా కొత్త నిమ్మకూరులో 1920లో జన్మించారు కుదరవల్లి సీతారామస్వామి. వీరి తండ్రి కుదరవల్లి నరసయ్య. ధాన్యం వ్యాపారం చేసేవారు. కొంతకాలం తండ్రి వ్యాపారంలో కొనసాగి, తరువాత బస్ కండక్టరుగా పనిచేసిన సీతారామస్వామి -మిత్రుడు పొట్లూరి వెంకట నారాయణరావుతో కలిసి శ్రీ లక్ష్మీనారాయణ కంబైన్స్ బ్యానర్‌పై 1967లో ఎన్టీ రామారావు, కాంతారావు కాంబినేషన్‌లో చిక్కడు-దొరకడు నిర్మించారు. ఇదే బ్యానర్‌పై 1969లో ఎన్టీఆర్, జయలలిత హీరో హీరోయిన్లుగా రూపొందించిన జానపద చిత్రం కదలడు-వదలడు. తరువాత రైతేరాజు (1970), నా పేరే భగవాన్ (1976), ముగ్గురూముగ్గురే (1978), మామా అల్లుళ్ల సవాల్ (1980) చిత్రాలు రూపొందించారు.
కదలడు-వదలడు చిత్రం జూలై 9, 1969లో విడుదలైంది.

రచన: వీటూరి
కళ: బి నాగరాజన్
కూర్పు: గోవిందస్వామి
స్టంట్స్: శివయ్య
సంగీతం: టీవీ రాజు
నృత్యం: చిన్ని, సంపత్
ఛాయాగ్రహణం: హెచ్‌ఎస్ వేణు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి విఠలాచార్య
నిర్మాతలు: కుదరవల్లి సీతారామస్వామి, గుత్తా సుబ్బారావు.

అవంతీ రాజ్యప్రభువు అనంగపాలుడు (్ధళిపాళ). పట్టపురాణి వినుత దేవి (హేమలత). చిన్నరాణి సరితాదేవి (్ఛయాదేవి). యువరాజు విక్రమసింహుని (మాస్టర్ విశే్వశ్వర్) పుట్టినరోజు సందర్భంగా మహా మంత్రి చార్వాకుడు (ముక్కామల), రాజుగారి బావమరిది, చిన్నరాణి సోదరుడు భుజంగరాయలు (రామదాసు), ఉప సేనాధిపతి డిండిమవర్మ (త్యాగరాజు) తమ పిల్లలచే యువరాజుకు బహుమతులు అందచేస్తారు. వాటిలో ఒక కీలుగుర్రం బొమ్మ ద్వారా యువరాజుకు ప్రమాదం జరగబోగా సేనాధిపతి వీరసేనుడు (మిక్కిలినేని) రక్షిస్తాడు. యువరాజును అంతం చేయడానికి దుష్టులు చార్వాకుడు, భుజంగరాయలు, డిండిమవర్మలు కుట్ర పన్నుతారు. దాని ఫలితంగా వీరసేనునితో అక్రమ సంబంధం ఉందని పట్టపురాణిని అనుమానించిన మహరాజు, ఇద్దరికీ మరణదండన విధిస్తాడు. ఆ శిక్షనుంచి తప్పించుకొన్న వీరసేనుడు -మహారాణి, యువరాజును రాజ్యానికి దూరంగావుంచి కాపాడతాడు. ఒక సామాన్య యువకునిగా, సాహసవంతునిగా పెరిగి పెద్దవాడైన విక్రముడు.. తల్లి, సేనాపతి ద్వారా నిజం తెలుసుకొంటాడు. అవంతీ రాజ్యానికి వెళ్లి అక్కడ మంత్రి కుమారుడు కిరీటి (సత్యనారాయణ)తో తలపడి అతన్ని ఓడిస్తాడు. రాకుమారుడు (చిన్నరాణి కుమారుడు) వినోదవర్మ (రామకృష్ణ), భుజంగరాయలు కుమార్తె మధుమతి (జయలలిత)ని ప్రేమిస్తాడు. అంతకుముందే కనె్నతీర్థం వద్ద విక్రముని (ఎన్‌టి రామారావు) పరాక్రమం చూసి మెచ్చిన మధుమతి, అతనిపై ప్రేమ పెంచుకుంటుంది. వారిరువురూ పరస్పర అనురాగబద్ధులై ఉంటారు. మధ్యలో డిండిమవర్మ కుమార్తె సుకన్య (విజయలలిత) విక్రమునిపై ప్రేమ పెంచుకోవటం కథ పలు మలుపులు తిరుగుతుంది. కథ నడుస్తుండగా రాజ్య కుట్రలతో మహారాజు, చిన్నరాణి, భుజంగరాయలు బందీలవుతారు. సింహాసనం అధిష్టించి మధుమతిని వివాహం చేసుకోవాలనే కిరీటి ప్రయత్నాలను విక్రముడు పలు ఉపాయాలతో ఎదుర్కొంటారు. దుష్టుల ఆటకట్టించి మహారాజుకు తన తల్లి నిర్దోషిత్వం నిరూపిస్తాడు విక్రముడు. మధుమతిని చేపట్టి సింహాసనం అధిష్టించటంతో కథ సుఖాంతమవుతుంది. ఈ చిత్రంలో విక్రముని మిత్రుడు గజపతిగా బాలకృష్ణ, చెలికత్తెగా ఝాన్సీ, ఇంకా రాజేశ్వరి, మోదుకూరి సత్యం తదితరులు నటించారు. ఈ చిత్రానికి.. గుర్రం బొమ్మలు, జపాన్ యువతిల బొమ్మలు, తమాషా స్ర్తి పురుషుల బొమ్మలు, పలు డిజైన్లతో చక్కని టైటిల్స్‌ను ఆకట్టుకునేలా రూపొందించేందుకు సహకరించారు ఎస్‌ఎస్ లాల్, జిఆర్ మణి.
దర్శకులు బి విఠలాచార్య చిత్రంలోని సన్నివేశాలను అర్ధవంతంగా రూపొందించి చిత్రీకరించారు. కీలుగుర్రం బొమ్మ బహుమతి చూసి సేనాని అనుమానపడటం.. విక్రముడు అధిరోహించగానే అది పైకెగిరి మండిపోతుండగా సేనాని రక్షించటం.. మహారాణి, వీరసేనుల మాస్క్‌లను శిల్పాచార్యుడు (పిజె శర్మ)తో తయారు చేయించి మహారాజును మోసపుచ్చటం.. మరోసారి మధుమతికి అనుమానం రేకత్తేలా -సుకన్య, విక్రముల మాస్క్‌లతో కొత్త టెక్నిక్ ఉపయోగించటం.. చిత్రం చివర్లో ఆ నిజం ఎలా వెల్లడైందో సహేతుకంగా చూపటం.. దర్శకుడి ప్రతిభకు అద్దంపడుతుంది. జానపద చిత్రానికి తగిన పోరాటాలు, విన్యాసాలు -విక్రమసేనుడు తొలుత సైన్యం నుంచి తప్పించుకోవటం కోసం ఎంతో వైవిధ్యంగా రూపొందించిన పోరాటం, రాకుమారునితో పారిపోతూ కాలు పోగొట్టుకునే సన్నివేశం, రాజ్యసభలో మల్లుడు, వీరుని మల్లయోధుని మట్టి కరిపించగా, విక్రముడు (ఎన్టీఆర్) తానొక్కడే అదేవిధంగా మల్లుని గాయపర్చి ఓడించటం, వీరసేనునికిచ్చిన మాట ప్రకారం సోదరుడు వినోదవర్మపై పరాక్రమం చూపకపోవటం, అతని హత్యానేరం విక్రమునిపై ఆపాదించబడటం.. దానికి మధుమతి సాక్ష్యం, తల్లి ఆజ్ఞతో సంకెళ్లు తెంచుకోవటం.. అంతకుముందు మధుమతి, విక్రముల ప్రణయ (బుల్లెమ్మా సౌఖ్యమేనా అంటూ పాట) సన్నివేశంలో పూలదండలో జయలలిత, ఎన్టీఆర్‌ల నృత్యాలు.. ఇలా సన్నివేశాలను ఆకట్టుకునేలా, రమణీయంగా చిత్రీకరించి మెప్పించారు. మరికొన్ని సన్నివేశాలు చూస్తే -విక్రముడు దయ్యం వేషంలో శత్రువులను బాధించటం, సత్యనారాయణకు చిట్కాలు చెప్పి చేయించటం, మారువేషంలో జయలలిత, వృద్ధులైన ముక్కామల, త్యాగరాజుతో వలపు నాటకం వంటివి సినిమా సాగతీతకు దారితీసి చిత్ర గమనవేగానికి అడ్డుపడ్డాయనిపిస్తుంది.
విక్రమసింహునిగా ఎన్‌టి రామారావు తొలుత పల్లె యువకునిగా సౌమ్యత, తరువాత తాను రాకుమారుడనని తెలిసి తండ్రిని కలుసుకోవటంలో ఆదుర్ధా, తండ్రి సాంగత్యంలో ఆనందం, సోదరుడు వినోదవర్మతో పోరు, వీరసేనుని మాట జ్ఞప్తికి తెచ్చుకొని ఓర్పు నేర్పుతో అతని కత్త్ధిటిని తట్టుకోవటం, సభలో గొలుసులతో బంధింపబడి తల్లి ఆజ్ఞకోసం ఎదురుచూడటం, సంకెళ్లు తెంచుకోవటంలో శౌర్యం, మహామంత్రి తదితరులను తమాషా వేషాలతో దారి మళ్ళించటంలో చురుకు, మధుమతితో ప్రణయ సన్నివేశాలు.. ఇలా ఎంతో ఈజ్‌తో తన పాత్రను పోషించి అలరించారు. జయలలిత దానికి తగ్గట్టు సన్నివేశానుగుణమైన హావభావాలను నటనలో ఆవిష్కరించారు. మిగిలిన పాత్రధారులు పాత్రోచితమైన నటన చూపగా, వీరసేనునిగా మిక్కిలినేని కడు ప్రశంసా పాత్రమైన తీరులో మెప్పించారు.
టివి రాజు, ఎన్‌టిఆర్, విఠలాచార్య కాంబినేషన్‌లో పలు జానపద చిత్రాలు రూపొందటం, ఈ కాంబినేషన్‌లో సంగీతం వీనులవిందుగా, గుర్తుండిపోయేలా స్వరాలతో, రచనతో గీతాలు తీర్చిదిద్దబడటం ఓ ఆనవాయితీ. ఈ చిత్రంలోనూ అదేపంథా కొనసాగించారు.
చిత్ర గీతాలు:
ఎన్టీఆర్, జయలలితపై చిత్రీకరించిన గీతం -బుల్లెమ్మా సౌఖ్యమేనా (రచన: వీటూరి, గానం: ఘంటసాల, పి.సుశీల). విజయలలిత, ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన గీతం -కట్కో కట్కో గళ్లచీర (రచన: సినారె, గానం: ఘంటసాల, పి సుశీల). జయలలిత, ఎన్టీఆర్‌పై చితీకరించిన మరో గీతం -ఓ ముద్దులొలికే ముద్దబంతి (రచన: సినారె, గానం: ఘంటసాల, పి.సుశీల). జయలలితపై తోటలో మరో గీతం -ఇక్కడ వాడే అక్కడ వాడే (గానం: పి సుశీల, రచన: సినారె). ఎన్టీఆర్ ఎదుట విజయలలిత నృత్యగీతం -కొమ్మా కొమ్మా కులికినచోట నువ్వే (రచన: సినారె, గీతం, గానం: పి సుశీల). సత్యనారాయణ, రాజేశ్వరిలపై గీతం -అందిస్తాను అందుకో మధువందిస్తాను (గానం: పి సుశీల, రచన: దాశరథి). జయలలిత మారువేషంలో ఆలపించే నృత్యగీతం -వారేవారే చుయ్ చుయ్ (గానం: పి సుశీల, రచన: కొసరాజు).
‘కదలడు-వదలడు’ చిత్రం -ఎన్‌టి రామారావు, జయలలిత, సత్యనారాయణ, ధూళిపాళవంటి భారీ తారాగణంతో, అలరించే కొన్ని గీతాలతో, విఠలాచార్య మర్క్ సన్నివేశాలతో రూపొంది ఓ మంచి కాలక్షేప చిత్రంగా నిలిచిందనుకోవాలి.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి